godavari Puskaras
-
గుడులకు సీఎం అపచారం
ఇన్‌బాక్స్: ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో విజయవాడలో కూల్చిన ఆలయాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. కానీ కృష్ణా పుష్కరాలకు అవి అడ్డుగా ఉన్నాయని ఆయనకు మాత్రమే అనిపించింది. ఎన్నో పుష్కరాలు వచ్చాయి. కానీ ఏ ముఖ్యమంత్రీ, ఏ తీర్థయాత్రికుడు, అధికారీ ఆలయాలు అడ్డుగా ఉన్నాయని భావించలేదు. చంద్రబాబు గోదావరి పుష్కరాలకి మనుషులను బలితీసుకున్నారు. కృష్ణా పుష్కరాలకు ఘన చరిత్ర కలిగిన దేవాలయాను బలిచేశారు. కూల్చివేసి ఇప్పుడు మళ్లీ వాటిని కట్టిస్తారట. అడుసు తొక్కనేల? కాలు కడగనేల? ప్రజాధనంతో ఎందుకీ కుప్పిగంతులు? విశ్వనాథ వారికి జ్ఞానపీఠం ప్రకటించినప్పుడు, వచ్చిన లక్ష రూపాయలు ఏం చేయబోతున్నారని అడిగితే, ఇందులో కొంత మా ఊరిలో ఆలయం జీర్ణోద్ధరణకు ఇస్తానని చెప్పారు. తక్కిన సొమ్ము సంగతేమిటంటే, ఎన్నో చిల్లులు ఉన్న నా జేబులో వేసుకుంటాను అన్నారట. ఇలాంటి దృష్టి చంద్రబాబుకు సాధ్యమా? కూల్చిన ఆలయాలను తక్షణం నిర్మించాలని వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యదర్శి రాఘవులు కోరడం న్యాయమే. ఆధునిక యుగం గురించి ఎప్పుడూ మాట్లాడే చంద్రబాబు అంధయుగాలలో విధ్వంసకారులు చేసిన పనినే చేశారు. పుష్కర స్నానం చేసిన తరువాత ప్రజలు ఆలయాలను సందర్శిస్తారు? ఇప్పుడు విజయవాడలో ఆలయాల శిథిలాలకి మొక్కుకుని వెళ్లాలి కాబోలు! - కేవీ రమణమూర్తి, కాకినాడ ప్రభుత్వ భూదాహానికి అంతులేదా? రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పటికే విజయవాడ, అమరావతి ప్రాంతంలో 33 వేల ఎకరాల పంట భూములను చంద్రబాబు ప్రభుత్వం కైవసం చేసుకుంది. భోగాపురంలో విమానాశ్రయం కోసం కొన్ని వందల ఎకరాలను స్వాధీనం చేసుకుంది. ఆక్వా పరిశ్రమ కోసం భీమవరం ప్రాంతంలో వందలాది ఎకరాలు తీసుకునే యత్నంలో ఉంది. ఇప్పుడు మచిలీపట్నం వద్ద పంటభూములను ఏకపక్షంగా తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించిందట. ఇది కూడా గతంలో మాదిరిగానే లక్షలలోనే సేకరించే ప్రయత్నంలో ఉంది. ఇవేకాకుండా ప్రతి నియోజకవర్గంలోను వందల ఎకరాలలో భూమిని వివిధ అవసరాల కోసం సేకరించాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా చెబుతున్నారు. పురాణాలలో చెప్పే బకాసురుడి తిండికైనా ఒక పరిమితి కనిపిస్తుంది కానీ, చంద్రబాబు ప్రభుత్వం భూదాహానికి పరిమితి కనిపించడం లేదు. అధికార జులుంతో, పరిశ్రమల పేరుతో పంట భూములను నాశనం చేసుకుంటూ పోతే ఇక తిండి గింజలు అందించే భూమి ఎంత? ఈ భూములన్నీ తమకు నచ్చిన విదేశీ కంపెనీలకు ధారాదత్తం చేయడానికేనని ఇప్పటికే రుజువైంది. చంద్రబాబు నాయుడు వ్యవసాయానికే కాదు, పచ్చదనానికి కూడా శత్రువే. అలాగే విపక్షానికి చెందిన ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అన్ని నైతిక విలువలకు కూడా ఆయన తిలోదకాలు ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి. కేవలం ప్రభుత్వమే కాదు, ప్రభుత్వాన్ని నడుపుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా భూదాహంతో అలమటించిపోతున్నారు. వీరి బెడద నుంచి కూడా ఆంధ్రప్రదేశ్‌ను ప్రజలు రక్షించుకోవాలి. - ఈదుపల్లి వెంకటేశ్వరరావు, ఏలూరు -
తప్పులు చేస్తాం.. నోరెత్తకండి!
ముఖ్యమైన అంశాలు చాలా ఉండగా దేన్నీ చర్చించకుండానే సభను ఐదు రోజులకే ఎందుకు ముగించారు? తమకు కావలసిన బిల్లులను ఆమోదింపజేసుకుని సభను చాలించడమనే ఈ సంప్రదాయం ఏ ప్రజాస్వామ్య విలువల కోసం? నీటి గురించి, ప్రాజెక్టులకు నీటి లభ్యత గురించిగాక కరువు మీదే చర్చించాలని ప్రతిపక్ష నేతను కట్టడి చెయ్యచూడటం ఏమిటి? దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఓటుకు కోట్లు ఉదంతంలో ఒక ముఖ్యమంత్రి ప్రమేయంపై వచ్చిన ఆరోపణలపై వీధుల్లో కాక శాసనసభలోనే చర్చించి ఉండాల్సింది కాదా? ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈసారి చాలా ఆసక్తికరం గా సాగుతాయని అందరూ భావించారు. అందుకు కారణం ఉంది. ప్రభు త్వం ఆత్మరక్షణలో పడే పలు సంఘటనలు గత సమావేశాలకూ ఈ సమావే శాలకూ మధ్య జరిగాయి. ఒకటా రెండా అనేక సంఘటనలు. గోదావరి పుష్కరాల తొలి రోజున ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన తొక్కిసలాటలో 27 మంది అమాయక భక్తులు చనిపోయారు. అంతకుముందే ఎమ్మార్వో వన జాక్షి మీద చింతమనేని ప్రభాకర్ మనుషులు దాడి చేసి కొట్టారు. లైంగిక వేధింపులను తట్ట్టుకోలేక రిషితేశ్వరి అనే విద్యార్థిని నాగార్జున విశ్వవిద్యాల యంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదేమో నన్న దిగులుతో కనీసం ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో సాక్షాత్తూ రాష్ర్ట మంత్రి నారాయణకు సంబంధించిన కళాశా లలో ఇద్దరు విద్యార్థినులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. గుంటూరు జనరల్ ఆస్పత్రిలో ఎలుకలు ఇంకా కళ్లు పూర్తిగా తెరవని ఒక పసి కందును కొరికి చంపేశాయి. వీటన్నిటికి తోడు తెలంగాణలో జరిగిన ఓటుకు కోట్ల వ్యవహారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన కోసం జరుగుతు న్న ఉద్యమం. ఈ సమస్యలన్నిటిని సావకాశంగా చర్చించాలంటేనే ఇతర అం శాలన్నీ పక్కన పెట్టి కనీసం పదిహేను రోజులు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వంలోని పెద్దలు ఈ అంశాలన్నిటి మీదా ఇప్పటికే బయట ఏం మా ట్లాడినా ఎటువంటి వివరణలు ఇచ్చినా చట్టసభలో వీటి మీద జరిగే చర్చకు ఉండే ప్రాధాన్యమే వేరు. ఆ చర్చ పర్యవసానంగా రూపొందే పరిష్కారాలు వేరు. అందుకే సభను కనీసం పదిహేను రోజులు జరపాలని ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. శాసనసభా వ్యవహారాల సలహా కమి టీ సమావేశంలో కూడా కోరింది. అందుకు ససేమిరా అన్నది అధికార పక్షం. చర్చకు తావేలేని సమావేశాల అంతరార్థం? 175 మంది సభ్యులుగల ఆంధ్రప్రదేశ్ శాసన సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రతిపక్షంగా ఉంది. అయితే అది 67 మంది సభ్యులున్న బలమైన ప్రతిపక్షం. ఆ పార్టీ విశ్వప్రయత్నం చేసినా పైన పేర్కొన్న సమస్యల్లో ఏ ఒక్క దాని మీదా అధికార పక్షం చర్చను సాగనివ్వలేదు. ఆగస్టు 31 నుంచి సెప్టెం బర్ నాలుగు వరకు ఐదు రోజులపాటు సభను తూతూ మంత్రంగా జరిపించి నిరవధికంగా వాయిదా వేశారు. ముఖ్యమైన అంశాలు ఇన్ని ఉన్నా దేనిపైనా చర్చను ఎందుకు చేపట్టలేదు? సభ ఐదు రోజులే ఎందుకు జరిగింది. అంత కన్నా మించి సభ జరగరాదన్న నిబంధన ఏదైనా ఉందా? లేకపోతే చట్ట సభలో చర్చ కంటే ముఖ్యమైన పనులు ముఖ్యమంత్రికి, మంత్రులకు, అధికార పక్ష సభ్యులకు ఏమైనా ఉన్నాయా? ఏ చర్చా లేకుండానే ఇలా సమా వేశాలను ముగించేట్టయితే... బోలెడు ప్రజాధనం వెచ్చించి శాసన సభను సమావేశపరచడం ఎందుకు? తమకు కావలసిన బిల్లులను ఆమోదింపజేసు కుని సభను చాలించడమనే ఈ సంప్రదాయాన్ని ఏ ప్రజాస్వామ్య విలువలను కాపాడటం కోసం ప్రవేశపెట్టినట్టు? స్థాయిని మరచిన జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార పక్షం తెలుగుదేశం, దాని మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ కాక పతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే ఉంది. బీజేపీ ఇక్కడ రాష్ర్ట ప్రభుత్వంలో భాగస్వామి, టీడీపీ అక్కడ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి. ఆ కారణంగా బీజేపీ మిత్ర ధర్మంగా భావించి ఇక్కడి ప్రభుత్వం పక్షానే నిలిచి, దాని అప్రజాస్వామిక వైఖరికి మౌనంగా ఆమోద ముద్ర వేసింది. అంతే తప్ప ఒక జాతీయ పార్టీగా కొం తలో కొంతయినా స్వతంత్రంగా వ్యవహరించలేదు. ముఖ్య అంశాలపై చర్చ జరపడానికి అధికార పక్షాన్ని ఒప్పించి ఉంటే... అది ఆ పార్టీ స్థాయికి తగిన దిగా ఉండేది, మంచి మార్కులు పడి ఉండేవి. ఆ పనిచెయ్యక పోగా కొన్ని సందర్భాలలో తెలుగుదేశం కంటే కూడా అది ఒక అడుగుముందుకేసి, ప్రతి పక్ష నిరసనను అడ్డుకునే ప్రయత్నం చెయ్యడమే విడ్డూరం. మంత్రులు తమ స్థాయి మరచి వాడిన భాష, చేసిన విమర్శలు రాజకీయాలకే తలవంపులు తెచ్చేవిగా ఉన్నాయి. ప్రతిపక్షం నుంచి ఎవరు మాట్లాడాలని లేచినా, చివరకు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడాలన్నా మైకులు సరిగా పనిచేయవు. ఆంధ్రప్రదే శ్‌కు ప్రత్యేక హోదా విషయంలో తమను తాము సమర్థించుకోవడంలో బీజేపీకి ఇబ్బందులు ఉండొచ్చు. కేంద్రంలో అధికారంలో ఉన్నది తామే కాబట్టి, ప్రత్యేక హోదా ఐదేళ్ళు కాదు పదేళ్ళు ఉండాల్సిందే అని నాడు ప్రతి పక్ష నేతగా గట్టిగా పట్టుబట్టింది, మాట్లాడింది తమ నేత వెంకయ్యనాయుడే కాబట్టి రాష్ట్ర బీజేపీకి ఇది ఒక్కటే సంకటం కావచ్చు. ఆశ్చర్యకరంగా ఆ ఒక్క అంశం మీదే కొద్దిలో కొద్దిగా అయినా చర్చ జరిపి ఒక తీర్మానం చేసి కేం ద్రానికి పంపించారు. మిగతా సమస్యలేవీ బీజేపీని అలా ఇరకాటంలో పెట్టేవే కావు. అది ఎంత టీడీపీకి మిత్రపక్షంగా ఉన్నా, మిగతా అంశాలపై చర్చకు అవకాశం కల్పించే రీతిలో ఎందుకు ప్రవ ర్తించలేకపోయింది? అన్నీ సమాధానాలు లేని ప్రశ్నలే! గోదావరి పుష్కరాల ప్రారంభ దినాన ముఖ్యమంత్రి, ఆయనతో ఉన్న ప్రము ఖుల బృందం... వీఐపీల కోసం ఏర్పాటు చేసిన ఘాట్‌లో కాక సామాన్య ప్రజల కోసం ఉద్దేశించిన ఘాట్‌లో స్నానాలు, పూజాదికాలు చేశారు. ఆ కార ణంగానే జరిగిన తొక్కిసలాటలో ముఖ్యమంత్రి కళ్ళ ముందే 27 మంది చని పోయారు. ఒక విదేశీ చానల్‌కు స్వల్పకాలిక ప్రచార చిత్రాన్ని షూట్ చెయ్య డంలో భాగంగానే ముఖ్యమంత్రి ఆ ఘాట్‌లోకి వచ్చారు. జనం పెద్ద సంఖ్యలో కనిపించాలంటే ఆ ఘాట్‌లోనే షూట్ చెయ్యాలి మరి! నిజానికి పుష్కరాల వంటి సందర్భాలలో ప్రముఖ పాత్ర నిర్వహించాల్సిన దేవాదాయ శాఖ మంత్రి ప్రమేయం ఎక్కడైనా కనిపించిందా? ప్రభుత్వ మహిళా అధికారి వనజాక్షి మీద దాడి చేసిన గుంపు మీద చర్యలు ఎందుకు లేవు? సరికదా, ఆ దాడికి బాధ్యుడయినా శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్‌ను ఎందుకు వెనకేసుకొచ్చారు? పదే పదే ఆయనకు ఎందుకు కితాబులు ఇస్తున్నారు? రిషితేశ్వరి ఆత్మహత్య సంఘటనలో ప్రిన్సిపాల్ బాబూరావు మీద చర్యలు ఎందుకు లేవు? ఆయనను ఎందుకు, ఎవరు కాపాడుతున్నారు? ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయి ఔరా! అనే విధంగా రాజధాని అమరావతిని నిర్మిస్తా మంటున్న ప్రాంతంలోనే ప్రభుత్వ ఆస్పత్రిలో పది రోజుల పసికందును ఎలుకలు కొరుక్కుతినే దుర్భర పరిస్థితులు ఎందుకున్నాయి? ఆ ఘటనలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రికి బాధ్యత ఉండదా? పైగా మంత్రి తనిఖీలంటూ అదే ఆస్పత్రిలో అంతకుముందే రాత్రి నిద్ర చేశారు కూడా. ఎందుకోగానీ మంత్రిగారికి మాత్రం ఆ ఎలుకల దండు కనిపించలేదు. తానే మొత్తం ప్రభు త్వంగా చక్రం తిప్పుతున్న మంత్రి నారాయణకు సంబంధించిన కళాశాలలో ఇద్దరు అమ్మాయిల అనుమానాస్పద మృతి ఘటనకు ఆయనను నైతిక బాధ్యడ్ని చేస్తూ ఎందుకు రాజీనామా చేయించలేకపోయారు? విడ్డూరపు ప్రభుత్వం... చమత్కారాల సభ శాసనసభ సమావేశాల కాలం పొడిగిస్తే... ఇదిగో ఇటువంటి అంశాలన్నిటి మీదా చర్చ జరుగుతుంది. కాబట్టే ‘శనగలు తిన్నాం చేతులు కడుక్కున్నాం’ అన్న చందంగా వర్షాకాల సమావేశాలను ముగించేశారు. ఆంధ్రప్రదేశ్ అంతటా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ వర్షాకాల సమా వేశాలు జరిగాయి. కనీసం కరువు మీదన్నా చర్చ సజావుగా సాగిందా? అదీ లేదు. నీటి గురించి మాట్లాడుకోకుండా, ఆ నీటి లభ్యతకు అవసరమైన ప్రాజె క్టుల ఊసే ఎత్తకుండా కరువు మీద మాత్రమే చర్చించాలని ప్రతిపక్ష నేతను కట్టడి చెయ్యచూడటం ఈ సమావేశాల్లో జరిగిన మరో చమత్కారం. ప్రభుత్వ ఉత్తరువుల్లో కనీస ప్రస్తావన కూడా లేకుండానే పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమకు నీళ్ళు ఎలా ఇస్తారు? నీళ్ళే లేని ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చెయ్యడం ఏం విడ్డూరం? అని ప్రశ్నించబోయిన ప్రతిపక్ష నాయకుడి మైకు పని చెయ్యదు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఓటుకు కోట్లు గుమ్మరించ బోయిన ఉదంతంలో ఒక ముఖ్యమంత్రి ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు రావడం, స్వయంగా ఆయన గొంతు రికార్డై బయటికి రావడం మీద ఆ రాష్ర్ట శాసన సభలో చర్చ జరగదు. ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ వీధుల్లో కాక శాసనసభలోనే చర్చించి... ఆ ఉదంతంలో తన ప్రమేయం లేని పక్షంలో మొత్తం సభను ఒప్పించి ఒక తీర్మానం చేయించి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి ప్రతిష్ట ఇనుమడించి ఉండేది. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి సమావేశమయ్యే చట్ట సభలు ప్రజా సమస్యల మీద కూడా కొంత చర్చ జరిపితే బాగుంటుందేమో! - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
'తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపించాలి'
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు మొదలైన తొలిరోజే తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ తొక్కిసలాట ఘటనను మరిపించేందుకు అభినందన సభలు ఏర్పాటు చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పుష్కరాలు విజయవంతం అయ్యాయని ఎలా చెబుతారని సూటిగా ప్రశ్నించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని జ్యోతుల నెహ్రు డిమాండ్ చేశారు. -
పుష్కరాల్లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
కృష్ణా(గుడివాడ): గోదావరి పుష్కరాల్లో స్నానం చేస్తుండగా కాలుజారి గల్లంతైన కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన భార్గవ్‌దీక్షిత్ మృతదేహం లభ్యమైనట్లు బంధువులు తెలిపారు. శనివారం పుష్కరాల కోసం సఖినేటిపల్లి వెళ్లిన భార్గవ్ గల్లంతైన విషయం తెలిసిందే. రెస్క్యూ టీమ్ రెండు రోజులపాటు తీవ్రంగా గాలించగా సోమవారం ఘాట్‌కు కిలోమీటరు దూరంలో మృతదేహం లభ్యమైంది. ప్రత్యేక వాహనంలో మృతదేహాన్ని గుడివాడ తీసుకొచ్చారు. -
మీకో దండం, పుష్కరాలకు రాకండి
ఇంత మంది జనం వరదలా రావడంలో కొంత పాపం మీడియా వారికి ఉన్నా సరే, గోదావరిలో మునగకుండానే, నిజాలు ప్రసారం చేసి టన్ను పుణ్యం మూటకట్టుకున్నారు. వాటి స్ఫూర్తితో పుష్కరాల యాత్రలు రద్దు చేసుకుందాం. కిలోమీటర్ల మేరకు గోదావరి దారులన్నీ లక్షల వాహనాల తో మూసుకుపోయాయని టీవీ చానళ్లు చెప్పి చెప్పలేనంత మేలు చేశాయి. రైళ్లు గంటలకొద్దీ ఆలస్యంగా నడు స్తున్నాయట. రెండు రాష్ట్రాల్లో బస్సు స్టేషన్లన్నీ రాని బస్సుల కోసం ఎదురుచూస్తున్న భక్తు లతో అద్భుతంగా నిండిపోయాయి. దాదాపు రెండు నెలల నుంచి హోరె త్తించే ప్రచారాలు చేసి, రారండోయ్ రారండోయ్ అంటూ దేశ విదేశాల గోదావరి భక్తులను ఆహ్వానించిన టీవీ యజమానులు, సంపాదకులు, విలేకరులు, కెమెరామెన్లు గోదావరిలో మునగకుండానే బోలెడంత పుణ్యం సంపాదించుకున్నారు. ఏ విధంగా అంటే రోడ్లు, రైలు మార్గాలు, బస్సులు, రైళ్లు కిటకిట లాడుతున్నాయని ఉన్నదున్నట్టు నిజాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అసలుసిసలు సమాచారం అంద డం వల్ల పుష్కరాలకు వెళ్లకూడదని చాలా మంది వివేక వంతమైన నిర్ణయం తీసుకోవడానికి మీడియా ఎంతో కమిట్మెంట్తో ఉపయోగపడింది. గోదావరీ తీర జిల్లాల్లో భయంకరంగా ఈ కోలి రోగం వ్యాపించిందనే మరొక నిజం చెప్పి మీడియా ఇంకొంచెం పుణ్యం కట్టుకున్నది. మరీ పుష్కరాలకు వెళ్లొద్దని ఆ శాస్త్ర పరిశోధకులు చెప్పడానికి మొహ మాటపడ్డారేమో. మునగండి కాని, గుటకవేయకండి, నోట్లోకి కళ్లల్లోకి, చెవుల్లోకి ఈ కోలి నిండిన నీళ్లు వెళ్లకుం డా చూసుకోండి(ఇది సాధ్యమా) అని ఉచితంగా సము చిత సలహా ఇచ్చారు, మనవాళ్లు అచ్చు వేశారు. లక్షల మంది వినకపోయినా వందలమందైనా ఆలోచించే అవ కాశాన్ని జనమాధ్యమాలు కల్పించడం ముదావహం. తెలుగు వారు పరమభక్తులనడంలో సందేహం లేదు. ఎంత భక్తులంటే పుణ్యం సంగతేమోగాని గోదా వరిలోనే తొక్కిసలాటలో 29 మంది పంచప్రాణాలు హరీమన్నా భక్తిలో ఒక్క మిల్లీ మీటర్ తేడా కూడా రావ డంలేదు. శబరిమలైలో తొక్కిసలాటలు వచ్చినా, వార ణాశిలో జనం మునిగినా, కుంభమేళాలో ప్రాణాలు పోయినా, ఏది ఏమైనా సరే ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అన్న సినీ డైలాగు లాగించి లారీలు బస్సులు కార్లు, రైలు బస్సుటాపులమీదైనా సరే కూర్చు ని ప్రయాణించడంలో తెలుగు భక్తుడిని మించినవాడు ప్రపంచంలోనే ఉండడు. 29 మంది చనిపోయిన తరు వాత భయపడి భక్తులు రాక జనం తగ్గుతారేమో నని అనుకున్న వాడు బుద్ధి తక్కువ వాడన్నట్టు. వాడికర్మ కాలి వాడు పోయాడు. మనం ముక్తులమవుదాం, పునీతులమవుదాం, ప్రాణాలు పోతే పోతాయి, అంత కుముందు మనకు మనమే పిండాలు పెట్టుకుందాం అన్నంత కమిట్మెంట్తో భక్తులు పోటెత్తుతున్నారు. గోదావరి గల గల, కళ కళ, పుష్కర శోభ, వైభవం, కవి తలు, కవులు వారి ప్రసంగాలు ప్రత్యక్ష ప్రసారాలు, పారవశ్యంతో చూస్తున్న తల్లులు తండ్రులు, వారి భక్తి సెగలు ఆకాశాన్నంటి దేవతలు దుందుభులు మోగిస్తు న్నారు. తెలుగు వారి భక్తితరంగాల్లో మునిగితేలుతున్న వారిని చూసి మురిసిపోతూ జయజయధ్వానాలు చేస్తు న్న వారితో ఆకాశంలో ట్రాఫిక్ జామ్ అయింది. తొక్కిస లాటలకు ఆకాశంలో ఆస్కారం లేదు కనుక ఎవరూ చేయనవసరంలేదు. ఏడాది పొడుగునా పుష్కరాలే అయినా మొదటి పన్నెండురోజులే ప్రధానం, అందులో మొదటి రోజు మరీ ప్రధానం. అందులో మొదటి గంట ఇంకా ఇంకా ప్రధానం, మునిగితే నేరుగా మోక్షమే... (అవును 29 మందికి దొరికినా నమ్మరా) అందులో మునుగుతున్న మన నేతలే మనకు ఆదర్శం, మనను ముక్తిమార్గంలో నడుపుతున్న అవధూతల మాటలే మనకు శిరోధార్యం అని జనం కుప్పలు తెప్పలుగా వస్తున్నారు. వచ్చారు. ఆగడంలేదు. పాపం చంద్రబాబైనా, చంద్రశేఖరుడైనా ఏం చేస్తారు? ఏదో సెంటిమెంట్‌తో రమ్మంటే ఇంతగా పోలోమని రావడమేనా? ఇంతగా వరదల్లో కొట్టుకొ చ్చిన తుంగల్లా వచ్చిన జనానికి ఎవరు మాత్రం ఏం ఏర్పాట్లు చేస్తారు? ఇదేమన్నా తిరుపతా? యాదాద్రా? ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు చదివి ఫస్టొస్తే ఏం లాభం, ఏఘాట్లో ఎప్పుడు స్నానం చేయాలో తెలియకపోతే? బంగారు అంచున్న పంచెల వారు ధగధగ మెరిసే కండువాల వారు శాస్త్రాలు చదివి ఓహో నెలల నుంచి చెబుతుంటే విని వచ్చే మనని ఆపడానికి ఈ ఖాకీ వారికి, వారిని నడిపే ఆ ఖాదీవారికి ఎంత ధైర్యం? పుష్కర మరణాలు ఎన్నయితేనేం పుష్కళంగా ఉన్న మన జనాభాకు వీసమెత్తు కూడా తేడా పడదు. మీడియాను అందరూ అన్ని రకాలుగా తిడుతు న్నారు. ఈ రోజు మీడియా నిజంగా చాలా మేలు చేసిం ది. అంతకు ముందు నెలల కొద్దీ ప్రచారం చేసినా సరే, ఇంత మంది వరదలా రావడంలో కొంత పాపం వారికి ఉన్నా సరే, వారు గోదావరిలో మునగకుండానే, నిజా లు ప్రసారం చేసి టన్ను పుణ్యం మూటకట్టుకున్నారు. పునీతులయ్యారు. వారి స్ఫూర్తితో వెంటనే పుష్కరాల యాత్రలు రద్దు చేసుకుందాం. మనం కూడా కలుషితం చేయనందుకు మనను గోదావరిలో ఉన్న పుష్కరుడు కరుణిస్తాడు. (దయచేసి గరికపాటి వారైనా ఈ నిజం చెబితే బాగుంటుంది). బస్సు టికెట్లు రద్దు చేసుకుం దాం, మన వల్ల ఒక్క బస్సు రద్దయినా గోదావరి దారి కాలుష్యం కొంత ఆపిన పుణ్యం మనకు దక్కుతుంది. పుష్కరాల రద్దు ద్వారా వచ్చిన పుణ్యాన్ని పాపం... పోయిన ఆ 29 ప్రాణులకు అర్పిద్దాం. వారి ఆత్మలు శాంతించడానికి. ఇక పుష్కరాల కోసం ప్రతిష్టను ఫణంగా పెట్టిన ప్రభువులకు కూడా కొన్ని మనవులు చేసుకుందాం. అయ్యా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వారూ వెంట నే పుష్కరాల వాణిజ్య ప్రకటనలు మానేయండి (ఈ నష్టానికి మీడియా వారు క్షమించాలి మరి) బస్సులు (నడుస్తుంటే) ఆపకండి, తిరుగు ప్రయా ణాలు నడపం డి. వస్తే జూలై 26 తరువాతనే రండి అని మీరు విలేక రుల సమావేశాల్లోనైనా చెప్పండి. వీలైతే గోదావరిలో మునగడానికి తలకు రూ.100 పుష్కర పన్ను విధిం చండి. లేకపోతే శుద్ధమైన గోదావరి జలాలను బాటిళ్ల లో నింపి దేశమంతా పంచండి, నెత్తిన పోసుకోమ నండి, కాని పుష్కరాల స్నానాలకు నదుల్లా రావద్దని చెప్పండి. ప్లీజ్. (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com - మాడభూషి శ్రీధర్ -
చంద్రబాబు అప్పుడు అక్కడే!
-
చంద్రబాబు అప్పుడు అక్కడే!
* తొక్కిసలాట సమయంలో పుష్కర ఘాట్‌లోనే ఏపీ సీఎం! * ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించినట్టు మీడియా కథనం * తొలుత నలుగురు, తరువాత 11 మంది చనిపోయినట్టు సీఎంకు తెలిపానన్న అధికారి * పోలీసు, రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చ సాక్షి ప్రతినిధి, రాజమండ్రి: పుష్కరాలు ప్రారంభమైన తొలిరోజున రాజమండ్రి పుష్కర ఘాట్‌వద్ద జరిగిన తొక్కిసలాటలో 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తొక్కిసలాట జరిగిన సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు పుష్కరఘాట్ లోపలే ఉన్నారని తాజాగా వెల్లడైన అంశం పోలీసు, రెవెన్యూ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తొక్కిసలాట జరిగినట్టు, అప్పటికి 11 మంది భక్తులు మృతిచెందినట్టు ఘాట్ లోపలే ఉన్న సీఎంకు తెలియజేసినట్టు పుష్కర విధుల్లో ఉన్న ఓ పోలీసు ఉన్నతాధికారిని ఉటంకిస్తూ తాజాగా మీడియాలో వచ్చిన కథనం సంచలనం రేపింది. పుష్కరాల ప్రారంభ ముహూర్త సమయంలో సీఎం ప్రచార డాక్యుమెంటరీలో నిమగ్నమవడం, ఆ సమయంలో భక్తులను మూడు గంటలపాటు కట్టడి చేసి, అనంతరం ఒకేసారి ఘాట్ లోపలకు పంపించడం.. తొక్కిసలాటకు, 29 మంది మరణాలకు దారితీయడం తెలిసిందే. అయితే తొక్కిసలాట జరిగినప్పుడు సీఎం ఎక్కడున్నారనేది ఇప్పటివరకు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ సమయంలో సీఎం ఘాట్లోపలే ఉన్నట్టు తాజాగా వెలువడిన కథనం వెల్లడించింది. ఇది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. అసలేం జరిగింది? గత మంగళవారం ఉదయం 6.26 గంటలకు పుష్కరాల ముహూర్త సమయం. సీఎం కుటుంబ సమేతంగా 5.45 గంటలకు పుష్కర ఘాట్‌కు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి పుష్కర స్నానమాచరించారు. అనంతరం పితృదేవతలకు పిండప్రదానం, గోదానం వంటివి ఘాట్‌లో పూర్తి చేశారు. ఇవన్నీ పూర్తయ్యేసరికి సమయం దాదాపు 7.30 గంటలైంది. పుష్కరస్నానం అనంతరం ఘాట్‌లో ఉన్న ప్రత్యేక బస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు రిఫ్రెష్ అయ్యి, సుమారు 8.30 గంటల సమయంలో ఆర్అండ్బీ అతిథిగృహానికి బయలుదేరారంటున్నారు. అయితే ఆ మధ్యలోనే తొక్కిసలాట జరిగిందనే ప్రచారం ఇప్పటికే ఉండగా.. తాజాగా వెల్లడైన మీడియా కథనం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. తొక్కిసలాటప్పుడు సీఎం ఘాట్లోపలే ఉన్నారని, మొదట నలుగురు, తదుపరి 11 మంది చనిపోయిన విషయాన్ని సీఎంకు వివరించినట్టు, ఆ సమయంలో అన్ని చర్యలూ తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించినట్టు ఒక పోలీసు అధికారిని ఉటంకిస్తూ మీడియా కథనం వెల్లడించింది. దీంతో పుష్కర విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు ఆదివారం ఇదేఅంశంపై చర్చించుకోవడం కనిపించింది. ఘాట్‌వద్ద ఎక్కువ సమయం భక్తులను నిలువరించడం, ముఖ్యమంత్రి వెళ్లే సమయానికి ఒకేసారి అనుమతించడమే తొక్కిసలాటకు కారణమని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఇటీవల నివేదికివ్వడం తెలిసిందే. తాజాగా పోలీసు అధికారి చెప్పిన విషయం చూస్తే ఈ దుర్ఘటనకు ముఖ్యమంత్రే బాధ్యులనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. పోలీసు అధికారి చెప్పినట్టు వచ్చిన కథనం వాస్తవమైతే ఆ సమయంలో ముఖ్యమంత్రి ఆ ఘటనను తేలికగా తీసుకున్నారనే భావనను అధికారవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పుష్కర ఘాట్ దుర్ఘటనతో పడిన మచ్చను చెరిపేసుకునేందుకు ఆ తరువాత అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా బస్టాండ్లు, ఫుష్కర ఘాట్లు, రైల్వే స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న చంద్రబాబు సంఘటన జరిగినప్పుడు సత్వరం స్పందించలేదనేందుకు ఇది నిదర్శనమని అభిప్రాయపడుతున్నాయి. అలా స్పందించివుంటే.. మృతులసంఖ్య అంత ఉండేది కాదని భావిస్తున్నాయి. -
రెండుకోట్లకు చేరిన పుష్కర స్నానాలు
హైదరాబాద్ సిటీ: గోదావరి పుష్కరాలు ప్రారంభం నాటి నుంచి ఆదివారం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు కోట్ల మంది భక్తులు పుష్కరస్నానాలు చేసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. శని, ఆదివారం నాడే కోటి మందికి పైగా భక్తులు పుష్కరాలకు హాజరైనట్టు పేర్కొన్నారు. పుష్కరాలు ప్రారంభం నాటి నుంచి రోజు వారీగా పుష్కరాలకు హాజరైన భక్తుల వివరాలు.. 14-07 15-07 16-07 17-07 18-07 19-07 మొత్తం (తూ.గో.గ్రామ 8,04,605 9,85,318 11,55,112 10,96,497 19,40,699 15,05,082 74,87,353 పట్టణ ప్రాంతం 9,97,329 6,46,969 10,87,587 11,15,062 19,54,619 14,35,267 72,36,833 (ప.గో.గ్రా,ప) 5,44,511 7,90,864 8,34,609 8,61,782 19,30,403 14,71,559 64,33,728 23,46,485 24,23,151 30,77,308 30,73,341 58,25,721 44,11,908 2,11,57,914 -
తొక్కిసలాట ఘటనపై పార్లమెంటులో నిలదీస్తాం
* వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి * పబ్లిసిటీ ఫిలిం షూటింగ్ కోసం 29 ప్రాణాలు బలిగొన్న * బాధ్యత ఏపీ సీఎం చంద్రబాబుదే * ఇదే విషయాన్ని పార్లమెంటుకు వివరిస్తాం * ప్రత్యేక హోదాతోపాటు ‘ఓటుకు కోట్లు’ అంశాన్నీ లేవనెత్తుతాం * మార్పులు చేయకపోతే భూసేకరణ బిల్లుకు మద్దతిచ్చేది లేదు * వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన పార్టీ ఎంపీల భేటీ * పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ (లోటస్ పాండ్ లో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశమైన పార్టీ ఎంపీలు మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బుట్టారేణుక, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి) సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పుష్కరఘాట్‌లో భక్తుల ప్రాణాలు బలిగొన్న తొక్కిసలాట ఘటనను పార్లమెంటులో ప్రస్తావించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో తేవాలని ప్రయత్నిస్తున్న భూసేకరణ బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల రూపాయలు గుమ్మరించిన చంద్రబాబుకు సంబంధించిన ‘ఓటుకు కోట్లు’ కేసును కూడా పార్లమెంటులో ప్రస్తావించాలని తీర్మానించింది. ప్రత్యేకహోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపైన కేంద్రంపై ఒత్తిడి తేవాలని కూడా నిర్ణయించింది. ఈ నెల 21 నుంచి ప్రారంభమవనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శనివారమిక్కడ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. అనంతరం సహచర ఎంపీలతో కలసి పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వివరాలు వెల్లడించారు. సీఎం చంద్రబాబు తన సొంత ప్రచారంకోసం ఒక డాక్యుమెంటరీ తీయడానికి రాజమండ్రి పుష్కరాలను వేదికగా చేసుకోవడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణానికి కారణమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. ఈ ఘటనకు పూర్తిబాధ్యత చంద్రబాబుదేనంటూ.. ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని చెప్పారు. దీంతోపాటు తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ పదవిని గెలవాలన్న ఉద్దేశంతో కోట్లు ఖర్చుచేసి ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయడానికి జరిగిన వ్యవహారాన్నీ పార్లమెంట్లో లేవనెత్తుతామన్నారు. ఇందులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికాక కూడా తప్పించుకోవాలని ప్రయత్నాలు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. దీనిపై చర్చ జరగాలని కోరతామన్నారు. మద్దతు ధర, ధాన్యం కొనుగోలుపైనా.. ధాన్యం రైతులకు మద్దతుధరను ప్రభుత్వం కేవలం రూ.50 మాత్రమే పెంచిందని, దీనిని మరింత పెంచాలని కోరతామని మేకపాటి చెప్పారు. ఎంఎస్పీ ధర పెంపుతోపాటు ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యం సేకరణను ఏడాదికేడాది తగ్గిస్తున్న వైనంపైనా సభలో చర్చ కోరతామన్నారు. 2013-14లోకన్నా 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ సగానికి సగం తగ్గిపోయిందని, ఈ ఏడాది మరింత తగ్గిస్తారన్న ప్రచారం జరుగుతోందని, ఇలాంటి చర్యలవల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికోసం ఎక్కువగా నీటి వృ థా చేయడంవల్ల రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూ రు జిల్లాల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఈ చర్యకు వై ఎస్సార్సీపీ వ్యతిరేకమని ఆయన చెప్పా రు. తప్పనిసరిగా శ్రీశైలంలో నిర్ణీతస్థాయిలో నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని పార్లమెం ట్లోనూ ప్రస్తావిస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇ వ్వాలని డిమాండ్ చేస్తూ గత పార్లమెంట్ సమావేశాల్లోనూ వైఎస్సార్సీపీ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చిందని.. రెండుసార్లు ఈ అంశాన్ని జీరోఅవర్‌లో ప్రస్తావించామని ఎంపీ మిథున్‌రెడ్డి విలేకరులడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రత్యేకహోదా కోరుతూ ప్లకార్డులతో సభలో ఆం దోళన చేయడాన్నీ గుర్తుచేశారు. సమావేశంలో మేకపాటితోపాటు ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, బుట్టా రేణుక, పెద్దిరెడ్డి మి థున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్ తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాలున్నందున హాజరవలేదు. విభజన బిల్లులోని అంశాల అమలుకు పోరాటం.. ప్రస్తుత ఆర్డినెన్స్ రూపంలో ఉన్న భూసేకరణ బిల్లుకు మద్దతిచ్చేది లేదని మేకపాటి స్పష్టం చేశారు. మూడు.. నాలుగు పంటలు పండే భూముల్ని తీసుకోవడం, సామాజిక ప్రభావ అంచనా(సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) చేయకుండా, రైతుల అంగీకారం లేకుండానే భూములు లాక్కోవడం వంటి ప్రక్రియలకు తమ పార్టీ మొదటినుంచీ వ్యతిరేకమని చెప్పారు. ఆ మూడంశాల్లో రైతులకు ఆమోదయోగ్యంగా మార్పులు చేసినట్లయితే బిల్లుకు తాము మద్దతిస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా, పోలవరం నిర్మాణానికి అధిక నిధుల కేటాయింపు అంశాలపై పార్లమెంట్లో పోరాడతామన్నారు. రైల్వేజోన్ ఏర్పాటుతోపాటు విభజన బిల్లులో పేర్కొన్న అన్నిఅంశాల అమలుకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. -
పుష్కరాల్లో మరో ఇద్దరు మృతి
కరీంనగర్(ధర్మపురి): కరీంనగర్ జిల్లా ధర్మపురికి పుష్కర స్నానం కోసం కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి శనివారం రాత్రి ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. బాలాపూర్‌కు చెందిన కర్నాటి అశోక్(42) తన భార్య సునీత, ఇద్దరు పిల్లలతో కలిసి రాత్రి 9.30 గంటల సమయంలో ధర్మపురి చేరుకున్నాడు. బస్టాండ్ సమీపం నుంచి గ్రామపంచాయతీ నందిచౌరస్తా వద్దకు చేరుకుని అక్కడ ఉన్న ఫెన్సింగ్‌కు ఒరిగాడు. ఫెన్సింగ్‌కు అమర్చిన విద్యుత్ దీపాలకు చెందిన వైరు దెబ్బతినడంతో పాటు వర్షంతో తడిసి ఉండటంతో అశోక్ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికి ఫలితం లేకపోవటంతో రాత్రి 10 గంటలకు మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ నీతూప్రసాద్ సందర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అశోక్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గుండెపోటుతోటుతో వృద్ధుడు.. ధర్మపురికి పుష్కర స్నానాల కోసం వచ్చిన ఓ వృద్ధుడు శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం నాచారం గ్రామానికి చెందిన అనుగుల వెంకటిగౌడ్(70) బంధువులతో కలిసి వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో పుష్కరస్నానం కోసం ఘాట్ వద్దకు వెళ్లిన సమయంలో గుండెనొప్పితో కుప్పకూలిపోయూడు. బంధువులు వెంటనే ఆయనను వైద్యశిబిరానికి తరలించారు. అప్పటికే వెంకటిగౌడ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
భద్రాచలంలో అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ జామ్
ఖమ్మం(భద్రాచలం): ఊహించని రీతిలో 5 లక్షల మంది భక్తులు భద్రాచలంలో పుష్కరాలకు రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. సెలవురోజులు కావడంతో గోదావరి పుష్కర స్నానం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా భక్తజనం లక్షలాదిగా తరలివచ్చారు. జిల్లాలోని 8 పుష్కరఘాట్లలో 6 లక్షలకు పైగా భక్తులు స్నానమాచరించగా ఇందులో 5 లక్షల మంది భద్రాచలానికి వచ్చారు. శుక్రవారం రాత్రి నుంచి మొదలైన భక్తుల రాకడ శనివారం సైతం కొనసాగింది. స్నానాలు పూర్తిచేసుకుని దర్శనం చేసుకున్న భక్తులు తిరిగి వెళ్లేక్రమంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోవడంతో అనేకమంది భక్తులు భద్రాచలంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. భద్రాచలం పట్టణంలోని ఏ వీధిలో చూసినా జనసందోహమే కన్పించింది. రాత్రివేళ సైతం గోదావరి నదిలో లక్ష మందికిపైగా పుష్కరస్నానం ఆచరించారు. పోలీసులు నిలువరించినప్పటికీ తిరిగి ఇంటిదారి పట్టాలనే ఆత్రుతతో చీకట్లోనే అనేకమంది స్నానం చేశారు.గోదావరి కరకట్టపైనే అనేకమంది నిద్రించారు. శనివారం రాత్రి తరలివచ్చిన భక్తులు నిద్రించేందుకు గదులు లేకపోవడంతో రోడ్లపైనే జాగారం చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో సకాలంలో పట్టణాన్ని విడిచివెళ్లలేని పరిస్థితి. ఒకవైపు స్నానాలు పూర్తిచేసుకున్న భక్తులు తిరిగి వెళ్లడానికి దారిలేక రోడ్లపైనే ఉండటం, ఆదివారంనాటి స్నానం కోసం లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో భద్రగిరి కిటకిటలాడింది. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రాత్రి వేళలో కూడా కొత్తగూడెం, పాల్వంచ, ఇతర ప్రాంతాల్లో భద్రాద్రికి వచ్చే వాహనాలను నిలిపివేశారు. -
పుష్కరాలలో ఏపీ, తెలంగాణలో ట్రాఫిక్ జామ్
-
‘బక్రాల’ వేటలో అసలు బాధ్యుడు
పుష్కరాల వంటి కార్యక్రమాలకు వీఐపీలు రద్దీలేని వేళల్లోనే వచ్చి, వెంటనే వెళ్లిపోవాలనే మార్గదర్శకాలు చెబుతున్నాయి. అందుకే 1991 గోదావరి పుష్కరాలకు నాటి సీఎం నేదురుమల్లి నాలుగో రోజున వెళ్లారు. 2003లో నాటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సాధారణ ఘాట్‌లో స్నానం చేస్తామంటే స్థానిక కలెక్టర్ వారించారు. ఈ సారి ఒక్క రాజమండ్రిలోనే పుష్కరాల పుణ్యమంతా సుడులు తిరుగుతోందన్నట్టుగా ప్రచారం చేశారు. అనర్థం జరిగిపోయాక గోదావరిలో ఎక్కడ చేసినా పుష్కర స్నానమేనని సెలవిస్తున్నారు. ‘కరాళ నృత్యం చేస్తున్న కరువు నుంచి జనాన్ని కాపాడ్డానికి అపురూపంగా పెంచుతున్న పంట చేలను మేస్తోందే!’ అని దర్బపుల్లలతో అదిలించినందుకే ఆవు చచ్చిపోయింది. అది తనను పరీక్షించడానికి వచ్చిన ‘మాయ ఆవు’ అని తెలిసినా... మహర్షి గౌతముడు చలించిపోయాడు. ఆవు చావుకు బాధ్యత వహించి ఘోర తపస్సుతో శివుడ్ని మెప్పించి, గోహత్య దోష నివారణకు శివుడి జటాజూటంలోని గంగమ్మ పాయని వరంగా పొంది, నేలకు దించిన ఫలితమే పవిత్ర గోదావరి! ఇలాగే జరిగిందో, లేదోగానీ, ఇది విస్తృతంగా ప్రచారంలో ఉన్న కథ. అనర్థాలకు కారకులైన వారు వాటికి నైతిక బాధ్యత వహించాలని అది చెప్పే నీతి ఒక సంస్కృతిగా, సంప్రదాయంగా వేల ఏళ్లుగా ఈ నేల మీద అమలవుతోంది. గౌతమి (గోదావరి) అందుకు ప్రత్యక్ష సాక్షి. ఆ గోదావరిలో పవిత్ర పుష్కర స్నానమాచరిద్దామని వచ్చి, పాలకుల వైఫల్యా నికి ప్రాణాలు పోగొట్టుకున్న 27 మంది చావుకు ఎవరూ బాధ్యత వహించరా? ఈ మానవ తప్పి దానికి నైతిక బాధ్యత అంటూ ఉండదా? రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి లాల్‌బహదూర్ శాస్త్రి రాజీనామా చేసినది తన వల్లే రైలు ప్రమాదం జరిగిందనీ కాదు, తన రాజీనామాతో ఇక రైలు ప్రమాదాలే జరుగవనీ కాదు. సరిగ్గా అలాగే, తన పాలనలో బందిపోటు దొంగతనాలు పెరిగినందుకు ఉత్తరప్రదేశ్ సీఎం పదవి నుంచి విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ వైదొలిగారు! (తర్వాత దేశానికి ప్రధాని అయ్యారు) బస్సుల జాతీయీకరణపై ైహైకోర్టు తప్పుబట్టినందుకే నీలం సంజీవరెడ్డి సీఎం పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీమద్యం వల్ల కొందరు చనిపోయినందుకు నైతిక బాధ్యత వహించాలంటే మంత్రి పదవికి, శాసన సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు కనుమూరి బాపిరాజు. ఎందుకిలా జరిగింది? గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదులకు పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలు తెలుగు ప్రజలకుగానీ, ప్రభుత్వాలకుగానీ కొత్తేమీ కాదు. ప్రభుత్వ యంత్రాం గానికి వాటిని విజయవంతంగా నిర్వహించిన అనుభవమూ ఉంది. ఈసారి భారీగా నిధుల కేటాయింపులూ జరిగాయి, అంతా ప్రణాళికాబద్ధంగా జరుగు తున్నదని చెప్పారు. కనుక రాష్ట్ర ప్రజలు సర్కారునూ, దాని ప్రచారాన్నీ నమ్మి అంతా సవ్యంగా జరుగుతుందని వచ్చారు. కానీ, తొక్కిసలాటలో వందల మంది క్షతగాత్రులయ్యారు. 27 మంది ప్రాణాలొదిలారు. ఇది మనిషి పరిధిలో లేని ప్రకృతి వైపరీత్యం కాదు. ఏ రకంగా చూసినా మానవ తప్పిదమే! నిర్వహణా లోపం వల్ల జరిగింది. ఎవరూ బాధ్యత వహించకుంటే, ఇలాంటి నిర్వహణా లోపాలు, నిర్లక్ష్యాలు, అలసత్వాలు పునరావృతమై సామాన్యులు తరచూ బలి కావాల్సి వస్తుంది. అది జరక్కూడదంటే, జరిగిన దారుణాన్ని సరిగ్గా పరిశీలించి, సమీక్షించి, విశ్లేషించాలి. అన్ని స్థాయిల్లో ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాజకీయ నిందలకిది సమయం కాదనే మాట నిజమే, అంత మాత్రాన తప్పెక్కడ జరిగింది? బాధ్యులెవరు? అన్నది గుర్తించకూడదని కాదు. బాధ్యత ఎక్కడ మొదలై ఎవరి వద్ద ఆగిపోతుంది? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. అన్నీ తానై నడిపించిన ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికా రులు ఈ బాధ్యతా వలయం నుంచి తప్పుకొని సాధారణ అధికారులనో, కిందిస్థాయి ఉద్యోగుల్నో బలిపశువుల్ని చేస్తారా? అదీ కాదంటే అలా దూసు కురావడం తప్పంటూ తొక్కిసలాటలో నలిగిన, ప్రాణాలొదిలిన భక్తుల్నే బాధ్యుల్ని చేస్తారో చూడాలి. అనవసర జాప్యంతో టెండర్లు పిలవకుండా, నామినేషన్ పద్ధతిన ‘అయిన వాళ్లకు’ పనులు అప్పగించడంతో భారీగా నిధులు దుర్వినియోగమయ్యాయే తప్ప చాలా చోట్ల పనులే జరగలేదు. జరి గిన అరకొర పనుల్లో నాణ్యత కొండెక్కింది. కట్టలు తెంచుకున్న అవినీతిని కళ్లారా చూస్తున్న అధికార, ఉద్యోగ వర్గాల్లో పనిలో తపన తగ్గింది. సరైన ప్రణాళికే లేక ఎక్కడికక్కడ నిర్వహణ వైఫల్యాలు, సమన్వయ లోపాలు, సౌక ర్యాల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. స్థానికాధికారులను, సిబ్బందిని సక్రమంగా పనిచేసుకోనీకుండా ఉన్నతాధికారగణం, రాజకీయ వ్యవస్థ నిరం తరం జోక్యం చేసుకున్నాయి. విపత్తు నిర్వహణపై ఏర్పాటు చేసిన శిక్షణకు క్షేత్రస్థాయి సిబ్బంది హాజరు కాలేనంతగా సమీక్షలు జరిపి, నెల రోజులు ఊదరగొట్టిన మంత్రులు, ఉన్నతాధికార వర్గం ఇప్పుడేం చెబుతారు? ఇంత జరిగినా ప్రచార యావ ఇంకా తగ్గలేదు. అవగాహన కార్యక్రమాలు, వర్క్షాపులంటూ పుష్కరాలకొచ్చిన జనాన్ని పోగేసి ఊదరగొడుతున్నారు. తెగ హడావుడి చేస్తూ, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు. ప్రచార యావే... జనం ప్రాణాల మీదకి తెచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార యావ, తదనుగుణంగా జరిగిన నిర్వాకాలే మారణకాండకు ప్రధాన కారణం. ప్రచారం మీదున్న దృష్టిలో పదోవంతైనా పనుల మీద, వాటి నాణ్యత మీద ఉంటే ఈ దుస్థితి దాపురిం చేది కాదనే భావన సర్వత్రా వ్యక్తమౌతోంది. రూ.1,650 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో శ్వేత పత్రం విడుదల చేస్తే... టెండర్లెందుకు పిలవలేదు? దేనికెంత ఖర్చయింది? పనుల ప్రమాణాలు, నిర్వహణ, నాణ్యత ఎందుకిలా దిగజా రాయి? అని ప్రజలు బేరీజు వేసి వాస్తవాలను అవగాహన చేసుకోగలు గుతారు. అప్పుడు తప్పెక్కడ జరిగిందో, బాధ్యులెవరో తేలిపోతుంది. గంట న్నర సేపు తొక్కిసలాట, అదీ దఫ దఫాలుగా జరుగుతున్నా నిలువరిం చాల్సిన పోలీసులు, భద్రతా సిబ్బంది లేరు. తొక్కిసలాటలో ఊపిరాడక నాలుక పిడుచగట్టుకు పోయిన వారి గొంతు తడపడానికి కాసిని మంచి నీళ్లు లేవు. ఆపత్కాలంలో ఆదుకునే వైద్య సదుపాయాల్లేవు, కొన ఊపిరితో ఉన్న వాళ్లని తరలించడానికి అంబులెన్స్‌లు లేవు. కానీ, ఘాట్ మధ్యలో సీఎం సకుటుంబ సమేతంగా పుష్కర స్నానం చేస్తుంటే బయట లక్షలాది జన సందోహం కిక్కిరిసి వేచివుంది. అదీ నాలుగయిదు గంటల నిరీక్షణ... ఎందుకు? జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద చంద్రబాబు కీర్తి పతాకాన్ని ఎగురవేసే లఘు చిత్రం చిత్రీకరణ కోసం! ఎంత దుర్మార్గమిది? వీఐపీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సరస్వతీ ఘాట్‌కు సీఎం, ఆయన కుటుంబం ఎందుకు పరిమితం కాలేదు? అధికారులు వారిస్తున్నా... ఆఖరు నిమిషంలో ఆయన సామాన్యుల ఘాట్‌కు వచ్చి, అక్కడే పూజ, స్నానాదికాలు ఎందుకు చేశారు? ఈ అంశాన్నీ విచారణ పరిధిలోకి తెస్తారా, లేదా? జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) సమూహ నిర్వహణా మార్గదర్శకాలన్నిటినీ ఎందుకు తుంగలో తొక్కారో తేలాలిప్పుడు. సరైన ప్రణాళిక, పని విభజన, బాధ్యతల పంపకం ఎందుకు జరగలేదు? అన్నీ మంచిగా జరిగితే కీర్తిని తన ఖాతాలో వేసుకోవాలనే దృష్టితో సీఎం అన్నిటికీ తానే కేంద్ర బిందువుగా ఉండటం వల్లే ఈ అనర్థమని ఉద్యోగవర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. అధికారుల తెలివిడి ఏమైంది? రాజకీయ వ్యవస్థకు ఊడిగం చేసీ చేసీ అధికారులు తమ విధుల్ని, రాజ్యాంగ బద్ధమైున బాధ్యతల్ని విస్మరిస్తున్నారు. రాజకీయ కారణాలతో ఓ ముఖ్యమం త్రి ఏం చెప్పినా అధికారులు తలలూపాలని లేదు. నిబంధనలు ఒప్పుకో వనో, అలా చేస్తే ఇలాంటి ఇబ్బందులొస్తాయనో.... చెప్పి ఉండాల్సింది. రాజ్యాంగం, చట్టాలు, సర్వీసు నిబంధనలకు లోబడి పని చేసే ప్రజా సేవకు లమే తప్ప రాజకీయ వ్యవస్థ చెప్పినట్టల్లా ఆడే బంట్లం కాదనే స్పృహ వారి కుండాలి. ఇటువంటి కార్యక్రమాలకు వీఐపీలు, జన సందోహం లేని వేళల్లోనే రావాలని, వచ్చి వెంటనే వెళ్లిపోవాలని ఎన్డీఎంఏ మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది. వీఐపీలొచ్చినపుడు రెవెన్యూ, పోలీసు తదితర సిబ్బంది దృష్టంతా వారిపైనే ఉంటుంది, కనుక సాధారణ విధుల నిర్వహణకు భంగం కలుగు తుందనేది దీని ఉద్దేశం. 1991 గోదావరి పుష్కరాల ప్రారంభోత్సవానికి నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి వెళ్లలేదు. పండితులు, అధికా రులతోనే పుష్కరాలను ప్రారంభం చేయించి, 4 రోజులు తర్వాత, రద్దీ తగ్గాక పుష్కర స్నానం చేశారు. 2003లో ఇదే చంద్రబాబు సీఎంగా ఉండగా పుష్కరాలు జరిగినపుడు స్థానిక కలెక్టర్ జవహర్‌రెడ్డి ఎన్డీఎంయే నిబంధనల్ని ఖచ్చితంగా అమలు జరిపించారు. నాటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వీఐపీ ఘాట్‌లో గాక, సాధారణ భక్తుల ఘాట్‌లో స్నానం చేస్తామంటే నిర్మొ హమాటంగా కుదరదని, ఇబ్బందులొస్తాయని నచ్చజెప్పారు. కానీ, ఈ సారి ఒక్క రాజమండ్రిలోనే గోదావరి పుష్కరాలు జరుగుతున్నట్టు, పుణ్యమంతా అక్కడే సుడులు తిరుగుతున్నట్టుగా ప్రభుత్వం ప్రచారం చేసింది. సీఎంతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు అంతా అక్కడే మోహరించారు. అదే సమయంలో తన పుష్కర స్నానానికి కొవ్వూరు ఘాట్‌ను ఎంపిక చేసుకొని విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జనానికి సరైన సంకేతం పంపారు. ప్రభుత్వం హోర్డింగ్స్, టీవీ, పత్రికలు, రేడియో... అం తటా రాజమండ్రి గురించే ప్రచారం చేశారు. అనర్థం జరిగిపోయాక ఇప్పుడు ముఖ్యమంత్రి... నాసిక్ నుంచి బంగాళాఖాతం వరకు గోదావరిలో ఎక్కడ స్నానం చేసినా పుష్కర స్నానమేనని సెలవిస్తున్నారు. ఇవే మాటలను ముం దునుంచే విస్తృతంగా ప్రచారాన్ని, అందుకు ఏర్పాట్లను చేసి ఉండాల్సింది, తెలంగాణలో ఇలా వికేంద్రీకరణ జరిగింది. బాసర, ఎస్సారెస్పీ, పోచం పాడు, ధర్మపురి, కోటిలింగాల, కాళేశ్వరం, ఏటూరు నాగారం, మణుగూరు, భద్రాచలం ఇలా చాలా ప్రాంతాలలో సదుపాయాలు కల్పించి, ప్రచారం చేశారు. మంత్రులు కూడా వేర్వేరు ప్రాంతాల్లో ఉండి పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర బిందువుగా బాధ్యత వహించాల్సిందే! ‘‘పాణాలు పోయాక పది లచ్చలిస్తామంటున్నారయ్యా..! కావాలంటే పది లచ్చలు నేనిస్తాను..మా పిన్నిని తీసుకురమ్మనండి..బాబూ!’’ అని హోరున విలపిస్తున్న శ్రీకాకుళం జిల్లా బలగ బత్తిన సత్తిబాబుకు ఎవరు సమాధానం చెబుతారు? అదలా ఉంచితే న్యాయవిచారణ అంటూ ముఖ్యమంత్రి దాట వేతకు యత్నిస్తున్నారు. నిస్సందే హమైన మానవ తప్పిదానికి నేరుగా ఆయనే బాధ్యత వహించాలి. పైగా రాజ్యాంగపరమైన బాధ్యతా ఉంది, వీటన్నిటి కంటే ఉన్నతమైన నైతిక బాధ్యతా ఉంది. చంద్రబాబు పరిపాలనా దక్షుడన డం ఉత్త ప్రచారమేనని మరో మారు రుజువైంది. అదే ఆయన నైజం. విజ యాల కీర్తిని తన ఖాతాలో, వైఫల్యాల అపకీర్తిని ఇతరుల ఖాతాలో వేయడం ఆయన రివాజు. ఈ రివాజు ప్రకారమే రాజమండ్రి దుర్ఘటన నెపం ఎవరిపై నెట్టాలా? అని ఆయన ఒక బలిపశువు (బక్రా)ను వెతుకుతున్నారు. ఈమెయిల్: dileepreddy@sakshi.com సాక్షి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ - దిలీప్ రెడ్డి -
జీతం సరిపోవటం లేదంటూ హోంగార్డు ఆత్మహత్యాయత్నం
తూర్పుగోదావరి(రాజమండ్రి): జీతం సరిపోవటం లేదంటూ దుర్గా ప్రసాద్ అనే హోంగార్డు గురువారం ఆత్మహత్యాయత్నం చేశాడు. సూసైడ్ నోట్ రాసి మహిళలు నెత్తికి రాసుకొనే వ్యాజ్‌మోలా తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సహచరులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోవడం లేదు, గోదావరి పుష్కరాలకు డ్యూటీ వేశారు కానీ తగిన ప్రయాణభత్యము చెల్లించటం లేదు. రెండు పూటలా తినక అయిదు రోజులయ్యింది అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేశాడు. దుర్గా ప్రసాద్ ఇదేవిధంగా గతంలో కూడా రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది. -
జలా పాపం జలా పిడికెడు
ఇరవై ఏడు శాపాలై క్రోధావరి ప్రశ్నిస్తోంది పాపాల పంపిణీకై కూచుంది కోటగుమ్మం ఎందుకు వేట గుమ్మం అయిందని గద్దిస్తోంది ఒక్కొక్కరే వస్త్తున్నారు పుష్కర ముష్కరులు పుష్కరం ఏడాదంతా ఉంటుంది ఎప్పుడైనా వచ్చి ఏ తీరంలోనైనా పుణ్యస్నానాలు చేయొచ్చని చెప్పకుండా అర్థం కాని శ్లోకాలు చెప్పి మట్టి ముందెయ్యాలి వెనుకెయ్యాలి అన్న వారంతా తప్పకుండా నరకానికే పోతారు ప్రభుత్వమూ, కాంట్రాక్టర్లూ కలిసి ఏ పనులు ఎవరు చేస్తున్నారో తెలీని జన గండాన్ని రాజమంద్రంలో సృష్టించినందుకు వీళ్లకీ నరకం తప్పదు ఒక నిష్టా గరిష్ట నిరాడంబర దీక్షా బద్ధ సంప్రదాయం మీద పడి దాన్ని మార్కెట్ సరుకు చేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి. ఒక జీవనది పుష్కరం పేరిట ఇరవై ఏడు జీవ నదుల్ని బలి చేసిన నేరం క్రోధావరి అందరికీ సమానంగా పంచుతోంది ఇక ఎంతమంది మునిగిలేస్తేనేం? మహా సమర్థవంతమైన నిర్వహణ చేసేసాం అనే ఘనత మెడలో గోల్డ్ మెడల్ కావాలన్న అత్యాశలకు, వికృత మార్కెట్ విన్యాసాలకు గాను దక్కేవి గోల్డ్ మెడళ్లు కావు! ఈ పాలకులు, ఈ వ్యవస్థ, ఈ ప్రచార సాధనాల మెడల్లో వేలాడుతున్నాయి ఇరవై ఏడు శాపాల కోల్డ్ మెడళ్లు!! జలా పాపం జలా బండెడు జల ఘట్టాలను బలి ఘట్టాలు చేసినందుకు ఒళ్లు మండి పారుతోంది గోదావరి క్రోధావరి అందరూ ఎక్కాల్సిందే బోను నరక శిక్షలు స్వీకరించాల్సిందే. - రామతీర్థ, 98492 00385 -
ఎక్కడైనా పుష్కరస్నానం చేయవచ్చు: బాబు
సాక్షి, రాజమండ్రి: గోదావరిలో ఎక్కడ పుష్కరస్నానం చేసిన పుణ్యం వస్తుందని, పుష్కరఘాట్లలోనే చేయాల్సిన అవసరంలేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆయన మంగళవారం అర్ధరాత్రి పుష్కరఘాట్లను పరిశీలించారు. ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... ఉదయం జరిగిన దుర్ఘటన దురదృష్టకర సంఘటనని సంతాపం వ్యక్తంచేశారు. రైల్వే స్టేషన్ పక్కనే ఉండటంవల్ల పుష్కరఘాట్‌కు భక్తులు పోటెత్తారని తెలిపారు. పుష్కరఘాట్మీద భక్తుల ఒత్తిడి తగ్గించి మిగతా ఘాట్లకు పంపించే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పక్కనే ఉన్న కోటిలింగాల ఘాట్‌లో గంటకు 70-80 వేల మంది స్నానం చేయవచ్చని తెలిపారు. భక్తులను అటు మళ్లించే ఏర్పాట్లు చేస్తామన్నారు. వీఐపీ ఘాట్కూడా రద్దీ లేనప్పుడు సామాన్య భక్తులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు మంచినీటి ప్యాకెట్లు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. -
మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం
ఏపీ సీఎం ప్రకటన.. రద్దీ నిర్వహణలో విఫలమయ్యామని అంగీకారం సాక్షి, రాజమండ్రి: తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు ఏపీ సీఎం చంద్రబాబు రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌లతో కలసి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలను పరిశీలించి, క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని, క్షతగాత్రులకు వైద్యం అందిస్తామని ధైర్యం చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రద్దీ నిర్వహణ మరింత క్రమపద్ధతిలో జరిగి ఉండాల్సిందన్నారు. అన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకున్నా.. అనుకున్నదానికంటే ఎక్కువమంది రావడం వల్ల ఊహించని ఈ సంఘటన జరిగిందన్నారు. ట్రాఫిక్, తాగునీటి సమస్యలపై అధికారులతో సమీక్ష జరుపుతామన్నారు. ఇంకా 11 రోజులు ఉన్నందున ఈ దుర్ఘటనకు సంబంధించి బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై అప్పుడే నిర్ణయం తీసుకోలేమన్నారు. పూర్తి విచారణ జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. పుష్కరాలు జరిగినన్ని రోజులూ దాదాపు రాజమండ్రిలోనే ఉంటానన్నారు. కాగా, నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు నేడు ఢిల్లీ వెళ్లాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన పర్యటన రద్దు చేసుకున్నారు. రాజమండ్రి ఘటన నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారవర్గాలు తెలిపాయి. న్యాయ విచారణకు ఆదేశం రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
హృదయం ద్రవించిపోతోంది
పుష్కర దుర్ఘటనపై ట్విట్టర్లో వైఎస్ జగన్ ఆవేదన సాక్షి, హైదరాబాద్: రాజమండ్రి దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలను చూసి తన హృదయం ద్రవించిపోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. మానవత్వం లేని ఈ అసమర్థ ప్రభుత్వ తీరుకు పుష్కర యాత్రికులు తీవ్రంగా కలత చెంది ఉన్నారని ఆయన మంగళవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ దుర్ఘటన జరక్కుండా చంద్రబాబు ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందని, తమ ప్రాణాల భద్రతపై యాత్రికులకు ఎలాంటి సందేహాలు లేనివిధంగా ప్రభుత్వం వ్యవహరించి ఉండాల్సిందని ఆయన అన్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు కుటుంబాలపై గోదావరి తల్లి దివ్యమైన ఆశీస్సులు ఉండాలని, ఈ పుష్కరాలు శాంతియుతంగా, సంతోషంగా ముగియాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. -
బాబు కోసం మావాళ్లను బలి చేశారు
* కాపాడాలని అరిచినా పట్టించుకున్నవారే లేరు * వైఎస్ జగన్ వద్ద మృతుల బంధువుల ఆవేదన సాక్షి, రాజమండ్రి: ‘‘అప్పటికే రెండున్నర గంటలపాటు బారికేడ్ల వెనుక ఉన్నాం. కనీసం మంచినీళ్లు ఇచ్చే దిక్కు లేదు. చంద్రబాబు వెళ్లగానే ఒక్కసారిగా గేట్లు తీశారు. అంతే వెనుకనున్నవారు తోసుకుంటూ రావడంతో ముందున్న మావాళ్లు పడిపోయారు. గంటన్నరకు పైగా తొక్కిసలాట జరిగింది. కాపాడండి అంటూ ఎంతగా ప్రాధేయపడినా పట్టించుకున్నవారే లేకుండాపోయారు. పుష్కర స్నానం చేద్దామని వస్తే పుణ్య లోకాలకు పంపేశారు’’ అంటూ మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. పుష్కర ఘాట్ తొక్కిసలాటలో మృతి చెందినవారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఓదార్చారు. ప్రభుత్వాస్పత్రితోపాటు రాజమండ్రిలోని బొల్లినేని, జీఎస్ఎల్ ఆస్పత్రుల్లో క్షతగాత్రులను పరామర్శించారు. షెడ్యూల్ ప్రకారం జగన్ బుధవారం రాజమండ్రికి రావాల్సి ఉంది. పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాటలో భక్తులు మృతి చెందారన్న విషయం తెలియగానే హుటాహుటిన హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12.30 గంటల విమానంలో బయల్దేరి 2 గంటల సమయంలో రాజమండ్రికి చేరుకున్నారు. మధురవూడి నుంచి జిల్లా ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న జగన్ నేరుగా మార్చురీకి వెళ్లి మృతుల కుటుంబీకులను ఓదార్చారు. మార్చురీ వద్ద కటిక నేలపై వరుసగా ఉన్న పుష్కర యాత్రికుల మృతదేహాలను చూసి చలించిపోయారు. కుమార్తెతోపాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయిన శ్రీకాకుళం జిల్లా బలగ గ్రామానికి చెందిన ఇందిర కుటుంబ సభ్యులను తొలుత పరామర్శించారు. ‘‘17 మందిమి వచ్చాం. 14 మంది మిగిలాం. పుణ్యస్నానాలు చేద్దామని వస్తే మావాళ్లను పుణ్య లోకాలకు పంపాల్సి వచ్చిందన్నా’’ అంటూ జగన్‌ను పట్టుకుని వారు కన్నీరుమున్నీరయ్యారు. ‘‘పొరుగూరు నుంచి పుష్కర స్నానం చేసేందుకు వచ్చిన మా పిన్ని తొక్కిసలాటలో చనిపోయింది. చంద్రబాబు వల్లే మాకీ చావు వచ్చింది. ఇప్పుడొచ్చి పది లచ్చలు ఇస్తానంటున్నాడు. ఎవడికి కావాలి ఆ డబ్బులు? నా దగ్గర డబ్బులున్నాయి. కావాలంటే నేనే ఇస్తా. మా పిన్నిని తీసుకురమ్మనండి’’ అంటూ జగన్ వద్ద బత్తిన సత్తిబాబు గుండెలు బాదుకుంటూ రోదించారు. నెల్లూరు జిల్లాకు చెందిన పర్వతాల పోలయ్య కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. భార్య రాజేశ్వరి మృతదేహం వద్ద పోలయ్య తన కుమార్తెతో కలిసి కన్నీరుమున్నీరవుతుండగా చూసి జగన్ చలించిపోయారు. మిగిలిన మృతుల కుటుంబాలను కూడా పేరుపేరునా పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. కేవలం చంద్రబాబు కోసమే లక్షలాది జనాన్ని ఆపేశారని, ఆయన వెళ్లగానే ఒకేసారి గేట్లు తెరవడంతో గంటన్నరపాటు తొక్కిసలాట జరిగిందని, వందలాది మంది ఊపిరి అందక నరకం చూశారని బాధిత కుటుంబ సభ్యులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ చావులకు ముమ్మాటికీ చంద్రబాబే కారణమని వారు ఆరోపించారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలంటూ వైద్యులకు సూచనలు చేశారు. -
ఈ చావులకు కారణం చంద్రబాబే..
* తక్షణమే ఏపీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి * కాశి వెళ్లి గంగలో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి * అధికారులను బలిపశువులను చేసేందుకే న్యాయ విచారణకు ఆదేశం * పుష్కర ఏర్పాట్ల వైఫల్యంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, రాజమండ్రి: ‘‘గోదావరి పుష్కరాలు ప్రారంభమైన తొలిరోజే ఇంతమంది దుర్మరణం పాలవడానికి ముమ్మాటికీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణం. ఈ మరణాలకు ఆయనే బాధ్యత వహించాలి. తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేసి, కాశీ వెళ్లి గంగలో మునిగి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి’’ అని వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. పుష్కరఘాట్‌లో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వచ్చారు. జిల్లా వైద్యవిధానపరిషత్ ఆస్పత్రిలో మృతుల కుటుంబసభ్యులను పరామర్శిం చారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘ఇవాళ ఇక్కడ జరిగిన సంఘటన ఏం జరిగిందో, ఎలా జరిగిందో మనమంతా చూశాం. ఈ సంఘటన మీద చంద్రబాబు న్యాయ విచారణకు ఆదేశించారని విన్నాను. ఆయన వైఖరిని చూసినప్పుడు నిజంగా ఆయన మనిషేనా అనిపిస్త్తుంది. ఈ ఇన్సిడెంట్‌కు కారణం ఎవరు? సరస్వతి ఘాట్ అని వీఐపీలకు ప్రత్యేకంగా కట్టారు. అక్కడ సాధారణ యాత్రికులకు అనుమతి లేదు. అక్కడ వీఐపీలు ఎంతసేపున్నా, ఏం చేసినా సాధారణ యాత్రికులకు ఏ ఇబ్బందీ ఉండదు. సామాన్యుల ఘాట్‌కు ఎందుకెళ్లావు? సీఎం హోదాలో బాబు వీఐపీ ఘాట్‌లో స్నానం చేసి ఉన్నా, అక్కడకు వెళ్లి గంటల తరబడి పూజలు చేసినా ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు. ఆయన ఏం చేశాడు? తానేం చేసినా పబ్లిసిటీకి ప్రాధాన్యం ఇస్తాడని అందరికీ తెలుసు. దాని కోసమే సరస్వతి ఘాట్‌కు వెళ్లకుండా పుష్కర ఘాట్‌కు వచ్చాడు. సీఎం రావడంతో యాత్రికులను లోనికి రానీయకుండా గేట్లన్నీ మూసేశారు. దాదాపు రెండున్నర గంటలపాటు భక్తులెవరూ నీళ్లలోకి దిగే అవకాశం లేకుండా చేశారు. దీంతో కిలోమీటర్ల పొడవునా భక్తులు కిక్కిరిసిపోయి ఒకరి మీద ఒకరు పడుతూ నరకం చూశారు.. వారు వెనక్కు వెళ్లేందుకు మార్గాల్లేవు. రెండున్నర గంటలపాటు అక్కడే నిలువు కాళ్లపై వేచి ఉండాల్సి వచ్చింది. తర్వాత బాబు తన పూజలు అయిపోయాయి.. జనాల్ని వదిలేయండని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. ఆయన బయల్దేరిన తర్వాత.. గేట్లను ఒకేసారి తెరవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ 27 మంది చనిపోయారని తెలిసింది. ఈ సంఖ్య పెరిగే పరిస్థితి ఉందంటున్నారు. న్యాయ విచారణ కాదు.. జైల్లో పెట్టాలి.. ఈ ఘటనపై న్యాయ విచారణ కావాలా? దీనికి ఎవరు బాధ్యులో తెలియదా? న్యాయవిచారణ కాదు.. బాబును వెంటనే జైల్లో పెట్టాలి. బాధ్యతగల సీఎం స్థానంలో ఉండి నువ్వు చేసింది ఏమిటి? వీఐపీ ఘాట్‌లో నువ్వు పూజలు ఎందుకు చేసుకోలేదు? ఆ ఘాట్‌ను వదిలిపెట్టి పబ్లిసిటీ కోసం పుష్కర ఘాట్‌కు వచ్చావ్. వేలాది మంది ప్రజలను లైన్లో నిలబెట్టి రెండుగంటలపాటు ఒకరి మీద ఒకరు పడేటట్టుగా చేసి వెనక్కిపోయే పరిస్థితి లేకుండా చేశావ్. తర్వాత ఒక్కసారిగా గేట్లు ఎత్తివేయిం చి తోపులాటకు కారణమయ్యావ్. ఇంతమంది చావుకు చంద్రబాబు కారణం కాదా? మళ్లీ న్యాయువిచారణ ఎందుకు? మళ్లీ అధికారులను బకరాలను చేసి.. తాను చేసిన తప్పును అధికారులపై నెట్టేసి, వారి ఉద్యోగాలు ఊడబెరికేసి తాను మంచోడన్నట్టుగా బాబు తప్పించుకోడానికే ఈ న్యాయ విచారణా? అని ప్రశ్నిస్తున్నా. అంతా పబ్లిసిటీ కోసమే... రెండు రోజులుగా చంద్రబాబు ఇక్కడే ఉన్నాడు. ఏం చేశాడు? పైగా చివరకు ఎండోమెంట్ మినిస్టర్ నన్ను ఇన్వాల్వ్ చేయడం లేదు. ఏర్పాట్లలో నాకు స్థానం కల్పించడం లేదని అంటే మీ మంత్రులు ఏమన్నారు? సాక్షాత్తూ చంద్రబాబే ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఎండోమెంట్ మిని స్టర్ ఇన్వాల్వ్ అయితే ఏమిటి? కాకపోతే ఏమిటి? అని అన్నారు. చివరకు అంతా నేనే చేశాను.. పబ్లిసిటీ అంతా తనకే రావాలి.. అని ఎవరికీ బాధ్యతలు ఇవ్వకుండా రెండు రోజు లుగా ఇక్కడే ఉండి అన్నీ పర్యవేక్షిస్తూ ఆయనే చూసుకుంటున్నాడు. చివరకు ఆయనే ఈ చావులకు కారణమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా కిరాతకం బహుశా మరొకటి ఉండదేమో? దీనికి చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాలి. తనలో ఏమాత్రం మానవత్వం ఉన్నా పదవి నుంచి పక్కకు తప్పుకోవాలి. వెంటనే రాజీనామా చేసి కాశీకి పోయి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. చావులకు లెక్కగట్టే దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడే వస్తుంది. చంద్రబాబు మనిషే కాదు. దీనికి బాధ్యత వహించాల్సింది బాబు. తప్పుకోవాల్సిందీ ఆయనే. ఎవరో ఒకరిమీద నెపం నెట్టేసి తాను తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు, గాయపడినవారికి వైఎస్సార్సీపీ తోడుగా ఉంటుంది’ అని జగన్ అన్నారు. -
మహా పాపం
* పుణ్య పుష్కరాల్లో ఏపీ సర్కారు నిర్వాకం.. పుష్కరాల తొలిరోజే పెను విషాదం * రాజమండ్రి పుష్కర ఘాట్‌లో భారీ తొక్కిసలాట, 27మంది మృతి * 200 మందికి గాయాలు, మృతుల్లో 24 మంది మహిళలే * రాజమండ్రి పుష్కరఘాట్‌కు లక్షలాదిగా పోటెత్తిన భక్తులు * లఘు ప్రచార చిత్రం కోసం సామాన్యుల ఘాట్‌కు వచ్చిన బాబు * ఏపీ సీఎం కోసం రెండు గేట్లు మూసివేత * ఉదయం 4 గం॥నుంచి 8.20 వరకూ భక్తులకు అనుమతి నిరాకరణ * చంద్రబాబు వెళ్లాక ఒక గేటు ఒకవైపు తెరిచిన వైనం * దీంతో ఒక్కసారిగా తోసుకెళ్లిన భక్తులు * రెండు గంటలపాటు తొక్కిసలాట సాక్షి, రాజమండ్రి: గోదావరి పుష్కరాల తొలిరోజే మహావిషాదం... పుష్కరాల చరిత్రలో మునుపెన్నడూ జరగని ఘోర దుర్ఘటన... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంతులేని నిర్లక్ష్యానికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రచారయావకు 27మంది పుష్కర భక్తులు బలయ్యారు. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం... బారికేడ్లు, మంచినీరులాంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం... జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ప్రచారం, లఘు చిత్రంలో నటిం చడం మీదనే దృష్టిపెట్టడం... గంటల తరబడి నిరీక్షిస్తున్న లక్షలాది భక్తులకు ఒక్కసారిగా గేట్లు తెరవడం... పెనువిషాదానికి దారి తీసింది. రూ.1600 కోట్లు ఖర్చుపెట్టి కుంభమేళాను మించిన స్థాయిలో నిర్వహిస్తామన్న ప్రచారార్భాటమే తప్ప కనీసం బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో రాజమండ్రి పుష్కరఘాట్‌లో మంగళవారం ఉదయం జరి గిన తొక్కిసలాట భక్తుల ప్రాణాలను బలితీసుకుంది. లఘు ప్రచార చిత్రంలో ప్రజలు భారీగా కనిపించాలన్న ఉద్దేశంతో సీఎం వీఐపీ ఘాట్‌లో పుష్కరస్నానం చేయకుండా సామా న్య భక్తుల ఘాట్‌కు రావడంతో భక్తులు నాలుగైదు గంటలపాటు వేచి చూడాల్సి వచ్చింది. సీఎం కుటుంబం వెళ్లిపోగానే ఒక్కసారిగా గేట్లు తెరవడంతో... తెల్లవారుజాము నుంచీ వేచి ఉన్న ప్రజలు ఒక్కసారిగా తోసుకురావడంతో జరిగిన తొక్కిసలాట 27 మంది అమాయక ప్రాణాలను బలితీసుకుంది. మరో 200 మంది గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. చనిపోయినవారిలో 24 మంది మహిళలే ఉన్నారు. రాజమండ్రి పుష్కరఘాట్‌లో మంగళవారం ఉదయం పుష్కర స్నానాలు ప్రారంభంలోనే జరిగిన తొక్కిసలాటలతో రెండు గంటలపాటు పుష్కరఘాట్ భక్తుల ఆర్తనాదాలు, ఆవేదనలు, ఆక్రందనలతో మార్మోగింది. తొక్కిసలాటతో ఊపిరాడక కొందరు, మంచినీళ్లు అందక ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు మృతదేహాలుండగానే మరోవైపు తొక్కిసలాట జరి గింది. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూడడం మినహా భక్తులను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. రెండుగంటల తర్వాత గానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. సీఎం కోసం గేట్లు మూసేశారు పుష్కరాల ప్రారంభ ఘడియల్లోనే పుష్కరస్నానం చేయాలని లక్షలాదిమంది భక్తులు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు కోటగుమ్మం సెంటర్ ఘాట్‌కు చేరుకున్నారు. కానీ సీఎం కుటుంబం పుష్కర స్నానం చేశాకనే ప్రజలను అనుమతిస్తామంటూ అధికారులు గేట్లు తెరవలేదు. అప్పటికే ఘాట్ బయట కోటగుమ్మం సెంటర్ ఇసుకవేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. సీఎం చంద్రబాబు వీఐపీ ఘాట్‌లో పుష్కరస్నానాలు ప్రారంభించాల్సి ఉంది. అయితే పుష్కరాలకోసం తీసే ఓ లఘుచిత్రంలో భారీగా ప్రజలు కనిపించాలన్న ఉద్దేశంతో ఆయన ఉదయం 5.45 గంటలకు కుటుంబ సమేతంగా సామాన్య ప్రజలకోసం కేటాయించిన పుష్కరఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ లఘుచిత్రం యత్నాలు, పిండప్రదానాలు, పూజా కార్యక్రమాలు పూర్తయ్యేసరికి 8.20 గంటలైంది. భద్రతా కారణాలంటూ అప్పటివరకూ భక్తులను ఘాట్‌లోకి అనుమతించలేదు. 8.20 గంటలకు ముఖ్యమంత్రి పుష్కరఘాట్‌నుంచి బయటకు వచ్చి ప్రత్యేక బస్సులోకి వెళ్లారు. అప్పుడు పోలీసులు మొదటి గేటును కొద్దిగా తెరిచారు. తెల్లవారుఝామునుంచీ ఎదురుచూస్తున్న భక్తులు ఒక్కసారిగా తోసుకుని లోనికి వెళ్లడానికి ప్రయత్నించారు. గేటుకు రెండువైపులా నలుగురైదుగురు పోలీసులున్నా వారు భక్తులను నియంత్రించలేకపోయారు. దీంతో తొక్కిసలాట మొదలైంది. గేటువద్ద ఒక కుప్పలాగా కొందరు పడిపోయారు. వారిని బయటకు లాగేందుకు కొందరు ప్రయత్నించినా బయటినుంచి జనం తోసుకొచ్చేస్తుండటంతో సాధ్యం కాలేదు. మరోవైపు తొక్కిసలాట జరుగుతూనే ఉంది. మరికొందరు పడిపోతూనే ఉన్నారు. ఈ తొక్కిసలాటను ఆపేందుకు పోలీసులు ముందుకు రాకపోగా తామేం చేయలేమని చేతులెత్తేశారు. చివరకు స్నానం చేసేందుకు అప్పటికే లోనికెళ్లిన కొందరు యువకులు, ఆక్టోపస్ పోలీసులు కుప్పగా పడి ఉన్న భక్తులను కాపాడేందుకు ముందుకు వచ్చారు. మీకేం సంబంధం, మీరెందుకు వచ్చారంటూ సివిల్ పోలీసులు వారిని అడ్డగించి కొట్టారు. అయినప్పటికీ వారు పట్టువిడవకుండా కొందరిని ఘాట్ లోపలికి, కొందరిని ఘాట్ బయటకు లాగారు. వారిలో కొందరు అప్పటికే ప్రాణాలు కోల్పోగా... కొందరిలో చలనం కనిపించలేదు. తొక్కిసలాటతో ఊపిరాడక, మంచినీళ్లు అందక ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. స్పృహ కోల్పోయిన వారికి అందించేందుకు మంచినీళ్లు కూడా కరువయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి అదనపు డీజీ ఆర్పీ ఠాకూర్, ఏలూరు రేంజి డీఐజీ హరికుమార్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని రెండు గేట్లను పూర్తిగా తెరిచి కొంతమంది పోలీసులను రంగంలోకి దింపారు. ఆ సమయంలోనూ భక్తులను నియంత్రించడం సాధ్యం కాకపోగా డీఐజీ హరికుమార్ చొక్కా చిరిగిపోయింది. రెండుగంటలపాటు ఇదే విధమైన పరిస్థితి కొనసాగింది. ఎట్టకేలకు 10:30 గంటలకు కొంతవరకూ భక్తులను అదుపు చేయగలిగారు. ఆ తర్వాత ఘాట్ లోపల, బయట ఉన్న మృతదేహాలను, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో రెండో గేటు వద్ద తొక్కిసలాట మొదలైంది. మరికొందరు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. ఆ తర్వాత వారిని ఆంబులెన్సుల్లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. దుర్ఘటనకు కారణాలివీ? 1. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్నానమాచరించడానికి భక్తులను ఉదయం 4 గంటల నుంచి 8.20 వరకు ఆపేయడం. 2. వీఐపీ ఘాట్‌లో కాకుండా లఘుచిత్రం చిత్రీకరణ కోసం సీఎం పుష్కరఘాట్ లోస్నానం చేయడం. 3. జాతీయ, అంతర్జాతీయ చానళ్లల్లో జనసందోహం భారీగా కనిపించేందుకు భక్తులందరినీ పుష్కరఘాట్‌కు మళ్లించడం. 4. భక్తుల భద్రత గాలికొదిలేసి ఉన్నతాధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది సీఎం కోసం పనిచేయడం. 5. ప్రజల్ని ఇతర ఘాట్లకు వెళ్లేలా అప్రమత్తం చేసేందుకు నియమించిన ప్రైవేటు కాంట్రాక్టరు చేతులెత్తేయడం. 6. మంత్రులు, ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు బారికేడ్ల పొడవును తగ్గించడం. 7. దుర్ఘటన ప్రాంతంలో ప్రాథమిక చికిత్స సౌకర్యం, మంచినీరు, అంబులెన్సు, సహాయక సిబ్బంది లేకపోవడం. 8. భారీ ఉత్సవాలు, వేడుకలు జరగడానికి ముందు చేయాల్సిన కసరత్తు (రిహార్సల్స్, మాబ్ మేనేజ్మెంట్) లోపించడం. లక్షల మందిని వదిలి సీఎంకే ప్రాధాన్యం పుష్కరాల బందోబస్తుకోసం రాజమండ్రిలో 22వేల మందికి పైగా పోలీసులను దింపినా పుష్కరాలు ప్రారంభమయ్యే సమయానికి వారికి డ్యూటీలు వేయలేదు. చంద్రబాబు పర్యటనకు మాత్రమే పోలీసులను ఎక్కువగా ఉపయోగిస్తూ మిగిలిన వారిని తర్వాత డ్యూటీలు వేస్తామని చెప్పారు. గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలోనే ఉండడంతో రైళ్లలో దిగిన వారంతా కోటిలింగాల ఘాట్‌లోకి రావడానికి ప్రయత్నించారు. దీంతో లక్షలాది మంది జనం గోదావరి స్టేషన్ నుంచి పుష్కరఘాట్ ఉన్న కోటగుమ్మం సెంటర్‌వరకూ నిలబడ్డారు. ఆ సమయంలో పక్కనే ఉన్న కోటిలింగాల ఘాట్, సమీపంలోని ఘాట్లన్నీ ఖాళీగా ఉన్నా భక్తులను అటువైపు మళ్లించేందుకు అక్కడ అధికారులెవ్వరూలేరు. మరోవైపు వీఐపీలు స్నానం చేయాల్సిన సరస్వతిఘాట్‌ను వదిలి ముఖ్యమంత్రి, ఆయన కుటుంబసభ్యులు సామాన్యభక్తులకు కేటాయించిన కోటిలింగాల ఘాట్‌కు వచ్చారు. వారికోసం తెల్లవారుజాము నాలుగు గంటలనుంచి ఉదయం 8.20 గంటలవరకూ ఆ ఘాట్‌లోకి ఎవ్వరినీ అడుగుపెట్టనీయలేదు. లక్షల మంది జనం ఉన్నచోటుకు సీఎం, ఆయన కుమారుడి కోసం రెండు బస్సులు, కాన్వాయ్‌ను అనుమతించారు. దీంతో వచ్చిన భక్తులు కోటిలింగాల ఘాట్‌కు వెళ్లే మార్గం మూసుకుపోయింది. భక్తులను నియంత్రించడం పోలీసులకు కష్టమైపోయింది. పుష్కరఘాట్‌లో దాదాపు మూడు గంటలు గడిపాక ముఖ్యమంత్రి వెళ్లిపోగానే ఆయనకు భద్రతగా వచ్చిన పోలీసులు కూడా పక్కకు వెళ్లిపోయారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట మొదలై 27మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆక్టోపస్ ఇతర విభాగాలు, తమిళనాడు పోలీసులున్నా వారికి భాష అర్థంకాక ఏమీ చేయలేకపోయారు. తొక్కిసలాట తర్వాత మంచినీళ్లు కూడా అందకపోవడంవల్ల కొందరు మృతి చెందారు. మరోవైపు ఘాట్ల వద్ద అనారోగ్యంతో ముగ్గురు మృతిచెందారు. -
మహా పుష్కరం.. మహా విషాదం
గోదావరి మహా పుష్కరాల తొలిరోజే రాజమండ్రి లో జరిగిన తొక్కిసలాటలో 20 మందికి పైగా భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. బాధ్యు లెవరైనప్పటికీ ఇది మానవ వైఫల్యానికి చెల్లించాల్సి వచ్చిన మూల్యం. మన దేశంలో సామూహిక ఉత్స వాలెంత సుప్రసిద్ధమైనవో, సమూహ నిర్వ హణ వైఫల్యాలూ అంతే ఘనమైనవి. కనుకనే ఒకదాని వెంట మరో విషాదాన్ని లెక్కపెట్టు కుంటూ కూచోవాల్సిన దుస్థితి, క్షంతవ్యం గాని వైఫల్యాల నుంచి సైతం ఏమీ నేర్చుకో లేని ఉదాసీనత మన సంస్కృతిలో భాగంగా మారాయి. గోదావరి పుష్కరాల నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టే కనిపించింది. భారీగా నిధులనూ కేటాయించింది. సకల సౌకర్యాలూ, ఏర్పాట్లూ సమకూరుస్తున్నట్టే భరోసా కల్పించింది. ముఖ్యమంత్రి స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నా మన్నారు. విస్తృత ప్రచారంతో ప్రజలను ఆహ్వానిం చారు. ఏం లాభం? సమూహ నిర్వహణకు వచ్చేస రికి ఆదిలోనే ఘోర వైఫల్యం, మహా విషాదం ఎదుర య్యాయి. రాజమండ్రికి ఈ స్థాయిలో ప్రజలు తరలి వస్తారనేది ఊహించనిది కాదు. వందల మంది చేరి తేనే తొక్కిసలాట, ప్రాణ నష్టం మనకు కొత్త కాదు. అలాంటప్పుడు లక్షల మంది గుమిగూడే సందర్భా నికి తగిన సన్నాహాలు, సంసిద్ధత ఏ స్థాయిలో ఉం డాలి? పుష్కర ఘాట్ల ప్రవేశ, నిర్గమన మార్గా ల్లో జనాల నియంత్రణకు తగిన ఏర్పాట్లు, మార్గనిర్దేశన ఉన్న దాఖలాలే లేవు. పైగా గం టల తరబడి తొక్కిసలాటలో నిలచిన భక్తులకు మంచినీటి వసతైనా కల్పించలేని అసమర్థతను ఏమనాలి? ఇంతటి ఘోర విషాదం తర్వాతైనా ప్రభు త్వం, అధికారయంత్రాంగం పాఠాలు నేర్చి మిగతా 11 రోజులైనా పుష్కరాలు సజావుగా సాగేలా సరైన చర్యలు చేపట్టాలి. భక్తుల ప్రాణాలు గాలిలో దీపా లుగా మారకూడదనుకుంటే ప్రభుత్వం తక్షణమే విప త్తు నిర్వహణ యంత్రాంగం సేవల్ని వినియోగించు కుని తగు చర్యలను చేపట్టాలి. - డా॥డి.వి.జి. శంకరరావు మాజీ ఎంపీ, పార్వతీపురం, విజయనగరం జిల్లా -
కోటగుమ్మంలో మృత్యు ఘోష
పవిత్ర గోదావరి పుష్కరాల ప్రారంభం రోజునే రాజమండ్రిలో తీవ్ర తొక్కిసలాట జరిగి 29 మంది ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమైనది. నగరంలోని కోటగుమ్మం స్నానఘట్టం వద్ద బుధవారం ఉదయం జరిగిన ఈ తొక్కిసలాట ఎన్నో కుటుంబాల్లో పెను విషాదం మిగిల్చింది. పలువురిని ఆస్పత్రులపాలు చేసింది. ఘటనకు దారితీసిన పరిస్థితులను గమనిస్తే ప్రభుత్వ యంత్రాంగంలోని అలసత్వమూ, నిర్లక్ష్యమూ కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. పుష్కరాలపై ఇన్ని నెలలుగా సాగుతున్నదంతా ప్రచారార్భాటమేనని అర్థమవుతుంది. ఈ విషాదం సంభవించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలోనే ఉన్నారు. నిజానికి ఆయన కోసం నాలుగు గంటలపాటు భక్తులను నిలిపి ఉంచిన కారణంగానే జనసందోహం అంతకంతకు పెరిగిపోయి ఈ స్థితి ఏర్పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులతో తెల్లారుజామున 4.30 గంటలనుంచి స్నానాల కోసం నిరీక్షిస్తున్నవారిని నాలుగు గంటలు ఆపేయడమే తప్పనుకుంటే... వారందరినీ చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు వెళ్లిన వెంటనే ఒకేసారి స్నానఘట్టానికి అనుమతించడం మరింత నేరం. ఆ స్నానఘట్టం వద్ద ఒకే ఒక్క ప్రవేశ ద్వారం ఉన్నదంటేనే ఏర్పాట్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో తెలుస్తుంది. ఈ తొక్కిసలాట జరుగుతున్న సమయానికి ఇంకా కోట గుమ్మం సెంటర్లోనే ఉన్న చంద్రబాబు కాన్వాయ్‌కు ఒక మహిళ అడ్డుపడి ఆ ఉదంతాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనంలేకపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అప్పుడు డీజీపీపైనా, ఉన్నతాధికారులపైనా బాబు మండిపడటం వల్ల కలిగే ప్రయోజనమేమిటో అర్థంకాదు. పాలనలో తనకు అపారమైన అనుభవమున్నదని తరచు చంద్రబాబు చెప్పుకుంటారు. క్రితం పుష్కరాల సమయానికి ఆయనే సీఎంగా ఉన్నారు. ఆ అనుభవమంతా ఇప్పుడు ఏ గంగలో కలిసిందో మరి. సామాన్య పౌరులు స్నానం చేసే చోటికే తానూ వెళ్తే సామాన్యులకు ఇబ్బందులు తలెత్తవచ్చునని ఆయన ఆలోచించలేకపోయారు. పన్నెండేళ్లకొక పర్యాయం వచ్చే పుష్కరాలు తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైనవనీ... పుణ్య స్నానాలాచరించడానికీ, మరణించిన ఆప్తులకు పితృ కర్మలు నిర్వర్తించడానికీ నలుమూలలనుంచీ లక్షలమంది వస్తారని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియనిది కాదు. తానే పుష్కరాలపై కొన్ని నెలలుగా ప్రచారం చేస్తున్నది కనుక అందుకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేసుకుని ఉండాలి. ఆ ఏర్పాట్లలో నిమగ్నం కావడానికి ముందు ఇంతటి జనసందోహం ఒకచోటకు చేరుతున్నప్పుడు రాగల సమస్యలేమిటన్న విషయంలో అంచనా ఉండాలి. భక్తి ప్రపత్తులతో వచ్చేవారికి కల్పించాల్సిన కనీస భద్రతపై దృష్టి పెట్టాలి. అవేమీ లేవు సరిగదా... కనీసం అక్కడున్నవారికి మంచినీటి సౌకర్యం కూడా లేదు. తొక్కిసలాట సమయంలో తీవ్రంగా గాయపడినవారు గుక్కెడు నీళ్లిమ్మని రోదిస్తున్నా చుట్టు పక్కల ఎక్కడా మంచినీరు లేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అలా నీళ్లు అందించగలిగి ఉంటే వారిలో కొందరి ప్రాణాలైనా కాపాడటం సాధ్యమయ్యే దంటున్నారు. మంచినీళ్ల సంగతలా ఉంచి ఆ దరిదాపుల్లో అంబులెన్స్లుగానీ, వైద్య నిపుణుల జాడగానీ లేదంటే ఏర్పాట్లు ఎంత అస్తవ్యస్థంగా ఉన్నాయో తెలుస్తుంది. గాయపడినవారిని కొంత దూరం వరకూ మోసుకెళ్లాల్సివచ్చిందని కొందరు చెబుతున్న తీరు చూస్తే రాజమండ్రిలో ప్రభుత్వమనేది ఉన్నదా అనే అనుమానం కలుగుతుంది. ప్రజల భక్తివిశ్వాసాలను గౌరవించడం, ప్రభుత్వపరంగా అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ, రాజమండ్రిలో స్నానం చేస్తేనే పుణ్యం లభిస్తుందన్న స్థాయిలో ప్రచారం చేయడం సబబేనా? పోనీ అలా ప్రచారం చేసిన ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేయగలిగిందా? ముఖ్యమంత్రి కొందరు మంత్రుల్ని తీసుకుని జపాన్ పర్యటనకెళ్తే... మిగిలిన మంత్రుల్లో కొందరు తానా సభల కోసమంటూ అమెరికా వెళ్లారు. బీజేపీ నేత, దేవాదాయ మంత్రి మాణిక్యాలరావుకు ఈ పుష్కర పనుల్లో ప్రమేయం కల్పించాల్సి ఉన్నా ఆయన సేవలు వినియోగించుకోలేదంటున్నారు. ఆయన వరకూ ఎందుకు... బీజేపీకి చెందిన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకు కూడా బాధ్యతలు అప్పగించలేదని చెబుతున్నారు. ఏతావాతా అక్కడ దిక్కూ మొక్కూ లేదు. పుష్కరాల ముహూర్తం ఆగమించే సమయానికి వారం ముందు వచ్చి చంద్రబాబు హడావుడి చేశారు. ఇంకా ఏర్పాట్లేవీ పూర్తికాలేదా అంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. కనీసం అప్పుడైనా కళ్లు తెరిచి ఇలాంటి పరిస్థితుల్లో రాజమండ్రికి అసంఖ్యాకంగా భక్తులు రావడం శ్రేయస్కరం కాదన్న ఆలోచన చేసి ఉండాల్సింది. పుష్కరాలపై జనంలో ఉండే భక్తి విశ్వాసాలన్నీ తమ పార్టీకే లబ్ధి చేకూర్చాలనీ... పుష్కర పనులైనా, అందుకు సంబంధించిన పథకాలైనా తమవారికే దక్కాలనీ చంద్రబాబు భావించిన పర్యవసానంగానే... ఎవరినీ కలుపుకొని వెళ్లలేని ఆయన అశక్తతే ఇంతమంది ప్రాణాలు తీసింది. విపరీతమైన జనసమ్మర్థం ఒకచోట చేరినప్పుడు తొక్కిసలాటలుండవచ్చుననడానికి గతంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని నయనాదేవి ఆలయంవద్ద, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న చాముండేశ్వరి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలే రుజువు. అలాగే.. అలాంటి దురదృష్ట ఘటన లకు చోటీయని శ్రావణబెళగొళ, వైష్ణోదేవి, స్వర్ణాలయంవంటివి ఉన్నాయి. వీటన్ని టినీ అధ్యయనం చేసి ఉంటే కోటగుమ్మం ఘటన జరిగి ఉండేది కాదు. నదీ స్నానాని కొచ్చినవారిని సురక్షితంగా తిరిగి వారి వారి ఇళ్లకెళ్లేలా చేయలేక పోవడమంటే... అది నిర్లక్ష్యం మాత్రమే కాదు-క్షమించరాని నేరం. అది అసమర్థత మాత్రమే కాదు- అమానుషత్వం. న్యాయవిచారణకు ఆదేశించి ఈ నేరాన్ని కప్పిపుచ్చుకోవడం, ఈ అమానుషత్వాన్ని దాచివుంచడం చంద్రబాబుకు సాధ్యం కాదుగాక కాదు. -
బాబుపై గుడివాడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు
కృష్ణా(గుడివాడ): గోదావరి పుష్కరాల్లో భక్తుల మృతికి కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ నేతలు కృష్ణా జిల్లా గుడివాడ వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం రాత్రి ఆ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు కె.ఎన్.రాజా ఈ మేరకు ఎస్.ఐ. సోమేశ్వరరావుకు ఫిర్యాదు అందజేశారు. రాజా వెంట పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు, ఎం.వి.నారాయణరెడ్డి, పలువురు కౌన్సిలర్లు ఉన్నారు. -
'నేనే సీఎం అయితే వెంటనే రాజీనామా చేస్తా'
ఎంవీపీకాలనీ (విశాఖపట్నం): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నిర్లక్ష్యధోరణి వల్లే 29 మంది భక్తులు మృతి చెందారని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయుకుడు బొత్ససత్యనారాయణ విమర్శించారు. ఆయన మంగళవారం ఒక కార్యక్రమంలో పుష్కరాల సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉంటే వెంటనే రాజీనామా చేసేవాడినన్నారు. పబ్లిసిటీ కోసం కటౌట్లు పెట్టి ఆర్భాటాలు చేశారేతప్పా, ప్రజల కోసం ఏ పనీ చేయలేదని ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. రూ. 1600 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు ప్రకటించిన చంద్రబాబు భక్తులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదన్నారు. కనీసం డాక్టర్ కాని నర్సు కాని కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. తాగటానికి భక్తులకు మంచినీరు సదుపాయం కూడా కల్పించలేదని ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. ఘటన దృశ్యాలు చూస్తుంటే గుండె తరుక్కు పోతుందన్నారు. తొక్కిసలాట ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. -
జయ జయ గోదావరి
* తెలుగు రాష్ట్రాల్లో పుష్కర శోభ * తెలంగాణలో ఉదయం 6.21, ఏపీలో 6.26 గంటల నుంచి పుష్కర సంరంభం * 12 రోజులపాటు జనసంద్రం కానున్న గోదావరి తీరం * పుణ్యస్నానాలు ఆచరించేందుకు తండోపతండాలుగా తరలివెళ్తున్న భక్తులు * కుటుంబ సమేతంగా ధర్మపురికి చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ * భద్రాచలంలో పుష్కరాలు ప్రారంభించనున్న చినజీయర్ * రాజమండ్రిలో పుణ్యస్నానం చేసి ప్రారంభించనున్న జయేంద్ర సరస్వతి * అనంతరం అక్కడే స్నానమాచరించనున్న ఏపీ సీఎం చంద్రబాబు (రాజమండ్రిలో సోమవారం రాత్రి గోదావరికి హారతి ఇస్తున్న దృశ్యం) అమృత ఘడియలు వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాలకు పుష్కర శోభను తెచ్చాయి. పవిత్ర గోదావరి తీరం భక్తజన సంద్రమైంది. తెలంగాణలో బాసర నుంచి భద్రాచలం వరకు, ఆంధ్రప్రదేశ్‌లో పట్టిసీమ నుంచి అంతర్వేది వరకు తీరం యావత్తూ జయజయ ధ్వానాలతో మార్మోగుతోంది. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తొలి పుష్కరాలు కావడం, అందునా 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే మహా పుష్కరాలు కావడంతో జనం పెద్దఎత్తున పవిత్ర స్నానాలకు తరలి వెళ్తున్నారు. తెలంగాణలో మంగళవారం ఉదయం 6.21 గంటలకు, ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 6.26 గంటలకు దేవ గురువు బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించే సమయాన గోదావరిలో పుణ్యస్నానాలు ప్రారంభం కానున్నాయి. ధర్మపురిలో పుష్కర స్నానానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం సాయంత్రమే కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాజమండ్రి పుష్కరఘాట్‌లో సకుటుంబంగా పుష్కర స్నానం ఆచరిస్తారు. తెలంగాణలో.. తెలంగాణలో ప్రముఖ క్షేత్రాలకు సోమవారం రాత్రి నుంచే భక్తుల రాక మొదలైంది. తొలిరోజు పది లక్షల మంది నదీ స్నానం ఆచరిస్తారని అంచనా. తెలంగాణ తొలి పుష్కరాలు కావటంతో వీటిని కుంభమేళా తరహాలో నిర్వహించాలని ప్రభుత్వం భావించి విస్తృత ప్రచారం నిర్వహించింది. కానీ గోదావరిలో నీటి ప్రవాహం లేకపోవటంతో భక్తుల్లో నిరాశ నెలకొంది. వరుణుడు కరుణించకపోవటంతో జలకళ లేక చాలాచోట్ల ఘాట్లు వెలవెలబోతున్నాయి. మహారాష్ట్ర ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై పెట్టుకున్న ఆశలూ ఆవిరయ్యాయి. దీంతో ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోని నీటి విడుదలతోనే సరిపుచ్చాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకుంది. అవి కూడా అంతంత మాత్రమే కావటంతో పుష్కర ఘాట్ల వరకు నీళ్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. బాసర నుంచి భద్రాచలం వరకు ఒక్క కాళేశ్వరం వద్ద మాత్రమే ఘాట్ల వరకు నీళ్లున్నాయి. సీఎం స్నానం ఆచరించనున్న ధర్మపురిలో ఘాట్ల నుంచి 10 మీటర్లు వెళ్లిన తర్వాతే నీళ్లున్నాయి. కాళేశ్వరంలో వసతులేవీ?: పుష్కలంగా నీళ్లున్న త్రివేణి సంగమ ప్రాంతమైన కాళేశ్వరంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. సోమవారం రాత్రి వరకు ఇక్కడికి దాదాపు 3 వేల మంది భక్తులు చేరుకున్నారు. వారికి సరైన వసతి లేదు. దేవాలయ నిర్వాహకులు సాధారణ టెంట్లు వేయటంతో వాటి కిందే సేద తీరారు. భద్రాచలం కళకళ: మిగతా క్షేత్రాలతో పోలిస్తే భద్రాచలం భక్తులతో కళకళలాడుతోంది. సోమవారం రాత్రి వరకు ఇక్కడికి పది వేల మంది వరకు భక్తులు చేరుకున్నారు. ఉదయం 6.21 సమయంలో త్రిదండి చినజీయర్ స్వామి ఇక్కడ స్నానమాచరించి మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావుతో కలసి పుష్కరాలను ప్రారంభిస్తారు. అయితే ఇక్కడ కూడా ఘాట్ల వద్ద నీళ్లు లేవు. 10 మీటర్ల మేర బురదలో నడిచి నీటి వద్దకు చేరుకోవాల్సిన పరిస్థితి. భద్రాచలానికి సమీపంలోని తారపాక వద్ద నాగ సాధువుల కోసం ఏర్పాటు చేసిన పందిళ్లు గాలివానతో కూలిపోయాయి. బాసర వెలవెల: దాదాపు లక్ష మంది వరకు పుణ్యస్నానాలు ఆచరిస్తారని భావిస్తున్న బాసర వెలవెలబోతోంది. నదిలో ప్రవాహం తక్కువగా ఉండటంతో భక్తులు ఇక్కడికి రావటానికి ఉత్సాహం చూపటం లేదు. రోజువారీ భక్తులు తప్ప సోమవారం రాత్రి వరకు ఇక్కడికి అదనంగా ఎవరూ రాలేదు. వరంగల్‌లో రామన్నగూడెం, ముళ్లకట్ట, మంగపేట వద్ద ఘాట్లకు దూరంగా ప్రవాహం ఉంది. హైదరాబాద్ నుంచి అంతంతే: తొలి రోజు పుణ్యస్నానాల కోసం హైదరాబాద్ నుంచి భారీగా భక్తులు తరలుతారని ఆశించినప్పటికీ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, వరంగల్ వైపు ఏమాత్రం డిమాండ్ లేకపోవటంతో ప్రత్యేక బస్సుల జోలికి వెళ్లలేదు. భద్రాచలం వైపు మాత్రం 30 ప్రత్యేక బస్సులు నడిపారు. మంగళవారం నుంచి రద్దీ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇబ్బంది లేకుండా చూడండి: సీఎం పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పుష్కరాల్లో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రం ధర్మపురికి వచ్చిన సీఎం పుష్కర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. - సాక్షి, హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లో.. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి తీరం భక్తజనంతో పోటెత్తనుంది. పుష్కరాలు జరిగే 12 రోజులూ నదిలో దాదాపు నాలుగున్నర కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని అంచనా. ఎక్కడెక్కడి నుంచి వచ్చేవారితో ఉభయగోదావరి జిల్లాల్లోని ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి సంకల్ప సహితంగా రాజమండ్రి వీఐపీ ఘాట్‌లో పుష్కర స్నానం చేసి పుష్కరాలు ప్రారంభమైనట్టు ప్రకటిస్తారు. సరిగ్గా ఇదే సమయానికి కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో కంచిపీఠం ఉత్తరాధికారి విజయేంద్ర సరస్వతి పుష్కర స్నానం ఆచరించనున్నారు. రాజమండ్రి పుష్కరఘాట్‌లో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో పుష్కర స్నానం ఆచరిస్తారు. దేదీప్యమానంగా గోదావరి తీరం రాజమండ్రి వద్ద గోదావరి తీరాన్ని విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా తీర్చిదిద్దారు. పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో పచ్చదనం ఉట్టిపడేలా ప్రధాన పుష్కర ఘాట్లకు వెళ్లే రోడ్లతోపాటు, ప్రధాన కూడళ్లను మొక్కలతో తీర్చిదిద్దారు. ఘాట్లలో ఆశించిన స్థాయిలో నీరు లేకపోవడంతో సీలేరు నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. సీలేరు బేసిన్ నుంచి 10వేల క్యుసెక్కులు నీటిని సోమవారం విడుదల చేశారు. పీఠాధిపతుల రాక.. తొలి పుష్కర స్నానమాచరించేందుకు కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి శంకర విజయేంద్రసరస్వతి, మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామి, త్రిదండి అహోబిల జీయర్‌స్వామి రాజమండ్రికి చేరుకోగా, మరికొంత మంది పీఠాధిపతులు, స్వామీజీలు మంగళవారం చేరుకోనున్నారు. ఆర్ఎస్ఎస్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ మంగళవారం ఉదయం 10 గంటలకు రాజమండ్రి వీఐపీ ఘాట్‌లో స్నానమాచరించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు లాలాచెరువు వద్ద లక్ష మందితో ఏర్పాటు చేసిన సంకల్ప సభలో ప్రసంగించనున్నారు. అట్టహాసంగా నిత్యహారతి అఖండ పుష్కరజ్యోతి యాత్ర రాజమండ్రి చేరుకున్న సందర్భంగా గోదావరి నదికి చంద్రబాబు సమక్షంలో సోమవారం రాత్రి ఇచ్చిన నిత్యహారతి అట్టహాసంగా జరిగింది. పుష్కర ఘాట్‌లో మెట్లపై హారతి ఇవ్వాల్సి ఉండగా.. గోదావరిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పంటుపై నుంచి హారతి ఇచ్చారు. ఘాట్‌పై నుంచి కాకుండా సీఎం కోసం పంటుపై నుంచి హారతులు ఇవ్వడంతో ఈ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరగలేదని భక్తులు ఆక్షేపిస్తున్నారు. అనంతరం గోదావరి ప్రాశస్త్యాన్ని లేజర్‌షో ద్వారా చూపించారు. - సాక్షి, రాజమండ్రి, కొవ్వూరు, హైదరాబాద్ ఏపీలో అట్టహాసంగా పుష్కర శోభాయాత్ర ద్వారకాతిరుమల: గోదావరి పుష్కరాల శోభాయాత్ర అట్టహాసంగా మొదలైంది. శోభాయాత్రను ద్వారకాతిరుమలలోని చినవెంకన్న సన్నిధి వద్ద ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు మాణిక్యాలరావు, పీతల సుజాత సోమవారం ప్రారంభించారు. రాజమండ్రిలో శ్రీవారి నమూనా ఆలయం సాక్షి, రాజమండ్రి: పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తిరుమల వేంకటేశ్వరస్వామి నమూనా ఆలయాన్ని సోమవారం ప్రారంభించారు. టీటీడీ ఆధ్వర్యంలో మున్సిపల్ స్టేడియంలో నిర్మించిన ఈ ఆలయంలో శ్రీవారి విగ్రహ ప్రతిష్ఠ సోమవారం ఉదయం జరిగింది. ఉదయం ఆరు నుంచి రాత్రి 10.30 గంటల వరకూ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. -
పుష్కర స్నానాలతో పునీతులుకండి
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గోదావరి పుష్కర స్నానాలు చేసి పునీతులు కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ప్రతి ఒక్కరూ గోదారమ్మ తల్లికి పూజలు చేసి.. వారి మనసులోని కోర్కెలు తెలిపి వాటిని నెరవేర్చుకోవాలని సూచించారు. సోమవారం ఆయన బంజారాహిల్స్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బుధవారం కుటుంబ సమేతంగా తాను భద్రాచలంలో పుష్కర స్నానం చేయనున్నట్లు చెప్పారు. గోదావరికి ఈ ఏడాది జరిగేవి మహా పుష్కరాలని, ఇవి 144 ఏళ్లకు ఒకసారి వస్తాయని చెప్పారు. పన్నెండేళ్లకు వచ్చే మామూలు పుష్కరాల కన్నా ఇప్పుడు జరుగుతున్న పుష్కరం ఎంతో ముఖ్యమైందని తెలిపారు. దేశం సుభిక్షంగా ఉండేలా చేయాలని ప్రజలందరూ గోదారమ్మ తల్లిని ప్రార్థించాలని పొంగులేటి చెప్పారు. నదీమ తల్లికి పుష్కరం వచ్చిందంటే ఆ 12 రోజులూ 12 పర్వదినాలతో సమానమన్నారు. పుష్కర కాలంలో నదీస్నానం చేయడం ఎంతో పుణ్యదాయకమని, నిజ ఆషాఢంలో పితరుల సంస్మరణార్థం శ్రార్ధకర్మలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తే చాలా మంచిదని పొంగులేటి చెప్పారు. పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించాలని ప్రతి తెలుగువారినీ కోరుకుంటున్నానని చెప్పారు. -
రామాయణ రహస్యం తెలిసిన నది
ఎన్నో నదీ తీరాలను చూసిన, అక్కడ వసించిన రాముడు మనసారా ‘గోదావరీ రమ్యా’ అని సంభాషించడం గోదావరి వరిష్ఠతకు నిదర్శనం. రాముడు మెచ్చిన నది గోదావరి. అది ఆంధ్రదేశంలో అధిక భాగం ఉండడం ఆంధ్రుల పుణ్యం. సీత గంగాతీరంలో తన వనవాసాన్ని గడుపుతుంది. భర్త తోడు లేకుండా గడుపుతుంది. గోదావరి తీరంలో అలా కాదు. ఒక పుష్కరకాలం పైగా సీతారాములు అన్యోన్యంగా కలసిమెలసి ఉన్నారు. నాటి జనపదాల్లోని, నేటి తెలుగుదేశ భాగంలోని పెద్ద నదుల్లో గోదావరి గొప్పది. రామాయణంలో మొదటిసారిగా అరణ్యకాండలో గోదావరి దర్శనమిస్తుంది. సీతారామలక్ష్మణులు చిత్రకూటం నుంచి బయలుదేరి అగస్త్యాశ్రమానికి వస్తారు. నివాసానికి ఏదైనా ఉత్తమమైన ప్రదేశాన్ని సూచించమని అభ్యర్థిస్తారు. అప్పుడు అగస్త్యుడు ‘రామా! ఇక్కడకు సమీపంలో పంచవటి అనే రమ్యమైన ప్రదేశం ఉంది. ఆ పంచవటీ ప్రాంతం పక్కనే గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది..., అని చెప్తాడు. సీతారామలక్ష్మ ణులు పంచవటి చేరుకున్నారు. ఆ సందర్భంలో రాముడు ‘ఇయం గోదావరీ రమ్యా పుష్టితై స్తరుభిర్వృతా/ హంస కారండ వాకీర్ణ చక్రవాకోప శోభితా/ నాతి దూరే న బాసన్నే మృగ యూధ పీడితా’ అంటాడు. ఆ నదిని చూడగానే రాముని అనుభూతి ఇదే. అంటే- ‘ఇదే రమ్యమైన గోదావరీ నది. ఒడ్డునే విరగపూచిన చెట్లతో నిండి ఉంది. హంసలు, కారండవాలు, చక్రవాకాలు వంటి జలపక్షులతో శోభిస్తోంది. ఆ నది మనకు మరీ దూరంగానూ లేదు, దగ్గరగానూ లేదు. ఈ ప్రదేశంలో లేళ్లు మందలు మందలుగా నిర్భయంగా తిరుగుతున్నాయి.’ సహసీత, సహానుజంగా రాముడు గోదావరిలో స్నానం చేశాడు. భక్తితో దేవత లకు, పితృదేవతలకు తర్పణాలు సమర్పించారు. ఉదయిస్తున్న సూర్యభగవానునికి నమస్కరించారు. సర్వదేవతలను స్తోత్రం చేశారు. ఆ సమయంలో సీతతో లక్ష్మణునితో కూడి ఉన్న శ్రీరాముడు గంగానదిలో స్నానం చేసి పార్వతితో నందితో ప్రకాశిస్తున్న శివునిలా ఉన్నాడంటాడు వాల్మీకి. ఈ శ్లోకం హరిహరాద్వైతాన్నే కాదు, గోదావరి గంగ వంటి పవిత్రమైన నది అనే విషయాన్ని కూడా ధ్వనింపచేస్తోంది. మాయలేడి సన్ని వేశంలో చివరిగా, ‘నేను నీకు దక్కుతాననుకుంటున్నావేమో, రాముడు లేకపోతే గోదావరిలో దూకేస్తాను’ అంటుంది సీతాసాధ్వి. ఈ విధంగా మానరక్షణకు గోదావరిని సమాశ్రయిస్తానంటుంది సీత. అంతేకాదు, రావణాసురుడు అపహరించుకుపోతూ ఉంటే, సీత గోదావరికి వందనాలర్పిస్తూ తన విషయం, రావణుని సంగతీ రామునికి చెప్పమని అర్థిస్తుంది. సీతాన్వేషణ సందర్భంలో రాముడు, సీతకు గోదావరి చాలా ప్రియమైనది. ఆ నదికి గాని వెళ్లిందా? అయినా నేను లేకుండా ఒంటరిగా వెళ్లదే అను కుంటాడు. ‘గోదావరీయం సరితాం వరిష్ఠాప్రియా యా మమ నిత్యకాలం/ అష్య త్రగచ్ఛేదితి చింతయామి నైకాకినీ యాతిహిసాకదాచితం’ అంటూ గోదావరి నదులలో శ్రేష్టమైనదని శ్రీరాముడే స్వయంగా చెప్పిన సందర్భమిది. ‘సీత ఏది?’ అని రాముడు గోదావరిని ప్రశ్నిస్తాడు. మళ్లీ గోదావరి ప్రసక్తి వాల్మీకి రామాయణంలో రావణ వధానంతరం శ్రీరాముడు విజయలక్ష్మీయుతుడై సీతాలక్ష్మణ సహితుడై పుష్పక విమానంలో అయోధ్యానగరికి వెళ్లే సందర్భంలో వస్తుంది. సీతాన్వేషణ సమయంలో తాను చూసిన ప్రదేశాలన్నింటినీ సీతకు చూపిస్తూ దండకారణ్య సమీపంలో గోదావరిని కూడా చూపిస్తూ, గోదావరి రమ్యమై ప్రసన్న సలిలయై ఉంది చూడు మైథిలీ అంటాడు. వాల్మీకి రామాయణాన్ని బట్టి రాముడు గోదావరిని చూడడం ఇది కడసారి. పంచవటిలో చూసినపుడు, ‘ఇయం గోదావరీ రమ్యా’ అని, చివరిసారి, ‘ఏషా గోదావరీ రమ్యా!’ అంటాడు. ఎన్నో నదీ తీరాలను చూసిన, అక్కడ వసించిన రాముడు మనసారా ‘గోదావరీ రమ్యా’ అని సంభాషించడం గోదావరి వరిష్ఠతకు నిదర్శనం. రాముడు మెచ్చిన నది గోదావరి. అది ఆంధ్రదేశంలో అధిక భాగం ఉండడం ఆంధ్రుల పుణ్యం. రామాయణాన్ని వాడుక భాషలోకి వచన కావ్యంగా తెనిగించిన శ్రీ శ్రీపాద సుబ్ర హ్మణ్యశాస్త్రి అరణ్యకాండ పీఠికలో వ్రాసిన వాక్యాలు ఈ సందర్భంలో స్మరింపతగినవే. ‘మన గోదావరీ మధురజలాలు సీతారామలక్ష్మణ స్నానపుణ్యాలు. రాముడనేక నదులు చూశాడు. స్వయంగా ఒక నది వొడ్డునే పుట్టి పెరిగి వ్యవహరించాడు కూడా! కానీ మన గోదావరి వంటిది మాత్రం మరొకటి కనబడలేదతనికి’. భవభూతి తన ఉత్తర రామచరిత్ర నాటకంలో రామకథా ఘట్టాన్ని గోదావరీ తీరంలో నడిపించాడు. నన్నయ్యభట్టు భారత మూలంలో లేకపోయినా అర్జునుని తీర్థయాత్రా సందర్భంలో ‘దక్షిణ గంగనా తద్దయునొప్పు’ గోదావరిని ప్రవేశపెట్టాడు. (వ్యాసకర్త విశ్రాంత ఆచార్యులు ఫోన్: 0891-2530289 - డా॥కోలవెన్ను మలయవాసిని -
మహా జన సంరంభం
ప్రవహించినంతమేరా పచ్చటి ప్రకృతిని మాత్రమే కాదు... జనపదాలనూ, సంస్కృతీ సంప్రదాయాలనూ పెంపొందింపజేసే నదులకు మనిషి జీవితంలో విశిష్ట స్థానం ఉంది. అవి మనిషి దాహార్తినీ, క్షుదార్తినీ తీర్చడంతోనే ఆగిపోలేదు. సంస్కారాన్నిచ్చాయి. సహజీవనాన్ని నేర్పాయి. విజ్ఞానతృష్ణను రగిల్చి ఉన్నత స్థానానికి చేర్చాయి. నదులను అమ్మలా సంభావించుకుని ప్రణమిల్లడం, పూజాదికాల్లో నదులరీత్యా ఉనికిని చెప్పుకోవడం అందుకే. ప్రాణికోటి మనుగడకు ఆధారమైన పంచభూతాల్లో నీటికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ‘పరోపకారాయ ఫలంతి వృక్షాః/ పరోపకారాయ వహంతి నద్యాః’ అనే సూక్తి నదులకుండే ప్రవాహ గుణంలోని పరోపకారత ను పట్టిచూపుతుంది. మనిషికీ, నదీమతల్లికీ గల అనుబంధాన్ని గుర్తుచేసుకోవడానికి ఒక సందర్భమయ్యే గోదావరి పుష్కరాలు మంగళవారం ఉదయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మొదలవుతున్నాయి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించే క్షణాలను గణనలోకి తీసుకుని తెలంగాణలో ఉదయం 6.21 గంటలకూ...ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 6.26కూ ఈ పుష్కరాలను లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. పన్నెండేళ్లకొకసారి వచ్చే ఈ పుష్కరాలు జన, జల రాశుల మహా సంగమం. మహా సంరంభం. ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో 5 కోట్లమంది, తెలంగాణలో 3 కోట్లమంది పుష్కరాల్లో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఈసారి జరిగేవి 144 ఏళ్లకొకసారి వచ్చే మహా పుష్కరాలని కొందరు పండితులు చెబుతున్నారు. అందుకే వీటి ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈ పుష్కర సమయంలో గోదావరీ తీరాన త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలూ, సప్త రుషులూ, పితృ దేవతలూ నడయాడతారని ప్రతీతి. అందుకే ఈ పన్నెండు రోజులూ గోదావరి నది ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. పితృకర్మలు సాగుతాయి. దక్షిణాన అతి పెద్ద నదిగా...దేశంలో గంగానది తర్వాత రెండో పెద్ద నదిగా ప్రఖ్యాతి చెందిన గోదావరి... మహారాష్ట్రలోని నాసిక్ సమీపాన సహ్యాద్రి కొండల్లో పుట్టి మొత్తంగా 1,465 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. అంతకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 927 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. ఒకచోట పర్వత శిఖరాలనుంచి దుమికినా, మరోచోట కొండల్ని ఒరుసుకుంటూ, సుడులు తిరుగుతూ అన్నిటినీ చుట్టబెడుతూ, మహావృక్షాలను సైతం కూకటివేళ్లతో పెకిలిస్తూ ప్రళయ భీకర రూపం చూపినా...వేరొకచోట ప్రశాంత గంభీర వదనంతో ప్రవహించినా, చివరిగా సముద్రంలో సంగమించేందుకు ఉత్తుంగ తరంగాలతో ఉరకలెత్తుతూ వెళ్లినా గోదావరి తీరే వేరు. అది మానవ జీవితంలోని సకల పార్శ్వాలనూ గుర్తుకు తెస్తుంది. ఈ పుష్కరాల పనుల కోసం రెండు రాష్ట్రాలూ భారీగానే ఖర్చు చేశాయి. పుష్కరాలకొచ్చే భక్తులకు స్నాన ఘట్టాలు మొదలుకొని వసతి సౌకర్యాలవరకూ వివిధ ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రోజుకు దాదాపు 25 లక్షలమంది పుష్కర స్నానం చేస్తారన్న అంచనాలతో ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 264 స్నానఘట్టాలను ఏర్పాటుచేశారు. ఇంత భారీయెత్తున ఏర్పాట్లు చేసి కోట్లాది రూపాయలు వ్యయం చేసిన రెండు ప్రభుత్వాలూ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికొచ్చేసరికి ముఖం చాటేశాయి. మరికొన్ని గంటల్లో పుష్కరాలు ప్రారంభం కాబోతున్నా పట్టనట్టు కూర్చున్నాయి. ఫలితంగా పారిశుద్ధ్యం పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అన్నిచోట్లా చెత్తాచెదారం పేరుకుపోయి, డ్రైనేజిలన్నీ పొంగిపొర్లి దుర్గంధం నిండింది. చినుకు పడిందే తడవుగా భయంకరమైన అంటు వ్యాధులు ప్రబలే స్థితి నెలకొంది. తెలంగాణలో సమ్మె మొదలై 8 రోజులు గడుస్తుంటే...ఏపీలో మూడు రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తున్నారు. కార్మికులు కోరుతున్నవి గొంతెమ్మ కోర్కెలేమీ కాదు. చాలీచాలని వేతనాలను సరిదిద్దాలంటున్నారు. తమ బతుకుల్ని కాస్తయినా బాగుచేయమంటున్నారు. మిగిలినవారంతా సమీపానికి రావడానికి కూడా హడలెత్తే చెత్తలో నిత్యం మునిగితేలుతూ వీధులను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో కార్మికులు చేస్తున్న కృషి నిజానికి వెలకట్టలేనిది. అలాంటివారి జీవితాలను కాంట్రాక్టు ఉద్యోగాల్లో పాతేసి, అభద్రతలోకి నెట్టడం అన్యాయమని, అమానుషమని పాలకులు ఎందుకు అనిపించడంలేదో ఆశ్చర్యం కలుగుతుంది. ఈఎస్ఐ సొమ్మును కాంట్రాక్టర్లు, అధికారుల పాలై వైద్య సేవలు లభించని స్థితి ఏర్పడినా కార్మికుల గోడు పట్టించుకునే నాథుడు లేడు. చట్టసభలకు ఒకసారి ఎన్నికైతేనే పెన్షన్తోసహా అనేక సౌకర్యాలు పొందేవారు... పౌరులందరికీ ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించడంలో రాత్రింబగళ్లు శ్రమించేవారిని చిన్నచూపు చూడటం వింతగొలుపుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైతే సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ఇప్పటికే పొరుగునున్న తమిళనాడునుంచి పారిశుద్ధ్య కార్మికులను రప్పించింది. తెలంగాణ సర్కారు సైతం ఆ తోవనే పోదల్చుకున్నట్టు కనబడుతోంది. అస్మదీయులకు కాంట్రాక్టులు అప్పగించి వారికి చేతినిండా పని కల్పించవచ్చు గనుక... కోట్లాది రూపాయలు వెనకేసుకోవచ్చు గనుక పుష్కర పనులంటూ హడావుడి చేస్తారు. వాస్తవానికి స్నాన ఘట్టాలవంటివి శాశ్వత ప్రాతిపదికన ఉండాల్సినవి. అందుకోసం పటిష్టంగా నిర్మాణం చేయాల్సినవి. కానీ పనులు నాసిరకంగా ఉండటంవల్ల వచ్చే పుష్కరాల వరకూ ఉండటం మాట అటుంచి కొన్ని నెలలకే నామరూపాల్లేకుండా పోతున్నాయి. కనుకనే ప్రతిసారీ వాటి కోసం కోట్లు ఖర్చుచేయాల్సివస్తున్నది. రోడ్ల సంగతి చెప్పనవసరమే లేదు. ఖర్చుచేశామన్న సొమ్ముతో పోల్చిచూస్తే జరిగిన పనులు సరిగా లేవన్నది అర్థమవుతుంది. భక్తినీ, చిత్తశుద్ధినీ, సత్సంకల్పాన్నీ పెంపొందింపజేసే ఈ పుష్కరాలు పాలకులకు సద్బుద్ధిని కలిగిస్తే మున్సిపల్ కార్మికులకూ, పౌరులకూ మేలు కలుగుతుంది. -
ఒక్క మిస్డ్‌కాల్‌తో పుష్కర సమాచారం
హైదరాబాద్ సిటీ: ఆంధ్రప్రదే శ్ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలకు సంబంధించి సమాచారం కావాల్సిన వారు 8333000020 నెంబరుకు ఫోను చేసి మిస్‌కాల్ ఇస్తే చాలు. ఫోను చేసిన వారు కాల్ కట్ అయిన కొద్దిసేపటికే వారికి ఇంట్రాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) కాల్ అందుబాటులోకి వస్తోంది. ఐవీఆర్ కాల్ ద్వారా పుష్కర ఘాట్ల సమాచారం.. దేవాలయాల సమాచారం.. హోటళ్లలో గదుల వివరాలు.. రవాణా సమాచారం.. రాజమండ్రి బస్సు వేళల.. రాజమండ్రికి ప్రత్యేక రైళ్ల వేళల.. పూజా వివరాల.. ప్రైవేట్ వాహానాల పార్కింగ్ వివరాలకు.. ఆసుపత్రుల వివరాలలో దేనికి సంబంధించిన వివరాలు కావాలో తెలియజేయాలని ఫోను చేసిన సంబంధిత వ్యక్తిని కోరుతుంది. కావాల్సిన సమాచారానికి ఉద్దేశించిన నెంబరును తన ఫోనులో నొక్కితే..కొద్ది సేపటికే దానికి సంబంధించిన వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో లభిస్తాయి. దీనికి తోడు భక్తులకు పుష్కర సమాచారం అందజేసేందుకు ప్రభుత్వం టోల్‌ఫ్రీ నెంబరు కూడా ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నెంబరు 12890కు ఫోను చేస్తే ఉచితంగా పుష్కర సమాచారం పొందవచ్చు. ఫుష్కరాలకు వచ్చిన భక్తులు తాము ఉన్న ప్రాంతంలో ఏటీఎం, హోటల్ గదుల ఖాళీల వివరాలు, రాకపోకల మార్గాల వివరాలను తెలియజేసుకునేందుకు ఘాట్ల వద్ద 25 మీడియా సెంటర్లను ఏర్పాటు చేశారు. మరోపక్క ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు చిత్రీకరించే దృశ్యాల ద్వారా రద్దీని అంచనా వేయడానికి 20 మంది నిపుణుల బృందం ప్రత్యేకంగా పనిచేస్తోంది. -
పుష్కరుడు వస్తున్నాడు!
-
పుష్కరుడు వస్తున్నాడు!
* తెలంగాణలో తొలి పుష్కర సంరంభం రేపట్నుంచే * ఉదయం 6.21 గంటల నుంచి పుణ్యస్నానాలు మొదలు * ధర్మపురిలో సకుటుంబంగా స్నానం ఆచరించనున్న కేసీఆర్ * 25 వరకు కొనసాగనున్న పుష్కర స్నానాలు * 2 కోట్ల మంది రావచ్చని అంచనా సాక్షి, హైదరాబాద్: గోదావరి మహా పుష్కరాలు మంగళవారం నుంచి ఘనంగా ప్రారంభం కాబోతున్నాయి. ఈనెల 25 వరకు పన్నెండు రోజుల పాటు జరగనున్న పుష్కరాలలో దాదాపు రెండు కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని భావిస్తున్నారు. ఈ సంఖ్య అంతకు రెట్టింపు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి పుష్కరాలు కావటంతో ప్రభుత్వం వీటిని ప్రతిష్టాత్మకంగా భావించి కుంభమేళా తరహాలో నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఆవిర్భావం, ముమ్మర ప్రచారం వెరసి గతంలో జరిగిన పుష్కరాలతో పోలిస్తే ఈ పుష్కరాలకు ప్రాధాన్యం పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా గోదావరి తీరంలో 73 ప్రాంతాల్లో 81 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. పుష్కర ప్రాంతాలకు ప్రత్యేకంగా రోడ్లను నిర్మించారు. ఆయా ప్రాంతాల్లోని దేవాలయాలను అందంగా ముస్తాబు చేశారు. ఇందుకు దాదాపు రూ.600 కోట్లు ఖర్చు చేశారు. కేంద్ర ప్రభుత్వం మరో రూ.50 కోట్లు అందజేసింది. ధర్మపురిలో కేసీఆర్ పుణ్యస్నానాలు మంగళవారం ఉదయం 6.21 గంటలకు పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. సీఎం కె.చంద్రశేఖర్‌రావు కుటుంబ సమేతంగా ధర్మపురిలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. ఇందుకు సోమవారం సాయంత్రమే అక్కడికి బయలుదేరనున్నారు. అనంతరం కాళేశ్వరం, భద్రాచలం కూడా సందర్శించనున్నారు. ఆయన వెంట మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉంటారు. పుష్కరాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించినా ఆయన రాకపై స్పష్టత లేదు. చాలాచోట్ల తుంపర స్నానాలే దిక్కు.. వానలు లేకపోవడంతో ఇప్పటికీ నదిలోకి కొత్త నీరు అంతగా ప్రవేశించలేదు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. కరీంనగర్ జిల్లాలో త్రివేణీ సంగమ క్షేత్రమైన కాళేశ్వరం వరకు గోదావరిలో ఇసుకే కనిపిస్తోంది. కాళేశ్వరం వద్ద ప్రాణహిత వచ్చి చేరటంతో అక్కడ్నుంచి నీటి ప్రవాహం కొంత పెరిగింది. వరంగల్ జిల్లా పరిధిలో గోదావరి ప్రవాహం ఓ పాయగా కనిపిస్తోంది. ఖమ్మం జిల్లా భద్రాచలంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ప్రాణహిత వచ్చి కలిసిన కాళేశ్వరం, భద్రాచలం మినహా మరెక్కడా పుష్కర ఘాట్లకు తగిలేలా నీరు లేదు. చాలాచోట్ల పైపుల కింద తుంపర స్నానం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కనికరించని మహారాష్ట్ర ఎగువన మహారాష్ట్ర గోదావరిపై 12 ప్రాజెక్టులు నిర్మించిన నేపథ్యంలో వాటిల్లో నిల్వ ఉన్న నీటిని దిగువకు విడుదల చేసి పుష్కర భక్తులకు సాంత్వన కలిగించాలన్న తెలంగాణ అభ్యర్థనను మహారాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. తుది ప్రయత్నంగా సీఎం చంద్రశేఖర్‌రావు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుతో ఆదివారం సాయంత్రం ఫోన్లో మాట్లాడారు. గైక్వాడ్ రిజర్వాయర్ నుంచి 3 టీఎంసీల నీటిని విడుదల చేసేలా చూడాలని కోరారు. కానీ అక్కడి ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తోంది. మంగళవారం ఉదయం నాటికి ఈ నీరు ఖమ్మం సరిహద్దు వరకు చేరుకునే అవకాశం ఉంది. బాసర వద్ద నదిలో తాత్కాలిక అడ్డుకట్ట వేసి ఘాట్ల వద్ద నీరు ముందుకు వెళ్లకుండా చూస్తున్నారు. ధర్మపురి, వరంగల్ జిల్లా మంగపేట వద్ద కూడా ఇలాంటి ఏర్పాటు చేశారు. ఆంధ్రా వైపు దృష్టి నీటి కొరత కారణంగా.. హైదరాబాద్ నుంచి పుష్కర స్నానాలకు వెళ్లేవారిలో ఎక్కువ మంది ఆంధ్రావైపు దృష్టి సారించారు. ఫలితంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపు వెళ్లే రైళ్లు, బస్సులకు విపరీతమైన రద్దీ ఏర్పడింది. ప్రత్యేక సర్వీసుల రిజర్వేషన్ టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. తెలంగాణలో భద్రాచలంపై భారం అధికంగా ఉంది. రోజుకు ఇక్కడికి దాదాపు 4 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని ఘాట్ల వద్దకు 12 రోజుల్లో కోటి మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు మంజూరు చేయకపోవటంతో పనులు ఆలస్యంగా మొదలయ్యాయి. ఆదివారం రాత్రి వరకు కూడా చాలాచోట్ల పుష్కర ఘాట్లు, రోడ్ల పనులు జరుగుతూనే ఉన్నాయి. బస్సులు, రైళ్లు ఫుల్ పుష్కర భక్తుల కోసం 250 ట్రిప్పులకు సరిపడా రైళ్లు, 2,600 అదనపు బస్సులను ప్రకటించారు. ఇవి సరిపోయేలా కనిపించటం లేదు. హెలీకాప్టర్లనూ అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ నుంచి బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో 10 నిమిషాలు ఆకాశంలో విహరించవచ్చు. ఇందుకు రూ.2,500-రూ.3,000 వరకు చెల్లించాలి. బురద దాటితేనే నీళ్లు ప్రస్తుతం బాసరలో పాత ఘాట్ వద్ద మాత్రమే ఘాట్ల వరకు నీళ్లున్నాయి. వంతెన వద్ద నిర్మించిన కొత్త ఘాట్ల వద్ద 50 మీటర్లు బురదలో ముందుకు వెళ్తేనే నీళ్లు తగులుతాయి. ధర్మపురి, మంథని వద్ద ఇదే పరిస్థితి. వరంగల్ జిల్లా ముళ్లకట్ట, రామన్నగూడెం, మంగపేట వద్ద అర కిలోమీటరు నుంచి కిలోమీటరు మేర ఇసుకలో ముందుకు నడవాల్సిందే. భద్రాచలంలో ఘాట్లు దిగాక 10 మీటర్ల మేర బురద మేట వేసింది. దీంతో దానిపై రెండడుగుల మేర ఇసుక నింపారు. ఖమ్మం జిల్లా పర్ణశాల, మోతెగడ్డ, రామచంద్రాపురంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. చినరావిగూడెం, రామానుజపురంలో ఇసుకలో ప్రత్యేకంగా కాలువ ఏర్పాటు చేసి ఘాట్ల వద్దకు నీటిని మళ్లిస్తున్నారు. ధర్మపురికి పీఠాధిపతుల రాక ధర్మపురి: ధర్మపురిలో గోదావరి పుష్కరాలకు వివిధ ప్రాంతాలకు చెందిన ఏడుగురు పీఠాధిపతులతోపాటు వంద మందికిపైగా వారి శిష్యులు రానున్నారు. శ్రీశ్రీశ్రీ పుష్పగిరి పీఠాధిపతి, రాఘవేంద్ర పీఠాధిపతి, వీరశైవ పీఠాధిపతి, ధర్మపురి శ్రీమఠం పీఠాధిపతి, మదనానంద స్వామీజీ, తోగూట పీఠాధిపతి, విశాఖపట్నంకు చెందిన స్వరూపానంద స్వామీజీ రానున్నారు. -
అల..నాటి పుష్కరాలు
గోదావరి పుష్కరాలు జూలై 14న ప్రారంభమవుతున్న నేపథ్యంలో- ఇది 11 పుష్కరాల క్రితం నాటి ప్రస్తావన. 1884 తారణనామ సంవత్సరంలో గోదావరి పుష్కర సంరంభం ప్రారంభమైంది. అప్పటికి గయోపాఖ్యాన కర్త, కవి చిలకమర్తి లక్ష్మీనరసింహంకు 17 ఏళ్లు. ఆనాటి ముచ్చట్లను, అప్పటి పుష్కర ఏర్పాట్లను తన ‘స్వీయచరిత్ర’లో ఇలా రాసుకున్నారు: ‘1884 తారణ సంవత్సరం గోదావరి పుష్కర యాత్రికులు ఉత్కళ దేశము నుండి, నిజాము రాష్ట్రం నుంచి తక్కిన ఆంధ్ర మండలం నుంచి వచ్చారు’. అనంతరం 1896లో ఆయన 29వ ఏట వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరంలో జరిగిన గోదావరి పుష్కరాలను గురించి కూడా తన ఆత్మకథలో ప్రస్తావిస్తూ, ‘యాత్రికులకు దొరతనము వారు కోటిలింగాల వద్ద తాటియాకుల పందెళ్లు, పాకలు వేయించి వసతులు ఏర్పరిచిరి. ధర్మవరం సంస్థానం ప్రొప్రయిటరు కంచుమర్తి రామచంద్రరావు జమిందారులు యాత్రికుల సౌకర్యం నిమిత్తం నూతి నీళ్లు, కుళాయిగొట్టం ద్వారా తెప్పించునేర్పాటు చేసిరి. పుష్కర నగరంలో మంచి మంచి బాటలు వేయించుటలో వీరు దొరతనము వారికి మిక్కిలి తోడ్పడిరి. ఆ పుష్కరములో వీరు మిక్కిలి శ్రమపడిరనడంలో అతిశయోక్తి లేదు. ఇంతియే కాదు. జనోపయోగకరమైన ప్రతి కార్యక్రమమునందు శ్రీరామచంద్రరావుగారు మేనుదాచుకొనక బహుశ్రమపడి పని చేసి రాజమహేంద్రవరమునకు మంచి యశస్సు సంపాదించెడివారు’. ‘ఎలిపిన్స్టన్ సబ్‌కలెక్టర్ మానవ సేవాపరాయణులు. గోదావరిరేవులో జనం పడిపోకుండా, కర్రదూలములు పాతించారు. విషూచి1 జాడ్యము వస్తే స్వయంగా పాయకానా దొడ్లను పరిశీలించి, శుభ్రం చేయించి మందులు సకాలంలో అందించారు’ అని రాశారు. - మధునామూర్తి ఫోన్: 9505504998 -
సాధువుల పుష్కర స్నానానికి రూ.1.50కోట్లు!
హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలానికి వచ్చే 1,500 మంది సాధువులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఏర్పాట్ల నిమిత్తం రూ.1.50 కోట్లు మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే.. పుష్కర ఏర్పాట్లలో భాగంగా సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీచేసింది. వివిధ జిల్లాల్లో జరుగుతున్న పుష్కర పనుల కోసం ఇప్పటికే విడుదల చేసిన నిధులకు అదనంగా మరో రూ.2 కోట్లను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. -
రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాలు, రంజాన్ కానుకలు, ఉద్యోగ నోటిఫికేషన్లకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో...మంత్రివర్గం శనివారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన 25 వేల ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు, టీఎస్పీఎస్సీ పరీక్షల విధానం, అభ్యర్థుల వయో పరిమితి సడలింపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర అంశాలను చర్చించే అవకాశముంది. ఇక అనాథ బాలల సంరక్షణ, హాస్టల్ విద్యార్థుల సంక్షేమం, పాఠశాలల్లో పిల్లలకు కడుపు నిండా మధ్యాహ్న భోజనం పెట్టే ప్రతిపాదనలపై ఇటీవల నియమించిన మంత్రుల కమిటీ ఇచ్చిన సిఫారసులపై చర్చించి ప్రభుత్వ విధానాన్ని ఖరారు చేయనున్నారు. సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అదనపు చెల్లింపులపై అధ్యయనానికి నియమించిన మంత్రుల సబ్‌కమిటీ ఇచ్చిన నివేదికపైనా చర్చిస్తారు. పుష్కరాలు, ఇఫ్తార్ నిర్వహణ, ముస్లింలకు రంజాన్ కానుకగా వస్త్రాల పంపిణీ అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. పార్లమెంటరీ కార్యదర్శుల పదవులు రద్దు చేసినందున తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. -
అందరి చూపూ భద్రాద్రి వైపే..
* పుష్కర స్నానానికి పుష్కలంగా నీరు * భద్రాద్రి వద్ద ప్రస్తుతం 10 అడుగులు ఉన్న నీటిమట్టం * జిల్లాలో కోటిమంది భక్తులు స్నానం ఆచరిస్తారని అంచనా * పార్కింగ్ ప్రదేశాల గుర్తింపులో సమస్యలు పుష్కర ఘడియలు సమీపిస్తున్నాయి. పన్నెండేళ్లకోమారు 12 రోజుల పాటు జరిగే గోదావరి పుష్కరాలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానం చేసేందుకు భక్త జనం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా జరుగుతున్న ఉత్సవాలు కావటంతో కుంభమేళాను తలపించే రీతిలో వీటిని చేపట్టాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి తీరాన ఉన్న బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం వంటి ప్రధాన పుణ్యక్షేత్రాల్లోని పుష్కర ఘాట్ల వద్దనే భక్తులు ఎక్కువగా స్నానమాచరించే అవకాశం ఉందని యంత్రాంగం భావిస్తోంది. అయితే గోదావరిలో ఆశించిన స్థాయిలో నీరు లేకపోవటం అధికార యంత్రాంగాన్ని కొంత ఆందోళనకు గురిచేస్తోంది. బాసర వద్ద గోదావరిలో ఇసుక తిన్నెలే దర్శనమిస్తున్నారుు. ధర్మపురి, కాళేశ్వరం వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ వారంలో భారీ వర్షాలు కురిస్తేనే గోదావరిలో నిండుగా నీళ్లు ఉంటాయని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు తెలిపారు. అయితే ఇప్పట్లో భారీ వర్షాలు ఉండకపోవచ్చని వాతావరణశాఖ నిపుణులు చెబుతుండటంతో గోదావరిలో కోట్లాది మంది పుష్కర స్నానాలు ఎలా సాగుతాయనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అందరి చూపూ పుష్కలంగా నీరున్న భద్రాచలంపైనే ఉంది. - భద్రాచలం భద్రాచలంలో జలకళ ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదిలో గురువారం 10 అడుగుల మేర నీటిమట్టం ఉందని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు తెలిపారు. పుష్కరాలు ముగిసేంత వరకు ఇదే స్థాయిలో నీళ్లు ఉంటాయని, ఒక వేళ వర్షాలు కురిస్తే నీటిమట్టం పెరుగుతుందని అంటున్నారు. ఖమ్మం జిల్లాలో భద్రాచలం, బూర్గంపాడు మండలం మోతె, దుమ్ముగూడెం మండలం పర్ణశాల, వెంకటాపురం మండలం రామచంద్రాపురం, మణుగూరు మండలం రామానుజవరం, చినరావిగూడెంలో ఘాట్లను ఏర్పాటు చేశారు. ఈ ఘాట్లలో రోజుకు 6.50 లక్షల మంది భక్తులు పుణ్య స్నానం చేయవచ్చని మొదట్లో అంచనా వేశారు. కానీ భద్రాచలం వైపే భక్తులందరి చూపూ ఉందని సమాచారం అందుతుండటంతో 10 లక్షల మందికి పైగా భక్తులు స్నానం ఆచరిస్తారని భావిస్తున్నారు. త్రిదండి చినజీయర్‌స్వామి భద్రాచలంలో పుష్కరాలను ప్రారంభించనున్నారు. వివిధ ప్రాంతాల పీఠాధిపతులు కూడా భద్రాచలం వచ్చేందుకే మొగ్గు చూపుతున్నట్లుగా ఇప్పటికే దేవస్థానం అధికారులకు సమాచారం ఉంది. ఈ లెక్కన పన్నెండు రోజుల పాటు కోటి మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు. అసంపూర్తిగా పనులు పుష్కరాల పేరుతో కొన్ని శాఖల ద్వారా చే స్తున్న పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. భద్రాచలంలో టుబాకో బోర్డు ప్రాంగణంలో ఉన్న పార్కింగ్ ప్రదేశానికి వెళ్లే ఐటీడీఏ రోడ్ పనులను పుష్కరాలకు ముందు పూర్తి చేయలేమని పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు చేతులెత్తేశారు. బూర్గంపాడు మండలంలోని పార్కింగ్ ప్రదేశాలకు వెళ్లే రహదారులు కూడా పూర్తి కాలేదు. దీంతో పార్కింగ్ ప్రదేశాల గుర్తింపులో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొన్ని శాఖల మధ్య నెలకొన్న సమన్వయ లోపం కారణంగానే పుష్కరాల పనులు సకాలంలో పూర్తి కావటం లేదని భక్తులు అంటున్నారు. ఏర్పాట్లపై దృష్టి పుష్కరాలకు భద్రాచలం వచ్చే భక్తుల సంఖ్య మొదట్లో వేసిన అం చనాల కంటే పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు ఎలా చేయాలనే దానిపై దృష్టి సారించింది. భద్రాచలంలోకి ఒక్క ఆర్టీసీ బస్సులనే అనుమతిస్తామని మొదట్లో ప్రకటించిన పోలీసులు, భక్తులరద్దీ పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రైవేటు ట్రావెల్స్‌లో వచ్చే భక్తులు కూడా నేరుగా పట్టణంలోకి వచ్చేందుకు అంగీకరించారు. -
గోదా‘వర్రీ’ పుష్కరాలు
* భక్తుల వసతి దైవాధీనం * స్కూళ్లు, హాస్టళ్లను వినియోగించుకోవాల్సిన దుస్థితి భద్రాచలం పరిసరాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలన్నీ 12 రోజులపాటు మూతపడబోతున్నాయి! ఎందుకంటారా? కుంభమేళ తరహాలో అట్టహాసంగా నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతున్న గోదావరి పుష్కరాలకు తరలి వచ్చే భక్తులకు.. వసతి మందిరాలు కరువవడంతో గత్యంతరం లేక ఈ స్కూళ్లు, హాస్టళ్లను వినియోగించుకోబోతున్నారు. భక్తుల వసతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు దేవాలయ నిర్వాహకులు చేసిన ప్రతిపాదనను నిధుల బూచి చూపి ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఫలితం.. ప్రత్యామ్నాయ వసతి కోసం ఇలా ప్రభుత్వ, ప్రైవేటు బడులు, వసతిగృహాలపై పడాల్సిన దుస్థితి నెలకొంది. ఇది ఒక్క భద్రాచలం వద్ద నెలకొన్న దుస్థితి కాదు. బాసర, కాళేశ్వరం, ధర్మపురి... ఇలా పుష్కరాలు జరిగే అన్నిచోట్లా ఇదే పరిస్థితి కనిపిస్తోంది! కేవలం భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు వీలుగా పుష్కర ఘాట్ల నిర్మాణానికే ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఆలయాల వద్ద భక్తులకు వసతి విషయాన్ని పట్టించుకోవడం లేదు. - సాక్షి, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో తొలి పుష్కరాల నేపథ్యంలో మరోపక్షం రోజుల తర్వాత గోదావరి తీరం యావత్తూ జనసంద్రంగా మారనుంది. 12 రోజుల పాటు బాసర నుంచి భద్రాచలం వరకు నదీ తీరంలోని పుణ్యక్షేత్రాలు ఇసకేస్తే రాలనంత జనంతో కిటకిటలాడనున్నాయి. దాదాపు రెండు కోట్ల మంది పుణ్య స్నానాలాచరించేందుకు వస్తారని అంచనా. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి పుష్కరాలు కావటంతో ఉత్సవాలపై అంచనాలూ పెరుగుతున్నాయి. కాళేశ్వరంలాంటి త్రివేణీ సంగమం, ఇతర ప్రత్యేకతలున్న ప్రాంతాలు తెలంగాణలో కొలువుదీరి ఉండటంతో పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. ఇలాంటి విశిష్ట సందర్భాల్లో దేవాలయాల వద్ద భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ పుణ్యక్షేత్రాల వద్ద పరిస్థితి ఇందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. పుష్కర ఘాట్ల నిర్మాణం తప్ప భక్తులకు వసతిని ప్రభుత్వం పట్టించుకుంటున్నట్టు లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగా పుష్కరాలకు రోజులు దగ్గరపడే కొద్దీ ఆలయాల నిర్వాహకుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. ఒక్కసారిగా లక్షలాదిగా వచ్చే భక్తులకు వసతి కల్పించలేమన్న భయం వెంటాడుతోంది. ఏదైనా అపశృతి చోటుచేసుకుంటే పరిస్థితి ఏంటనే ఆందోళనతో కొందరు అధికారులు పుష్కర బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారంటే పరిస్థితి తీవ్రత తెలుస్తోంది. భద్రాచలంలో పూర్తిస్థాయి ఏర్పాట్లేవి? భద్రాచలంలో అప్పుడే సందడి మొదలైంది. పుష్కరాలు జరిగే 12 రోజుల సమయంలో దాదాపు 80 లక్షల మంది ఇక్కడికి వస్తారని అంచనా. అంటే సగటున రోజుకు ఆరున్నర లక్షల మందికి పైమాటే! భక్తుల ఏర్పాట్ల కోసం భద్రాచలం దేవాలయం రూ.12 కోట్లు ప్రతిపాదిస్తే... ప్రభుత్వం మొత్తం ఖమ్మం జిల్లాకు కలిపి రూ.1.70 కోట్లు కేటాయించింది. ఇందులో ఈ దేవాలయానికి రూ.కోటి ఇచ్చింది. వర్షాలు కురిసే సమయం కావటంతో భక్తుల విశ్రాంతి కోసం రెండున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేకంగా వాటర్‌ప్రూఫ్ మంటపాలు ఏర్పాటు చేయాలని దేవాలయ నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు రూ.కోటి వ్యయమవుతుందని ప్రతిపాదించారు. కానీ ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. కేవలం క్యూలైన్లపై షెడ్డు ఏర్పాటుకే అనుమతించింది. ఇందుకు రూ.40 లక్షలు కేటాయించింది. స్వామి దర్శనానికి ఎదురుచూసే వారికి ఇది రక్షణగా ఉంటుంది. కానీ వాన కురిస్తే అంతే పరిస్థితి. వృద్ధులు, చిన్నపిల్లల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం కావటంతో పాఠశాలలు, కాలేజీలు, వసతి గృహాలను ఖాళీ చేసి వాటిని వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది. దేవాలయంతోపాటు స్నానఘట్టాల వద్ద 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆలయ నిర్వాహకులు ప్రతిపాదించగా.. ఆలయం వద్ద 15 కెమెరాల ఏర్పాటుకే అనుమతి వచ్చింది. బాసరకు నిధులేవి? బాసర ఆలయానికి రూ.2.10 కోట్లు అడిగితే.. రూ.కోటిన్నర ఇచ్చారు. ఇక్కడ కూడా భక్తులకు అదనపు వసతి లేకుండా పోయింది. వచ్చిన డబ్బులు ఆలయానికి, ఉన్న అతిథి గృహాలకు రంగులు, ఆలయ పరిసరాల్లో రోడ్డు నిర్మాణం, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటుకే సరిపోని పరిస్థితి నెలకొంది. ఇక్కడ భారీ విశ్రాంత మందిరం ఉన్నా... భక్తులకు ప్రసాదాలు తయారు చేసేందుకు దాన్ని కేటాయించారు. అంటే సత్రాలు పోను అదనపు రద్దీ అంతా ఆరుబయటే అన్నమాట! కాళేశ్వరంలో భక్తులకు వసతి ఎక్కడ? కరీంనగర్ జిల్లాలోని త్రివేణి సంగమమైన కాళేశ్వరానికి 24 లక్షల మంది వస్తారని అంచనా. ఇందుకోసం నాలుగు భారీ విశ్రాంతి మందిరాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులు ప్రతిపాదించారు. శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తే ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవ రద్దీకి కూడా ఉపయోగపడుతుందని కోరారు. అయితే ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. ఇక్కడ ఆల యానికి కేవలం 20 గదులు మాత్రమే ఉన్నాయి. వాటిని వివిధ విభాగాల అధికారులు, సిబ్బందే ఆక్రమిస్తారు. సాధారణ భక్తులకు ఒక్క గది కూడా దొరకదు. దీంతో ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని మాధేపురాలో ఉన్న బీసీ వసతి గృహాన్ని ఖాళీ చేసి తీసుకోవాలని నిర్ణయించారు. ఛత్తీస్‌గఢ్‌కు చేరువగా ఉన్న ప్రాంతం కావటంతో భద్రత కోసం భారీ సంఖ్యలో వచ్చే పోలీసుల కోసమే ఆ వసతి గృహాన్ని వారికి కేటాయించారు. దీంతో భక్తుల పరిస్థితి గందరగోళంగా మారనుంది. కేశఖండన, శార్ధ మండపాలకు టికానా లేదు. వాన నుంచి రక్షణగా శాశ్వత పద్ధతిలో గోదావరి చెంత వాటిని నిర్మించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పక్కన పెట్టింది. దీంతో టెంట్లే దిక్కు కానున్నాయి. ఈ ఆలయానికి రూ.2.60 కోట్లు అడిగితే రూ.1.60 కోట్లు కేటాయించారు. -
పుష్కరాలపై ప్రత్యేక వెబ్సైట్
హైదరాబాద్: గోదావరి పుష్కరాలపై త్వరలో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. పుష్కరాల సందర్భంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కోసం నిపుణల బృందాల్ని నియమించామన్నారు. శాసనసభలోని తన చాంబర్లో బుధవారం గోదావరి పుష్కరాలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో ఓ బృందం శృంగేరి తదితర ప్రాంతాలకు వెళ్లి అక్కడి పీఠాధిపతులు, మత పెద్దలను ఆహ్వానిస్తుందన్నారు. పుష్కరాలకు హాజరుకావాలంటూ స్వయంగా తానే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితోపాటు రాష్ర్టపతిని ఆహ్వానిస్తానన్నారు. గోదావరి పుష్కరాలను జాతీయ వేడుకల కింద పరిగణించాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్నారు. పుష్కరాల లోగోను వచ్చే నెల పదో తేదీలోగా నిర్ణయిస్తామన్నారు. సమీక్షా సమావేశంలో మంత్రి మాణిక్యాలరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్ కృష్ణారావు, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, కమిషనర్ అనురాధ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అదిత్యనాథ్‌దాసు తదితరులు పాల్గొన్నారు.