పవిత్ర గోదావరి పుష్కరాల ప్రారంభం రోజునే రాజమండ్రిలో తీవ్ర తొక్కిసలాట జరిగి 29 మంది ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమైనది. నగరంలోని కోటగుమ్మం స్నానఘట్టం వద్ద బుధవారం ఉదయం జరిగిన ఈ తొక్కిసలాట ఎన్నో కుటుంబాల్లో పెను విషాదం మిగిల్చింది. పలువురిని ఆస్పత్రులపాలు చేసింది. ఘటనకు దారితీసిన పరిస్థితులను గమనిస్తే ప్రభుత్వ యంత్రాంగంలోని అలసత్వమూ, నిర్లక్ష్యమూ కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. పుష్కరాలపై ఇన్ని నెలలుగా సాగుతున్నదంతా ప్రచారార్భాటమేనని అర్థమవుతుంది. ఈ విషాదం సంభవించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలోనే ఉన్నారు. నిజానికి ఆయన కోసం నాలుగు గంటలపాటు భక్తులను నిలిపి ఉంచిన కారణంగానే జనసందోహం అంతకంతకు పెరిగిపోయి ఈ స్థితి ఏర్పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
చిన్న పిల్లలు, వృద్ధులతో తెల్లారుజామున 4.30 గంటలనుంచి స్నానాల కోసం నిరీక్షిస్తున్నవారిని నాలుగు గంటలు ఆపేయడమే తప్పనుకుంటే... వారందరినీ చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు వెళ్లిన వెంటనే ఒకేసారి స్నానఘట్టానికి అనుమతించడం మరింత నేరం. ఆ స్నానఘట్టం వద్ద ఒకే ఒక్క ప్రవేశ ద్వారం ఉన్నదంటేనే ఏర్పాట్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో తెలుస్తుంది. ఈ తొక్కిసలాట జరుగుతున్న సమయానికి ఇంకా కోట గుమ్మం సెంటర్‌లోనే ఉన్న చంద్రబాబు కాన్వాయ్‌కు ఒక మహిళ అడ్డుపడి ఆ ఉదంతాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనంలేకపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అప్పుడు డీజీపీపైనా, ఉన్నతాధికారులపైనా బాబు మండిపడటం వల్ల కలిగే ప్రయోజనమేమిటో అర్థంకాదు. పాలనలో తనకు అపారమైన అనుభవమున్నదని తరచు చంద్రబాబు చెప్పుకుంటారు. క్రితం పుష్కరాల సమయానికి ఆయనే సీఎంగా ఉన్నారు. ఆ అనుభవమంతా ఇప్పుడు ఏ గంగలో కలిసిందో మరి. సామాన్య పౌరులు స్నానం చేసే చోటికే తానూ వెళ్తే సామాన్యులకు ఇబ్బందులు తలెత్తవచ్చునని ఆయన ఆలోచించలేకపోయారు.
పన్నెండేళ్లకొక పర్యాయం వచ్చే పుష్కరాలు తెలుగు ప్రజలకు ఎంతో ముఖ్యమైనవనీ... పుణ్య స్నానాలాచరించడానికీ, మరణించిన ఆప్తులకు పితృ కర్మలు నిర్వర్తించడానికీ నలుమూలలనుంచీ లక్షలమంది వస్తారని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియనిది కాదు. తానే పుష్కరాలపై కొన్ని నెలలుగా ప్రచారం చేస్తున్నది కనుక అందుకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేసుకుని ఉండాలి. ఆ ఏర్పాట్లలో నిమగ్నం కావడానికి ముందు ఇంతటి జనసందోహం ఒకచోటకు చేరుతున్నప్పుడు రాగల సమస్యలేమిటన్న విషయంలో అంచనా ఉండాలి. భక్తి ప్రపత్తులతో వచ్చేవారికి కల్పించాల్సిన కనీస భద్రతపై దృష్టి పెట్టాలి. అవేమీ లేవు సరిగదా... కనీసం అక్కడున్నవారికి మంచినీటి సౌకర్యం కూడా లేదు. తొక్కిసలాట సమయంలో తీవ్రంగా గాయపడినవారు గుక్కెడు నీళ్లిమ్మని రోదిస్తున్నా చుట్టు పక్కల ఎక్కడా మంచినీరు లేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అలా నీళ్లు అందించగలిగి ఉంటే వారిలో కొందరి ప్రాణాలైనా కాపాడటం సాధ్యమయ్యే దంటున్నారు.
మంచినీళ్ల సంగతలా ఉంచి ఆ దరిదాపుల్లో అంబులెన్స్‌లుగానీ, వైద్య నిపుణుల జాడగానీ లేదంటే ఏర్పాట్లు ఎంత అస్తవ్యస్థంగా ఉన్నాయో తెలుస్తుంది. గాయపడినవారిని కొంత దూరం వరకూ మోసుకెళ్లాల్సివచ్చిందని కొందరు చెబుతున్న తీరు చూస్తే రాజమండ్రిలో ప్రభుత్వమనేది ఉన్నదా అనే అనుమానం కలుగుతుంది. ప్రజల భక్తివిశ్వాసాలను గౌరవించడం, ప్రభుత్వపరంగా అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ, రాజమండ్రిలో స్నానం చేస్తేనే పుణ్యం లభిస్తుందన్న స్థాయిలో ప్రచారం చేయడం సబబేనా? పోనీ అలా ప్రచారం చేసిన ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేయగలిగిందా? ముఖ్యమంత్రి కొందరు మంత్రుల్ని తీసుకుని జపాన్ పర్యటనకెళ్తే... మిగిలిన మంత్రుల్లో కొందరు తానా సభల కోసమంటూ అమెరికా వెళ్లారు. బీజేపీ నేత, దేవాదాయ మంత్రి మాణిక్యాలరావుకు ఈ పుష్కర పనుల్లో ప్రమేయం కల్పించాల్సి ఉన్నా ఆయన సేవలు వినియోగించుకోలేదంటున్నారు. ఆయన వరకూ ఎందుకు... బీజేపీకి చెందిన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణకు కూడా బాధ్యతలు అప్పగించలేదని చెబుతున్నారు. ఏతావాతా అక్కడ దిక్కూ మొక్కూ లేదు.
పుష్కరాల ముహూర్తం ఆగమించే సమయానికి వారం ముందు వచ్చి చంద్రబాబు హడావుడి చేశారు. ఇంకా ఏర్పాట్లేవీ పూర్తికాలేదా అంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. కనీసం అప్పుడైనా కళ్లు తెరిచి ఇలాంటి పరిస్థితుల్లో రాజమండ్రికి అసంఖ్యాకంగా భక్తులు రావడం శ్రేయస్కరం కాదన్న ఆలోచన చేసి ఉండాల్సింది. పుష్కరాలపై జనంలో ఉండే భక్తి విశ్వాసాలన్నీ తమ పార్టీకే లబ్ధి చేకూర్చాలనీ... పుష్కర పనులైనా, అందుకు సంబంధించిన పథకాలైనా తమవారికే దక్కాలనీ చంద్రబాబు భావించిన పర్యవసానంగానే... ఎవరినీ కలుపుకొని వెళ్లలేని ఆయన అశక్తతే ఇంతమంది ప్రాణాలు తీసింది. విపరీతమైన జనసమ్మర్థం ఒకచోట చేరినప్పుడు తొక్కిసలాటలుండవచ్చుననడానికి గతంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని నయనాదేవి ఆలయంవద్ద, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న చాముండేశ్వరి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలే రుజువు. అలాగే.. అలాంటి దురదృష్ట ఘటన లకు చోటీయని శ్రావణబెళగొళ, వైష్ణోదేవి, స్వర్ణాలయంవంటివి ఉన్నాయి. వీటన్ని టినీ అధ్యయనం చేసి ఉంటే కోటగుమ్మం ఘటన జరిగి ఉండేది కాదు. నదీ స్నానాని కొచ్చినవారిని సురక్షితంగా తిరిగి వారి వారి ఇళ్లకెళ్లేలా చేయలేక పోవడమంటే... అది నిర్లక్ష్యం మాత్రమే కాదు-క్షమించరాని నేరం. అది అసమర్థత మాత్రమే కాదు- అమానుషత్వం. న్యాయవిచారణకు ఆదేశించి ఈ నేరాన్ని కప్పిపుచ్చుకోవడం, ఈ అమానుషత్వాన్ని దాచివుంచడం చంద్రబాబుకు సాధ్యం కాదుగాక కాదు.
కోటగుమ్మంలో మృత్యు ఘోష
Published Wed, Jul 15 2015 1:33 AM | Last Updated on Sun, Sep 3 2017 5:29 AM
Advertisement