Kotthagudem
-
కరోనా: జిల్లాలో ఒక్కరోజే 11 పాజిటివ్ కేసులు
సాక్షి, సూర్యాపేట : జిల్లాలో శనివారం ఒక్కరోజే 11 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో జిల్లా ప్రజల్లో భయాందోళన నెలకొంది. సూర్యాపేట పట్టణంలో 9, తిరుమలగిరి, నేరేడుచర్లలో ఒక్కో కేసు నమోదైంది. మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు వైరస్ అంటుకోవడంతో జిల్లావాసులు వణికిపోతున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీతోపాటు జిల్లాలోని నాగారం, తిరుమలగిరి, నేరేడుచర్ల మండలాలకు వైరస్ వ్యాప్తి చెందడంతో.. అధికారులు హై అలర్ట్ అయ్యారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 20 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ.. కేసు తేలింది.. ఈ నెల 8న సూర్యాపేట పట్టణంలోని కొత్తగూడెం బజార్‌కు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు పరీక్షల్లో తేలింది. కరోనా లక్షణాలు ఉండడంతో తానే స్వయంగా జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షల్లో అతనికి పాజిటివ్ వచ్చినట్లు తేలిసింది. అయితే ఇతను పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఎవరిని కాంటాక్టు అయ్యాడన్న సమాచారం తొలుత తేలలేదు. ఇతని ద్వారా తన కూతురుకు కూడా శనివారం పాజిటివ్ వచ్చింది. కుడకుడ వ్యక్తినుంచి వర్ధమానుకోటలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి వైరస్ సోకితే, కొత్తగూడెం బజార్లో మాత్రం ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కూతుళ్లు వైరస్ బారినపడ్డారు. ఇతని నుంచే స్థానిక పాత మార్కెట్ పరిధిలోని మరో 8 మందికి కరోనా సోకినట్లు శనివారం రాత్రి అధికారులు ప్రకటించారు. చదవండి: వారికి ఆకులే మాస్క్‌లు డిశ్చార్జ్ అయ్యి.. మళ్లీ పాజిటివ్.. మూడు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ క్వారంటైన్లనుంచి కొంతమందిని డిశ్చార్జ్ చేశారు. ఇలా చేసిన వారికి చివరలో పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్ రాగా, నేరేడుచర్లకు చెందిన వ్యక్తికి మాత్రం పాజిటివ్ వచ్చింది. గత నెల చివరలో సదరు వ్యక్తి మర్కజ్‌కు వెళ్లి వచ్చాడు. అదేవిధంగా జిల్లాలో నమోదైన తొలి కరోనా పాజిటివ్ కేసు, కుడకుడకు చెందిన వ్యక్తి మర్కజ్ వెళ్లి వస్తూ గత నెల తిరుమలగిరిలో ప్రార్థన మందిరంలో బస చేశాడు. మసీదులో అతనితో ఉన్న వ్యక్తిని కూడా జిల్లా కేంద్రంలోని క్వారంటైన్‌కు తరలించి పరీక్ష చేయడంతో పాజిటివ్ అని తేలింది. -
పొత్తులు..‘పంతాలు’
సాక్షి, కొత్తగూడెం: కాంగ్రెస్ కూటమిలో సీట్ల కేటాయింపు ప్రక్రియలో తలెత్తిన అసంతృప్తుల కారణంగా ఆయా పార్టీలు ఏ మేరకు సహకరించుకుంటాయో అనే విషయంలో ఒక స్పష్టత లేకుండా పోయింది. జిల్లాలోని ఏకైక జనరల్ స్థానమైన కొత్తగూడెం నియోజకవర్గం విషయంలో కూటమి పార్టీల మధ్య ఐక్యత సన్నగిల్లుతోంది. ఈ సీటును పొత్తుల్లో భాగంగా సీపీఐ గట్టిగా కోరినప్పటికీ కాంగ్రెస్ నాయకత్వం వనమా వెంకటేశ్వరరావును తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో కూటమిలోని సీపీఐ, టీడీపీ కత్తులు దూస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మాన్ని ఏమాత్రం పాటించలేదని సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన వనమా వెంకటేశ్వరరావుకు సీపీఐ నుంచి ఏ మేరకు సహకారం అందుతుందనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీని ఏమాత్రం ఖాతరు చేయకుండా కాంగ్రెస్ కొత్తగూడెం సీటు విషయంలో ఏకపక్షంగా వ్యవహరించిందని సీపీఐ గరంగా ఉంది. ఈ సీటును ఆశించిన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బాహాటంగానే కాంగ్రెస్‌ను విమర్శించారు. ఆ పార్టీ కూటమికి అహంకారపూరిత పెద్దన్న పాత్ర పోషించిందని అన్నారు. పొత్తు ధర్మాన్ని ఏమాత్రం పాటించలేదని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 40 నియోజకవర్గాల్లో గణనీయమైన ఓటుబ్యాంకు కలిగి ఉన్న సీపీఐ విషయంలో కాంగ్రెస్ దారుణంగా వ్యవహరించిందని అన్నారు. తమకు మూడు సీట్లు మాత్రమే కేటాయించడం కాంగ్రెస్ నాయకత్వం తీరుకు నిదర్శనమన్నారు. వివిధ రకాల సర్వేల పేరుతో కాంగ్రెస్ పార్టీ హైప్ సృష్టించిందన్నారు. తాను టీఆర్ఎస్ వద్ద డబ్బులు తీసుకుని టికెట్ ఆశించానని వనమా వెంకటేశ్వరరావు తీవ్రమైన ఆరోపణలు చేయడం పట్ల కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో చర్చించి స్నేహపూర్వక పోటీకైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. బీ–ఫారం కూడా సిద్ధంగా ఉంచుకున్నానని తెలిపారు. అయితే తనకు మద్దతు ఇవ్వాలంటూ వనమా వెంకటేశ్వరారవు కూనంనేని ఇంటికి వెళ్లి కోరగా, రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని చెబుతానని కూనంనేని తెలిపారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. బరిలోకి దిగుతానంటున్న ఎడవల్లి.. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ సైతం వనమాకు ఏ మాత్రం సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బరిలోకి దిగుతానని అంటున్నారు. ఇప్పటికే తన వర్గీయులతో సమావేశం నిర్వహించారు. తాను ఏ బ్యానర్‌పై బరిలోకి దిగేది శుక్రవారం నాటికి స్పష్టత ఇస్తానని ఎడవల్లి చెబుతున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ కూడా ఈ స్థానాన్ని ఆశించారు. టికెట్ తనకు వచ్చే అవకాశం ఉండగా, నామా నాగేశ్వరారవు తన స్వార్థం కోసం రాకుండా చేశారని ఆరోపిస్తున్నారు. మంగళవారం కొత్తగూడెంలో నామా నాగేశ్వరరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. బుధవారం జరిగిన సమావేశంలో వనమాకు ఏమాత్రం సహకరించేది లేదని తెగేసి చెప్పారు. కోనేరుకు టికెట్ ఇవ్వకపోతే కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వబోమని టీడీపీ నాయకులు కాపా కృష్ణమోహన్, రావి రాంబాబు అంటున్నారు. ‘పేట’లోనూ సహకారం డౌటే.. అశ్వారావుపేటలో బలంగా ఉన్న తమకు కాకుండా ఏ మాత్రం కేడర్ లేని టీడీపీకి టికెట్ ఇవ్వడమేంటని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే టీపీసీసీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నం నాగమణి నామినేషన్ కూడా దాఖలు చేశారు. టికెట్ ఆశించి భంగపడిన మరో ఇద్దరు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థికి కాంగ్రెస్ కేడర్ సహకరిస్తేనే ఉపయోగం ఉంటుందని, లేదంటే గడ్డు పరిస్థితి నెలకొంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
టెన్షన్..సీట్ల టెన్షన్
సాక్షి, కొత్తగూడెం : కాంగ్రెస్ కూటమి పొత్తులు, సీట్ల లెక్కల వ్యవహారం నేడు తేలే అవకాశం ఉన్న నేపథ్యంలో.. జిల్లాలో కాంగ్రెస్ నుంచి ఏ స్థానంలో ఎవరికి టికెట్ దక్కుతుందనే విషయాలపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ కూటమిలోని టీడీపీ, టీజేఎస్ పార్టీల సర్దుబాట్లకు సంబంధించి న వ్యవహారం కొలిక్కి వచ్చినప్పటికీ సీపీఐతో సీట్ల సర్దుబాటు అంశంలో మాత్రం ఇప్పటికీ చిక్కుముడులు వీడలేదు. దీంతో సీట్ల లెక్కలు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో తేలలేదు. కొత్తగూడెంపై వీడని ప్రతిష్టంభన జిల్లాలోని ఏకైక జనరల్ నియోజకవర్గం కొత్తగూడెం విషయంలోనే ప్రతిష్టంభన ఏర్పడింది. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ వివిధ దశల్లో సర్వేలు నిర్వహించింది. వివిధ రకాలుగా వడపోత కార్యక్రమాలు నిర్వహించింది. నోటిఫికేషన్ సమయం సమీపించినా కూటమి పార్టీల పొత్తుల వ్యవహారంలో ఇంకా చర్చలు సాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీట్ల సర్దుబాట్ల విషయంలో అనేక కొర్రీలు, కిరికిరీలు తలెత్తడంతో పీటముడి పడింది. కొత్తగూడెం సీటు విషయానికి వస్తే ఇక్కడ మరింత గందరగోళం నెలకొంది. ఈ సీటు కోసం సీపీఐ పట్టువదలకుండా ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణల మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో హోరాహోరీ నెలకొంది. దీంతో ఈ సీటు విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సైతం గందరగోళంలో పడిన పరిస్థితి ఏర్పడింది. ఈ సీటు విషయమై రాజకీయ వర్గాలతో పాటు, సాధారణ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. మొదటి జాబితాలో ఎవరెవరికీ..? అనేక ములుపులు తిరుగుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీల టికెట్ల వ్యవహారం తుది దశకు చేరినప్పటికీ ఇంకా కొన్ని సీట్ల విషయంలో సరైన స్పష్టత రాలేదు. నేడు (శనివారం) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను 74 మంది పేర్లతో విడుదల చేయనున్నారు. రెండో జాబితా ఆదివారం ప్రకటిస్తామని చెబుతున్నప్పటికీ పలు సందేహాలు కలుగుతున్నాయి. నామినేషన్ల చివరి రోజు వరకు పొడిగించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. దీంతో 64 రోజులుగా ఎదురుచూస్తున్న ఆశావహుల్లో లబ్..డబ్ అనే విధంగా ఉత్కంఠ నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలకు సంబంధించి మొదటి జాబితాలో పినపాక ఒక్కటే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పినపాక అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పేరు ఖరారైనట్లు సమాచారం. అశ్వారావుపేట స్థానం పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయించడం, ఇక్కడ టీడీపీ నుంచి మెచ్చా నాగేశ్వరరావు బరిలో ఉండడం దాదాపు ఖాయమైనట్లే. కొత్తగూడెం నియోజకవర్గాన్ని పొత్తుల్లో భాగంగా తమకు కేటాయించాల్సిందేనని సీపీఐ గట్టిగా పట్టుబడుతోంది. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు విషయమై హైటెన్షన్ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆశావహులు వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణలను కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. వీరిద్దరిలో ఎవరిని బుజ్జగిస్తారో లేదా సీపీఐకి ఇవ్వాల్సి వస్తే ఇద్దరిని బుజ్జగిస్తారో అనే చర్చ సర్వత్రా నడుస్తోంది. ఈ సీటు కోసం సీపీఐ గట్టి పట్టు పడుతుండడంతో పాటు, ఇవ్వనిపక్షంలో కూటమి నుంచి బయటకు వెళతామని సీపీఐ అల్టిమేటం ఇవ్వడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. రాష్ట్రవ్యాప్త పొత్తు కొత్తగూడెం సీటుతో ముడిపడినట్లైంది. ఇల్లెందు, భద్రాచలం పెండింగే.. ఇల్లెందు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం 31 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఐదుగురు అభ్యర్థులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఊకె అబ్బయ్య, హరిప్రియలను అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. ఈ క్రమంలో మొదటి జాబితాలో ఇల్లెందు అభ్యర్థి పేరు ప్రకటించకుండా అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. మరోవైపు భద్రాచలం అభ్యర్థి విషయంలోనూ ఎంపిక ఓ కొలిక్కి రాకపోవడంతో దీన్ని కూడా పెండింగ్‌లో పెట్టారు. ఇక్కడ నుంచి పోటీకి కారం కృష్ణమోహన్, కృష్ణబాబు రేసులో ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క పోటీ చేస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి. సీతక్క మాత్రం ములుగు నుంచి పోటీ చేసేందుకే పట్టుబడుతున్నారు. ములుగు కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్న పొదెం వీరయ్యను భద్రాచలం నుంచి పోటీ చేయించేందుకు ప్రతిపాదించగా.. అందుకు ఆయన సుముఖంగా లేకపోగా ములుగు కోసమే భీష్మిస్తున్నారు. దీంతో ములుగుతో పాటు భద్రాచలం సీటు విషయాన్ని సైతం కాంగ్రెస్ అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాలో ప్రకటించకుండా పెండింగ్‌లో పెడుతున్న సీట్ల విషయానికి వస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనివే ఎక్కువగా ఉండడం గమనార్హం. టీఆర్ఎస్ ప్రకటించి 2 నెలల నాలుగు రోజులు తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అదేరోజు నుంచి 19వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ఉండనుంది. గత సెప్టెంబరు 6వ తేదీన శాసనసభ రద్దు చేయడంతో ఇప్పటికి రెండు నెలల నాలుగు రోజులు అయింది. టీఆర్ఎస్ పార్టీ 105 మంది అభ్యర్థులను అసెంబ్లీ రద్దు రోజే ప్రకటించింది. అప్పటి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో రెండు విడతలు ప్రచారం నిర్వహించారు. -
గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు
పినపాక(భద్రాద్రి కొత్తగూడెం): మహాశివరాత్రిని పురస్కరించుకొని పుణ్య స్నానాలు ఆచరిచండానికి గోదావరిలో దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం చింతలబయ్యారం గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామ శివారులోని గోదావరి ఒడ్డు పై ఉన్న శివాలయంలో పూజలు చేయడానికి వచ్చిన తంతరపల్లి మురళి(18), అల్లు నాగేంద్రబాబు(19), గూడె ప్రేమ్ కుమార్(22), పవన్(18), అనే నలుగురు యువకులు పవిత్ర స్నానమాచరించడానికి గోదావరిలో దిగి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గజఈతగాళ్ల సాహయంతో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
ఖమ్మంలో 22.. భద్రాదిలో 22
► ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి సమానంగా మండలాలు ► కొత్త జిల్లాలోకి నూతనంగా ఆరు మండలాలు ► ‘ఆచార్య జయశంకర్’లోకి వాజేడు, వెంకటాపురం ► భద్రాద్రి జిల్లా, రెవెన్యూ డివిజన్‌లోకి జూలూరుపాడు ► వైరా కాదు.. కల్లూరు రెవెన్యూ డివిజనే ఫైనల్ కానుంది.. ► ఏడు మండలాలతో ఈ డివిజన్ ఏర్పాటు ► ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లోకి మధిర, ఎర్రుపాలెం ► కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా నామకరణం ► రాజధానిలో జరిగిన ప్రజా ప్రతినిధుల భేటీలో ► ఈ ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ప్రాథమిక అంగీకారం సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లా పునర్విభజనకు తుది రూపు వచ్చింది. కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెంగా నామకరణం చేశారు. ఈ జిల్లాలోకి కొత్తగా ఆరు మండలాలు రానున్నాయి. ఆచార్య జయశంకర్ (భూపాలపల్లి) జిల్లాలోకి వాజేడు, వెంకటాపురం మండలాలు వెళ్లనున్నాయి. భద్రాద్రి జిల్లా, రెవెన్యూ డివిజన్లో జూలూరుపాడు మండలం కొనసాగుతుంది. వైరాకు బదులుగా ఏడు మండలాలతో కల్లూరు రెవెన్యూ డివిజన్ ఏర్పడనుంది. ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లోకి మధిర, ఎర్రుపాలెం మండలాలు వెళ్లనున్నాయి. ఈ మేరకు రాజధానిలో సీఎం కేసీఆర్ జిల్లాకు చెందిన మంత్రితోపాటు ప్రజాప్రతినిధులతో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. దీనిలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అభ్యంతరాలు పరిగణనలోకి.. గతంలో జిల్లా పునర్విభజనపై విడుదల చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై ప్రజల నుంచి అనేక అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా కొత్త మండలాల ఏర్పాటు.. రెవెన్యూ డివిజన్లపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ ఆందోళనలతోపాటు ఇంటెలిజెన్స్ నివేదికల మేరకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని గుర్తుకు తెచ్చేలా కొత్త జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా నామకరణం చేశారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో కొత్తగూడెం జిల్లాలో 18 మండలాలను పేర్కొన్నారు. వాజేడు, వెంకటాపురం మండలాలు జిల్లా కేంద్రం కొత్తగూడెంకు దూరంగా ఉన్నాయి.. తమకు భూపాలపల్లి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ జిల్లాలో కలపాలని స్థానికులు ఆందోళనలు చేశారు. వారి ఆకాంక్ష మేరకు ప్రభుత్వం ఆ రెండు మండలాలను భూపాలపల్లి జిల్లాలో కలపనుంది. కొత్తగా గుండాల మండలంలోని ఆళ్లపల్లి, పినపాక మండలంలోని కరకగూడెం, కొత్తగూడెం మండలంలోని లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, చండ్రుగొండ మండలంలోని అన్నపురెడ్డిపల్లిలను మండలాలుగా ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. మొత్తంగా కొత్తగూడెం జిల్లాలో 22 మండలాలు కానున్నాయి. కల్లూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ కల్లూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో వైరా కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కానీ కల్లూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేసిందని స్థానికులు ఆందోళనలు చేశారు. కల్లూరు రెవెన్యూ డివిజన్ చేస్తే ఇటు వైరాతోపాటు.. అటు సత్తుపల్లికి కూడా సౌకర్యంగా ఉంటుందని ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికల ఆధారంగా కల్లూరు కేంద్రంగానే రెవెన్యూ డివిజన్ చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ రెవెన్యూ డివిజన్‌లోకి తల్లాడ, కల్లూరు, సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు, వైరా, ఏన్కూరు మండలాలు రానున్నాయి. మధిర, ఎర్రుపాలెం మండలాలు ఖమ్మం రెవెన్యూ డివిజన్లో కొనసాగనున్నాయి. జూలూరుపాడు ‘కొత్త’జిల్లాలోకే... జూలూరుపాడు మండల ప్రజల అభీష్టాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ మండలాన్ని కొత్తగూడెం జిల్లాలో కలపాలని నిర్ణయించింది. ఈ మండలాన్ని ఖమ్మంలో కలపడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమైంది. జేఏసీగా ఏర్పడి ఆందోళనలు చేపట్టారు. ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన దీక్ష చేశారు. ఖమ్మంలో ప్రదర్శన చేసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వివిధ రూపాల్లో మండల ప్రజలు తన ఆకాంక్షను వెలిబుచ్చారు. అధికారుల నివేదికతోపాటు ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఈ మండలాన్ని కూడా కొత్తగూడెం జిల్లాలో కలపాలని సీఎం ఈ సమావేశంలో పేర్కొన్నారు. కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలోనే జూలూరుపాడు మండలం ఉండనుంది. ఈ అన్ని మార్పులపై జిల్లా అధికారులు నివేదికలు తయారు చేసిన అనంతరం వీటిని ముఖ్యమంత్రి పరిశీలించిన తర్వాత తుది నోటిఫికేషన్లో పేర్కొనే అవకాశం ఉంది. ఖమ్మంలో 22.. భద్రాదిలో 22 ఖమ్మం జిల్లాలో మొత్తంగా 46 మండలాలు కాగా.. రాష్ట్ర పునర్విభజనతో ఐదు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. ఇక మిగిలిన 41 మండలాలతో జల్లా పునర్విభజన చేయాలని ప్రభుత్వం భావించింది. ఇందులో గార్ల, బయ్యారం మండలాలను మహబూబాబాద్ జిల్లాలో కలుపుతున్నారు. మిగిలిన 39 మండలాల్లో తొలివిడత విడుదల చేసిన నోటిఫికేషన్ రఘునాథపాలెం కొత్త మండలంగా పేర్కొంటూ మొత్తం 40 జిల్లాలకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో ఖమ్మంజిల్లాలో 22, కొత్తగూడెం జిల్లాకు 18 మండలాలను కేటాయించారు. రెండు మండలాలు ఆచార్య జయశంకర్ (భూపాలపల్లి) జిల్లాలో కలవడం.. కొత్తగా ఆరు మండలాలు ఏర్పాటు కానుండటంతో ఖమ్మం జిల్లాలో 22 మండలాలు, కొత్తగూడెం జిల్లాలో కూడా 22 మండలాలు అవుతున్నాయి. జిల్లా పునర్విభజన తర్వాత రెండు జిల్లాలకు సమానంగా మండలాలు రావడం ఇదే ప్రథమం కావచ్చు. ఈ సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాలు, స్త్రీ,శిశుసంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, తాటి వెంకటేశ్వర్లు, బానోతు మదన్‌లాల్, జలగం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.