భద్రాచలం ఏజెన్సీ ప్రజల ఆరోగ్యావసరాలకు ఇదే పెద్ద దిక్కు. గర్భిణులంతా వైద్య సేవలకు, కాన్పులకు ఇక్కడికే వస్తుంటారు. మణుగూరు, పాల్వంచ తదితర ప్రాంతాల్లోని వైద్యులు కూడా అత్యవసర కేసులను ఇక్కడికే పంపిస్తుంటారు. కాన్పులు చేయటంలో ఈ ఆస్పత్రికి మంచి రికార్డ్ ఉంది. జాతీయ స్థాయి పురస్కారాలు కూడా అందుకుంది.
ఇదంతా గతం...! మరి, వర్తమానం..?
ఈ ఆస్పత్రి గత కీర్తి గతించింది. రెండొందల పడకలున్న ఈ పెద్దాసుపత్రి పరిస్థితి.. ‘పేరు గొప్ప–ఊరు దిబ్బ’ సామెతను తల పిస్తోంది. ‘‘గర్భిణులారా...! దయచేసి, మా ఆస్పత్రికి రావద్దు. మేమిక్కడ కాన్పు లు చేయడం లేదు. మరేదైనా ఆస్పత్రికి వెళ్లండి’’ అని, ఇక్కడి వైద్యులు చేతులెత్తి (చేతులెత్తేసి) వేడుకుంటున్నారు.
భద్రాచలం: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రసవ సేవలు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. స్త్రీ వ్యాధి నిపుణులు (గైనకాలజిస్ట్) అందుబాటులో లేకపోవటంతో కాన్పులు చేయటం మా వల్ల కాదంటూ విధుల్లో ఉన్న వైద్యులు చేతులెత్తేస్తున్నారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా ఉండటంతో రోగులకు సకాలంలో సరైన వైద్యసేవలు అందటం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల నుంచి ఇక్కడికి ప్రసవ సేవల కోసమని గర్భిణులు వస్తుంటారు. భూపాలపల్లి జిల్లాలోని వాజేడు, వెంకటాపురం నుంచి కూడా రోగులు వస్తుంటారు. రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులన్నింటికంటే అత్యధిక ప్రసవాలు చేయటం ద్వారా వరుసగా మూడుసార్లు రాష్ట్రస్థాయిలో అవార్డు సాధించిన భద్రాచలం ఆసుపత్రిలో ప్రస్తుత పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. కాన్పుల కోసమని వచ్చే గర్భిణులను వేరే ఆసుపత్రులకు వెళ్లిపొమ్మంటూ ఇక్కడ వైద్యులు సూచిస్తున్నారు. దీంతో, సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర ఆందళన వ్యక్తం చేస్తున్నారు. ప్రసవ సేవలు పూర్తిగా బందయ్యే పరిస్థితులు ఏర్పడినప్పటికీ, ఉన్నతాధికారులెవ్వరూ దీనిపై తగిన దృష్టి సారించకపోవటంపై విమర్శలు, ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.
భద్రాచలం ఏరియా వైద్యశాలకు మూడు రాష్ట్రాల నుంచి వైద్య సేవల కోసమని రోగులు వస్తుంటారు. జిల్లాలోని మణుగూరు, పాల్వంచ వంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడకే అత్యవసర కేసులను రిఫర్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే, 100 పడకల సామర్థ్యంగల భద్రాచలం ఆసుపత్రిని ఇటీవలనే 200 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవల అందిటమే లక్ష్యంగా నూతన భవనాలను నిర్మించటంతో పాటు, అధునాతన వైద్య పరికరాలను కూడా అందుబాటులో ఉంచారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, సరిపడినంతమంది వైద్యులను, సిబ్బందిని నియమించకపోవటంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు సకాలంలో సరైన వైద్యం అందటం లేదు.
కాన్పులు చేయటం మా వల్లకాదు...
భద్రాచలం ఏరియా ఆసుపత్రికి కాన్పులు చేయటంలో మంచి రికార్డు ఉంది. డాక్టర్ కోటిరెడ్డి నాయకత్వంలోని ఇక్కడి వైద్యుల పనితీరుకు జాతీయ స్థాయి పురస్కారాలు కూడా అందాయి. కానీ, స్త్రీ వ్యాధి నిపుణులు(గైనకాలజిస్ట్) లేకపోవటంతో కాన్పుల కోసమని వచ్చే వారిని ఇక్కడ చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరిస్తున్నారు. కాన్పుల సంఖ్యనుబట్టి ఇక్కడ వాస్తవంగా ఐదుగురు గైనకాలజిస్టులు ఉండాలి. ఇటీవల నిపుణులైన వైద్యుల నియామకంలో భద్రాచలానికి ప్రాధాన్యమిచ్చి, ఐదుగురిని పంపించారు. ఆ తరువాత కొన్ని రోజులకే, ఇక్కడి పని భారాన్ని తట్టుకోలేక, ఇద్దరు రాజీనామా చేసి వెళ్లిపోయారు. మరో ఇద్దరు వైద్యులు.. ఎటువంటి సమాచారం లేకుండా సెలవు తీసుకున్నారు. ఇక మిగిలింది.. ఒకే ఒక్క గైనకాలజిస్ట్. ఆమె కూడా ప్రసూతి సెలవులో ఉన్నారు. దీంతో, కాన్పులు చేసే వారు ఇక్కడ లేకుండాపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాన్పులు చేసేందుకు ప్రైవేటు గైనకాలిజిస్టులను రప్పిస్తున్నారు. వారికి ఒక్కో కాన్పుకు రూ.2500లు చెల్లిస్తున్నారు. వారు కూడా.. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. గతంలో 500 నుంచి 600 వరకు కాన్పులు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గత నెలలో 435 కాన్పులు చేయగా, ఈ నెలలో ఇప్పటివరకూ 100 చేశారు. ప్రస్తుతం కాన్పులకు వచ్చే వారిని చేర్చుకోవటం లేదు.
ఈ ఉద్యోగం.. మాకొద్దు...
భద్రాచలం ఏరియా ఆసుపత్రి సామర్ధ్యం మేరకు 66 మంది వైద్యులు ఉండాలి. కానీ, ప్రస్తుతం ఇక్కడ 16 మంది మాత్రమే ఉన్నారు. ఇటీవలి నియామకాల్లో 19 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను ఇక్కడకి పంపించారు. ఇందులో ఎనిమిది చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు. ఏరియా ఆసుపత్రికి రోజుకు 600 వరకూ రోగులు వస్తుండం, ఇందులో 160 వరకూ ఇన్‌పేషంట్స్‌గా ఉంటుండటంతో వైద్యులపై తీవ్రమైన పని భారం పడుతోంది. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో కూడా ఒకరిద్దరు మరికొన్ని రోజుల్లో ఇక్కడ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో, సాధారణ వైద్య సేవలను కూడా స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ అందిస్తున్న పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ వంటి చోట్ల నుంచి వచ్చి క్షణం తీరిక లేని ఉద్యోగం చేయటం తమ వల్లకాదని ఓ వైద్యుడు ‘సాక్షి’తో అన్నారు. నిబంధనలు కూడా మరీ కఠినతరంగా ఉండటంతో ఇక్కడ పనిచేయలేమన్నారు. వీరికి సహాయకారులుగా నర్సింగ్ సిబ్బంది కూడా లేరు. 64 మంది నర్సింగ్ సిబ్బంది ఉండాలి. కానీ ఇందులో 15 మంది మాత్రమే ఉన్నారు. నర్సింగ్ శిక్షణ కోసమని వచ్చే విద్యార్థుల సహకారంతో ఓపీ విభాగాన్ని నెట్టుకొస్తున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు ఎందుకు దీనిపై దృష్టి సారించటం లేదనేది అంతుపట్టని ప్ర«శ్నగా మిగిలింది.
భద్రాచలం పెద్దాసుపత్రికి... గర్భిణులు రావద్దట...!
Published Fri, Dec 14 2018 10:58 AM | Last Updated on Fri, Dec 14 2018 10:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment