ఇన్‌బాక్స్: ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో విజయవాడలో కూల్చిన ఆలయాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. కానీ కృష్ణా పుష్కరాలకు అవి అడ్డుగా ఉన్నాయని ఆయనకు మాత్రమే అనిపించింది. ఎన్నో పుష్కరాలు వచ్చాయి. కానీ ఏ ముఖ్యమంత్రీ, ఏ తీర్థయాత్రికుడు, అధికారీ ఆలయాలు అడ్డుగా ఉన్నాయని భావించలేదు. చంద్రబాబు గోదావరి పుష్కరాలకి మనుషులను బలితీసుకున్నారు. కృష్ణా పుష్కరాలకు ఘన చరిత్ర కలిగిన దేవాలయాను బలిచేశారు. కూల్చివేసి ఇప్పుడు మళ్లీ వాటిని కట్టిస్తారట. అడుసు తొక్కనేల? కాలు కడగనేల? ప్రజాధనంతో ఎందుకీ కుప్పిగంతులు? విశ్వనాథ వారికి జ్ఞానపీఠం ప్రకటించినప్పుడు, వచ్చిన లక్ష రూపాయలు ఏం చేయబోతున్నారని అడిగితే, ఇందులో కొంత మా ఊరిలో ఆలయం జీర్ణోద్ధరణకు ఇస్తానని చెప్పారు.
తక్కిన సొమ్ము సంగతేమిటంటే, ఎన్నో చిల్లులు ఉన్న నా జేబులో వేసుకుంటాను అన్నారట. ఇలాంటి దృష్టి చంద్రబాబుకు సాధ్యమా? కూల్చిన ఆలయాలను తక్షణం నిర్మించాలని వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యదర్శి రాఘవులు కోరడం న్యాయమే. ఆధునిక యుగం గురించి ఎప్పుడూ మాట్లాడే చంద్రబాబు అంధయుగాలలో విధ్వంసకారులు చేసిన పనినే చేశారు. పుష్కర స్నానం చేసిన తరువాత ప్రజలు ఆలయాలను సందర్శిస్తారు? ఇప్పుడు విజయవాడలో ఆలయాల శిథిలాలకి మొక్కుకుని వెళ్లాలి కాబోలు!
- కేవీ రమణమూర్తి, కాకినాడ
ప్రభుత్వ భూదాహానికి అంతులేదా?
రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పటికే విజయవాడ, అమరావతి ప్రాంతంలో 33 వేల ఎకరాల పంట భూములను చంద్రబాబు ప్రభుత్వం కైవసం చేసుకుంది. భోగాపురంలో విమానాశ్రయం కోసం కొన్ని వందల ఎకరాలను స్వాధీనం చేసుకుంది. ఆక్వా పరిశ్రమ కోసం భీమవరం ప్రాంతంలో వందలాది ఎకరాలు తీసుకునే యత్నంలో ఉంది. ఇప్పుడు మచిలీపట్నం వద్ద పంటభూములను ఏకపక్షంగా తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించిందట. ఇది కూడా గతంలో మాదిరిగానే లక్షలలోనే సేకరించే ప్రయత్నంలో ఉంది. ఇవేకాకుండా ప్రతి నియోజకవర్గంలోను వందల ఎకరాలలో భూమిని వివిధ అవసరాల కోసం సేకరించాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా చెబుతున్నారు.
పురాణాలలో చెప్పే బకాసురుడి తిండికైనా ఒక పరిమితి కనిపిస్తుంది కానీ, చంద్రబాబు ప్రభుత్వం భూదాహానికి పరిమితి కనిపించడం లేదు. అధికార జులుంతో, పరిశ్రమల పేరుతో పంట భూములను నాశనం చేసుకుంటూ పోతే ఇక తిండి గింజలు అందించే భూమి ఎంత? ఈ భూములన్నీ తమకు నచ్చిన విదేశీ కంపెనీలకు ధారాదత్తం చేయడానికేనని ఇప్పటికే రుజువైంది. చంద్రబాబు నాయుడు వ్యవసాయానికే కాదు, పచ్చదనానికి కూడా శత్రువే. అలాగే విపక్షానికి చెందిన ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ అన్ని నైతిక విలువలకు కూడా ఆయన తిలోదకాలు ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి. కేవలం ప్రభుత్వమే కాదు, ప్రభుత్వాన్ని నడుపుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా భూదాహంతో అలమటించిపోతున్నారు. వీరి బెడద నుంచి కూడా ఆంధ్రప్రదేశ్‌ను ప్రజలు రక్షించుకోవాలి.
- ఈదుపల్లి వెంకటేశ్వరరావు, ఏలూరు
గుడులకు సీఎం అపచారం
Published Thu, Jul 21 2016 1:12 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
Advertisement
Advertisement