ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ళ సుబ్బారావు
సాక్షి, తాడితోట (రాజమహేంద్రవరం): ‘ప్రజాస్వామ్య దేశంలో ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని ఏవిధంగా ఖర్చు చేయాలనే దానిపై నిబంధనలున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేసి మరీ దుబారా ఖర్చులు చేస్తుంది. విదేశీ పర్యటనల పేరుతో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లపై తిరుగుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సాధారణ విమానాలలో రూ.వేల వ్యయంతో ప్రయాణిస్తుంటే.. చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో విహరిస్తున్నారు.
ఓ పక్క ఆదాయం లేదంటూనే నెలకు ఒక్క రోజు కూడా ఉపయోగించని ప్రత్యేక బస్సును రూ.5.5 కోట్ల తో కొన్నారు. వందల కోట్లు ఖర్చు పెట్టి రాజధానిలో భవనాలకు శంకుస్థాపనలు చేసి, శిలాఫలకాలు పెడుతున్నారు. నాలుగు సార్లు రాళ్ళు వేసి రూ.350 కోట్లు ఖర్చు చేయడం ఏ పరిపాలనానుభవం కిందకు వస్తుందో టీడీపీ నాయకులే చెప్పాలి’ అన్నారు.. ప్రముఖ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ళ సుబ్బారావు. ‘సాక్షి’కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశం..
‘పోలవరం సందర్శనకు రూ.84.5 కోట్లు
పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు రాష్ట్రానికి అప్పగించి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మొత్తం కేంద్రం మంజూరు చేస్తోంది. కేంద్ర నిధులను పట్టిసీమ ప్రాజెక్టుకు మళ్ళించి తమకు సంబంధించిన వారికి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇంకా పూర్తిగా నిర్మించని పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు ప్రచారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల్ని తరలించడానికి, ఉచితంగా భోజనాలు పెట్టడానికి, సుమారు రూ.84.5 కోట్లు ఖర్చు పెట్టారు.
ధర్మ పోరాట దీక్షల పేరుతో సుమారు రూ.63 కోట్లు ఖర్చు చేశారు. 2018కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు చివరకు చేతులు ఎత్తివేసి కేంద్రాన్ని విమర్శించడానికి పూనుకున్నాడు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఉండాల్సిన దానికన్నా అధిక వ్యయానికి టెండర్లు పిలవడాన్ని వివిధ కేంద్ర సంస్థలు తప్పు పట్టాయి. కేంద్రం ఇచ్చిన సొమ్ము ఎంత, పనులకు రాష్ట్రం ఎంత ఖర్చు చేసిందీ శ్వేతపత్రం విడుదల చేయమంటే విడుదల చేయలేదు. చంద్రబాబు పాలనలో ఇసుక, మట్టి, భూముల వంటి అన్ని వనరులనూ దోచుకున్నారు. ఇలాంటి అవినీతి పాలనలో చంద్రబాబు గిన్నిస్ రికార్డు సాధించాడు.
అమరావతి కాదు భ్రమరావతి..
రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో అమరావతి పేరుతో ప్రజలను మోసం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం సచివాలయం, హై కోర్టు, సెక్రటేరియట్, గవర్నర్ బంగ్లా తదితర భవనాలు రాజధానిలో నిర్మించడానికి కేంద్రం నిధులు మంజూరు చేయాలి. కేంద్ర ప్రభుత్వం భవనాల నిర్మాణానికి కోట్లాది రూపాయలు మంజూరు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా శాశ్వత భవనం నిర్మాణం చేపట్టలేదు. హైకోర్టు, సచివాలయం వంటి వాటికి కూడా తాత్కాలిక భవనాలు నిర్మించారు.
వర్షం వస్తే ఆ భవనాలలో నీరు చేరుతుంది. రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి సేకరించిన వేలాది ఎకరాలను తన అనుయాయులకు, ప్రైవేటు విద్యావైద్య సంస్థలకు అతి తక్కువ ధరలకు కేటాయించి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించకపోగా, వారికి ఉపాధి కల్పించలేదు. రైతులకు ఏవిధమైన ప్రభుత్వం నుంచి సహాయం అందక వీధిన పడ్డారు.
దీక్షల పేరుతో రూ.కోట్ల దుర్వినియోగం
నవ నిర్మాణ దీక్షల పేరుతో సుమారు రూ.80 కోట్లు ఖర్చు చేశారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా దీక్షల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన దాఖలాలు లేవు. ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే దీక్షల పేరుతో ప్రజా ధనం దుర్వినియోగం చేసింది. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టింది. ఒక్క సంవత్సరం కూడా హైదరాబాద్ సచివాలయంలో ఉండకుండా సచివాలయం ఎల్ బ్లాక్ రిపేర్లుకు రూ.14.63 కోట్లు ఖర్చు చేశారు. దీనిని ఏవిధంగా సమర్థిస్తారు. ముఖ్యమంత్రి కార్యాలయం మరమ్మతులకు సుమారు రూ.6.90 కోట్లు ఖర్చు చేశారు. తన కుటుంబాన్ని హోటల్ పార్కు హయాత్‌లో పెట్టి కోట్లు ఖర్చు చేయడం నిజం. దీని వలన ప్రజలకు ఒనగూరేది ఏమీ లేదు. పుష్కరాల పేరుతో కోట్లు ఖర్చు చేసి 29 మందిని బలి చేశారు. అనేక మంది క్షతగాత్రులవడానికి కారకులయ్యారు.
ప్రత్యేకహోదాపై యూ టర్న్
కేంద్ర ప్రభుత్వంతో టీడీపీ మిత్రత్వం కొనసాగినంత కాలం ప్రత్యేక హోదాను వ్యతిరేకించి అదేమైనా సంజీవినా, దానివల్ల ఒరిగేది ఏమీ లేదని చెబుతూ ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేసిన వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంతో పొత్తుకు స్వస్తి చెప్పాక యూ టర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కు తానే పోరాట యోధుడినని ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదం. విద్యార్థులపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తానన్న చంద్రబాబు యూటర్న్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశాడు.
‘ఐటీ గ్రిడ్స్’పై సమగ్ర విచారణ జరపాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం నేరం. పౌరుల ప్రైవసీ సమాచారాన్ని సేవా మిత్ర పేరుతో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలకు అందజేయడం, నాలుగు విభాగాలు గా విభజించి ఏ పార్టీకి చెందిన వారు, ఏపార్టీకి అభిమానులు వంటి మొత్తం సమాచారాన్ని దుర్వినియోగం చేశారు. వీటిని ప్రశ్నించిన వారిని రౌడీలుగా చిత్రీకరిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి పోయిన చంద్రబాబు ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత డేటాను ఇవ్వడం దారుణం. దీని పై ఎన్నికల కమిషన్ సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. యాప్‌ను ఏర్పాటు చేసి ప్రైవేటు సంస్థల ద్వారా దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించడం చట్టరీత్యా నేరం.
‘బాబు’కు బుద్ధి చెప్పడం తథ్యం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓట్ల తొలగింపు చేస్తున్న ప్రైవేటు సంస్థల పై చర్యలు తీసుకోవడం మాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య సమస్యగా చిత్రీకరించడం బాధ్యతారాహిత్యం. దీనిపై ఫిర్యాదు చేసిన వారిని భయభ్రాంతులకు గురి చేయడం దారుణం. నేరం ఎక్కడ జరిగితే అక్కడ పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. అంతే గాని చంద్రబాబు తెలంగాణ పోలీసులకు సంబంధం లేనట్లు మాట్లాడడం అవివేకం. చట్టం ముందు అందరూ సమానులే ఎవరూ అతీతులు కాదు. చంద్రబాబు అవినీతి పాలనను ప్రజలు గమనిస్తున్నారు. తగిన సమయంలో బుద్ధి చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment