tholi ekadasi
-
తొలి ఏకాదశి..శయన ఏకాదశి.. ఆరోజు విష్ణువు నిజంగానే..
హిందువుల తొట్టతొలి పండుగగా తొలి ఏకాదశిని పేర్కొంటారు. హిందువుల ప్రధానమైన పండుగలకు తొలి ఏకాదశితోనే శ్రీకారం చుడతారు. తొలి ఏకాదశి తర్వాతే వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ప్రధాన పండగలు వస్తాయి. అందుకే హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి విశేష ప్రాధాన్యత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశికి విశేష ప్రాధాన్యతనిస్తారు. దీన్నే శయన ఏకాదశి, హరివాసరం, పేలాల పండగ’ అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఆషాడంలో వచ్చే శుక్ల ఏకాదశి నాడు ప్రజలందరూ ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని జరుపుకుంటారు. జూన్ 29వ తేది గురువారం నాడు తొలి ఏకాదశి వస్తున్న నేపధ్యంలో ఈ పండగ విశేషాలు తెలుసుకుందాం. ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశిగా’గా పేర్కొంటారు. పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు. తిరిగి అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ‘ప్రబోధినీ ఏకాదశి’ నాడు తిరిగి నిద్ర లేస్తాడు. చాతుర్మాస వ్రతం కూడా ఈ ఏకాదశి నాడు మొదలవుతుంది. దీనిని దేవ శయన ఏకాదశి లేదా హరి శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి దేవతలకు రాత్రిపూట మొదలవుతుంది, విష్ణువు పగటిపూట విశ్రాంతి తీసుకుంటాడని చెబుతారు. అంతేగాక ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు. నిజంగానే విష్ణువు ఆ రోజు నిద్రపోతారా.. నిజంగా విష్ణువు నిద్రపోతారా లేదా నిద్రకు మరేదైనా అర్థం ఉందా అంటే..చైతన్య స్థాయిలో ఎప్పుడూ మెలకువగా ఉండే వ్యక్తిని దేవుడిగా భావిస్తారు. అలాంటి పరిస్థితిలో ఎప్పుడూ మెలకువగా ఉండే భగవంతుడు అంత కాలం ఎలా నిద్రపోతాడు? అంటే దీనిలో దాగి ఉన్న రహస్యం.. ప్రజలు సాంప్రదాయ ఆచారాలను అనుసరించి వారి జీవితాన్ని కాలానుగుణంగా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో పెట్టినవి. ఆ రోజు నుంచి ఒంటి పూట భోజనం, జాగరణ వంటి వాటితో ఆరోగ్యంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సామాన్య ప్రజల కోసం ఋషులు ఏర్పాటు చేసినవి. నిశితంగా ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది. కొన్ని రోజుల తర్వాత.. శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం వర్షాకాల మాసం. వర్షాకాలం ముగిసిన తరువాత.. శరదృతువు ప్రారంభమవుతుంది. అంటే ఈ చాతుర్మాస్య దీక్ష స్వీకరించే నాలుగు మాసాలు రుతువులు మారే మాసాలు. వాతావరణం మారినప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దగ్గు, జలుబు , ఫ్లూలతోపాటు ఇన్ఫెక్షన్ వంటి సీజనల్ వ్యాధుల వ్యాప్తి పెరుగుతుంది. అన్ని కూరగాయలు , పండ్లలో బ్యాక్టీరియా, కీటకాలు పెరగడం ప్రారంభిస్తాయి. వర్షం కారణంగా సాధారణ వ్యక్తి తన జీవితాన్ని ఇంటి వద్దనే ఎక్కువగా గడిపేస్తాడు. ఈ కారణంగా ఈ నాలుగు మాసాలలో శుభకార్యాలు చేయవద్దని.. ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సంయమనం పాటించేందుకు ఈ వ్రత నియమాలను ఏర్పాటు చేశారు. ఏకాదశి తిధి ఎలా వచ్చిందంటే.. తాళజంఘుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడితో యుద్ధం చేసిన శ్రీ మహావిష్ణువు అలసిపోయి శయనిస్తాడు. దేవదేవుడు యోగనిద్రలో ఉండడం అదునుగా భావించిన దానవులు దేవతలపై విజృంభించారు. దీంతో దేవతలు భయపడి వైకుంఠధామానికి పరుగులు తీయడంతో భగవానుడి శరీరం నుంచి ఉద్భవించిన ‘సత్త్వశక్తి’ దానవుల దాష్టీకాన్ని కట్టడి చేసింది. యోగనిద్ర నుంచి మేల్కొన్న పరంధాముడు ఆ శక్తికి ‘ఏకాదశి’ అని పేరుపెట్టాడు. ఆమె సమయస్ఫూర్తికి, సకాలంలో సహకరించి నందుకు సంతసించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకంలో పూజలు అందుకోవాలని కోరుకుందట. అప్పటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. వ్రతం ఆచరించు విధానం.. ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశినాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది. అలాగే ఈ వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించ కూడదని పురాణాలు చెబుతున్నాయి. మానవ జాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నట్లు పండితులు చెప్తుంటారు. తొలి ఏకాదశి రోజున పిండిదీపం పెట్టాలి. ఈ రోజు పేలాల పిండి తినడం ఆచారం. ఉపవాసం ఉండే వారి నియమాలు యథావిధి. అలా కాకుండా కొన్ని ప్రాంతాల్లో తొలి ఏకాదశిని పండుగులా జరుపుకునే ఆచారం కూడా ఉంది. రైతులకు కూడా పండుగే.. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ.. తొలి ఏకాదశి రోజున శేషసాయిని(విష్ణువు) పూజించి..అలా ప్రతినెలా వచ్చే ఏకాదశిని విడిచిపెట్టకుండా శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అంతేగాదు అనాదిగా సాధువులు, భక్తజనులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి శ్రీ విష్ణుసాయుజ్యం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. సూర్యవంశ చక్రవర్తి, సత్యసంధుడు మాంధాత, తన రాజ్యంలో అనావృష్టి నెలకొన్నప్పుడు అంగిరసుడి సూచనపై ‘శయనైక ఏకాదశి’ వ్రతాన్ని భక్తితో చేశాడని, ఫలితంగా వర్షాలు కురిసి పరిస్థితి చక్కబడిందని పురాణాలు చెపుతున్నాయి. పైగా సతీ సక్కుబాయి కూడా ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందారట. అలాగే ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలు చేస్తారు. (చదవండి: ఆత్మ అంతిమంగా ఎక్కడకు చేరుకుంటుందో అదే..!) -
భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి
ద్వారకాతిరుమల/వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): సకల శుభాలు కలిగించే తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు వేకువజాము నుంచే ఆలయాలకు వచ్చి పూజలు చేశారు. ప్రధానంగా అన్నవరం, సింహాచలం, అరసవిల్లి వంటి ముఖ్యమైన ఆలయాల్లో భక్తజనం పెద్దఎత్తున వచ్చారు. ఇక ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలోని దాదాపు అన్ని విభాగాలూ భక్తులతో నిండిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్షేత్రంలో రద్దీ కొనసాగింది. భజన మండళ్ల సభ్యులు కోలాట భజనలతో ఆకట్టుకున్నారు. అలాగే, ఉమ్మడి కృష్ణాజిల్లాలో కూడా ఆదివారం ఈ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. విజయవాడ లబ్బీపేట, వన్‌టౌన్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో స్వామి వారికి పలు ప్రత్యేక పూజలు, లక్ష తులసీదళార్చన నిర్వహించారు. అభినవ మేల్కొటెగా పేరుగాంచిన కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని ఉల్లిపాలెంలోని శ్రీగోదా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణస్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో పులకించింది. 11 అడుగుల శ్రీమన్నారాయణుడి మూలమూర్తికి అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మచిలీపట్నం చిలకలపూడి కీర పండరీపురంలో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామివారికి ఆదివారం ప్రత్యేక పూజలు జరిపించారు. అలాగే, బెజవాడ కనకదుర్గమ్మ, పట్నాడు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి ఆలయంలో కూడా భక్తులు పోటెత్తారు. క్యూలైన్లలో పెద్దఎత్తున బారులుతీరారు. -
సందడి సందడిగా బోనాల పండుగ
అనంతపురం కల్చరల్ : నగరంలోని నాయక్‌నగర్‌లోని బంజారాల ప్రాచీన ఆలయంలో మంగళవారం సీతలాయ్యాడి బోనాల పండుగ వేడుకగా జరిగింది. ఏడాదికోసారి వచ్చే ఉత్సవాన్ని బంజారాలు ఘనంగా నిర్వహించారు. వందలాదిగా తరలివచ్చిన జనసందోహంతో నగర వీధులు కోలాహలంగా మారాయి. దాదాపు 200 మంది మహిళలు తలపై బోనాలు పెట్టుకుని జాతరగా వెళ్ళి అమ్మవారికి సమర్పించారు. అంతకు ముందు బంజారా పూజారులు నాయకుల కులదైవమైన మారెమ్మ తల్లి ప్రతిరూపాలైన పెద్దమ్మ, కాంకాళి, మరియమ్మ, సుంకులమ్మ, నాన్‌బాయి, హింగిలా భవానీ, మత్రాళీ తదితర అక్కమ్మ దేవతలను సర్వంగ సుందరంగా అలంకరించి ప్రతిష్టించారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మహిళలు, వృద్ధులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు చంద్రీబాయి, కృష్ణానాయక్ మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా లంబాడీలుగా, సుగాళీలుగా, నాయక్‌లుగా పిలవబడుతున్న బంజారాలు ఏ ప్రాంతంలో ఉన్నా తమ సంస్కృతిని మరచిపోకుండా చేసుకునే పండుగలకు నిదర్శనమే సీతాలయ్యాది ఉత్సవమన్నారు. కార్యక్రమంలో శంకరశివరావు రాథోడ్, లక్ష్మణా నాయక్, కళావతి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు
నారాయణపేట రూరల్ : ఆషాఢ శుద్ధ ఏకాదశిని నారాయణపేట మండల ప్రజలు వైభవోపేతంగా నిర్వహించుకున్నారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం వైష్ణవ ఆలయాలు కిటకిటలాడాయి. తెల్లవారుజామునే స్నానాలు చేసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సరాఫ్‌బజార్ పాండురంగ దేవాలయం, బాలాజీ మందిర్లలో స్వామి వారికి అభిషేకం, బిల్వార్చన, మహామంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకుని ఉపవాసదీక్షలు చేపట్టారు. శనివారం ద్వాదశి సందర్భంగా అన్నదానం చేపట్టనున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గౌతమి, రఘురామయ్యగౌడ్, ఆలయ కమిటీ సభ్యులు జ్యోతిర్నాత్, శ్రీకిషన్లాహోటీ, బన్సిలాల్, దినేష్లాహోటీ, తమ్మలిరాము, బాబురావు, బన్సికుమార్, అంబాజీరావు తదితరులు పాల్గొన్నారు. -
యాదాద్రిలో తొలి ఏకాదశి ఏర్పాట్లు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం (యాదాద్రి)లో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో స్వామి, అమ్మవార్లకు తిరుమంజన స్నపనం, నవకలశ స్నపనం చేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటే విశేష పుణ్య ఫలితం ఉంటుందని చెప్పారు. భక్తుల కోసం సుమారు 50 వేల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేయనున్నారు. దర్శనం క్యూలైన్లలో ఎటువంటి తోపులాటలు లేకుండా ఉండేందుకు గాను కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఆలయంలో విశేష పూజలు, తులసీ అర్చనలు, కుంకుమార్చనలు, చేయనున్నట్లు అర్చకులు తెలిపారు. కొండపై పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం సెలవురోజు కావడంతో యాదాద్రికి భక్తుల రద్దీ పెరిగింది. పుష్కరాలకు వెళ్లిన భక్తులు తిరుగుప్రయాణంలో గుట్టకు వస్తున్నారు. సంగీత భవనం, దర్శనం క్యూలైను,్ల ప్రసాదాల క్యూలైన్లు అన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారని దేవస్థానం అధికారులు చెప్పారు. -
‘గిరి’.. భక్త ఝరి..
తొలి ఏకాద శి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం మన్యంకొండకు భక్తజనం పోటెత్తారు. లక్ష్మీవేంకటేశ్వరుని దర్శించుకునేందుకు బారులుతీరారు. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం బారులుతీరారు. లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కురుమూర్తి నామస్మరణతో ఏడుకొండలు మార్మోగాయి తొలి ఏకాదశి పర్వదినాన జిల్లాలోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కృష్ణా పరీవాహక ప్రాంతంలోని గద్వాల, అలంపూర్, బీచుపల్లి, నదీఅగ్రహారం, మన్యంకొండ, నల్లమలలోని శైవక్షేత్రాలతోపాటు కడ్తాల మైసిగండి ఆలయాలు జనసంద్రంగా కనిపించాయి. భక్తులు పుణ ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు సత్యనారాయణస్వామి వ్రతాల్లో పాల్గొన్నారు.