సాక్షి, కొత్తగూడెం: మొదటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల ఖిల్లాగా ఉండేది. రాష్ట్ర శాసనసభలో ప్రతిసారి ఉమ్మడి జిల్లా నుంచి వామపక్ష పార్టీల ప్రాతినిధ్యం ఉండేది. అయితే ప్రస్తుత శాసనసభలో మాత్రం వాపపక్ష పార్టీలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ప్రజాసమస్యలు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల ప్రజల సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తే అవకాశం కమ్యూనిస్టులకు దక్కలేదు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో ప్రాతినిధ్యం ఉన్నా, లేకున్నా ఉమ్మడి జిల్లాలో మాత్రం ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండేది. సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీలు ప్రజాగొంతుక వినిపించేవి.
రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అసలు వామపక్ష పార్టీలకు ప్రాతినిధ్యమే దక్కలేదు. తెలంగాణ శాసనసభలో మాత్రం గత ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం నుంచి సీపీఎం ప్రాతినిధ్యం వహించింది. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పొత్తుతో సీపీఎం ఒక్క భద్రాచలం శాసనసభ స్థానంలో మాత్రమే గెలుపొందింది. సీపీఐ నల్లగొండ జిల్లాలోని దేవరకొండ స్థానాన్ని గెలిచినప్పటికీ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారు. ఈ నెల 11న వెల్లడయిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వామపక్షాలకు ఒక్క స్థానం కూడా దక్కలేదు. సీపీఎం బీఎల్‌ఎఫ్ బ్యానర్‌తో, సీపీఐ కాంగ్రెస్ కూటమితో వెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం, అశ్వారావుపేట, పినపాకల్లో సీపీఎం నేరుగా బరిలోకి దిగగా, కొత్తగూడెంలో బీఎల్‌ఎఫ్ అభ్యర్థిని బరిలోకి దింపింది. ఇల్లెందులో న్యూడెమోక్రసీ(రాయల) అభ్యర్థికి సీపీఎం మద్దతు తెలిపింది. సీపీఐ మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కూటమి పొత్తుతో ఒక్క వైరా స్థానంలో మాత్రమే పోటీ చేసింది. కానీ వామపక్షాలు ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. అన్ని చోట్లా సీపీఎం, బీఎల్‌ఎఫ్, సీపీఐ, ఎన్డీ(రాయల), ఎన్డీ(చంద్రన్న) పార్టీలకు ఓట్లు అనుకున్న స్థాయిలో కూడా రాలేదు. దీంతో ఆయా పార్టీలకు ప్రాతినిధ్యం అవకాశం లేకపోవడంతో పాటు ప్రాబల్యం కూడా తగ్గిపోయిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
∙గతంలో ఉమ్మడి జిల్లాలో గట్టి ప్రాబల్యం కలిగి ఉన్న సీపీఐ పట్టు ఈసారి మరింత తగ్గిపోయింది. కాంగ్రెస్ కూటమితో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా స్థానంలో పోటీ చేయగా ఓటమి పాలైంది. 2014 ఎన్నికల్లో సైతం ఖమ్మం లోక్‌సభకు సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ, కాంగ్రెస్ పొత్తుతో పోటీ చేసినప్పటికీ మూడోస్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. శాసనసభ స్థానాలు సైతం ఎక్కడా గెలుచుకోలేకపోయింది. సీపీఐ 1989, 1996, 1998 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు భద్రాచలం లోక్‌సభ స్థానాన్ని గెలుచుకుంది. 1962లో అప్పటి పాల్వంచ నియోజకవర్గంలో గెలిచింది. తరువాత బూర్గంపాడు శాసనసభ నియోజకవర్గంలో 5 సార్లు విజయం సాధించింది. అదేవిధంగా సుజాతనగర్ నియోజకవర్గంలో 5 సార్లు విజయం సాధించింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సుజాతనగర్ స్థానంలో కొత్తగా ఏర్పాటైన వైరా నియోజకవర్గంలో సైతం సీపీఐ 2009లో విజయం సాధించింది. 2009లో కొత్తగూడెంలోనూ గెలుపొందింది. ఇక 1952, 1962, 1994ల్లో ఇల్లెందులోనూ సీపీఐ విజయం సాధించింది. ఇంతటి ప్రాబల్యం కలిగి ఉన్న సీపీఐ ఈసారి మరింత దెబ్బతిన్నది.
∙గతంలో ఖమ్మం లోక్‌సభ స్థానంతో పాటు వివిధ శాసనసభ స్థానాల్లో ప్రాతినిధ్యం వహించిన సీపీఎం 2014లో ఒక్క భద్రాచలం శాసనసభ స్థానంలో మాత్రమే వైఎస్సార్‌సీపీ మద్దతుతో గెలిచింది. 2004లో భద్రాచలం లోక్‌సభ స్థానాన్ని సైతం సీపీఎం గెలుచుకుంది. 1978 నుంచి 2014 వరకు (2009 మినహా) సీపీఎం భద్రాచలంలో వరుసగా 8 సార్లు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఇల్లెందు(ఎన్డీకి మద్దతు), కొత్తగూడెంలో బీఎల్‌ఎఫ్, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేటల్లో సీపీఎం నేరుగా పోటీ చేసింది. అయితే సీపీఎంకు గట్టి పట్టున్న చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, ఎటపాక మండలాలు ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లిపోవడంతో సిట్టింగ్ స్థానం భద్రాచలం నియోజకవర్గంలోనూ మూడో స్థానానికి పడిపోయింది.
ఇల్లెందులో ఎన్డీ రాయల, చంద్రన్న వర్గాలు విడివిడిగా..
సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ విషయానికి వస్తే 1978 నుంచి 2004 వరకు (1994 మినహా) 6 సార్లు విజయం సాధించింది. నియోజకవర్గాల పునర్విభజనతో ఎన్డీ 2009, 2014లో ఓటమిపాలైంది. ఎన్డీకి గట్టి పట్టున్న గుండాల మండలం పినపాకలోకి, కారేపల్లి మండలం వైరా నియోజకవర్గంలోకి వెళ్లాయి. దీంతో ఎన్డీకి గెలుపు దూరమైంది. కాగా 2013లో ఎన్డీ రాయల, చంద్రన్న వర్గాలుగా విడిపోయాయి. దీంతో 2014 ఎన్నికల్లో రాయల వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, చంద్రన్న వర్గం నుంచి యదళ్లపల్లి సత్యం పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లో కూడా రెండు వర్గాలు అన్ని స్థానాల్లో విడివిడిగా పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయాయి.
Comments
Please login to add a commentAdd a comment