కోటగుమ్మం(రాజమండ్రి), న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజన ముసాయిదా బిల్లు-2013ను అప్రజాస్వామికంగా శాసనసభలో ప్రవేశపెట్టారని నిరసన తెలుపుతూ న్యాయవాదులు సోమవారం స్థానిక జిల్లా కోర్టు ఎదుట ఆ బిల్లు ప్రతులను తగులబెట్టారు. ఈ సందర్భంగా సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కోకన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ సీమాంధ్రలోని సుమారు 6 కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ, అహంకారపూరితంగా విభజన బిల్లు తీసుకురావడం ఇటలీ సోనియాకే చెల్లిందని దుయ్యబట్టారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజున రాష్ట్ర విభజన బిల్లును అప్రజాస్వామికంగా ప్రవేశ పెట్టడం దురదృష్టకరమని చెప్పారు.
సీమాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ప్రజా ప్రతినిధులు.. కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపాలని కోరారు. లేకుంటే చరిత్రలో సీమాంధ్ర ద్రోహులుగా మిగులుతారని హెచ్చరించారు. అప్రజాస్వామికంగా, దొడ్డిదారిన శాసనసభలో బిల్లును ప్రవేశపెడితే.. దానిపై నిరసన తెలిపిన వారి భావవ్యక్తీకరణ స్వేచ్ఛని హరించి, దాడులు చేస్తుంటే.. భవిష్యత్తులో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అవగతమవుతోందన్నారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులపై జరిగిన దౌర్జన్యాలను ప్రజాస్వామ్య వాదులు ఖండిచాలన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, కొందరు జాక్ నాయకులు ప్రకటనలు చేయడం మాని, కార్యచరణకు దిగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
రాజ్యాంగ విరుద్ధంగా ప్రవేశపెట్టిన రాష్ర్ట విభజన ముసాయిదా బిల్లు-2013 అసెంబ్లీలో చర్చకు వస్తే, అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ బిల్లును న్యాయప్రక్రియ ద్వారా ఎదుర్కొని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సీమాంధ్ర న్యాయవాదుల జాక్ ప్రయత్నిస్తోందని వివరించారు. రాజమండ్రి బార్ అసోసియేషన్ కార్యదర్శి ఈఎంఎస్ బాబు, ప్రతినిధులు తమ్మరెడ్డి పాణిగ్రాహి, ఎస్.రమణమూర్తి, ఆంజనేయబాబు, జి.కృష్ణకపూర్, విక్టోరియా, సీహెచ్ రామారావు చౌదరి, టి.వీరేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
‘విభజన’ బిల్లు దహనం
Published Tue, Dec 17 2013 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 AM
Advertisement