సాక్షి, కొత్తగూడెం: కాంగ్రెస్ కూటమిలో సీట్ల కేటాయింపు ప్రక్రియలో తలెత్తిన అసంతృప్తుల కారణంగా ఆయా పార్టీలు ఏ మేరకు సహకరించుకుంటాయో అనే విషయంలో ఒక స్పష్టత లేకుండా పోయింది. జిల్లాలోని ఏకైక జనరల్ స్థానమైన కొత్తగూడెం నియోజకవర్గం విషయంలో కూటమి పార్టీల మధ్య ఐక్యత సన్నగిల్లుతోంది. ఈ సీటును పొత్తుల్లో భాగంగా సీపీఐ గట్టిగా కోరినప్పటికీ కాంగ్రెస్ నాయకత్వం వనమా వెంకటేశ్వరరావును తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో కూటమిలోని సీపీఐ, టీడీపీ కత్తులు దూస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మాన్ని ఏమాత్రం పాటించలేదని సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన వనమా వెంకటేశ్వరరావుకు సీపీఐ నుంచి ఏ మేరకు సహకారం అందుతుందనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీని ఏమాత్రం ఖాతరు చేయకుండా కాంగ్రెస్ కొత్తగూడెం సీటు విషయంలో ఏకపక్షంగా వ్యవహరించిందని సీపీఐ గరంగా ఉంది. ఈ సీటును ఆశించిన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బాహాటంగానే కాంగ్రెస్‌ను విమర్శించారు. ఆ పార్టీ కూటమికి అహంకారపూరిత పెద్దన్న పాత్ర పోషించిందని అన్నారు. పొత్తు ధర్మాన్ని ఏమాత్రం పాటించలేదని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 40 నియోజకవర్గాల్లో గణనీయమైన ఓటుబ్యాంకు కలిగి ఉన్న సీపీఐ విషయంలో కాంగ్రెస్ దారుణంగా వ్యవహరించిందని అన్నారు.
తమకు మూడు సీట్లు మాత్రమే కేటాయించడం కాంగ్రెస్ నాయకత్వం తీరుకు నిదర్శనమన్నారు. వివిధ రకాల సర్వేల పేరుతో కాంగ్రెస్ పార్టీ హైప్ సృష్టించిందన్నారు. తాను టీఆర్‌ఎస్ వద్ద డబ్బులు తీసుకుని టికెట్ ఆశించానని వనమా వెంకటేశ్వరరావు తీవ్రమైన ఆరోపణలు చేయడం పట్ల కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో చర్చించి స్నేహపూర్వక పోటీకైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. బీ–ఫారం కూడా సిద్ధంగా ఉంచుకున్నానని తెలిపారు. అయితే తనకు మద్దతు ఇవ్వాలంటూ వనమా వెంకటేశ్వరారవు కూనంనేని ఇంటికి వెళ్లి కోరగా, రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని చెబుతానని కూనంనేని తెలిపారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
బరిలోకి దిగుతానంటున్న ఎడవల్లి..
కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ సైతం వనమాకు ఏ మాత్రం సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బరిలోకి దిగుతానని అంటున్నారు. ఇప్పటికే తన వర్గీయులతో సమావేశం నిర్వహించారు. తాను ఏ బ్యానర్‌పై బరిలోకి దిగేది శుక్రవారం నాటికి స్పష్టత ఇస్తానని ఎడవల్లి చెబుతున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ కూడా ఈ స్థానాన్ని ఆశించారు. టికెట్ తనకు వచ్చే అవకాశం ఉండగా, నామా నాగేశ్వరారవు తన స్వార్థం కోసం రాకుండా చేశారని ఆరోపిస్తున్నారు. మంగళవారం కొత్తగూడెంలో నామా నాగేశ్వరరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. బుధవారం జరిగిన సమావేశంలో వనమాకు ఏమాత్రం సహకరించేది లేదని తెగేసి చెప్పారు. కోనేరుకు టికెట్ ఇవ్వకపోతే కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వబోమని టీడీపీ నాయకులు కాపా కృష్ణమోహన్, రావి రాంబాబు అంటున్నారు.
‘పేట’లోనూ సహకారం డౌటే..
అశ్వారావుపేటలో బలంగా ఉన్న తమకు కాకుండా ఏ మాత్రం కేడర్ లేని టీడీపీకి టికెట్ ఇవ్వడమేంటని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే టీపీసీసీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నం నాగమణి నామినేషన్ కూడా దాఖలు చేశారు. టికెట్ ఆశించి భంగపడిన మరో ఇద్దరు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థికి కాంగ్రెస్ కేడర్ సహకరిస్తేనే ఉపయోగం ఉంటుందని, లేదంటే గడ్డు పరిస్థితి నెలకొంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment