చంద్రబాబు అప్పుడు అక్కడే!
* తొక్కిసలాట సమయంలో పుష్కర ఘాట్‌లోనే ఏపీ సీఎం!
* ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించినట్టు మీడియా కథనం
* తొలుత నలుగురు, తరువాత 11 మంది చనిపోయినట్టు సీఎంకు తెలిపానన్న అధికారి
* పోలీసు, రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చ
సాక్షి ప్రతినిధి, రాజమండ్రి: పుష్కరాలు ప్రారంభమైన తొలిరోజున రాజమండ్రి పుష్కర ఘాట్‌వద్ద జరిగిన తొక్కిసలాటలో 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయిన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తొక్కిసలాట జరిగిన సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు పుష్కరఘాట్ లోపలే ఉన్నారని తాజాగా వెల్లడైన అంశం పోలీసు, రెవెన్యూ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తొక్కిసలాట జరిగినట్టు, అప్పటికి 11 మంది భక్తులు మృతిచెందినట్టు ఘాట్ లోపలే ఉన్న సీఎంకు తెలియజేసినట్టు పుష్కర విధుల్లో ఉన్న ఓ పోలీసు ఉన్నతాధికారిని ఉటంకిస్తూ తాజాగా మీడియాలో వచ్చిన కథనం సంచలనం రేపింది.
పుష్కరాల ప్రారంభ ముహూర్త సమయంలో సీఎం ప్రచార డాక్యుమెంటరీలో నిమగ్నమవడం, ఆ సమయంలో భక్తులను మూడు గంటలపాటు కట్టడి చేసి, అనంతరం ఒకేసారి ఘాట్ లోపలకు పంపించడం.. తొక్కిసలాటకు, 29 మంది మరణాలకు దారితీయడం తెలిసిందే. అయితే తొక్కిసలాట జరిగినప్పుడు సీఎం ఎక్కడున్నారనేది ఇప్పటివరకు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ సమయంలో సీఎం ఘాట్‌లోపలే ఉన్నట్టు తాజాగా వెలువడిన కథనం వెల్లడించింది. ఇది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.
అసలేం జరిగింది?
గత మంగళవారం ఉదయం 6.26 గంటలకు పుష్కరాల ముహూర్త సమయం. సీఎం కుటుంబ సమేతంగా 5.45 గంటలకు పుష్కర ఘాట్‌కు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి పుష్కర స్నానమాచరించారు. అనంతరం పితృదేవతలకు పిండప్రదానం, గోదానం వంటివి ఘాట్‌లో పూర్తి చేశారు. ఇవన్నీ పూర్తయ్యేసరికి సమయం దాదాపు 7.30 గంటలైంది. పుష్కరస్నానం అనంతరం ఘాట్‌లో ఉన్న ప్రత్యేక బస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు రిఫ్రెష్ అయ్యి, సుమారు 8.30 గంటల సమయంలో ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి బయలుదేరారంటున్నారు.
అయితే ఆ మధ్యలోనే తొక్కిసలాట జరిగిందనే ప్రచారం ఇప్పటికే ఉండగా.. తాజాగా వెల్లడైన మీడియా కథనం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. తొక్కిసలాటప్పుడు సీఎం ఘాట్‌లోపలే ఉన్నారని, మొదట నలుగురు, తదుపరి 11 మంది చనిపోయిన విషయాన్ని సీఎంకు వివరించినట్టు, ఆ సమయంలో అన్ని చర్యలూ తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించినట్టు ఒక పోలీసు అధికారిని ఉటంకిస్తూ మీడియా కథనం వెల్లడించింది. దీంతో పుష్కర విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు ఆదివారం ఇదేఅంశంపై చర్చించుకోవడం కనిపించింది.
ఘాట్‌వద్ద ఎక్కువ సమయం భక్తులను నిలువరించడం, ముఖ్యమంత్రి వెళ్లే సమయానికి ఒకేసారి అనుమతించడమే తొక్కిసలాటకు కారణమని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఇటీవల నివేదికివ్వడం తెలిసిందే. తాజాగా పోలీసు అధికారి చెప్పిన విషయం చూస్తే ఈ దుర్ఘటనకు ముఖ్యమంత్రే బాధ్యులనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. పోలీసు అధికారి చెప్పినట్టు వచ్చిన కథనం వాస్తవమైతే ఆ సమయంలో ముఖ్యమంత్రి ఆ ఘటనను తేలికగా తీసుకున్నారనే భావనను అధికారవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పుష్కర ఘాట్ దుర్ఘటనతో పడిన మచ్చను చెరిపేసుకునేందుకు ఆ తరువాత అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా బస్టాండ్లు, ఫుష్కర ఘాట్లు, రైల్వే స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న చంద్రబాబు సంఘటన జరిగినప్పుడు సత్వరం స్పందించలేదనేందుకు ఇది నిదర్శనమని అభిప్రాయపడుతున్నాయి. అలా స్పందించివుంటే.. మృతులసంఖ్య అంత ఉండేది కాదని భావిస్తున్నాయి.