సాక్షి, చెన్నూర్ : చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల వేడి రగిలింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు రాత్రి, పగలనక ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో 1,64,191 ఓట్లు ఉండగా, మందమర్రి మండలంలోనే 65,553 ఓట్లు ఉన్నాయి. మందమర్రిలో ఎక్కువ ఓట్లు ఉండడంతో ప్రధానపార్టీ అభ్యర్థులతోపాటు ఇతర పార్టీ అభ్యర్థులు మందమర్రిలో ప్రచారాన్ని ఎక్కువ సాగిస్తున్నారు. అన్నిపార్టీల అభ్యర్థుల ఆశలన్నీ మందమర్రి మీదనే ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రధాన అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఆయా పార్టీల అనుచరవర్గం గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతీఓటరు కలిసేందుకు గడపగడపకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
వినూత్న రితీలో..
ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులతోపాటు అనుచరవర్గంలో పడరాని పాట్లు పడుతున్నారు. వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలని ప్రార్థిస్తూ వారి నిర్వహించే వృత్తులను అభ్యర్థులు, నాయకులు నిర్వహిస్తున్నారు. టీ స్టాల్స్‌లో టీ తయారు చేయడంతో దోసెలు వేయడం, ఇస్త్రీ చేయడం, పండ్లు అమ్మడం, కట్టుమిషన్లు కుట్టడం పనులు చేస్తూ వినూత్న రితీలో ప్రచారాన్ని సాగిస్తున్నారు.
అన్ని పార్టీలకు సవాలే..
టీఆర్‌ఎస్ ప్రభుత్వం 9 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు శంఖారావం పూరించింది. ప్రభుత్వం రద్దు చేసిన తర్వాతనే అభ్యర్థులను ప్రకటించడంతో అభ్యర్థులు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. మహాకూటమి అభ్యర్థులు ఖరారు ఆలస్యం కావడంతో ముందుగానే టీఆర్‌ఎస్ అభ్యర్థులు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సూడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను కలిసి భారీ మెజార్టీతో గెలిపించాలని కలియతిరుగుతున్నారు. మహాకూటమి అభ్యర్థు ఖారారు కావడం అలస్యమైనప్పటికి కాంగ్రెస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్‌నేత టీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌తో పోటాపోటీగా ప్రచారం చేశారు. బీజేపీ, బీఎస్పీ, బీఎల్‌ఎఫ్, న్యూ ఇండియా, ఆర్పీ (ఏ) ఆర్పీ (కె), పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, ఎన్‌సీపీతోపాటు నలుగురు స్వంతంత్ర అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ ఎన్నికలు ప్రధాన పార్టీల అభ్యర్థులకు సవాలుగా మారాయి. అభివృద్ధి నినాదంతో టీఆర్‌ఎస్, ప్రభుత్వం వ్యతిరేక విధానాలతో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం సాగిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. అంతేకాక బీజేపీ, బీఎల్‌ఎఫ్, బీఎస్పీ అభ్యర్థులు సైతం ప్రభుత్వం వ్యతిరేక ఓటుపైనే ఆశతో ముందుకుపోతున్నారు.
పెరిగిన జంప్ జిలానీలు
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జంప్ జిలానీల పెరిగారు. నిన్న మొన్నటి వరకు ఒక పార్టీలో పనిచేసి నాయకులు, కార్యకర్తలు తెల్లవారే సరికి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. జంప్ జిలానీల బెడద అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. ప్రధాన స్థాయి నాయకులకు ఒక రేటు, కింద స్థాయి నాయకులకు మరో రేటుతో పార్టీలు మారుతున్నారు. నాయకులు పార్టీలు మారడంలో వారిని నమ్ముకొని ఉన్న కార్యకర్తలు ఆయోమయానికి గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment