బాబు కోసం మావాళ్లను బలి చేశారు
* కాపాడాలని అరిచినా పట్టించుకున్నవారే లేరు
* వైఎస్ జగన్ వద్ద మృతుల బంధువుల ఆవేదన
సాక్షి, రాజమండ్రి: ‘‘అప్పటికే రెండున్నర గంటలపాటు బారికేడ్ల వెనుక ఉన్నాం. కనీసం మంచినీళ్లు ఇచ్చే దిక్కు లేదు. చంద్రబాబు వెళ్లగానే ఒక్కసారిగా గేట్లు తీశారు. అంతే వెనుకనున్నవారు తోసుకుంటూ రావడంతో ముందున్న మావాళ్లు పడిపోయారు. గంటన్నరకు పైగా తొక్కిసలాట జరిగింది. కాపాడండి అంటూ ఎంతగా ప్రాధేయపడినా పట్టించుకున్నవారే లేకుండాపోయారు. పుష్కర స్నానం చేద్దామని వస్తే పుణ్య లోకాలకు పంపేశారు’’ అంటూ మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. పుష్కర ఘాట్ తొక్కిసలాటలో మృతి చెందినవారి కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఓదార్చారు. ప్రభుత్వాస్పత్రితోపాటు రాజమండ్రిలోని బొల్లినేని, జీఎస్‌ఎల్ ఆస్పత్రుల్లో క్షతగాత్రులను పరామర్శించారు.
షెడ్యూల్ ప్రకారం జగన్ బుధవారం రాజమండ్రికి రావాల్సి ఉంది. పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాటలో భక్తులు మృతి చెందారన్న విషయం తెలియగానే హుటాహుటిన హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12.30 గంటల విమానంలో బయల్దేరి 2 గంటల సమయంలో రాజమండ్రికి చేరుకున్నారు. మధురవూడి నుంచి జిల్లా ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న జగన్ నేరుగా మార్చురీకి వెళ్లి మృతుల కుటుంబీకులను ఓదార్చారు. మార్చురీ వద్ద కటిక నేలపై వరుసగా ఉన్న పుష్కర యాత్రికుల మృతదేహాలను చూసి చలించిపోయారు.
కుమార్తెతోపాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయిన శ్రీకాకుళం జిల్లా బలగ గ్రామానికి చెందిన ఇందిర కుటుంబ సభ్యులను తొలుత పరామర్శించారు. ‘‘17 మందిమి వచ్చాం. 14 మంది మిగిలాం. పుణ్యస్నానాలు చేద్దామని వస్తే మావాళ్లను పుణ్య లోకాలకు పంపాల్సి వచ్చిందన్నా’’ అంటూ జగన్‌ను పట్టుకుని వారు కన్నీరుమున్నీరయ్యారు. ‘‘పొరుగూరు నుంచి పుష్కర స్నానం చేసేందుకు వచ్చిన మా పిన్ని తొక్కిసలాటలో చనిపోయింది. చంద్రబాబు వల్లే మాకీ చావు వచ్చింది. ఇప్పుడొచ్చి పది లచ్చలు ఇస్తానంటున్నాడు. ఎవడికి కావాలి ఆ డబ్బులు? నా దగ్గర డబ్బులున్నాయి. కావాలంటే నేనే ఇస్తా. మా పిన్నిని తీసుకురమ్మనండి’’ అంటూ జగన్ వద్ద బత్తిన సత్తిబాబు గుండెలు బాదుకుంటూ రోదించారు.
నెల్లూరు జిల్లాకు చెందిన పర్వతాల పోలయ్య కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. భార్య రాజేశ్వరి మృతదేహం వద్ద పోలయ్య తన కుమార్తెతో కలిసి కన్నీరుమున్నీరవుతుండగా చూసి జగన్ చలించిపోయారు. మిగిలిన మృతుల కుటుంబాలను కూడా పేరుపేరునా పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. కేవలం చంద్రబాబు కోసమే లక్షలాది జనాన్ని ఆపేశారని, ఆయన వెళ్లగానే ఒకేసారి గేట్లు తెరవడంతో గంటన్నరపాటు తొక్కిసలాట జరిగిందని, వందలాది మంది ఊపిరి అందక నరకం చూశారని బాధిత కుటుంబ సభ్యులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ చావులకు ముమ్మాటికీ చంద్రబాబే కారణమని వారు ఆరోపించారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలంటూ వైద్యులకు సూచనలు చేశారు.