యాదాద్రిలో తొలి ఏకాదశి ఏర్పాట్లు
యాదగిరికొండ: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం (యాదాద్రి)లో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో స్వామి, అమ్మవార్లకు తిరుమంజన స్నపనం, నవకలశ స్నపనం చేయనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటే విశేష పుణ్య ఫలితం ఉంటుందని చెప్పారు. భక్తుల కోసం సుమారు 50 వేల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేయనున్నారు. దర్శనం క్యూలైన్లలో ఎటువంటి తోపులాటలు లేకుండా ఉండేందుకు గాను కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఆలయంలో విశేష పూజలు, తులసీ అర్చనలు, కుంకుమార్చనలు, చేయనున్నట్లు అర్చకులు తెలిపారు.
కొండపై పెరిగిన భక్తుల రద్దీ..
ఆదివారం సెలవురోజు కావడంతో యాదాద్రికి భక్తుల రద్దీ పెరిగింది. పుష్కరాలకు వెళ్లిన భక్తులు తిరుగుప్రయాణంలో గుట్టకు వస్తున్నారు. సంగీత భవనం, దర్శనం క్యూలైను,్ల ప్రసాదాల క్యూలైన్లు అన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారని దేవస్థానం అధికారులు చెప్పారు.