కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్‌లైన్ : ది ఆర్యాపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా నగరంలో కోలాహలం నెలకొంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక దానవాయిపేటలోని ఎస్‌కేవీటీ హైస్కూల్, వీటీ డిగ్రీ కళాశాలలో పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ మందకొండిగా ప్రారంభమైంది.
మొత్తం 50,376 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. రాజమండ్రితో పాటు దివాన్‌చెరువు, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కూడా బ్యాంక్ బ్రాంచీలు ఉన్నాయి. ఈ క్రమంలో కాకినాడలో రెండు, దివాన్ చెరువు, తాడేపల్లిగూడెంలో ఒక్కొక్క బూత్‌ను ఏర్పాటు చేసి, పోలింగ్ నిర్వహించారు. మొత్తం 50,376 ఓటర్లకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు 9,704 (19.27 శాతం) ఓట్లు పోలయ్యాయి.
మూడు ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుగా అభ్యర్థులు బరిలో నిలిచారు. టీడీపీ నాయకులు ఈ ఎన్నికలపై అంతగా ఆసక్తి చూపలేదు. ఆ పార్టీ నేత మురళీమోహన్ వెంట ఇంటింటికీ తెలుదేశం పార్టీ కార్యక్రమానికి పరిమితం కావడంతో, టీడీపీ ప్రభావం అంతగా లేకపోయింది. ప్రధానంగా కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ మద్దతుతో నిలిచిన అభ్యర్థుల మధ్యే పోటీ నెలకొంది. పోలింగ్ ముగిసే సమయానికి 39.47 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఎన్నికల ప్రత్యేకాధికారి ఎ.రాధాకృష్ణారావు తెలిపారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థులు పోలింగ్ జరిగిన ప్రాంగణంలోకి వచ్చి ఓటర్లను అభ్యర్థించడం కనిపించింది. పోలీసులు అభ్యంతరం చెప్పినా.. అభ్యర్థులు అక్కడే ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, బ్యాంక్ చైర్మన్ అభ్యర్థులు లంక సత్యనారాయణ, చల్లా శంకర్రావు, డీవీవీ త్రినాథ్, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, నగర, రూరల్ కోఆర్డినేటర్లు బొమ్మన రాజ్‌కుమార్, ఆకుల వీర్రాజు, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ ఎస్.శివరామ సుబ్రహ్మణ్యం, కాంగ్రెస్ నాయకులు ప్రసాదుల హరినాథ్, రామినీడు మురళి, సీపీఎం నాయకుడు టీఎస్ ప్రకాష్, టి.అరుణ్, సీపీఐ జిల్లా కార్యదర్శి మీసాల సత్యనారాయణ తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ ప్రశాంతం
Published Mon, Dec 30 2013 1:21 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement