సందడి సందడిగా బోనాల పండుగ
అనంతపురం కల్చరల్ : నగరంలోని నాయక్‌నగర్‌లోని బంజారాల ప్రాచీన ఆలయంలో మంగళవారం సీతలాయ్యాడి బోనాల పండుగ వేడుకగా జరిగింది. ఏడాదికోసారి వచ్చే ఉత్సవాన్ని బంజారాలు ఘనంగా నిర్వహించారు. వందలాదిగా తరలివచ్చిన జనసందోహంతో నగర వీధులు కోలాహలంగా మారాయి. దాదాపు 200 మంది మహిళలు తలపై బోనాలు పెట్టుకుని జాతరగా వెళ్ళి అమ్మవారికి సమర్పించారు. అంతకు ముందు బంజారా పూజారులు నాయకుల కులదైవమైన మారెమ్మ తల్లి ప్రతిరూపాలైన పెద్దమ్మ, కాంకాళి, మరియమ్మ, సుంకులమ్మ, నాన్‌బాయి, హింగిలా భవానీ, మత్రాళీ తదితర అక్కమ్మ దేవతలను సర్వంగ సుందరంగా అలంకరించి ప్రతిష్టించారు.
చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మహిళలు, వృద్ధులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు చంద్రీబాయి, కృష్ణానాయక్ మాట్లాడుతూ వందల సంవత్సరాలుగా లంబాడీలుగా, సుగాళీలుగా, నాయక్‌లుగా పిలవబడుతున్న బంజారాలు ఏ ప్రాంతంలో ఉన్నా తమ సంస్కృతిని మరచిపోకుండా చేసుకునే పండుగలకు నిదర్శనమే సీతాలయ్యాది ఉత్సవమన్నారు. కార్యక్రమంలో శంకరశివరావు రాథోడ్, లక్ష్మణా నాయక్, కళావతి తదితరులు పాల్గొన్నారు.