
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 6న భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి వెళ్లలేని భక్తులకు ఇళ్ల వద్దనే రాములోరి తలంబ్రాలను అందజేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ ఆర్టీసీ ఏటీఎం సి.రవీందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్గో సేవా విభాగం ద్వారా ఈ సదుపాయం కల్పించనున్నారు. ఎంజీబీఎస్‌లోని కార్గో, పార్శిల్ బుకింగ్ కౌంటర్లో భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. కల్యాణం జరిగిన తర్వాత ముత్యాలతో కూడిన తలంబ్రాలను అడ్వాన్స్‌గా బుకింగ్ చేసుకున్న వారికి పంపిణీ చేయనున్నారు. పూర్తి వివరాలకు ఎంజీబీఎస్ (MGBS) లాజిస్టిక్స్ ఇన్‌చార్జి 91542 98741, 91542 98865లలో సంప్రదించవచ్చు.
కమనీయం.. రామయ్య నిత్య కల్యాణం
భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేనపూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గా వించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

బ్రహ్మోత్సవాల అంకురార్పణ జాప్యంపై విచారణ
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి (Srirama Navami) బ్రహ్మోత్సవాల అంకురార్పణ ఈనెల 13వ తేదీన ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ అడిషనల్ కలెక్టర్ కృష్ణవేణి గురువారం రంగనాయకుల గుట్టపై గల కాటేజీలో విచారణ చేపట్టారు. అర్చకులు, ఈఓను పిలిచి ఆరా తీశారు. ప్రధానార్చకులు విజయరాఘవన్, కోటి రామస్వరూప్, స్థానాచార్యులు స్థలశాయి, ఉప ప్రధాన అర్చకులు మురళీకృష్ణమాచార్యులు, శ్రీనివాస రామానుజాచార్యులను విడివిడిగా విచారించారు.
ఈ వేడుకలకు బ్రహ్మగా వ్యవహరించాల్సిన ఓ అర్చకుడిని పర్ణశాలకు పంపించారని, ఆయన ప్రాముఖ్యతను ముందుగానే లిఖితపూర్వకంగా ఈఓ దృష్టికి తెచ్చామని అర్చకులు వివరించినట్లు తెలుస్తోంది. ఈఓ వ్యవహారశైలితోనే ఆలస్యమైందని వారు చెప్పినట్టు సమాచారం. ఆ తర్వాత విచారణకు ఈఓ రమాదేవిని పిలవగా ఆమె తన వాదన చెప్పారని తెలిసింది. టెంపుల్ స్పెషల్ ప్రొటెక్షన్ (Temple Special Protection) వారు నిర్వహించిన తనిఖీలు, దీనిపై ఏఈఓ ఇచ్చిన నివేదిక ఆధారంగానే అర్చకుడిపై డిప్యూటేషన్ చర్యలు తీసుకున్నామని, పాలనాపరమైన నిర్ణయాలు, నిబంధనల ప్రకారమే వ్యవహరించామని పేర్కొన్నట్లు సమాచారం.
చదవండి: దేవాలయాల్లో రావి, వేప చెట్లు ఎందుకు ఉంటాయి?
కాగా, ఇరు వర్గాల వాదనలపై దేవాదాయ శాఖ కమిషనర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు కృష్ణవేణి వెల్లడించారు. విచారణలో వరంగల్ డీసీ సంధ్యారాణి, హైదరాబాద్ డీసీ కృష్ణప్రసాద్, ఖమ్మం ఏసీ వీరస్వామి పాల్గొన్నారు. కాగా, కృష్ణవేణిని శ్రీరామనవమి ఉత్సవాల ప్రత్యేకాధికారిగా నియమించినట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment