Toli Ekadashi or Shayana Ekadashi: Will Lord Vishnu Really Goes To Sleep - Sakshi
Sakshi News home page

తొలి ఏకాదశి..శయన ఏకాదశి..విష్ణువు నిజంగానే నిద్రలోకి వెళ్తారా..!

Published Wed, Jun 28 2023 5:01 PM | Last Updated on Fri, Jul 14 2023 4:34 PM

Tholi Ekadashi or Shayana Ekadashi Vishnu Really Goes To Sleep - Sakshi

హిందువుల తొట్టతొలి పండుగగా తొలి ఏకాదశిని పేర్కొంటారు. హిందువుల ప్రధానమైన పండుగలకు తొలి ఏకాదశితోనే శ్రీకారం చుడతారు. తొలి ఏకాదశి తర్వాతే వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ప్రధాన పండగలు వస్తాయి. అందుకే హిందూ సంప్రదాయంలో తొలి ఏకాదశికి విశేష ప్రాధాన్యత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏకాదశికి విశేష ప్రాధాన్యతనిస్తారు.  దీన్నే శయన ఏకాదశి, హరివాసరం, పేలాల పండగ’ అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఆషాడంలో వచ్చే శుక్ల ఏకాదశి నాడు ప్రజలందరూ ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని జరుపుకుంటారు. జూన్ 29వ తేది గురువారం నాడు తొలి ఏకాదశి వస్తున్న నేపధ్యంలో ఈ పండగ విశేషాలు తెలుసుకుందాం.

ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశిగా’గా పేర్కొంటారు. పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు. తిరిగి అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ‘ప్రబోధినీ ఏకాదశి’ నాడు తిరిగి నిద్ర లేస్తాడు. చాతుర్మాస వ్రతం కూడా ఈ ఏకాదశి నాడు మొదలవుతుంది. దీనిని దేవ శయన ఏకాదశి లేదా హరి శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి దేవతలకు రాత్రిపూట మొదలవుతుంది,  విష్ణువు పగటిపూట విశ్రాంతి తీసుకుంటాడని చెబుతారు. అంతేగాక ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు.

నిజంగానే విష్ణువు ఆ రోజు నిద్రపోతారా..
నిజంగా విష్ణువు నిద్రపోతారా లేదా నిద్రకు మరేదైనా అర్థం ఉందా అంటే..చైతన్య స్థాయిలో ఎప్పుడూ మెలకువగా ఉండే వ్యక్తిని దేవుడిగా భావిస్తారు. అలాంటి పరిస్థితిలో ఎప్పుడూ మెలకువగా ఉండే భగవంతుడు అంత కాలం ఎలా నిద్రపోతాడు? అంటే దీనిలో దాగి ఉన్న రహస్యం.. ప్రజలు సాంప్రదాయ ఆచారాలను అనుసరించి వారి జీవితాన్ని కాలానుగుణంగా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో పెట్టినవి. ఆ రోజు నుంచి ఒంటి పూట భోజనం, జాగరణ వంటి వాటితో  ఆరోగ్యంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో సామాన్య ప్రజల కోసం ఋషులు ఏర్పాటు చేసినవి. నిశితంగా ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు.

ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది. కొన్ని రోజుల తర్వాత.. శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం వర్షాకాల మాసం. వర్షాకాలం ముగిసిన తరువాత.. శరదృతువు ప్రారంభమవుతుంది. అంటే ఈ చాతుర్మాస్య దీక్ష స్వీకరించే నాలుగు మాసాలు రుతువులు మారే మాసాలు. వాతావరణం మారినప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దగ్గు, జలుబు , ఫ్లూలతోపాటు ఇన్ఫెక్షన్ వంటి సీజనల్ వ్యాధుల వ్యాప్తి పెరుగుతుంది. అన్ని కూరగాయలు , పండ్లలో బ్యాక్టీరియా, కీటకాలు పెరగడం ప్రారంభిస్తాయి. వర్షం కారణంగా సాధారణ వ్యక్తి తన జీవితాన్ని ఇంటి వద్దనే ఎక్కువగా గడిపేస్తాడు. ఈ కారణంగా ఈ నాలుగు మాసాలలో శుభకార్యాలు చేయవద్దని.. ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సంయమనం పాటించేందుకు ఈ వ్రత నియమాలను ఏర్పాటు చేశారు.

ఏకాదశి తిధి ఎలా వచ్చిందంటే..
తాళజంఘుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడితో యుద్ధం చేసిన శ్రీ మహావిష్ణువు అలసిపోయి శయనిస్తాడు. దేవదేవుడు యోగనిద్రలో ఉండడం అదునుగా భావించిన దానవులు దేవతలపై విజృంభించారు. దీంతో దేవతలు భయపడి వైకుంఠధామానికి పరుగులు తీయడంతో భగవానుడి శరీరం నుంచి ఉద్భవించిన ‘సత్త్వశక్తి’ దానవుల దాష్టీకాన్ని కట్టడి చేసింది. యోగనిద్ర నుంచి మేల్కొన్న పరంధాముడు ఆ శక్తికి ‘ఏకాదశి’ అని పేరుపెట్టాడు. ఆమె సమయస్ఫూర్తికి, సకాలంలో సహకరించి నందుకు సంతసించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకంలో పూజలు అందుకోవాలని కోరుకుందట. అప్పటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది.

వ్రతం ఆచరించు విధానం..
ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశినాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది. అలాగే ఈ వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు.

అదేవిధంగా మంచంపై శయనించ కూడదని పురాణాలు చెబుతున్నాయి. మానవ జాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నట్లు పండితులు చెప్తుంటారు. తొలి ఏకాదశి రోజున పిండిదీపం పెట్టాలి. ఈ రోజు పేలాల పిండి తినడం ఆచారం. ఉపవాసం ఉండే వారి నియమాలు యథావిధి. అలా కాకుండా కొన్ని ప్రాంతాల్లో తొలి ఏకాదశిని పండుగులా జరుపుకునే ఆచారం కూడా ఉంది.

రైతులకు కూడా పండుగే..
ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు.

ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ..
తొలి ఏకాదశి రోజున శేషసాయిని(విష్ణువు) పూజించి..అలా ప్ర‌తినెలా వచ్చే ఏకాదశిని విడిచిపెట్టకుండా శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అంతేగాదు అనాదిగా సాధువులు, భక్తజనులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి శ్రీ విష్ణుసాయుజ్యం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు.

సూర్యవంశ చక్రవర్తి, సత్యసంధుడు మాంధాత, తన రాజ్యంలో అనావృష్టి నెలకొన్నప్పుడు అంగిరసుడి సూచనపై ‘శయనైక ఏకాదశి’ వ్రతాన్ని భక్తితో చేశాడని, ఫలితంగా వర్షాలు కురిసి పరిస్థితి చక్కబడిందని పురాణాలు చెపుతున్నాయి. పైగా సతీ సక్కుబాయి కూడా ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందారట. అలాగే ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలు చేస్తారు.

(చదవండి: ఆత్మ అంతిమంగా ఎక్కడకు చేరుకుంటుందో అదే..!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement