ఖమ్మంలో 22.. భద్రాదిలో 22 | New mandals to add in Khammam 22 and Badhrachalam 22 Mandals | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో 22.. భద్రాదిలో 22

Published Mon, Oct 3 2016 11:54 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

ఖమ్మంలో 22.. భద్రాదిలో 22

ఖమ్మంలో 22.. భద్రాదిలో 22

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి సమానంగా మండలాలు
కొత్త జిల్లాలోకి నూతనంగా ఆరు మండలాలు
‘ఆచార్య జయశంకర్‌’లోకి వాజేడు, వెంకటాపురం
భద్రాద్రి జిల్లా, రెవెన్యూ డివిజన్‌లోకి జూలూరుపాడు
వైరా కాదు.. కల్లూరు రెవెన్యూ డివిజనే ఫైనల్‌ కానుంది..
ఏడు మండలాలతో ఈ డివిజన్‌ ఏర్పాటు
ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లోకి మధిర, ఎర్రుపాలెం
కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా నామకరణం
రాజధానిలో జరిగిన ప్రజా ప్రతినిధుల భేటీలో
ఈ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్‌ ప్రాథమిక అంగీకారం

సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా పునర్విభజనకు తుది రూపు వచ్చింది. కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెంగా నామకరణం చేశారు. ఈ జిల్లాలోకి కొత్తగా ఆరు మండలాలు రానున్నాయి. ఆచార్య జయశంకర్‌ (భూపాలపల్లి) జిల్లాలోకి వాజేడు, వెంకటాపురం మండలాలు వెళ్లనున్నాయి. భద్రాద్రి జిల్లా, రెవెన్యూ డివిజన్‌లో జూలూరుపాడు మండలం కొనసాగుతుంది.  వైరాకు బదులుగా ఏడు మండలాలతో కల్లూరు రెవెన్యూ డివిజన్‌ ఏర్పడనుంది. ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లోకి మధిర, ఎర్రుపాలెం మండలాలు వెళ్లనున్నాయి. ఈ మేరకు రాజధానిలో సీఎం కేసీఆర్‌ జిల్లాకు చెందిన మంత్రితోపాటు ప్రజాప్రతినిధులతో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

అభ్యంతరాలు పరిగణనలోకి..
గతంలో జిల్లా పునర్విభజనపై విడుదల చేసిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌పై ప్రజల నుంచి అనేక అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా కొత్త మండలాల ఏర్పాటు.. రెవెన్యూ డివిజన్‌లపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ ఆందోళనలతోపాటు ఇంటెలిజెన్స్‌  నివేదికల మేరకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని గుర్తుకు తెచ్చేలా కొత్త జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా నామకరణం చేశారు. డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో కొత్తగూడెం జిల్లాలో 18 మండలాలను పేర్కొన్నారు. వాజేడు, వెంకటాపురం మండలాలు జిల్లా కేంద్రం కొత్తగూడెంకు దూరంగా ఉన్నాయి.. తమకు భూపాలపల్లి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ జిల్లాలో కలపాలని స్థానికులు ఆందోళనలు చేశారు.

వారి ఆకాంక్ష మేరకు ప్రభుత్వం ఆ రెండు మండలాలను భూపాలపల్లి జిల్లాలో కలపనుంది. కొత్తగా గుండాల మండలంలోని ఆళ్లపల్లి, పినపాక మండలంలోని కరకగూడెం, కొత్తగూడెం మండలంలోని లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, చండ్రుగొండ మండలంలోని అన్నపురెడ్డిపల్లిలను మండలాలుగా ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు.  మొత్తంగా కొత్తగూడెం జిల్లాలో 22 మండలాలు కానున్నాయి.

కల్లూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌
కల్లూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కానుంది. డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో వైరా కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కానీ కల్లూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసిందని స్థానికులు ఆందోళనలు చేశారు. కల్లూరు రెవెన్యూ డివిజన్‌ చేస్తే ఇటు వైరాతోపాటు.. అటు సత్తుపల్లికి కూడా సౌకర్యంగా ఉంటుందని ఇంటెలిజెన్స్‌ ఇచ్చిన నివేదికల ఆధారంగా కల్లూరు కేంద్రంగానే రెవెన్యూ డివిజన్‌ చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ రెవెన్యూ డివిజన్‌లోకి తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు, వైరా, ఏన్కూరు మండలాలు రానున్నాయి. మధిర, ఎర్రుపాలెం మండలాలు ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లో కొనసాగనున్నాయి.

జూలూరుపాడు ‘కొత్త’జిల్లాలోకే...
జూలూరుపాడు మండల ప్రజల అభీష్టాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ మండలాన్ని కొత్తగూడెం జిల్లాలో కలపాలని నిర్ణయించింది. ఈ మండలాన్ని ఖమ్మంలో కలపడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమైంది. జేఏసీగా ఏర్పడి ఆందోళనలు చేపట్టారు. ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన దీక్ష చేశారు. ఖమ్మంలో ప్రదర్శన చేసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వివిధ రూపాల్లో మండల ప్రజలు తన ఆకాంక్షను వెలిబుచ్చారు. అధికారుల నివేదికతోపాటు ఇంటెలిజెన్స్‌ సమాచారం మేరకు ఈ మండలాన్ని కూడా కొత్తగూడెం జిల్లాలో కలపాలని సీఎం ఈ సమావేశంలో పేర్కొన్నారు. కొత్తగూడెం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోనే జూలూరుపాడు మండలం ఉండనుంది. ఈ అన్ని మార్పులపై జిల్లా అధికారులు నివేదికలు తయారు చేసిన అనంతరం వీటిని ముఖ్యమంత్రి పరిశీలించిన తర్వాత తుది నోటిఫికేషన్‌లో పేర్కొనే అవకాశం ఉంది.

ఖమ్మంలో 22.. భద్రాదిలో 22
ఖమ్మం జిల్లాలో మొత్తంగా 46 మండలాలు కాగా.. రాష్ట్ర పునర్విభజనతో ఐదు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. ఇక మిగిలిన 41 మండలాలతో జల్లా పునర్విభజన చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్‌ జిల్లాలో కలుపుతున్నారు. మిగిలిన 39 మండలాల్లో తొలివిడత విడుదల చేసిన నోటిఫికేషన్‌ రఘునాథపాలెం కొత్త మండలంగా పేర్కొంటూ మొత్తం 40 జిల్లాలకు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. వీటిలో ఖమ్మంజిల్లాలో 22, కొత్తగూడెం జిల్లాకు 18 మండలాలను కేటాయించారు. రెండు మండలాలు ఆచార్య జయశంకర్‌ (భూపాలపల్లి) జిల్లాలో కలవడం.. కొత్తగా ఆరు మండలాలు ఏర్పాటు కానుండటంతో ఖమ్మం జిల్లాలో 22 మండలాలు, కొత్తగూడెం జిల్లాలో కూడా 22 మండలాలు అవుతున్నాయి. జిల్లా పునర్విభజన తర్వాత రెండు జిల్లాలకు సమానంగా మండలాలు రావడం ఇదే ప్రథమం కావచ్చు.

ఈ సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాలు, స్త్రీ,శిశుసంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, తాటి వెంకటేశ్వర్లు, బానోతు మదన్‌లాల్, జలగం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement