భద్రాచలంలో అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ జామ్ | Traffic jam till midnight at Badharachalam | Sakshi
Sakshi News home page

భద్రాచలంలో అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ జామ్

Published Sun, Jul 19 2015 12:34 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

Traffic jam till midnight at Badharachalam

ఖమ్మం(భద్రాచలం): ఊహించని రీతిలో 5 లక్షల మంది భక్తులు భద్రాచలంలో పుష్కరాలకు రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. సెలవురోజులు కావడంతో గోదావరి పుష్కర స్నానం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా భక్తజనం లక్షలాదిగా తరలివచ్చారు. జిల్లాలోని 8 పుష్కరఘాట్‌లలో 6 లక్షలకు పైగా భక్తులు స్నానమాచరించగా ఇందులో 5 లక్షల మంది భద్రాచలానికి వచ్చారు. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన భక్తుల రాకడ శనివారం సైతం కొనసాగింది. స్నానాలు పూర్తిచేసుకుని దర్శనం చేసుకున్న భక్తులు తిరిగి వెళ్లేక్రమంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోవడంతో అనేకమంది భక్తులు భద్రాచలంలోనే వేచి ఉండాల్సి వచ్చింది.

భద్రాచలం పట్టణంలోని ఏ వీధిలో చూసినా జనసందోహమే కన్పించింది. రాత్రివేళ సైతం గోదావరి నదిలో లక్ష మందికిపైగా పుష్కరస్నానం ఆచరించారు. పోలీసులు నిలువరించినప్పటికీ తిరిగి ఇంటిదారి పట్టాలనే ఆత్రుతతో చీకట్లోనే అనేకమంది స్నానం చేశారు.గోదావరి కరకట్టపైనే అనేకమంది నిద్రించారు. శనివారం రాత్రి తరలివచ్చిన భక్తులు నిద్రించేందుకు గదులు లేకపోవడంతో రోడ్లపైనే జాగారం చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో సకాలంలో పట్టణాన్ని విడిచివెళ్లలేని పరిస్థితి. ఒకవైపు స్నానాలు పూర్తిచేసుకున్న భక్తులు తిరిగి వెళ్లడానికి దారిలేక రోడ్లపైనే ఉండటం, ఆదివారంనాటి స్నానం కోసం లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో భద్రగిరి కిటకిటలాడింది. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రాత్రి వేళలో కూడా కొత్తగూడెం, పాల్వంచ, ఇతర ప్రాంతాల్లో భద్రాద్రికి వచ్చే వాహనాలను నిలిపివేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement