గోదా‘వర్రీ’ పుష్కరాలు | More worry about godavari puskaras | Sakshi
Sakshi News home page

గోదా‘వర్రీ’ పుష్కరాలు

Published Mon, Jun 29 2015 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 4:32 AM

గోదా‘వర్రీ’ పుష్కరాలు

గోదా‘వర్రీ’ పుష్కరాలు

* భక్తుల వసతి దైవాధీనం
* స్కూళ్లు, హాస్టళ్లను వినియోగించుకోవాల్సిన దుస్థితి

 
భద్రాచలం పరిసరాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలన్నీ 12 రోజులపాటు మూతపడబోతున్నాయి! ఎందుకంటారా? కుంభమేళ తరహాలో అట్టహాసంగా నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతున్న గోదావరి పుష్కరాలకు తరలి వచ్చే భక్తులకు.. వసతి మందిరాలు కరువవడంతో గత్యంతరం లేక ఈ స్కూళ్లు, హాస్టళ్లను వినియోగించుకోబోతున్నారు. భక్తుల వసతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు దేవాలయ నిర్వాహకులు చేసిన ప్రతిపాదనను నిధుల బూచి చూపి ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఫలితం.. ప్రత్యామ్నాయ వసతి కోసం ఇలా ప్రభుత్వ, ప్రైవేటు బడులు, వసతిగృహాలపై పడాల్సిన దుస్థితి నెలకొంది. ఇది ఒక్క భద్రాచలం వద్ద నెలకొన్న దుస్థితి కాదు. బాసర, కాళేశ్వరం, ధర్మపురి... ఇలా పుష్కరాలు జరిగే అన్నిచోట్లా ఇదే పరిస్థితి కనిపిస్తోంది! కేవలం భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు వీలుగా పుష్కర ఘాట్ల నిర్మాణానికే ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఆలయాల వద్ద భక్తులకు వసతి విషయాన్ని పట్టించుకోవడం లేదు.   
- సాక్షి, హైదరాబాద్
 
తెలంగాణ రాష్ట్రంలో తొలి పుష్కరాల నేపథ్యంలో మరోపక్షం రోజుల తర్వాత గోదావరి తీరం యావత్తూ జనసంద్రంగా మారనుంది. 12 రోజుల పాటు బాసర నుంచి భద్రాచలం వరకు నదీ తీరంలోని పుణ్యక్షేత్రాలు ఇసకేస్తే రాలనంత జనంతో కిటకిటలాడనున్నాయి. దాదాపు రెండు కోట్ల మంది పుణ్య స్నానాలాచరించేందుకు వస్తారని అంచనా. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి పుష్కరాలు కావటంతో ఉత్సవాలపై అంచనాలూ పెరుగుతున్నాయి. కాళేశ్వరంలాంటి త్రివేణీ సంగమం, ఇతర ప్రత్యేకతలున్న ప్రాంతాలు తెలంగాణలో కొలువుదీరి ఉండటంతో పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తే అవకాశం ఉంది.
 
ఇలాంటి విశిష్ట సందర్భాల్లో దేవాలయాల వద్ద భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ పుణ్యక్షేత్రాల వద్ద పరిస్థితి ఇందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. పుష్కర ఘాట్ల నిర్మాణం తప్ప భక్తులకు వసతిని ప్రభుత్వం పట్టించుకుంటున్నట్టు లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగా పుష్కరాలకు రోజులు దగ్గరపడే కొద్దీ ఆలయాల నిర్వాహకుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. ఒక్కసారిగా లక్షలాదిగా వచ్చే భక్తులకు వసతి కల్పించలేమన్న భయం వెంటాడుతోంది. ఏదైనా అపశృతి చోటుచేసుకుంటే పరిస్థితి ఏంటనే ఆందోళనతో కొందరు అధికారులు పుష్కర బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారంటే పరిస్థితి తీవ్రత తెలుస్తోంది.
 
భద్రాచలంలో పూర్తిస్థాయి ఏర్పాట్లేవి?

భద్రాచలంలో అప్పుడే సందడి మొదలైంది. పుష్కరాలు జరిగే 12 రోజుల సమయంలో దాదాపు 80 లక్షల మంది ఇక్కడికి వస్తారని అంచనా. అంటే సగటున రోజుకు ఆరున్నర లక్షల మందికి పైమాటే! భక్తుల ఏర్పాట్ల కోసం భద్రాచలం దేవాలయం రూ.12 కోట్లు ప్రతిపాదిస్తే...  ప్రభుత్వం మొత్తం ఖమ్మం జిల్లాకు కలిపి రూ.1.70 కోట్లు కేటాయించింది. ఇందులో ఈ దేవాలయానికి రూ.కోటి ఇచ్చింది. వర్షాలు కురిసే సమయం కావటంతో భక్తుల విశ్రాంతి కోసం రెండున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేకంగా వాటర్‌ప్రూఫ్ మంటపాలు ఏర్పాటు చేయాలని దేవాలయ నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు రూ.కోటి వ్యయమవుతుందని ప్రతిపాదించారు. కానీ ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. కేవలం క్యూలైన్లపై షెడ్డు ఏర్పాటుకే అనుమతించింది. ఇందుకు రూ.40 లక్షలు కేటాయించింది. స్వామి దర్శనానికి ఎదురుచూసే వారికి ఇది రక్షణగా ఉంటుంది. కానీ వాన కురిస్తే అంతే పరిస్థితి. వృద్ధులు, చిన్నపిల్లల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం కావటంతో పాఠశాలలు, కాలేజీలు, వసతి గృహాలను ఖాళీ చేసి వాటిని వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది. దేవాలయంతోపాటు స్నానఘట్టాల వద్ద 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆలయ నిర్వాహకులు ప్రతిపాదించగా.. ఆలయం వద్ద 15 కెమెరాల ఏర్పాటుకే అనుమతి వచ్చింది.
 
బాసరకు నిధులేవి?
బాసర ఆలయానికి రూ.2.10 కోట్లు అడిగితే.. రూ.కోటిన్నర ఇచ్చారు. ఇక్కడ కూడా భక్తులకు అదనపు వసతి లేకుండా పోయింది. వచ్చిన డబ్బులు ఆలయానికి, ఉన్న అతిథి గృహాలకు రంగులు, ఆలయ పరిసరాల్లో రోడ్డు నిర్మాణం, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటుకే సరిపోని పరిస్థితి నెలకొంది. ఇక్కడ భారీ విశ్రాంత మందిరం ఉన్నా... భక్తులకు ప్రసాదాలు తయారు చేసేందుకు దాన్ని కేటాయించారు. అంటే సత్రాలు పోను అదనపు రద్దీ అంతా ఆరుబయటే అన్నమాట!
 
 కాళేశ్వరంలో భక్తులకు వసతి ఎక్కడ?
 కరీంనగర్ జిల్లాలోని త్రివేణి సంగమమైన కాళేశ్వరానికి 24 లక్షల మంది వస్తారని అంచనా. ఇందుకోసం నాలుగు భారీ విశ్రాంతి మందిరాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులు ప్రతిపాదించారు. శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తే ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవ రద్దీకి కూడా ఉపయోగపడుతుందని కోరారు. అయితే ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. ఇక్కడ ఆల యానికి కేవలం 20 గదులు మాత్రమే ఉన్నాయి. వాటిని వివిధ విభాగాల అధికారులు, సిబ్బందే ఆక్రమిస్తారు. సాధారణ భక్తులకు ఒక్క గది కూడా దొరకదు.
 
 దీంతో ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని మాధేపురాలో ఉన్న బీసీ వసతి గృహాన్ని ఖాళీ చేసి తీసుకోవాలని నిర్ణయించారు. ఛత్తీస్‌గఢ్‌కు చేరువగా ఉన్న ప్రాంతం కావటంతో భద్రత  కోసం భారీ సంఖ్యలో వచ్చే పోలీసుల కోసమే ఆ వసతి గృహాన్ని వారికి కేటాయించారు. దీంతో భక్తుల పరిస్థితి గందరగోళంగా మారనుంది. కేశఖండన, శార్ధ మండపాలకు టికానా లేదు. వాన నుంచి రక్షణగా శాశ్వత పద్ధతిలో గోదావరి చెంత వాటిని నిర్మించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పక్కన పెట్టింది. దీంతో టెంట్లే దిక్కు కానున్నాయి. ఈ ఆలయానికి రూ.2.60 కోట్లు అడిగితే రూ.1.60 కోట్లు కేటాయించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement