విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
ద్వారకాతిరుమల/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): సకల శుభాలు కలిగించే తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు వేకువజాము నుంచే ఆలయాలకు వచ్చి పూజలు చేశారు. ప్రధానంగా అన్నవరం, సింహాచలం, అరసవిల్లి వంటి ముఖ్యమైన ఆలయాల్లో భక్తజనం పెద్దఎత్తున వచ్చారు. ఇక ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలోని దాదాపు అన్ని విభాగాలూ భక్తులతో నిండిపోయాయి.
ఉదయం నుంచి సాయంత్రం వరకు క్షేత్రంలో రద్దీ కొనసాగింది. భజన మండళ్ల సభ్యులు కోలాట భజనలతో ఆకట్టుకున్నారు. అలాగే, ఉమ్మడి కృష్ణాజిల్లాలో కూడా ఆదివారం ఈ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. విజయవాడ లబ్బీపేట, వన్‌టౌన్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో స్వామి వారికి పలు ప్రత్యేక పూజలు, లక్ష తులసీదళార్చన నిర్వహించారు.
అభినవ మేల్కొటెగా పేరుగాంచిన కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని ఉల్లిపాలెంలోని శ్రీగోదా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణస్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో పులకించింది. 11 అడుగుల శ్రీమన్నారాయణుడి మూలమూర్తికి అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
మచిలీపట్నం చిలకలపూడి కీర పండరీపురంలో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామివారికి ఆదివారం ప్రత్యేక పూజలు జరిపించారు. అలాగే, బెజవాడ కనకదుర్గమ్మ, పట్నాడు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి ఆలయంలో కూడా భక్తులు పోటెత్తారు. క్యూలైన్లలో పెద్దఎత్తున బారులుతీరారు.
Comments
Please login to add a commentAdd a comment