ఇరవై ఏడు శాపాలై క్రోధావరి ప్రశ్నిస్తోంది
పాపాల పంపిణీకై కూచుంది
కోటగుమ్మం ఎందుకు
వేట గుమ్మం అయిందని గద్దిస్తోంది
ఒక్కొక్కరే వస్త్తున్నారు పుష్కర ముష్కరులు
పుష్కరం ఏడాదంతా ఉంటుంది
ఎప్పుడైనా వచ్చి ఏ తీరంలోనైనా
పుణ్యస్నానాలు చేయొచ్చని చెప్పకుండా
అర్థం కాని శ్లోకాలు చెప్పి
మట్టి ముందెయ్యాలి వెనుకెయ్యాలి అన్న
వారంతా తప్పకుండా నరకానికే పోతారు
ప్రభుత్వమూ, కాంట్రాక్టర్లూ కలిసి
ఏ పనులు ఎవరు చేస్తున్నారో తెలీని
జన గండాన్ని రాజమంద్రంలో సృష్టించినందుకు
వీళ్లకీ నరకం తప్పదు
ఒక నిష్టా గరిష్ట నిరాడంబర దీక్షా బద్ధ
సంప్రదాయం మీద పడి
దాన్ని మార్కెట్ సరుకు చేస్తే
ఇలాంటి ఫలితాలే వస్తాయి.
ఒక జీవనది పుష్కరం పేరిట
ఇరవై ఏడు జీవ నదుల్ని బలి చేసిన నేరం
క్రోధావరి అందరికీ సమానంగా పంచుతోంది
ఇక ఎంతమంది మునిగిలేస్తేనేం?
మహా సమర్థవంతమైన నిర్వహణ
చేసేసాం అనే ఘనత
మెడలో గోల్డ్ మెడల్ కావాలన్న అత్యాశలకు,
వికృత మార్కెట్ విన్యాసాలకు గాను
దక్కేవి గోల్డ్ మెడళ్లు కావు!
ఈ పాలకులు, ఈ వ్యవస్థ,
ఈ ప్రచార సాధనాల
మెడల్లో వేలాడుతున్నాయి
ఇరవై ఏడు శాపాల కోల్డ్ మెడళ్లు!!
జలా పాపం జలా బండెడు
జల ఘట్టాలను బలి ఘట్టాలు చేసినందుకు
ఒళ్లు మండి పారుతోంది గోదావరి క్రోధావరి
అందరూ ఎక్కాల్సిందే బోను
నరక శిక్షలు స్వీకరించాల్సిందే.
- రామతీర్థ, 98492 00385
జలా పాపం జలా పిడికెడు
Published Thu, Jul 16 2015 1:41 AM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM
Advertisement