పోటా పోటి.. | Political Heat In State | Sakshi
Sakshi News home page

పోటా పోటి..

Published Sun, Nov 25 2018 10:46 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Political Heat In State - Sakshi

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఎన్నికల ప్రచా రం ఊపందుకుంది. ఈనెల 22న నామి నేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియగా.. అగ్రనేతల పర్యటనలతో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. కరీంనగర్‌ జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉండగా.. టీఆర్‌ఎస్‌–ప్రజాకూటమి (మహాకూటమి) అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొం డూరు నియోజకవర్గాల నుంచి బీజేపీ పోటీ చేస్తున్నా, కరీంనగర్, చొప్పదండిలలో హోరాహోరీగా పోరాడుతున్నా రు. మానకొండూరులోనూ బీజేపీ అభ్యర్థి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బీఎల్‌ఎఫ్, బీఎస్‌పీ తదితర 14 పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు కలిసి మొత్తం 61 మంది పోటీలో ఉండగా.. ప్రధానంగా టీఆర్‌ఎస్‌–ప్రజాకూటమి అభ్యర్థుల మధ్యే పోటీ కనిపిస్తోంది.

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:
నామినేషన్ల ఉపసంహరణ గురువారం తర్వాత ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్, బీజేపీ నేత అమిత్‌షా, కాంగ్రెస్‌ నేతలు భట్టి విక్రమార్క, విజయశాంతి తదితరులు కూడా క్యాంపెయిన్‌ నిర్వహించారు. హుజూరాబాద్‌ మండలం ఇందిరానగర్‌లో కేసీఆర్‌ సభ విజయవంతమైంది. కాగా.. మరోమారు ప్రచారానికి ఈనెల 25 నుంచి ఆయా పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగనున్నారు. దీంతో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు ప్రచారం దూకుడు పెంచాయి. శనివారం నాటికి ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలా ఉంది.

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో త్రిముఖ పో టీ జరుగుతున్నా.. ప్రధాన పోటీ టీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ల మధ్యే నెలకొంది. 2009 వరకు కమలాపూర్, ఆ నియోజకవర్గం తర్వాత హుజూరా బాద్‌ నుంచి మొత్తం ఐదు పర్యాయాలు విజయ దుందుబి మోగించిన మంత్రి ఈటల రాజేందర్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆరోసారి విజయం సాధించేందుకు దూసుకెళ్తున్నారు. 30 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాలలో అధికారానికి దూరంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా చివరి నిమిషంలో పాడి కౌశిక్‌రెడ్డిని ప్రకటించింది. ఈనెల 19న వీణవంక మండలం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో జిల్లాలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ నాలుగున్నరేళ్లలో చేసిన సుమారు మూడు వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ మంత్రి ఈటల రాజేందర్‌ ›ప్రచారం చేస్తున్నారు. ప్రజాకూటమి అభ్యర్థిగా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న తనను గెలిపించాలని పాడి కౌశిక్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి పుప్పాల రఘు ఈ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు.

 కరీంనగర్‌: టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యన ప్రధాన పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి మొదటìసారిగా బీసీ వర్గానికి చెందిన అభ్యర్థిగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ టీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొంది హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తున్నారు. ›ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. రికార్డు స్థాయిలో నిధులు, పనులను ప్రచారం చేస్తున్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్‌ తనను గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన, వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాకూటమి అధికారంలోకి వస్తే జరిగే మేలును వివరిస్తూ గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన బీజేపీ బండి సంజయ్‌కుమార్‌ ఈసారి కూడా ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ హిందుత్వ నినాదం, మోదీ పథకాలతో ముందుకెళ్తున్న ఆయన చాపకింది నీరులా ప్రచారం చేస్తున్నారు.

మానకొండూరు (ఎస్సీ): మానకొండూరు నియోజకవర్గంలో మళ్లీ పాతకాపుల మధ్యనే హోరాహోరీ పోరు సాగుతోంది. ప్రధానంగా పోటీ టీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ పార్టీల మధ్యన నెలకొనగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రసమయి బాలకిషన్, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆరెపల్లి మోహన్‌ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. బాలకిషన్‌కు అండగా మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్‌ తదితరులు  ప్రచారం నిర్వహించగా.. మోహన్‌ కోసం మల్లు భట్టి విక్రమార్క, విజయశాంతి రోడ్‌షోలు నిర్వహించారు. ఇద్దరి మధ్య పోరు రసవత్తరంగా సాగుతుండగా.. బీజేపీ అభ్యర్థి గడ్డం నాగరాజు సైతం నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ గ్రామాల్లో తిరుగుతున్నారు.

చొప్పదండి (ఎస్సీ): చొప్పదండి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ సాగుతోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుంకె రవిశంకర్, కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి బొడిగె శోభ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇచ్చిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బొడిగె శోభను నిరాకరించగా, ఆమె బీజేపీ నుంచి బరిలో దిగారు. తొలిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా అధికార పార్టీ నుంచి బరిలోకి దిగిన రవిశంకర్‌ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజాకూటమి అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్‌ మేడిపల్లి సత్యం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే జరిగే మేలును ప్రజలకు వివరిస్తూ  తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement