pearl talambralu
-
16 నుంచి భద్రాద్రిలో నూతన ఆర్జిత సేవలు
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 16 నుంచి నూతన ఆర్జిత సేవలు ప్రారంభించనున్నట్లు ఈఓ రమాదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సేవలకు సంబంధించిన వివరాలను గతంలో వెల్లడించిన ఆలయ అధికారులు.. భక్తులు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు అందజేయాలని కోరారు. ఈ ఏడాది జనవరి నుంచే నూతన సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో జాప్యం జరిగింది. సేవల వివరాలు ఇవీ.. వేదాశీర్వచనం: స్వామివారి దర్శనానంతరం బేడా మండపంలో (ఒక్కొక్కరికి లేదా దంపతులు) రూ.500 టికెట్‌తో ఉదయం 9.30, 10, 10.30, 11 గంటల స్లాట్స్‌లలో ఆశీర్వాదాలు అందజేస్తారు. ఇందులో పాల్గొన్న భక్తులకు కండువా, జాకెట్పీసు, 100 గ్రామల లడ్డూ అందజేస్తారు. స్వామివారికి తులసీమాల అలంకరణ (ప్రతి శనివారం) రూ.1,000 టికెట్‌తో దంపతులు లేదా ఒకరికి ఉదయం 7 గంటలకు ఉభయదాత శిరస్సుపై తులసీమాల ఉంచి ఆలయ ప్రదక్షిణ చేయిస్తారు. ఆ తర్వాత అంతరాలయంలో భక్తుల సమక్షంలో ధ్రువమూర్తులకు అలంకరణ చేస్తారు. ఇందులో పాల్గొన్న వారికి కండువా, జాకెట్ పీసు, 100 గ్రాముల లడ్డూలు రెండు, అంతరాలయ అర్చనతో రామకోటి పుస్తకాన్ని బహూకరిస్తారు. స్వామివారి నిత్య సర్వ కైంకర్య సేవ రూ.5 వేల టికెట్‌తో ప్రతి రోజూ జరిగే అన్ని సేవలలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దంపతులు పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఆ రోజు 10 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇందులో పాల్గొనే భక్తులకు సుప్రభాతం, అభిõషేకం, అంతరాలయ అర్చన, శ్రీలక్ష్మీ అమ్మవారి అర్చన, శ్రీ ఆంజనేయ స్వామి వారి అర్చన, నిత్యకల్యాణం, వేదాశీర్వచనం, సచిత్ర రామాయణ పుస్తకం, ముత్యాల తలంబ్రాల ప్యాకెట్, అదనంగా ఐదుగురికి అన్నప్రసాదం, దర్బారు సేవ, పవళింపు(ఏకాంత) సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది. శ్రీరామనవమి ముత్యాల తలంబ్రాల సమర్పణ రూ.10 వేల టికెట్‌తో శ్రీరామనవమి కల్యాణ టికెట్ సెక్టార్ – 2లో రెండు సంవత్సరాలకు టికెట్లు (ఉభయం), కల్యాణ వ్రస్తాలు, ప్రసాదాలు, 108 ముత్యాలతో కూడిన తలంబ్రాలు అందజేస్తారు. నిత్య పూల అలంకరణ సేవ రూ. 5 వేల టికెట్‌తో సోమవారం నుంచి శనివారం వరకు జరిగే పూజల్లో స్వామి వారికి, ఉపాలయాల్లో అవసరమైన పూల దండల సమర్పణ. ఇందులో పాల్గొనే వారికి కండువా, జాకెట్ పీసు, రెండు చిన్న లడ్డూలు, నలుగురికి అన్నప్రసాదం అందజేస్తారు. తులాభారం రూ.100 టికెట్ ధరతో ప్రతి రోజూ తులాభారం (భక్తులు మొక్కుకున్న చిల్లర నాణేలు, లేదా బియ్యం.. తదితర వస్తువులు) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు అందించవచ్చు. -
కల్యాణ పనులకు వేళాయె..
రూ. 50 లక్షలతో రామయ్య పెళ్లి పనులు ఉభయదాతలకు ‘సచిత్ర రామాయణం’ కల్యాణ తలంబ్రాల ప్యాకెట్ రూ. 50 భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఏప్రిల్28న జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ రామనవమి రోజున భద్రాచలంలో జరిగే రాముల వారి కల్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సీఎం తీసుకురావటం ఆనవాయితీ. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్ల కోసం అధికారులు కార్యాచరణ రూపొందించారు. రూ.50 లక్షలతో స్వామివారి కల్యాణ పనులు చేపట్టాలనే లక్ష్యంతో ఇప్పటికే టెండర్లు పిలిచారు. జూలైలో గోదావరి పుష్కరాలు కూడా ఉండటంతో నవమి ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నవమి పనులతో పాటే గోదావరి పుష్కరాల కోసం దేవస్థానం ద్వారా మరో రూ.30 లక్షల వ్యయంతో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. దాతల ప్రోత్సాహం కోసం.. భద్రాద్రి ఆలయాభివృద్ధిలో భాగంగా దాతలను ప్రోత్సహించాలని దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి నిర్ణయించారు. స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొనే ఉభయదాతలకు సచిత్ర రామాయణం పుస్తకాలను అందజేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఉభయదాతల టికెట్లు కొనుగోలు చేసిన వారికి పంచె, చీర, కండువా, జాకెట్టు, లడ్డు, పులిహోర ప్యాకెట్, నలుగురికి స్వామివారి అన్నదాన ప్రసాదం ఇస్తున్నారు. వీటితో పాటు సచిత్ర రామాయణం పుస్తకాలు, రామదాసు కీర్తనల సీడీని కూడా అందజేయాలని భావిస్తున్నారు. తలంబ్రాల్లోనూ మార్పులు స్వామివారి కల్యాణం తలంబ్రాల ప్యాకెట్‌ను రెండేళ్లుగా రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక నుంచి తలంబ్రాల్లో 2 ముత్యాలు, స్వామివారి రాగిమాడ, ఒక ఫొటోను జతచేసి రూ.50 చొప్పున విక్రయించాలని అధికారులు భావిస్తున్నారు. టికెట్ల రేటు పెంపు శ్రీ రామనవమి రోజున భద్రాచలంలో జరిగే స్వామివారి కల్యాణోత్సవాన్ని ప్రత్యక్ష్యంగా తిల కించే అవకాశం కేవలం 35,832 మంది భక్తులకే ఉంది. రూ.100, రూ.200, రూ.500, రూ.1,116 టికెట్లతో పాటు, వీఐపీ పేరిట రూ.2,000, ఉభయదాతల పేరిట రూ.3,016 విలువ గల టికెట్లను మొత్తం 20,032 మందికి విక్రయిస్తున్నారు. ఈసారి వీఐపీ టిక్కెట్టును రూ. 2,000 నుంచి రూ. 3,500, ఉభయదాతల టికెట్‌ను రూ.3,016 నుంచి రూ. 5,016కు పెంచనున్నారు. -
అయోధ్య రాముడు! దక్కన్ రాముడు !!
అయోధ్య రాముడు వేరు ! దక్కన్ రాముళ్లు వేరు !! సీత కాళ్లపారాణి ఆరకముందే, నూనుగు మీసాల రాముడు అంతఃపుర కారణాలతో అడవిబాట పట్టాడు. ఒక మహాయుద్ధం చేసి సీతా సమేతుడై పట్టాభిషిక్తుడు అయ్యాడో లేదో వియోగ రాముడయ్యాడు ! రామాయణంలో భద్రాద్రి ప్రత్యేకమైనది. పద్నాలుగేళ్ల వనవాసకాలంలో పదేళ్లను పది నిమిషాలుగా సీతారాములు ఇక్కడ ఆహ్లాదంగా గడిపారు. ముత్యాల బాట.. ఇతిహాస కాలానంతరం, చారిత్రక భద్రాచలం తహసీల్దార్ గోపన్న (రామదాసు)కు ఇక్కడ గుడి కట్టాలనిపించింది. కుతుబ్‌షాహీల చివరి రాజు తానీషాకు జమకట్టాల్సిన పన్నులతో ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత జైలుపాలైన రామదాసు రాములోరిపై భక్తిపూర్వకంగా నిందాస్తుతి రాశాడు. రామలక్ష్మణులు గోల్కొండకు రాక తప్పలేదు. తానీషాను ‘నిద్ర’లేపి తమ దాసుడు కట్టాల్సిన డబ్బులను అణాపైసలతో సహా చెల్లించి రసీదు సైతం పొందారు. తానీషా పశ్చాత్తప్తుడై రామదాసును విడుదల చేశాడని గాథ ! ఏటా సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు పంపుతానన్న తానీషా మాట నేటికీ అమలవుతోంది. కూచిపూడి భాగవతులకు తానీషా అగ్రహారాన్నివ్వడమూ మరొక సందర్భంలో స్మరణీయమే ! మరొక దక్కనీ రాముడికి సంబంధించిన చారిత్రక డాక్యుమెంట్లను తిప్పి చూద్దాం. అసఫ్జాహీలు-కాయస్థులు ఈ అపురూపమైన దక్కనీ చిత్రాన్ని తిలకించండి. 19వ శతాబ్దపు అజ్ఞాత చిత్రకారుడు కాగితంపై వాటర్ కలర్స్‌తో, బంగారుపూతతో చిత్రించాడు. ఇందులో ప్రస్తుత కథానాయకుడు మూడో నిజాం నవాబ్ సికిందర్ జా ఉద్యానవనంలో సుమసౌరభాన్ని ఆస్వాదిస్తూ విరాజమానుడై ఉన్నాడు. ఆయన ఎదురుగా నాలుగు సామాజిక సమూహాలకు ప్రతీకలైన నలుగురు ప్రధానులు.. ప్రభువు ఆనతిని ఆలకిస్తున్నారు. ఇంతకీ సికిందర్ జా ఎవరు ? ఔరంగజేబ్ పతనానంతరం అరాచకం తాండవించింది. కత్తి కింద ఒకటిగా మసలిన ప్రాంతీయ అస్తిత్వాలు తమ ప్రత్యేకతను చాటుకోవాలనుకున్నాయి. ఆ నేపథ్యంలో మహమ్మద్ షా (1719-48) ధోరణులు నచ్చక పాలకవర్గంలోని ప్రముఖుడు నిజాం-ఉల్-ముల్క్ దక్కన్ వచ్చేశాడు. ఏడాదిలో (1724) పాత దక్కన్‌ను ఏకం చేశాడు. ఆయన ప్రత్యేకతను దక్కనీయులు, ఢిల్లీ పాలకులు సైతం గుర్తించి ‘అసఫ్ జాహీ’ బిరుదునిచ్చి గుర్తించారు ! ఆయన వెంట ఢిల్లీ నుంచి కాయస్థులు దక్కన్ వచ్చారు. కూర్చున్న కొమ్మను నరుక్కునే ఢిల్లీ ఏలికల వైపరీత్యాలు చోటు చేసుకోకుండా ప్రజలకూ ప్రభుతకు వారధిగా వ్యవహరించారు. వివిధ పదవుల్లో, బాధ్యతల్లో రాజ ప్రముఖులుగా ఎదిగారు. ఆ క్రమంలో రాజపరివాపు జీతభత్యాలను చెల్లించే అధికారి భవానీ ప్రసాద్‌కు మూడో నిజాం ‘రాజా’ బిరుదునిచ్చారు. ఆ సందర్భంగా రామాలయం నిర్మించాలనుకున్నారు భవానీ ప్రసాద్. ప్రస్తుత నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి రాజేంద్రనగర్‌కు వెళ్లే దారిలో అత్తాపూర్ సమీపంలో ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రతిష్ఠించిన రాముడి విగ్రహం వెనుక ఒక కథ ఉంది. గద్వాల తర్వాత హైదరాబాదే.. పాత హైదరాబాద్ స్టేట్‌లోని రాయచూర్ జిల్లాలో నిజాంలకు అనుబంధంగా గద్వాల సంస్థానం ఉండేది. 