గోదావరి మధ్యలో 120 మంది..
కోటగుమ్మం: గోదావరిలో ప్రయూణిస్తున్న రెండు లాంచీలు ఈదురుగాలులు, వర్షం వల్ల నది మధ్యలో నిలిచిపోయాయి. దీంతో ఈ రెంటిలో ఉన్న 120 మంది ప్రయాణికులు దాదాపు రెండుగంటలు ఆందోళనగా గడిపారు. శనివారం సాయంత్రం రాజమండ్రి నుంచి కొవ్వూరు వెళ్తున్న సరంగి పేరు కలిగిన లాంచీ ఈదురుగాలులకు అటూఇటూ ఊగిసలాడింది. దీంతో నావికులు లాంచీని పాత వంతెన సమీపంలో ఇసుకతిన్నె వద్దకు చేర్చి లంగర్ వేసి నిలిపివేశారు.
అదే సమయంలో కొవ్వూరు నుంచి రాజమండ్రి వస్తున్న మరో లాంచీకి కూడా అదే పరిస్థితి ఏర్పడడంతో దగ్గరలో ఉన్న ఇసుకతెన్నె వద్దకు చేర్చి నిలిపివేశారు. చీకటి పడడం, వర్షం కురుస్తుండడంతో ఆలాంచీల్లో ఉన్న ప్రయూణికులు తీవ్ర ఆందోళనకు గురై ప్రాణాలు అరచేత పెట్టుకుని గడిపారు.
కొందరు ప్రయాణికులు పోలీసులకు, 108 నంబర్‌కి ఫోన్ చేసి సమాచారం అందించడంతో రెవెన్యూ, ఫైర్ సిబ్బంది స్పందించి లాంచీలు ఒడ్డుకు చేర్చే ఏర్పాట్లు చేశారు. ఈదురుగాలులు కొంతతగ్గగానే రాజమండ్రి అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసు అధికారులు ప్రత్యేక బోటులో వెళ్లి లాంచీలను ఒడ్డుకు చేర్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.