ప్రచార హోరు.. | Election Campaign.. | Sakshi
Sakshi News home page

ప్రచార హోరు..

Published Sun, Nov 25 2018 9:59 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Election Campaign..  - Sakshi

ఎన్నికల రణరంగంలో రాటుదేలిన అభ్యర్థులు. ప్రధాన రాజకీయ పక్షాల్లో బరి సమంగా ఉండడంతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తూ పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు. రెండు నెలల క్రితమే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆ పార్టీ ఖరారు చేయడం.. మొదట్లో కొన్నిచోట్ల అభ్యర్థులకు అసమ్మతి సెగ ఆందోళనకు గురిచేసినా.. పార్టీ నాయకత్వం సమసిపోయేలా చేయడం.. మరికొన్నిచోట్ల తీవ్రతను తగ్గించేలా చేయడంతో అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారంలో తలమునకలయ్యారు. ఇక ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించినప్పటికీ పలుచోట్ల ప్రజాకూటమి అభ్యర్థుల వ్యవహార శైలిపై భాగస్వామ్య పక్షాలు అసంతృప్తితో ఉండగా.. ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ప్రచారానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్, ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పోటీ చేస్తుండగా.. బీజేపీ పది స్థానాల్లోనూ.. బీఎల్‌ఎఫ్‌–సీపీఎం కూటమి పది స్థానాల్లోనూ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ పలు స్థానాల్లో అభ్యర్థులను రంగంలోకి దించాయి. ప్రధానంగా టీఆర్‌ఎస్, ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాల మధ్యే పోటాపోటీ నెలకొంది. ఈసారి ఎన్నికల గోదాలోకి దిగిన ఇరుపక్షాల అభ్యర్థుల్లో అనేక మందికి గతంలో పోటీ చేసిన అనుభవం ఉండడం.. కొందరు పోటీ చేస్తున్న పార్టీకి కొత్త అయినా.. గత ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి మరో పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో ప్రధాన పార్టీ ప్రత్యర్థుల రాజకీయ బలాలు, బలహీనతలపై తమకున్న అవగాహన మేరకు వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించుకుని ప్రచారంలో రాజకీయ అస్త్రాలను సంధిస్తున్నారు.

కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్‌ ఉమ్మడి జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా.. టీడీపీ మూడు నియోజకవర్గాల్లో.. సీపీఐ ఒక నియోజకవర్గంలో బరిలో నిలిచింది.  అయితే భాగస్వామ్య పక్షాల మధ్య ఓట్ల బదలాయింపు అంశం ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ, కాంగ్రెస్‌ తొలిసారిగా మిత్రపక్షంగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తుండడం, గతంలోనూ కాంగ్రెస్‌తో ఎన్నికల మైత్రి కొనసాగించిన సీపీఐ ఈసారి సైతం కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉండటంతో ఆయా పార్టీలకు.. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న బలం తమ గెలుపునకు దోహదపడుతుందని అభ్యర్థులు అంచనాలో మునిగితేలుతున్నారు. అయితే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ ద్వితీయ శ్రేణి నేతల మధ్య సమన్వయం సాధించి.. రాజకీయ ప్రత్యర్థిపై కలిసికట్టుగా ప్రచారాస్త్రాలను సంధించాలన్న పార్టీల లక్ష్యం మాత్రం జిల్లాలో ఇంకా ఆచరణకు నోచుకోవడం లేదు. ఉమ్మడి జిల్లాలోని ఇల్లెందు, పాలేరు, కొత్తగూడెం, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థులు ఇప్పటి వరకు ఒంటరిగానే తమ ప్రచారం కొనసాగిస్తున్నారు.

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న మల్లు భట్టి విక్రమార్క తన ప్రచారం కొనసాగిస్తూనే.. మధిరకు గల రాజకీయ ప్రాధాన్యత దృష్ట్యా పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతితో కలిసి నియోజకవర్గంలో ఒక దఫా ప్రచారం నిర్వహించారు. ఇల్లెందు, పాలేరు, మధిర, కొత్తగూడెం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రెండు, మూడు రోజుల్లో జిల్లాకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైరాలో ప్రజాకూటమి అభ్యర్థిగా సీపీఐ నుంచి గుగులోతు విజయాబాయి పోటీ చేస్తుండగా.. ఇక్కడ కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థిగా రాములునాయక్‌ రంగంలో ఉండడం, ఆయన కాంగ్రెస్‌ శ్రేణులతో నిత్యం సమావేశాలు నిర్వహించడం.. టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతలను తనవైపు తిప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్‌ శ్రేణులు ప్రచార పర్వంలో పూర్తిస్థాయిలో పాల్గొనకపోవడంపై సీపీఐ ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్టానానికి వివరించినట్లు సమాచారం.

వైరాలో కాంగ్రెస్‌ శ్రేణులు సహకరించేలా చూడాలని, లేదంటే కూటమి భాగస్వామ్య పక్షమైన తమ పార్టీ శ్రేణులు ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు సహకరించే అంశంపై ప్రభావం పడుతుందని తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వైరా నియోజకవర్గంలోని పరిస్థితులను చక్కబెట్టే పనిని భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. సత్తుపల్లిలో ప్రజాకూటమి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత సంభాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వేంసూరు మండలంలో రోడ్‌షో నిర్వహించారు.

ప్రచారంలో భాగస్వామ్యం కల్పించకపోవడంపై అసంతృప్తి
ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు ప్రచార సరళి కాంగ్రెస్‌ శ్రేణులను పూర్తిస్థాయిలో మమేకం చేయలేకపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆయన పక్షాన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఎవరూ బహిరంగ ప్రచారానికి రాకపోవడం.. పార్టీ ప్రచారం, ఇతర వ్యవహారాల్లో కూటమి నేతల పాత్ర నామమాత్రంగా ఉండడం.. కాంగ్రెస్‌ ద్వితీయ శ్రేణి నాయకులు అనేక మంది ప్రచారంలో తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ప్రచారంలో కాంగ్రెస్‌లోని అన్ని వర్గాలు, టీడీపీ శ్రేణులు పూర్తిస్థాయిలో పాల్గొనకపోవడంపై టీడీపీ వర్గాల్లోనే ‘మారిందన్నావురో.. ఎక్కడ మారిందిరో’ అంటూ తమ పార్టీ నేతల వ్యవహార శైలిపై వ్యంగ్య వాగ్భాణాలు వదులుతున్నారు.

కూటమి పక్షాన జరిగే ప్రచారంలో తమకు పూర్తిస్థాయి సమాచారం ఉండడం లేదని ఆయా ప్రాంతాల్లోని కాంగ్రెస్‌ శ్రేణులు నిర్వేదం చెందుతుండగా.. వచ్చిన వారినే కలుపుకుపోతామనే భావనతో ప్రచార పర్వాన్ని భుజానికెత్తుకున్న టీడీపీ నేతలు వ్యవహరిస్తుండడంతో ఖమ్మం నియోజకవర్గంలో ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాల నుంచి మనుషులు కలిసినా.. మనసులు కలవని పరిస్థితి నెలకొందనే విమర్శలు వినవస్తున్నాయి. ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన సీనియర్‌ నేతల్లో సైతం అసంతృప్తి గూడుకట్టుకుని ఉంది. పార్టీ ముఖ్య నేతల సూచన మేరకు ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నా.. తమను ప్రజాకూటమి అభ్యర్థి పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారని అనేక సందర్భాల్లో తమ సమీప ప్రాంతాల్లో జరిగే ఆత్మీయ సమావేశాలకు, కార్యకర్తల సమావేశాలకు ఆహ్వానం సైతం ఉండడం లేదని మథన పడుతున్నట్లు సమాచారం.

ఖమ్మం టికెట్‌ ఆశించిన పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఖమ్మం నియోజకవర్గంలో ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. కూటమిలోని భాగస్వామ్య పక్షం ఆయన సేవలను వినియోగించుకోకపోవడంపై సుధాకర్‌రెడ్డి వర్గీయుల్లో అసంతృప్తి రగులుతోంది. అయితే ఈనెల 28న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తుండడంతో ఖమ్మం ప్రజాకూటమి అభ్యర్థి, టీడీపీ నేత నామా నాగేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, శాసన మండలి ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బాగం హేమంతరావు తదితరులు ఖమ్మంలో విలేకరుల సమావేశం నిర్వహించి.. కూటమి విజయానికి సర్వశక్తులు ఒడ్డుతామని స్పష్టం చేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement