అందరి చూపూ భద్రాద్రి వైపే.. | Godavari puskaras to be started from july 14 | Sakshi
Sakshi News home page

అందరి చూపూ భద్రాద్రి వైపే..

Published Fri, Jul 10 2015 2:55 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM

Godavari puskaras to be started from july 14

* పుష్కర స్నానానికి పుష్కలంగా నీరు
* భద్రాద్రి వద్ద ప్రస్తుతం 10 అడుగులు ఉన్న నీటిమట్టం
* జిల్లాలో కోటిమంది భక్తులు స్నానం ఆచరిస్తారని అంచనా
* పార్కింగ్ ప్రదేశాల గుర్తింపులో సమస్యలు

పుష్కర ఘడియలు సమీపిస్తున్నాయి. పన్నెండేళ్లకోమారు 12 రోజుల పాటు జరిగే గోదావరి పుష్కరాలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానం చేసేందుకు భక్త జనం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా జరుగుతున్న ఉత్సవాలు కావటంతో కుంభమేళాను తలపించే రీతిలో వీటిని చేపట్టాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి తీరాన ఉన్న బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం వంటి ప్రధాన పుణ్యక్షేత్రాల్లోని పుష్కర ఘాట్‌ల వద్దనే భక్తులు ఎక్కువగా స్నానమాచరించే అవకాశం ఉందని యంత్రాంగం భావిస్తోంది.
 
 అయితే గోదావరిలో ఆశించిన స్థాయిలో నీరు లేకపోవటం అధికార యంత్రాంగాన్ని కొంత ఆందోళనకు గురిచేస్తోంది. బాసర వద్ద గోదావరిలో ఇసుక తిన్నెలే దర్శనమిస్తున్నారుు. ధర్మపురి, కాళేశ్వరం వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ వారంలో భారీ వర్షాలు కురిస్తేనే గోదావరిలో నిండుగా నీళ్లు ఉంటాయని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు తెలిపారు. అయితే ఇప్పట్లో భారీ వర్షాలు ఉండకపోవచ్చని వాతావరణశాఖ నిపుణులు చెబుతుండటంతో గోదావరిలో కోట్లాది మంది పుష్కర స్నానాలు ఎలా సాగుతాయనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అందరి చూపూ పుష్కలంగా నీరున్న భద్రాచలంపైనే ఉంది.                                                                       
 - భద్రాచలం

 
 భద్రాచలంలో జలకళ
ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదిలో గురువారం 10 అడుగుల మేర నీటిమట్టం ఉందని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు తెలిపారు. పుష్కరాలు ముగిసేంత వరకు ఇదే స్థాయిలో నీళ్లు ఉంటాయని, ఒక వేళ వర్షాలు కురిస్తే నీటిమట్టం పెరుగుతుందని అంటున్నారు. ఖమ్మం జిల్లాలో భద్రాచలం, బూర్గంపాడు మండలం మోతె, దుమ్ముగూడెం మండలం పర్ణశాల, వెంకటాపురం మండలం రామచంద్రాపురం, మణుగూరు మండలం రామానుజవరం, చినరావిగూడెంలో ఘాట్‌లను ఏర్పాటు చేశారు. ఈ ఘాట్లలో రోజుకు  6.50 లక్షల మంది భక్తులు పుణ్య స్నానం చేయవచ్చని మొదట్లో అంచనా వేశారు. కానీ భద్రాచలం వైపే భక్తులందరి చూపూ ఉందని సమాచారం అందుతుండటంతో 10 లక్షల మందికి పైగా భక్తులు స్నానం ఆచరిస్తారని భావిస్తున్నారు. త్రిదండి చినజీయర్‌స్వామి భద్రాచలంలో పుష్కరాలను ప్రారంభించనున్నారు. వివిధ ప్రాంతాల పీఠాధిపతులు కూడా భద్రాచలం వచ్చేందుకే మొగ్గు చూపుతున్నట్లుగా ఇప్పటికే దేవస్థానం అధికారులకు సమాచారం ఉంది. ఈ లెక్కన పన్నెండు రోజుల పాటు కోటి మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు.      
 
 అసంపూర్తిగా పనులు
 పుష్కరాల పేరుతో కొన్ని శాఖల ద్వారా చే స్తున్న పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. భద్రాచలంలో టుబాకో బోర్డు ప్రాంగణంలో ఉన్న పార్కింగ్ ప్రదేశానికి వెళ్లే ఐటీడీఏ రోడ్ పనులను పుష్కరాలకు ముందు పూర్తి చేయలేమని పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు చేతులెత్తేశారు. బూర్గంపాడు మండలంలోని పార్కింగ్ ప్రదేశాలకు వెళ్లే రహదారులు కూడా పూర్తి కాలేదు. దీంతో పార్కింగ్ ప్రదేశాల గుర్తింపులో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొన్ని శాఖల మధ్య నెలకొన్న సమన్వయ లోపం కారణంగానే పుష్కరాల పనులు సకాలంలో పూర్తి కావటం లేదని భక్తులు అంటున్నారు.  
 
  ఏర్పాట్లపై దృష్టి
 పుష్కరాలకు భద్రాచలం వచ్చే భక్తుల సంఖ్య మొదట్లో వేసిన అం చనాల కంటే పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు ఎలా చేయాలనే దానిపై దృష్టి సారించింది. భద్రాచలంలోకి ఒక్క ఆర్టీసీ బస్సులనే అనుమతిస్తామని మొదట్లో ప్రకటించిన పోలీసులు, భక్తులరద్దీ పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రైవేటు ట్రావెల్స్‌లో వచ్చే భక్తులు కూడా నేరుగా పట్టణంలోకి వచ్చేందుకు అంగీకరించారు.                                                     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement