నేడు రాష్ట్రస్థాయిలోను, అన్ని జిల్లాల్లోను దేవదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహణ
ప్రతి జిల్లాలో ఇద్దరు అర్చకులు, ఒక వేదపండితుడికి సత్కారం
సాక్షి, అమరావతి: క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. మంగళవారం తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ పంచాంగ శ్రవణ కార్యక్రమంతో పాటు వేదపండితులు, ఆలయ అర్చకులను సత్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో విజయవాడలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఉదయం 9 గంటలకు కప్పగంతుల సుబ్బరామ సోమయాజులు ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా 18 మంది వేద పండితులను ఘనంగా సత్కరిస్తారు. అన్ని జిల్లాల్లో ఉగాది ఉత్సవాల నిర్వహణలో భాగంగా వేదపండితులు, అర్చకులకు సన్మాన కార్యక్రమాల నిర్వహణకు దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్దేశించారు. ప్రతి జిల్లాలో 62 ఏళ్లకు పైబడిన అర్చకులు ఇద్దరిని, ఒక వేద పండితుడిని సత్కరించాలని సూచించారు. సన్మాన గ్రహీతలకు ప్రశంసాపత్రం, రూ.10,116 సంభావన, శాలువా, కొత్తవస్త్రాలు, పండ్లు అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment