భద్రతతో ‘సెల్’గాటం!
కోటగుమ్మం,(రాజమండ్రి) :రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఖైదీలు సెల్‌ఫోన్ వినియోగం కలవరపరుస్తోంది. జైలులో అధికారులు ఫోన్ సౌకర్యం కల్పించినా, ఖైదీల వద్ద సెల్‌ఫోన్‌లు లభిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు జైలు అధికారులే వీరినిప్రోత్సహిస్తున్నట్టు ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అలాగే కోర్టులకు వాయిదాల నిమిత్తం వెళ్లిన ఖైదీలు వీటిని జైలులోకి తీసుకువెళుతున్నట్టు సమాచారం. బయట నుంచి ఖైదీలకు వస్తున్న ఆహార పదార్ధాల ద్వారా, ఇతర మార్గాల ద్వారా సెల్ ఫోన్‌లు ఖైదీలకు చేరుతున్నాయి. వీటిని బ్యారక్‌ల వ ద్ద భూమిలో గోతులు తీసి వాటిని అందులో భద్రపరుచుకుంటున్నారు. వీటిని రాత్రిళ్లు లాకప్ అనంతరం బయటకు తీసి వినియోగిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫోన్ సౌకర్యం ఉన్నా...
రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఖైదీలు మాట్లాడుకునేందుకు ల్యాండ్ ఫోన్ సౌకర్యం ఉంది. జైలు అధికారులు కల్పించిన ఈ ఫోన్లలో మాట్లాడిన మాటల వాయిస్ రికార్డు అవుతుంది. దీంతో కొంతమంది ఖైదీలు అధికారులకు సొమ్ములిచ్చి... బయట నుంచి సెల్‌ఫోన్‌లు రప్పించుకుని, అక్కడి నుంచే అసాంఘిక కార్యకలాపాలను నిర్వహించుకుంటున్నారు. బంధువులతో మాట్లాడుకునే ఖైదీలు మాత్రం జైలులో ఉన్న ల్యాండ్ ఫోన్‌నే వినియోగిస్తున్నారు.
ఒకే నెలలో ఐదు సెల్‌ఫోన్లు లభ్యం
జూలై, ఆగస్టు నెలల్లో సెంట్రల్ జైలులో మొత్తం ఐదు సెల్‌ఫోన్లు లభ్యమయ్యాయి. 2 ఏ బ్లాక్‌లో అల్తాఫ్ హుసేన్ భక్షి అనే ఖైదీ వద్ద ఒక సెల్ ఫోన్, స్నేహ బ్లాక్‌లో గంధపు చెక్కల స్మగ్లర్స్ వద్ద మూడు సెల్ ఫోన్లు, ఛార్జర్లు లభించాయి. అలాగే 2 ఏ బ్లాక్‌లో పలివెల సత్తిబాబు, గంటశాల వెంకట రమణ అనే ఖైదీల వద్ద సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో బయట పడుతున్న సెల్‌ఫోన్ల వల్ల పర్యవేక్షణ లోపం బయట పడుతుంది. ఇప్పటికైనా జైలు అధికారులు అప్రమత్తంగా ఉండి, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.