సాక్షి, కొత్తగూడెం : కాంగ్రెస్ కూటమి పొత్తులు, సీట్ల లెక్కల వ్యవహారం నేడు తేలే అవకాశం ఉన్న నేపథ్యంలో.. జిల్లాలో కాంగ్రెస్ నుంచి ఏ స్థానంలో ఎవరికి టికెట్ దక్కుతుందనే విషయాలపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ కూటమిలోని టీడీపీ, టీజేఎస్ పార్టీల సర్దుబాట్లకు సంబంధించి న వ్యవహారం కొలిక్కి వచ్చినప్పటికీ సీపీఐతో సీట్ల సర్దుబాటు అంశంలో మాత్రం ఇప్పటికీ చిక్కుముడులు వీడలేదు. దీంతో సీట్ల లెక్కలు ఇప్పటివరకు పూర్తిస్థాయిలో తేలలేదు.
కొత్తగూడెంపై వీడని ప్రతిష్టంభన
జిల్లాలోని ఏకైక జనరల్ నియోజకవర్గం కొత్తగూడెం విషయంలోనే ప్రతిష్టంభన ఏర్పడింది. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ వివిధ దశల్లో సర్వేలు నిర్వహించింది. వివిధ రకాలుగా వడపోత కార్యక్రమాలు నిర్వహించింది. నోటిఫికేషన్ సమయం సమీపించినా కూటమి పార్టీల పొత్తుల వ్యవహారంలో ఇంకా చర్చలు సాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీట్ల సర్దుబాట్ల విషయంలో అనేక కొర్రీలు, కిరికిరీలు తలెత్తడంతో పీటముడి పడింది. కొత్తగూడెం సీటు విషయానికి వస్తే ఇక్కడ మరింత గందరగోళం నెలకొంది.
ఈ సీటు కోసం సీపీఐ పట్టువదలకుండా ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీలో టికెట్ కోసం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణల మధ్య నువ్వా నేనా అనే స్థాయిలో హోరాహోరీ నెలకొంది. దీంతో ఈ సీటు విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సైతం గందరగోళంలో పడిన పరిస్థితి ఏర్పడింది. ఈ సీటు విషయమై రాజకీయ వర్గాలతో పాటు, సాధారణ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.
మొదటి జాబితాలో ఎవరెవరికీ..?
అనేక ములుపులు తిరుగుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీల టికెట్ల వ్యవహారం తుది దశకు చేరినప్పటికీ ఇంకా కొన్ని సీట్ల విషయంలో సరైన స్పష్టత రాలేదు. నేడు (శనివారం) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాను 74 మంది పేర్లతో విడుదల చేయనున్నారు. రెండో జాబితా ఆదివారం ప్రకటిస్తామని చెబుతున్నప్పటికీ పలు సందేహాలు కలుగుతున్నాయి. నామినేషన్ల చివరి రోజు వరకు పొడిగించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. దీంతో 64 రోజులుగా ఎదురుచూస్తున్న ఆశావహుల్లో లబ్..డబ్ అనే విధంగా ఉత్కంఠ నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాలకు సంబంధించి మొదటి జాబితాలో పినపాక ఒక్కటే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పినపాక అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పేరు ఖరారైనట్లు సమాచారం. అశ్వారావుపేట స్థానం పొత్తుల్లో భాగంగా టీడీపీకి కేటాయించడం, ఇక్కడ టీడీపీ నుంచి మెచ్చా నాగేశ్వరరావు బరిలో ఉండడం దాదాపు ఖాయమైనట్లే.
కొత్తగూడెం నియోజకవర్గాన్ని పొత్తుల్లో భాగంగా తమకు కేటాయించాల్సిందేనని సీపీఐ గట్టిగా పట్టుబడుతోంది. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీటు విషయమై హైటెన్షన్ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆశావహులు వనమా వెంకటేశ్వరరావు, ఎడవల్లి కృష్ణలను కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. వీరిద్దరిలో ఎవరిని బుజ్జగిస్తారో లేదా సీపీఐకి ఇవ్వాల్సి వస్తే ఇద్దరిని బుజ్జగిస్తారో అనే చర్చ సర్వత్రా నడుస్తోంది. ఈ సీటు కోసం సీపీఐ గట్టి పట్టు పడుతుండడంతో పాటు, ఇవ్వనిపక్షంలో కూటమి నుంచి బయటకు వెళతామని సీపీఐ అల్టిమేటం ఇవ్వడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. రాష్ట్రవ్యాప్త పొత్తు కొత్తగూడెం సీటుతో ముడిపడినట్లైంది.
ఇల్లెందు, భద్రాచలం పెండింగే..
ఇల్లెందు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం 31 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఐదుగురు అభ్యర్థులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఊకె అబ్బయ్య, హరిప్రియలను అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. ఈ క్రమంలో మొదటి జాబితాలో ఇల్లెందు అభ్యర్థి పేరు ప్రకటించకుండా అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. మరోవైపు భద్రాచలం అభ్యర్థి విషయంలోనూ ఎంపిక ఓ కొలిక్కి రాకపోవడంతో దీన్ని కూడా పెండింగ్‌లో పెట్టారు. ఇక్కడ నుంచి పోటీకి కారం కృష్ణమోహన్, కృష్ణబాబు రేసులో ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క పోటీ చేస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి.
సీతక్క మాత్రం ములుగు నుంచి పోటీ చేసేందుకే పట్టుబడుతున్నారు. ములుగు కాంగ్రెస్ టికెట్ రేసులో ఉన్న పొదెం వీరయ్యను భద్రాచలం నుంచి పోటీ చేయించేందుకు ప్రతిపాదించగా.. అందుకు ఆయన సుముఖంగా లేకపోగా ములుగు కోసమే భీష్మిస్తున్నారు. దీంతో ములుగుతో పాటు భద్రాచలం సీటు విషయాన్ని సైతం కాంగ్రెస్ అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాలో ప్రకటించకుండా పెండింగ్‌లో పెడుతున్న సీట్ల విషయానికి వస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనివే ఎక్కువగా ఉండడం గమనార్హం.
టీఆర్‌ఎస్ ప్రకటించి 2 నెలల నాలుగు రోజులు
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అదేరోజు నుంచి 19వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ఉండనుంది. గత సెప్టెంబరు 6వ తేదీన శాసనసభ రద్దు చేయడంతో ఇప్పటికి రెండు నెలల నాలుగు రోజులు అయింది. టీఆర్‌ఎస్ పార్టీ 105 మంది అభ్యర్థులను అసెంబ్లీ రద్దు రోజే ప్రకటించింది. అప్పటి నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో రెండు విడతలు ప్రచారం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment