muppalla subbarao
-
అవినీతిలో చంద్రబాబుది ‘గిన్నిస్’ రికార్డు
సాక్షి, తాడితోట (రాజమహేంద్రవరం): ‘ప్రజాస్వామ్య దేశంలో ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని ఏవిధంగా ఖర్చు చేయాలనే దానిపై నిబంధనలున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేసి మరీ దుబారా ఖర్చులు చేస్తుంది. విదేశీ పర్యటనల పేరుతో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లపై తిరుగుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు సాధారణ విమానాలలో రూ.వేల వ్యయంతో ప్రయాణిస్తుంటే.. చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో విహరిస్తున్నారు. ఓ పక్క ఆదాయం లేదంటూనే నెలకు ఒక్క రోజు కూడా ఉపయోగించని ప్రత్యేక బస్సును రూ.5.5 కోట్ల తో కొన్నారు. వందల కోట్లు ఖర్చు పెట్టి రాజధానిలో భవనాలకు శంకుస్థాపనలు చేసి, శిలాఫలకాలు పెడుతున్నారు. నాలుగు సార్లు రాళ్ళు వేసి రూ.350 కోట్లు ఖర్చు చేయడం ఏ పరిపాలనానుభవం కిందకు వస్తుందో టీడీపీ నాయకులే చెప్పాలి’ అన్నారు.. ప్రముఖ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ళ సుబ్బారావు. ‘సాక్షి’కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశం.. ‘పోలవరం సందర్శనకు రూ.84.5 కోట్లు పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు రాష్ట్రానికి అప్పగించి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మొత్తం కేంద్రం మంజూరు చేస్తోంది. కేంద్ర నిధులను పట్టిసీమ ప్రాజెక్టుకు మళ్ళించి తమకు సంబంధించిన వారికి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇంకా పూర్తిగా నిర్మించని పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు ప్రచారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల్ని తరలించడానికి, ఉచితంగా భోజనాలు పెట్టడానికి, సుమారు రూ.84.5 కోట్లు ఖర్చు పెట్టారు. ధర్మ పోరాట దీక్షల పేరుతో సుమారు రూ.63 కోట్లు ఖర్చు చేశారు. 2018కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు చివరకు చేతులు ఎత్తివేసి కేంద్రాన్ని విమర్శించడానికి పూనుకున్నాడు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఉండాల్సిన దానికన్నా అధిక వ్యయానికి టెండర్లు పిలవడాన్ని వివిధ కేంద్ర సంస్థలు తప్పు పట్టాయి. కేంద్రం ఇచ్చిన సొమ్ము ఎంత, పనులకు రాష్ట్రం ఎంత ఖర్చు చేసిందీ శ్వేతపత్రం విడుదల చేయమంటే విడుదల చేయలేదు. చంద్రబాబు పాలనలో ఇసుక, మట్టి, భూముల వంటి అన్ని వనరులనూ దోచుకున్నారు. ఇలాంటి అవినీతి పాలనలో చంద్రబాబు గిన్నిస్ రికార్డు సాధించాడు. అమరావతి కాదు భ్రమరావతి.. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో అమరావతి పేరుతో ప్రజలను మోసం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం సచివాలయం, హై కోర్టు, సెక్రటేరియట్, గవర్నర్ బంగ్లా తదితర భవనాలు రాజధానిలో నిర్మించడానికి కేంద్రం నిధులు మంజూరు చేయాలి. కేంద్ర ప్రభుత్వం భవనాల నిర్మాణానికి కోట్లాది రూపాయలు మంజూరు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా శాశ్వత భవనం నిర్మాణం చేపట్టలేదు. హైకోర్టు, సచివాలయం వంటి వాటికి కూడా తాత్కాలిక భవనాలు నిర్మించారు. వర్షం వస్తే ఆ భవనాలలో నీరు చేరుతుంది. రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి సేకరించిన వేలాది ఎకరాలను తన అనుయాయులకు, ప్రైవేటు విద్యావైద్య సంస్థలకు అతి తక్కువ ధరలకు కేటాయించి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించకపోగా, వారికి ఉపాధి కల్పించలేదు. రైతులకు ఏవిధమైన ప్రభుత్వం నుంచి సహాయం అందక వీధిన పడ్డారు. దీక్షల పేరుతో రూ.కోట్ల దుర్వినియోగం నవ నిర్మాణ దీక్షల పేరుతో సుమారు రూ.80 కోట్లు ఖర్చు చేశారు. దేశంలో ఏ ప్రభుత్వం కూడా దీక్షల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన దాఖలాలు లేవు. ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే దీక్షల పేరుతో ప్రజా ధనం దుర్వినియోగం చేసింది. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టింది. ఒక్క సంవత్సరం కూడా హైదరాబాద్ సచివాలయంలో ఉండకుండా సచివాలయం ఎల్ బ్లాక్ రిపేర్లుకు రూ.14.63 కోట్లు ఖర్చు చేశారు. దీనిని ఏవిధంగా సమర్థిస్తారు. ముఖ్యమంత్రి కార్యాలయం మరమ్మతులకు సుమారు రూ.6.90 కోట్లు ఖర్చు చేశారు. తన కుటుంబాన్ని హోటల్ పార్కు హయాత్‌లో పెట్టి కోట్లు ఖర్చు చేయడం నిజం. దీని వలన ప్రజలకు ఒనగూరేది ఏమీ లేదు. పుష్కరాల పేరుతో కోట్లు ఖర్చు చేసి 29 మందిని బలి చేశారు. అనేక మంది క్షతగాత్రులవడానికి కారకులయ్యారు. ప్రత్యేకహోదాపై యూ టర్న్ కేంద్ర ప్రభుత్వంతో టీడీపీ మిత్రత్వం కొనసాగినంత కాలం ప్రత్యేక హోదాను వ్యతిరేకించి అదేమైనా సంజీవినా, దానివల్ల ఒరిగేది ఏమీ లేదని చెబుతూ ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేసిన వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంతో పొత్తుకు స్వస్తి చెప్పాక యూ టర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కు తానే పోరాట యోధుడినని ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదం. విద్యార్థులపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తానన్న చంద్రబాబు యూటర్న్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశాడు. ‘ఐటీ గ్రిడ్స్’పై సమగ్ర విచారణ జరపాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం నేరం. పౌరుల ప్రైవసీ సమాచారాన్ని సేవా మిత్ర పేరుతో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలకు అందజేయడం, నాలుగు విభాగాలు గా విభజించి ఏ పార్టీకి చెందిన వారు, ఏపార్టీకి అభిమానులు వంటి మొత్తం సమాచారాన్ని దుర్వినియోగం చేశారు. వీటిని ప్రశ్నించిన వారిని రౌడీలుగా చిత్రీకరిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి పోయిన చంద్రబాబు ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత డేటాను ఇవ్వడం దారుణం. దీని పై ఎన్నికల కమిషన్ సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. యాప్‌ను ఏర్పాటు చేసి ప్రైవేటు సంస్థల ద్వారా దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించడం చట్టరీత్యా నేరం. ‘బాబు’కు బుద్ధి చెప్పడం తథ్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓట్ల తొలగింపు చేస్తున్న ప్రైవేటు సంస్థల పై చర్యలు తీసుకోవడం మాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య సమస్యగా చిత్రీకరించడం బాధ్యతారాహిత్యం. దీనిపై ఫిర్యాదు చేసిన వారిని భయభ్రాంతులకు గురి చేయడం దారుణం. నేరం ఎక్కడ జరిగితే అక్కడ పోలీసులు కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు. అంతే గాని చంద్రబాబు తెలంగాణ పోలీసులకు సంబంధం లేనట్లు మాట్లాడడం అవివేకం. చట్టం ముందు అందరూ సమానులే ఎవరూ అతీతులు కాదు. చంద్రబాబు అవినీతి పాలనను ప్రజలు గమనిస్తున్నారు. తగిన సమయంలో బుద్ధి చెబుతారు. -
పుష్కర తొక్కిసలాటపై ఇప్పటికీ ఆధారాలివ్వని యంత్రాంగం
29 మంది బలైన ఘోరంపై క్షమార్హం కాని అలసత్వం ఏకసభ్య కమిషన్ ముందు వాయిదా మంత్రజపం రేపటితో ముగియనున్న కమిషన్ గడువు నేడు రాజమహేంద్రవరంలో మరోసారి విచారణ రాష్ట్ర ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతామని ప్రగల్భాలు పలుకుతూ, ‘గాలిలో బొమ్మలు గీసి’ ఊరిస్తున్న ప్రభుత్వం.. 29 నిండు ప్రాణాలు గాలిలో కలిసిన దుర్ఘటన జరిగి ఏడాది కావస్తున్నా.. కారణమేంటో, కారకులెవరో తేల్చలేదు. పుష్కరుడు గోదావరి జలాల్లో ప్రవేశించే పుణ్యఘడియల్లో స్నానమాచరించాలని గంటల తరబడి నిరీక్షించిన వారిపై మృత్యువే తొక్కిసలాట రూపంలో పాశం విసిరింది. అంత ఘోరం జరిగితే దానికి గల అసలు కారణాలను తొక్కేసేందుకు యత్నిస్తున్నట్టుంది అధికార యంత్రాంగం తీరు. కాకినాడ : గత జూలై 14న గోదావరి పుష్కరాల ప్రారంభం నాడు రాజమహేంద్రవరం పుష్కరఘాట్వద్ద జరిగిన తొక్కిసలాట, అనంతర పరిణామాలకు బాధ్యుడు ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఏపీ బార్ అసోసియేషన్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన దుర్ఘటనపై విచారణకు నియమించిన జస్టిస్ సోమయూజులు ఏకసభ్య కమిషన్‌కు కూడా నివేదించారు. సీఎం వీఐపీలకు కేటాయించిన ఘాట్‌లో కాక సాధారణ భక్తుల కోసం ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్‌లో సుమారు గంటపాటు పిండప్రదానాలు చేయడం, ఆయన వెళ్లిపోయే వరకూ లక్షలాది మంది భక్తులను గేటు బయటే నిలిపి ఒకేసారి అనుమతించడం, టెలీఫిల్మ్ నిర్మాణం కోసం కూడా భక్తులు వెల్లువలా ఒకేసారి ఘాట్‌కు వచ్చేలా నిలిపివేయడం ఇందుకు కారణమన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇందులో భాగమవడంతో 29 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. సీఎం సమక్షంలో జరిగినందునే.. దుర్ఘటన జరిగిన కొన్నినెలల తరువాతే ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 15న జస్టిస్ సోమయాజులు కమిషన్ నియమించింది. కమిషన్ మొదటిసారి ఈ ఏడాది జనవరి 18న బహిరంగ విచారణ జరపగా మొదటి అఫిడవిట్‌ను ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు వేశారు. తరువాత 18 మంది అఫిడవిట్లు దాఖలు చేశారు. రెండోసారి ఫిబ్రవరి 23న, మూడోసారి మార్చి 21న బహిరంగ విచారణ నిర్వహించాక కమిషన్ కాలపరిమితి ముగియడంతో సర్కారు మరో మూడు నెలలు కమిషన్ గడువు పెంచింది. అనంతరం జూన్ 18, 21న రెండు పర్యాయాలు విచారణ నిర్వహించగా అఫిడవిట్లు దాఖలు చేసినవారు సమర్పించిన ఆధారాలు, సీడీలను కమిషన్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో పరిశీలించింది. తిరిగి 23న బహిరంగ విచారణ చేపట్టారు. కమిషన్‌కు ఆధారాలు సమర్పించేందుకు ప్రభుత్వం మరో రెండు వారాలు గడువు కోరడంతో తిరిగి జూన్ 28కి విచారణ వాయిదా వేసింది. కాగా కమిషన్ గడువు ఈ నెల 29తో ముగియనుంది. ఇన్నిసార్లు విచారణ నిర్వహించినా అధికారులు దుర్ఘటనకు సంబంధించి ఒక్క ఆధారం కూడా అందజేయకపోవడం గమనార్హం. పుష్కర దుర్ఘటన జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనమైనా, చంద్రబాబు సమక్షంలోనే ఇదంతా జరగడంతో ప్రభుత్వం వాయిదా మంత్రాన్నే జపిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే విచారణలో అధికారులు ఏం చేస్తారో చూడాలి. సీఎంను విచారణకు పిలవాలి.. తొక్కిసలాటప్పుడుఘాట్లో ఉన్న ముఖ్యమంత్రి ప్రత్యక్ష సాక్షి అని, పుష్కరాలను రాజమహేంద్రవరం నుంచి పర్యవేక్షించిన సీఎం తానే ఐ విట్నెస్ అని విలేకరుల సమావేశంలో తెలిపారని, అలాంటి సీఎంను బహిరంగ విచారణకు పిలవాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఏపీబార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ళ సుబ్బారావు, వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు విచారణ జరిపినా జిల్లా యంత్రాంగం నుంచి కనీస సమాచారం, ఆధారాలు అందజేయకపోగా, ఇప్పుడు మరోసారి మూడు నెలల గడువు కోరడాన్ని అఫిడవిట్ దాఖలు చేసిన ముప్పాళ్ల తదితరులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 29న కమిషన్ గడువు ముగిసిపోనున్న తరుణంలో కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ కమిషన్ గడువును మరో మూడు నెలలు పొడిగించాలని ప్రభుత్వానికి లేఖ రాయడం విస్మయాన్ని కలిగిస్తోంది. కమిషన్ అనేక పర్యాయాలు విచారణ జరిపినా ఆధారాలు ఇవ్వలేని యంత్రాంగం మరో మూడు నెలలు పొడిగిస్తే మాత్రం ఇస్తుందనే గ్యారంటీ ఏమిటని అఫిడవిట్లు దాఖలు చేసిన వారు ప్రశ్నిస్తున్నారు. తప్పిదాలు బయట పడతాయనే జాప్యం పుష్కరాల సందర్భంగా అధికారుల తప్పిదాలు బయట పడతాయనే కమిషన్‌కు ఆధారాలు సమర్పించడంలో జాప్యం చేస్తున్నారు. కలెక్టర్ తాను ఇచ్చిన తొలి నివేదికలో ఆధారాలన్నీ సిద్ధంగా ఉన్నాయని, వాటిని ఎప్పుడైనా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అదే కలెక్టర్ మరో మూడు నెలలు గడువు కోరడం గమనార్హం. అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారు. పుష్కరాలకు లక్షలాది రూపాయలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, తీరా ఇప్పుడు దానిలో రికార్డింగ్ చేయలేదని బుకాయిస్తున్నారు. దుర్ఘటన నాడు నేషనల్ జియోగ్రఫిక్ చానల్ చిత్రీకరించిన చిత్రాలను బయటపెట్టాలి. వాస్తవాలు బయట పెట్టకపోతే ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని అర్థమవుతుంది. కమిషన్ గడువు ముగుస్తున్నందున అధికారులు ఆధారాలు సమర్పించి తమ నిజాయితీని నిరూపించుకోవాలి. - ముప్పాళ్ళ సుబ్బారావు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు -
‘విభజన’ బిల్లు దహనం
కోటగుమ్మం(రాజమండ్రి), న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజన ముసాయిదా బిల్లు-2013ను అప్రజాస్వామికంగా శాసనసభలో ప్రవేశపెట్టారని నిరసన తెలుపుతూ న్యాయవాదులు సోమవారం స్థానిక జిల్లా కోర్టు ఎదుట ఆ బిల్లు ప్రతులను తగులబెట్టారు. ఈ సందర్భంగా సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కోకన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ సీమాంధ్రలోని సుమారు 6 కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ, అహంకారపూరితంగా విభజన బిల్లు తీసుకురావడం ఇటలీ సోనియాకే చెల్లిందని దుయ్యబట్టారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజున రాష్ట్ర విభజన బిల్లును అప్రజాస్వామికంగా ప్రవేశ పెట్టడం దురదృష్టకరమని చెప్పారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ప్రజా ప్రతినిధులు.. కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపాలని కోరారు. లేకుంటే చరిత్రలో సీమాంధ్ర ద్రోహులుగా మిగులుతారని హెచ్చరించారు. అప్రజాస్వామికంగా, దొడ్డిదారిన శాసనసభలో బిల్లును ప్రవేశపెడితే.. దానిపై నిరసన తెలిపిన వారి భావవ్యక్తీకరణ స్వేచ్ఛని హరించి, దాడులు చేస్తుంటే.. భవిష్యత్తులో పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అవగతమవుతోందన్నారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులపై జరిగిన దౌర్జన్యాలను ప్రజాస్వామ్య వాదులు ఖండిచాలన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, కొందరు జాక్ నాయకులు ప్రకటనలు చేయడం మాని, కార్యచరణకు దిగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవేశపెట్టిన రాష్ర్ట విభజన ముసాయిదా బిల్లు-2013 అసెంబ్లీలో చర్చకు వస్తే, అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ బిల్లును న్యాయప్రక్రియ ద్వారా ఎదుర్కొని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సీమాంధ్ర న్యాయవాదుల జాక్ ప్రయత్నిస్తోందని వివరించారు. రాజమండ్రి బార్ అసోసియేషన్ కార్యదర్శి ఈఎంఎస్ బాబు, ప్రతినిధులు తమ్మరెడ్డి పాణిగ్రాహి, ఎస్.రమణమూర్తి, ఆంజనేయబాబు, జి.కృష్ణకపూర్, విక్టోరియా, సీహెచ్ రామారావు చౌదరి, టి.వీరేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.