సాక్షి ప్రతినిధి–ఖమ్మం : అంబేడ్కర్ వాదులు, అభ్యుదయ వాదులు, కమ్యూనిస్టులు కలిసి పనిచేయాలన్నదే లాల్–నీల్ సిద్ధాంతమని, భవిష్యత్తు ఈ ఎజెండాదే అని అంటున్నారు ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ సీపీఎం అభ్యర్థి బి.వెంకట్. సమాజంలోని పీడిత, తాడిత ప్రజలు ‘లాల్ –నీల్’ వైపు మొగ్గు చూపే సమయం ఆసన్నమైందని ఘంటాపథంగా చెబుతున్నారాయన. జనరల్ నియోజకవర్గమైన ఖమ్మంలో పార్లమెంటు అభ్యర్థిగా దళిత నేతకు అవకాశమిచ్చింది సీపీఎం.
ఇదీ లాల్–నీల్ ఎజెండాలో భాగమేనని, ఇటువంటి పోటీలు ఇకముందు కూడా ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక్కడి అగ్రవర్ణ ప్రాబల్యాన్ని కాదని మరీ అదే జిల్లాకు చెందిన నాయకుడు, దశాబ్దాల కాలంగా ప్రజాపోరాటాల్లో ఉన్న వెంకట్‌ను ఇందుకు ఎంచుకుంది. ఇది లాల్ నీల్ ఎజెండాకు అనుగుణంగా జరిగిన ఎంపిక అని ఆ పార్టీ చెబుతోంది.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న వెంకట్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్ర రాజకీయాలు, కమ్యూనిస్టు పోరాటాలు, లాల్ నీల్ లక్ష్యాలను వివరించారు. కార్పొరేట్ రాజకీయాలకు కాలం చెల్లే రోజు ఎంతో దూరంలో లేదని, పీడిత ప్రజల పక్షాన నిలిచే కమ్యూనిస్టు పార్టీలదే భవిష్యత్తు అని ఆయన చెప్పారు. ప్రజల్లో భ్రమలు కల్పించడం కమ్యూనిస్టు పార్టీల పని కాదని, వాస్తవ పరిస్థితులను ఆలోచింపచేయడమే తమ లక్ష్యమని అన్నారు. ఖమ్మం జిల్లా వాసి అయిన తాను జిల్లా ప్రజలతో మమేకం కావడమే కాకుండా సమస్యల మూలాలపై అవగాహన ఉందని, ఓటు అడిగే హక్కు సీపీఐ బలపరుస్తున్న సీపీఎం అభ్యర్థిగా తనకే ఉందని అంటున్నారు వెంకట్. ఇంకా ఆయన ఏమంటున్నారంటే..
పోరాటాలే కమ్యూనిస్టుల బలం..
పేద బలహీన, బడుగు వర్గాల కోసం పోరాటం చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలకు ప్రజలే అండ. భూమి కోసం.. భుక్తి కోసం ఆదివాసీలకు అండగా మేము నడిపిన భూ పోరాటాలే మాకు బలం. ఇప్పుడు కొత్తగా అంబేడ్కర్‌వాదులను, అభ్యుదయ వాదులతో మాతో కలుపుకోవడం ద్వారా పోరాటాలు మరింత పదును తేలతాయనడంలో సందేహం లేదు. పోడు భూముల ఉద్యమం నుంచి కార్మిక, కర్షక, అసంఘటిత కార్మికుల కోసం మేము చేసిన ఉద్యమాలే ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో సీపీఎం విజయానికి దోహదపడతాయి.
విద్యార్థి దశ నుంచి రాజకీయ రంగంలో ఉన్న నాకు జిల్లా ప్రజల అవసరాలు ఏమిటో.. వాటిని తీర్చే మార్గాలేంటో.. ప్రభుత్వాల మెడలు వంచేందుకు చేయాల్సిన పోరాటాలు ఏమిటో సంపూర్ణ అవగాహన ఉంది. ప్రజల పక్షాన నిలబడే మాకు వారి అండదండలు ఎప్పుడూ ఉంటాయి.
ప్రజలకు అండగా నిలిచేది కమ్యూనిస్టులే
జీఎస్టీ, నోట్ల రద్దుకు వ్యతిరేకంగా సీపీఎం నిలబడితే.. టీఆర్‌ఎస్ పార్టీ నోట్ల రద్దుకు అనుకూలంగా నిలిచింది. ఈ ఒక్క అంశమే ఎవరు ప్రజాపక్షమో.. ఎవరు కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నారో తేటతెల్లం చేస్తోంది. దేశ ప్రజలకు అవసరమైన చట్టాలు చేయగల ఏకైక వేదిక పార్లమెంట్. మాతో పోటీ పడుతున్న రాజకీయ ప్రత్యర్థులంతా కార్పొరేట్, కాంట్రాక్టర్లకు అనుకూలమైన వారే. వారు అధికారంలోకి వస్తే వారికి అనుకూలమైన చట్టాలే వస్తాయి తప్ప పేద ప్రజల గోడు వినరు.
పేద ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయరు. ఖమ్మం జిల్లా 80 శాతంపైగా వ్యవసాయం పై ఆధారపడిన జిల్లా. వ్యవసాయం లాభసాటిగా ఉండేలా.. వ్యవసాయం పండగ అయ్యేలా చేయడం మా ప్రధాన లక్ష్యం. రైతుల శ్రేయస్సు కోసం.. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించడం.. వారిని రుణ విముక్తులను చేయడం నా ముందున్న ప్రధాన కర్తవ్యాలు. జిల్లాలో అత్యధికంగా ఉన్న దళిత, బీసీ, మైనార్టీలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, డిగ్రీ వరకు విద్యను ఉచితంగా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రజలు సంపాదించిన డబ్బు అనారోగ్యం రూపంలో ఆస్పత్రులకే ఖర్చవుతోంది. ఏ చిన్న వ్యాధి వచ్చినా లక్షల్లో డబ్బు పెట్టాల్సిన దుస్థితి ఈ జిల్లా ప్రజలది. ఇందుకు గాను కొత్తగూడెంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ఏర్పాటు చేసేందుకు కృషి చేయడం నా ముందున్న మరో ప్రధాన కర్తవ్యం.
కమ్యూనిస్టుల కలయిన ఎన్నికల కోసం కాదు..
కార్పొరేట్ సంస్కృతి కలిగిన రాజకీయ పార్టీల రుగ్మతలను ప్రజలకు తెలియజేస్తాం. ఫిరాయింపుదారులకు వ్యతిరేకంగా ప్రజలను తీర్పు ఇవ్వమని కోరతాం. కమ్యూనిస్టు పార్టీలు విడిగా పోటీ చేసినప్పుడు జరిగిన రాజకీయ నష్టంపై ఆత్మ విమర్శ చేసుకున్నాం. రెండు పార్టీలుగా మా లోపాలపై ఆత్మ పరిశీలన చేసుకున్నాం. ఖమ్మం జిల్లాలో ఎవరిని గెలిపించాలన్నా.. ఎవరిని ఓడించాలన్నా ఉభయ కమ్యూనిస్టు పార్టీలకే సాధ్యం. ఇదే ఒరవడి భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. ఎన్నికల కోసం కమ్యూనిస్టులు ఏకం కాలేదు.
సీపీఐ, సీపీఎం ఐక్య పోరాటాలు చేస్తున్న క్రమంలో ఎన్నికలు వచ్చాయి తప్ప.. మా కలయిక ఎన్నికలకు పరిమితమైంది కాదు. సీపీఐతోపాటు నాకు బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌కు చెందిన పలు పార్టీలు, అనేక సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. ప్రజల పక్షంగా నిలబడే వ్యక్తిని గెలిపించుకోవడమే కమ్యూనిస్టుల లక్ష్యం. కార్పొరేట్ శక్తులను ఓడించాలని అభ్యర్థించడం, సామాజిక తరగతులను రాజకీయ దోపిడీ చేస్తున్న వారి పీడనను వదిలించుకోవాలని ప్రజలను చైతన్యపరుస్తాం.
సామాజిక తరగతులు రిజర్వేషన్ స్థానాలకే పరిమితం కాకుండా జనరల్ స్థానాల్లో సైతం పోటీ చేయించాలన్న మా పార్టీ నిర్ణయం పార్టీలకు అతీతంగా అందరినీ ఆకర్షిస్తోంది. ఆలోచింపచేస్తోంది. ఆదరింప చేసేలా చేస్తోంది. జిల్లాలో ఉభయ కమ్యూనిస్టులైన సీపీఎం, సీపీఐలు రెండు దశాబ్దాల తర్వాత కలిసి పోటీ చేయడంతో జిల్లా ప్రజల్లో ఆసక్తితోపాటు తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశలు చిగురిస్తున్నాయి. కమ్యూనిస్టుల ఐక్య పోరాటాలతో ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల ఖిల్లాగా మారే అవకాశాలు ఉన్నాయి.
ఇంటర్వ్యూ: మాటేటి వేణుగోపాల్, సాక్షి ప్రతినిధి–ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment