గోదావరిలో ఎక్కడ పుష్కరస్నానం చేసిన పుణ్యం వస్తుందని, పుష్కరఘాట్‌లలోనే చేయాల్సిన అవసరంలేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.
సాక్షి, రాజమండ్రి: గోదావరిలో ఎక్కడ పుష్కరస్నానం చేసిన పుణ్యం వస్తుందని, పుష్కరఘాట్‌లలోనే చేయాల్సిన అవసరంలేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆయన మంగళవారం అర్ధరాత్రి పుష్కరఘాట్‌లను పరిశీలించారు. ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... ఉదయం జరిగిన దుర్ఘటన దురదృష్టకర సంఘటనని సంతాపం వ్యక్తంచేశారు. రైల్వే స్టేషన్ పక్కనే ఉండటంవల్ల పుష్కరఘాట్‌కు భక్తులు పోటెత్తారని తెలిపారు.
పుష్కరఘాట్‌మీద భక్తుల ఒత్తిడి తగ్గించి మిగతా ఘాట్‌లకు పంపించే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పక్కనే ఉన్న కోటిలింగాల ఘాట్‌లో గంటకు 70-80 వేల మంది స్నానం చేయవచ్చని తెలిపారు. భక్తులను అటు మళ్లించే ఏర్పాట్లు చేస్తామన్నారు. వీఐపీ ఘాట్‌కూడా రద్దీ లేనప్పుడు సామాన్య భక్తులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. క్యూలైన్‌లో ఉన్న భక్తులకు మంచినీటి ప్యాకెట్లు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.