Kotagummam
-
అరకోటి విలువైన బాణాసంచా స్వాధీనం
కోటగుమ్మం (రాజమండ్రి) : రాజమండ్రి నగరంలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.50 లక్షల విలువైన బాణాసంచాను అధికారులు సీజ్ చేశారు. నగరంలోని మోచీ వీధిలో ఉన్న అరవ సుబ్బరాజు అనే వ్యాపారికి చెందిన ఏడు గోదాములపై మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులు సోదాలు చేశారు. ఆ గోదాముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన రూ.50 లక్షల విలువైన మందుగుండు సామగ్రిని సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సోదాల్లో రాజమండ్రి అర్బన్ ఎస్పీ బి.శరత్ బాబుతోపాటు అగ్నిమాపక, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
జలా పాపం జలా పిడికెడు
ఇరవై ఏడు శాపాలై క్రోధావరి ప్రశ్నిస్తోంది పాపాల పంపిణీకై కూచుంది కోటగుమ్మం ఎందుకు వేట గుమ్మం అయిందని గద్దిస్తోంది ఒక్కొక్కరే వస్త్తున్నారు పుష్కర ముష్కరులు పుష్కరం ఏడాదంతా ఉంటుంది ఎప్పుడైనా వచ్చి ఏ తీరంలోనైనా పుణ్యస్నానాలు చేయొచ్చని చెప్పకుండా అర్థం కాని శ్లోకాలు చెప్పి మట్టి ముందెయ్యాలి వెనుకెయ్యాలి అన్న వారంతా తప్పకుండా నరకానికే పోతారు ప్రభుత్వమూ, కాంట్రాక్టర్లూ కలిసి ఏ పనులు ఎవరు చేస్తున్నారో తెలీని జన గండాన్ని రాజమంద్రంలో సృష్టించినందుకు వీళ్లకీ నరకం తప్పదు ఒక నిష్టా గరిష్ట నిరాడంబర దీక్షా బద్ధ సంప్రదాయం మీద పడి దాన్ని మార్కెట్ సరుకు చేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి. ఒక జీవనది పుష్కరం పేరిట ఇరవై ఏడు జీవ నదుల్ని బలి చేసిన నేరం క్రోధావరి అందరికీ సమానంగా పంచుతోంది ఇక ఎంతమంది మునిగిలేస్తేనేం? మహా సమర్థవంతమైన నిర్వహణ చేసేసాం అనే ఘనత మెడలో గోల్డ్ మెడల్ కావాలన్న అత్యాశలకు, వికృత మార్కెట్ విన్యాసాలకు గాను దక్కేవి గోల్డ్ మెడళ్లు కావు! ఈ పాలకులు, ఈ వ్యవస్థ, ఈ ప్రచార సాధనాల మెడల్లో వేలాడుతున్నాయి ఇరవై ఏడు శాపాల కోల్డ్ మెడళ్లు!! జలా పాపం జలా బండెడు జల ఘట్టాలను బలి ఘట్టాలు చేసినందుకు ఒళ్లు మండి పారుతోంది గోదావరి క్రోధావరి అందరూ ఎక్కాల్సిందే బోను నరక శిక్షలు స్వీకరించాల్సిందే. - రామతీర్థ, 98492 00385 -
కోటగుమ్మంలో మృత్యు ఘోష
పవిత్ర గోదావరి పుష్కరాల ప్రారంభం రోజునే రాజమండ్రిలో తీవ్ర తొక్కిసలాట జరిగి 29 మంది ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమైనది. నగరంలోని కోటగుమ్మం స్నానఘట్టం వద్ద బుధవారం ఉదయం జరిగిన ఈ తొక్కిసలాట ఎన్నో కుటుంబాల్లో పెను విషాదం మిగిల్చింది. పలువురిని ఆస్పత్రులపాలు చేసింది. ఘటనకు దారితీసిన పరిస్థితులను గమనిస్తే ప్రభుత్వ యంత్రాంగంలోని అలసత్వమూ, నిర్లక్ష్యమూ కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. పుష్కరాలపై ఇన్ని నెలలుగా సాగుతున్నదంతా ప్రచారార్భాటమేనని అర్థమవుతుంది. ఈ విషాదం సంభవించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలోనే ఉన్నారు. నిజానికి ఆయన కోసం నాలుగు గంటలపాటు భక్తులను నిలిపి ఉంచిన కారణంగానే జనసందోహం అంతకంతకు పెరిగిపోయి ఈ స్థితి ఏర్పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులతో తెల్లారుజామున 4.30 గంటలనుంచి స్నానాల కోసం నిరీక్షిస్తున్నవారిని నాలుగు గంటలు ఆపేయడమే తప్పనుకుంటే... వారందరినీ చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు వెళ్లిన వెంటనే ఒకేసారి స్నానఘట్టానికి అనుమతించడం మరింత నేరం. ఆ స్నానఘట్టం వద్ద ఒకే ఒక్క ప్రవేశ ద్వారం ఉన్నదంటేనే ఏర్పాట్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో తెలుస్తుంది. ఈ తొక్కిసలాట జరుగుతున్న సమయానికి ఇంకా కోట గుమ్మం సెంటర్లోనే ఉన్న చంద్రబాబు కాన్వాయ్‌కు ఒక మహిళ అడ్డుపడి ఆ ఉదంతాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనంలేకపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అప్పుడు డీజీపీపైనా, ఉన్నతాధికారులపైనా బాబు మండిపడటం వల్ల కలిగే ప్రయోజనమేమిటో అర్థంకాదు. పాలనలో తనకు అపారమైన అనుభవమున్నదని తరచు చంద్రబాబు చెప్పుకుంటారు. క్రితం పుష్కరాల సమయానికి ఆయనే సీఎంగా ఉన్నారు. ఆ అనుభవమంతా ఇప్పుడు ఏ గంగలో కలిసిందో మరి. సామాన్య పౌరులు స్నానం చేసే చోటికే తానూ వెళ్తే సామాన్యులకు ఇబ్బందులు తలెత్తవచ్చునని ఆయన ఆలోచించలేకపోయారు. పన్నెండేళ్లకొక పర్యాయం వచ్చే పుష్కరాలు తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైనవనీ... పుణ్య స్నానాలాచరించడానికీ, మరణించిన ఆప్తులకు పితృ కర్మలు నిర్వర్తించడానికీ నలుమూలలనుంచీ లక్షలమంది వస్తారని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియనిది కాదు. తానే పుష్కరాలపై కొన్ని నెలలుగా ప్రచారం చేస్తున్నది కనుక అందుకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేసుకుని ఉండాలి. ఆ ఏర్పాట్లలో నిమగ్నం కావడానికి ముందు ఇంతటి జనసందోహం ఒకచోటకు చేరుతున్నప్పుడు రాగల సమస్యలేమిటన్న విషయంలో అంచనా ఉండాలి. భక్తి ప్రపత్తులతో వచ్చేవారికి కల్పించాల్సిన కనీస భద్రతపై దృష్టి పెట్టాలి. అవేమీ లేవు సరిగదా... కనీసం అక్కడున్నవారికి మంచినీటి సౌకర్యం కూడా లేదు. తొక్కిసలాట సమయంలో తీవ్రంగా గాయపడినవారు గుక్కెడు నీళ్లిమ్మని రోదిస్తున్నా చుట్టు పక్కల ఎక్కడా మంచినీరు లేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అలా నీళ్లు అందించగలిగి ఉంటే వారిలో కొందరి ప్రాణాలైనా కాపాడటం సాధ్యమయ్యే దంటున్నారు. మంచినీళ్ల సంగతలా ఉంచి ఆ దరిదాపుల్లో అంబులెన్స్లుగానీ, వైద్య నిపుణుల జాడగానీ లేదంటే ఏర్పాట్లు ఎంత అస్తవ్యస్థంగా ఉన్నాయో తెలుస్తుంది. గాయపడినవారిని కొంత దూరం వరకూ మోసుకెళ్లాల్సివచ్చిందని కొందరు చెబుతున్న తీరు చూస్తే రాజమండ్రిలో ప్రభుత్వమనేది ఉన్నదా అనే అనుమానం కలుగుతుంది. ప్రజల భక్తివిశ్వాసాలను గౌరవించడం, ప్రభుత్వపరంగా అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ, రాజమండ్రిలో స్నానం చేస్తేనే పుణ్యం లభిస్తుందన్న స్థాయిలో ప్రచారం చేయడం సబబేనా? పోనీ అలా ప్రచారం చేసిన ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేయగలిగిందా? ముఖ్యమంత్రి కొందరు మంత్రుల్ని తీసుకుని జపాన్ పర్యటనకెళ్తే... మిగిలిన మంత్రుల్లో కొందరు తానా సభల కోసమంటూ అమెరికా వెళ్లారు. బీజేపీ నేత, దేవాదాయ మంత్రి మాణిక్యాలరావుకు ఈ పుష్కర పనుల్లో ప్రమేయం కల్పించాల్సి ఉన్నా ఆయన సేవలు వినియోగించుకోలేదంటున్నారు. ఆయన వరకూ ఎందుకు... బీజేపీకి చెందిన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకు కూడా బాధ్యతలు అప్పగించలేదని చెబుతున్నారు. ఏతావాతా అక్కడ దిక్కూ మొక్కూ లేదు. పుష్కరాల ముహూర్తం ఆగమించే సమయానికి వారం ముందు వచ్చి చంద్రబాబు హడావుడి చేశారు. ఇంకా ఏర్పాట్లేవీ పూర్తికాలేదా అంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. కనీసం అప్పుడైనా కళ్లు తెరిచి ఇలాంటి పరిస్థితుల్లో రాజమండ్రికి అసంఖ్యాకంగా భక్తులు రావడం శ్రేయస్కరం కాదన్న ఆలోచన చేసి ఉండాల్సింది. పుష్కరాలపై జనంలో ఉండే భక్తి విశ్వాసాలన్నీ తమ పార్టీకే లబ్ధి చేకూర్చాలనీ... పుష్కర పనులైనా, అందుకు సంబంధించిన పథకాలైనా తమవారికే దక్కాలనీ చంద్రబాబు భావించిన పర్యవసానంగానే... ఎవరినీ కలుపుకొని వెళ్లలేని ఆయన అశక్తతే ఇంతమంది ప్రాణాలు తీసింది. విపరీతమైన జనసమ్మర్థం ఒకచోట చేరినప్పుడు తొక్కిసలాటలుండవచ్చుననడానికి గతంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని నయనాదేవి ఆలయంవద్ద, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న చాముండేశ్వరి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలే రుజువు. అలాగే.. అలాంటి దురదృష్ట ఘటన లకు చోటీయని శ్రావణబెళగొళ, వైష్ణోదేవి, స్వర్ణాలయంవంటివి ఉన్నాయి. వీటన్ని టినీ అధ్యయనం చేసి ఉంటే కోటగుమ్మం ఘటన జరిగి ఉండేది కాదు. నదీ స్నానాని కొచ్చినవారిని సురక్షితంగా తిరిగి వారి వారి ఇళ్లకెళ్లేలా చేయలేక పోవడమంటే... అది నిర్లక్ష్యం మాత్రమే కాదు-క్షమించరాని నేరం. అది అసమర్థత మాత్రమే కాదు- అమానుషత్వం. న్యాయవిచారణకు ఆదేశించి ఈ నేరాన్ని కప్పిపుచ్చుకోవడం, ఈ అమానుషత్వాన్ని దాచివుంచడం చంద్రబాబుకు సాధ్యం కాదుగాక కాదు. -
గోదావరి మధ్యలో 120 మంది..
కోటగుమ్మం: గోదావరిలో ప్రయూణిస్తున్న రెండు లాంచీలు ఈదురుగాలులు, వర్షం వల్ల నది మధ్యలో నిలిచిపోయాయి. దీంతో ఈ రెంటిలో ఉన్న 120 మంది ప్రయాణికులు దాదాపు రెండుగంటలు ఆందోళనగా గడిపారు. శనివారం సాయంత్రం రాజమండ్రి నుంచి కొవ్వూరు వెళ్తున్న సరంగి పేరు కలిగిన లాంచీ ఈదురుగాలులకు అటూఇటూ ఊగిసలాడింది. దీంతో నావికులు లాంచీని పాత వంతెన సమీపంలో ఇసుకతిన్నె వద్దకు చేర్చి లంగర్ వేసి నిలిపివేశారు. అదే సమయంలో కొవ్వూరు నుంచి రాజమండ్రి వస్తున్న మరో లాంచీకి కూడా అదే పరిస్థితి ఏర్పడడంతో దగ్గరలో ఉన్న ఇసుకతెన్నె వద్దకు చేర్చి నిలిపివేశారు. చీకటి పడడం, వర్షం కురుస్తుండడంతో ఆలాంచీల్లో ఉన్న ప్రయూణికులు తీవ్ర ఆందోళనకు గురై ప్రాణాలు అరచేత పెట్టుకుని గడిపారు. కొందరు ప్రయాణికులు పోలీసులకు, 108 నంబర్‌కి ఫోన్ చేసి సమాచారం అందించడంతో రెవెన్యూ, ఫైర్ సిబ్బంది స్పందించి లాంచీలు ఒడ్డుకు చేర్చే ఏర్పాట్లు చేశారు. ఈదురుగాలులు కొంతతగ్గగానే రాజమండ్రి అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసు అధికారులు ప్రత్యేక బోటులో వెళ్లి లాంచీలను ఒడ్డుకు చేర్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. -
భద్రతతో ‘సెల్’గాటం!
కోటగుమ్మం,(రాజమండ్రి) :రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఖైదీలు సెల్‌ఫోన్ వినియోగం కలవరపరుస్తోంది. జైలులో అధికారులు ఫోన్ సౌకర్యం కల్పించినా, ఖైదీల వద్ద సెల్ఫోన్లు లభిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు జైలు అధికారులే వీరినిప్రోత్సహిస్తున్నట్టు ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అలాగే కోర్టులకు వాయిదాల నిమిత్తం వెళ్లిన ఖైదీలు వీటిని జైలులోకి తీసుకువెళుతున్నట్టు సమాచారం. బయట నుంచి ఖైదీలకు వస్తున్న ఆహార పదార్ధాల ద్వారా, ఇతర మార్గాల ద్వారా సెల్ ఫోన్లు ఖైదీలకు చేరుతున్నాయి. వీటిని బ్యారక్ల వ ద్ద భూమిలో గోతులు తీసి వాటిని అందులో భద్రపరుచుకుంటున్నారు. వీటిని రాత్రిళ్లు లాకప్ అనంతరం బయటకు తీసి వినియోగిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ సౌకర్యం ఉన్నా... రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీలు మాట్లాడుకునేందుకు ల్యాండ్ ఫోన్ సౌకర్యం ఉంది. జైలు అధికారులు కల్పించిన ఈ ఫోన్లలో మాట్లాడిన మాటల వాయిస్ రికార్డు అవుతుంది. దీంతో కొంతమంది ఖైదీలు అధికారులకు సొమ్ములిచ్చి... బయట నుంచి సెల్ఫోన్లు రప్పించుకుని, అక్కడి నుంచే అసాంఘిక కార్యకలాపాలను నిర్వహించుకుంటున్నారు. బంధువులతో మాట్లాడుకునే ఖైదీలు మాత్రం జైలులో ఉన్న ల్యాండ్ ఫోన్‌నే వినియోగిస్తున్నారు. ఒకే నెలలో ఐదు సెల్ఫోన్లు లభ్యం జూలై, ఆగస్టు నెలల్లో సెంట్రల్ జైలులో మొత్తం ఐదు సెల్ఫోన్లు లభ్యమయ్యాయి. 2 ఏ బ్లాక్‌లో అల్తాఫ్ హుసేన్ భక్షి అనే ఖైదీ వద్ద ఒక సెల్ ఫోన్, స్నేహ బ్లాక్‌లో గంధపు చెక్కల స్మగ్లర్స్ వద్ద మూడు సెల్ ఫోన్లు, ఛార్జర్లు లభించాయి. అలాగే 2 ఏ బ్లాక్‌లో పలివెల సత్తిబాబు, గంటశాల వెంకట రమణ అనే ఖైదీల వద్ద సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో బయట పడుతున్న సెల్ఫోన్ల వల్ల పర్యవేక్షణ లోపం బయట పడుతుంది. ఇప్పటికైనా జైలు అధికారులు అప్రమత్తంగా ఉండి, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
వీడి వెళ్లాల్సిందేనా!
కోటగుమ్మం(రాజమండ్రి), న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనతో ఉద్యోగులను స్థానికత ఆధారంగా బదిలీ చేస్తుండడంతో జైళ్ల శాఖ ఉద్యోగుల్లో గుబులు పుడుతోంది. విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు చేసుకుంటున్న తెలంగాణ ఉద్యోగులకు.. ‘విభజన ప్రక్రియ’ శాపంగా మారింది. కొంతమంది ఉద్యోగులు ఇక్కడే ఉద్యోగాలు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. ఇక్కడ అలవాటు పడిన ఉద్యోగులు తెలంగాణ వెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. ఈ బదిలీల వల్ల పిల్లల చదువులకు ఆటంకం ఏర్పడుతుందని, బదిలీపై వెళితే అక్కడ వసతి, పిల్లల చదువులు కష్టంగా మారుతాయని ఉద్యోగులు చెబుతున్నారు. పిల్లల చదువులు పూర్తయ్యే వరకు ఇక్కడ ఉంచాలంటే కుటుంబం ఒకచోట, పిల్లలు వేరేచోట ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బదిలీలు తప్పనిసరి కాకుండా ఉద్యోగుల అభీష్టానికి విడిచిపెట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే 120 మంది బదిలీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో వార్డర్లుగా పనిచేస్తున్న 120 మంది తెలంగాణ వారిని ఇప్పటికే బదిలీ చేశారు. జూన్ 2వ తేదీ అపాయింటెడ్ డే నాటికి కోస్తా రీజియన్ పరిధిలో మరో 50 మంది తెలంగాణ ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశం ఉందని కోస్తా రీజియన్ జైళ్ల శాఖ డీఐజీ ఎ.నరసింహ తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే ఈ బదిలీలు ఖాయమన్నారు. అపాయింటెడ్ డే నాటికి రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ కె.న్యూటన్, మరో ముగ్గురు డిప్యూటీ సూపరింటెండెంట్ల బదిలీ ఖరారైంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడితే మరింత మంది బదిలీలు జరుగుతాని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. -
పోలింగ్ ప్రశాంతం
కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్‌లైన్ : ది ఆర్యాపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా నగరంలో కోలాహలం నెలకొంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక దానవాయిపేటలోని ఎస్‌కేవీటీ హైస్కూల్, వీటీ డిగ్రీ కళాశాలలో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ మందకొండిగా ప్రారంభమైంది. మొత్తం 50,376 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. రాజమండ్రితో పాటు దివాన్‌చెరువు, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కూడా బ్యాంక్ బ్రాంచీలు ఉన్నాయి. ఈ క్రమంలో కాకినాడలో రెండు, దివాన్ చెరువు, తాడేపల్లిగూడెంలో ఒక్కొక్క బూత్‌ను ఏర్పాటు చేసి, పోలింగ్ నిర్వహించారు. మొత్తం 50,376 ఓటర్లకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు 9,704 (19.27 శాతం) ఓట్లు పోలయ్యాయి. మూడు ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుగా అభ్యర్థులు బరిలో నిలిచారు. టీడీపీ నాయకులు ఈ ఎన్నికలపై అంతగా ఆసక్తి చూపలేదు. ఆ పార్టీ నేత మురళీమోహన్ వెంట ఇంటింటికీ తెలుదేశం పార్టీ కార్యక్రమానికి పరిమితం కావడంతో, టీడీపీ ప్రభావం అంతగా లేకపోయింది. ప్రధానంగా కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ మద్దతుతో నిలిచిన అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. పోలింగ్ ముగిసే సమయానికి 39.47 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఎన్నికల ప్రత్యేకాధికారి ఎ.రాధాకృష్ణారావు తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థులు పోలింగ్ జరిగిన ప్రాంగణంలోకి వచ్చి ఓటర్లను అభ్యర్థించడం కనిపించింది. పోలీసులు అభ్యంతరం చెప్పినా.. అభ్యర్థులు అక్కడే ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, బ్యాంక్ చైర్మన్ అభ్యర్థులు లంక సత్యనారాయణ, చల్లా శంకర్రావు, డీవీవీ త్రినాథ్, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, నగర, రూరల్ కోఆర్డినేటర్లు బొమ్మన రాజ్‌కుమార్, ఆకుల వీర్రాజు, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ ఎస్.శివరామ సుబ్రహ్మణ్యం, కాంగ్రెస్ నాయకులు ప్రసాదుల హరినాథ్, రామినీడు మురళి, సీపీఎం నాయకుడు టీఎస్ ప్రకాష్, టి.అరుణ్, సీపీఐ జిల్లా కార్యదర్శి మీసాల సత్యనారాయణ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
‘విభజన’ బిల్లు దహనం
కోటగుమ్మం(రాజమండ్రి), న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజన ముసాయిదా బిల్లు-2013ను అప్రజాస్వామికంగా శాసనసభలో ప్రవేశపెట్టారని నిరసన తెలుపుతూ న్యాయవాదులు సోమవారం స్థానిక జిల్లా కోర్టు ఎదుట ఆ బిల్లు ప్రతులను తగులబెట్టారు. ఈ సందర్భంగా సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కోకన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ సీమాంధ్రలోని సుమారు 6 కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ, అహంకారపూరితంగా విభజన బిల్లు తీసుకురావడం ఇటలీ సోనియాకే చెల్లిందని దుయ్యబట్టారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజున రాష్ట్ర విభజన బిల్లును అప్రజాస్వామికంగా ప్రవేశ పెట్టడం దురదృష్టకరమని చెప్పారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ప్రజా ప్రతినిధులు.. కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపాలని కోరారు. లేకుంటే చరిత్రలో సీమాంధ్ర ద్రోహులుగా మిగులుతారని హెచ్చరించారు. అప్రజాస్వామికంగా, దొడ్డిదారిన శాసనసభలో బిల్లును ప్రవేశపెడితే.. దానిపై నిరసన తెలిపిన వారి భావవ్యక్తీకరణ స్వేచ్ఛని హరించి, దాడులు చేస్తుంటే.. భవిష్యత్తులో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అవగతమవుతోందన్నారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులపై జరిగిన దౌర్జన్యాలను ప్రజాస్వామ్య వాదులు ఖండిచాలన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, కొందరు జాక్ నాయకులు ప్రకటనలు చేయడం మాని, కార్యచరణకు దిగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవేశపెట్టిన రాష్ర్ట విభజన ముసాయిదా బిల్లు-2013 అసెంబ్లీలో చర్చకు వస్తే, అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ బిల్లును న్యాయప్రక్రియ ద్వారా ఎదుర్కొని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సీమాంధ్ర న్యాయవాదుల జాక్ ప్రయత్నిస్తోందని వివరించారు. రాజమండ్రి బార్ అసోసియేషన్ కార్యదర్శి ఈఎంఎస్ బాబు, ప్రతినిధులు తమ్మరెడ్డి పాణిగ్రాహి, ఎస్.రమణమూర్తి, ఆంజనేయబాబు, జి.కృష్ణకపూర్, విక్టోరియా, సీహెచ్ రామారావు చౌదరి, టి.వీరేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నేతలపై క్రిమినల్ చర్యలు
కోటగుమ్మం, న్యూస్‌లైన్:న్యాయవాదులను దుర్భాషలాడిన కాంగ్రెస్ నేతలపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కో - కన్వీనర్ ముప్పాళ్ళ సుబ్బారావు స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రి బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర రక్షణ కోసం తొలినుంచి ఉద్యమిస్తున్న న్యాయవాదులను కించపరుస్తూ, కాంగ్రెస్ నేతలు దుర్భాషలాడారన్నారు. న్యాయవాదుల జేఏసీ ప్రకటించిన కార్యక్రమాలనే న్యాయవాదులు చేపడుతున్నారని, అవి వ్యక్తిగత కార్యక్రమాలు కావని గ్రహించకుండా దుర్భాషలాడడం, అసభ్య పదజాలంతో ప్రసంగించడం వారి కుసంస్కారమని ఆయన విమర్శించారు. రాజమండ్రి సిటి ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు తన సమక్షం లోనే అనుచరులు రెచ్చిపోతున్నా నిరోధించకపోవడం శోచనీయమని, పైగా నేనూ లాయర్నే అనడం దురదృష్టకరమని అన్నారు. స్పీకర్ ఫార్మెట్‌లోనే రాజీనామా ఇస్తే, ఆ లేఖను విలేకరులకు ఎందుకు చూపించలేదని ఆయన ఎమ్మెల్యేని ఉద్దేశించి ప్రశ్నించారు. రాజీనామా చేసిన తరువాత కూడా గన్ మెన్‌ను రక్షణ ఎందుకు తీసుకుంటున్నారని, ఎమ్మెల్యేగా సకల సదుపాయాలు ఎందుకు ఉపయోగించుకుంటున్నారో వివరణ ఇవ్వాలని నిలదీశారు. న్యాయవాదుల జేఏసీ పిలుపు మేరకు అందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాసాల ముందు తాము ఆందోళన నిర్వహించామని తెలిపారు. దీనిని మరచి తననే టార్గెట్ చేశారని ఎమ్మెల్యే రౌతు వితండవాదం చేయడం హాస్యాస్పదమని ముప్పాళ్ళ అన్నారు. నాయకులు రాజీనామాలు చేసి సంక్షోభం సృష్టిస్తేనే ఆత్మగౌరవ పోరాటం విజయం సాధిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులను కించపరుస్తూ దుర్భాషలాడిన వారికి చట్ట ప్రకారం గుణపాఠం చెబుతామని, ఇది న్యాయవాదుల ప్రతిష్టకు సంబంధించిన అంశమని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.ఎల్.ఎన్. ప్రసాద్ స్పష్టం చేశారు. కోశాధికారి రమణ మూర్తి, కార్యదర్శి ఎం.ఎ.భాషా, ఎం. ఆంజనేయ బాబు, బి.జె.ఎస్.దివాకర్, రాఘవ రెడ్డి, సిహెచ్ రామారావు చౌదరి, శ్రీనివాస్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.