1384 చ.కి.మీ విస్తీర్ణంలో గద్వాల పట్టణమూ, 214 గ్రామాల సంస్థానానికి రాజా సోమభూపాలుడు పాలకుడు. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో భాగమైన ఈ సంస్థానం హైదరాబాద్ స్టేట్ కంటే ముందే అస్తిత్వంలో ఉండేది. రాజా సోమభూపాలుడు తన పరివారం కోసం ఒక రామాలయాన్ని నిర్మించాలనుకున్నాడు. రాముడి శిల్పం పూర్తవుతున్న నేపథ్యంలో ఆయనకు ఒక కల వచ్చింది. ‘సమీపంలోని బావిలో ఉన్న తన విగ్రహాన్ని వెలికి తీయించి ఆలయంలో ప్రతిష్ఠించవలసినది’ అని రాముడు చెప్పాడట. అదే సమయంలో ‘రాజా’ భవానీ ప్రసాద్‌కూ సోమభూపాలుడికి రాముడు కలలో చెప్పిన వైనం కలగా వచ్చిందట. బావిలోని విగ్రహాన్ని గద్వాలాధీశుడు ప్రతిష్ఠిస్తున్న నేపథ్యంలో ముందుగా శిల్పులకు పురమాయించగా రూపొందిన రాముడి విగ్రహం తనకు బహుమతిగా ఇవ్వవలసిందిగా కోరాడట భవానీ ప్రసాద్. సోమభూపాలుడు సంతోషంగా అంగీకరించి బహూకరించాడట. ఫర్కుందా బునియాద్.. ఆలయ నిర్మాణం పూర్తయ్యాక, సీతారామలక్ష్మణుల విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా భవానీప్రసాద్ మూడో నిజాం సికిందర్ జాను ఆహ్వానించాడు. 1812లో ఈ అపురూప దృశ్యాన్ని ఆబాలగోపాలం వీక్షించింది ! ఆలయ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న సికిందర్ జా మడులూ-మాన్యాలు ఆలయానికి రాశాడు. అర్చకులకు, సిబ్బందికి జీతభత్యాలను ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వమన్నాడు. ఏటా రామనవమి రోజు ప్రభుత్వం తరఫున ‘యాత్ర’ నిర్వహించాలని ఆదేశాలిచ్చాడు. 1816వ సంవత్సరపు ‘దఫ్తర్-ఎ-ఇస్తిఫా’ రికార్డుల ప్రకారం అర్చకులకు రోజుకు రెండు రూపాయల గ్రాంట్ మంజూరైంది. మూడో నిజాం ఉత్తర్వుల్లో హైదరాబాద్ పేరును ‘ఫర్కుందా బునియాద్’ అని పేర్కొన్నారు. భాగ్యనగర్ అనే పేరుకు ఫర్షియా పదం ‘ఫర్కుందా బునియాద్’ సమానార్థకం కావడం విశేషం ! దక్కన్ ముస్లింలు విగ్రహ ప్రతిష్ఠాపకులు రామ్‌బాగ్ ఆలయంగా స్థానికులు వ్యవహరించే ఈ ఆలయం ప్రతిష్ఠాపనలో హిందూ-ముస్లింలు సాదరంగా పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపనను స్వయంగా ముస్లిం పాలకుడు చేశాడు. ముస్లింలంటే విగ్రహ విధ్వంసుకులనే భావనలను పూర్వపక్షం చేశారు. మనవత్వాన్ని పరిమళించే ఈ మతసామరస్యానికి బీజాలు నగరానికి పునాదులు వేసిన కులీ కుతుబ్షాలో ఉన్నాయి. ఒక కవితలో అంటాడు.. కాఫిర్లు లేరు ముస్లింలు లేరు.. అన్ని మతాలు.. ప్రేమ కుదురులోనే పుష్పిస్తాయి.. హైదరాబాద్ తెహ్జీబ్ పరిమళాలను ఆస్వాదించేంతగా కాలుష్య ప్రపంచం ‘అభివృద్ధి’ చెందాలని ఆశిద్దాం! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి