ఏపీ సీఎం ప్రకటన.. రద్దీ నిర్వహణలో విఫలమయ్యామని అంగీకారం
సాక్షి, రాజమండ్రి: తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు ఏపీ సీఎం చంద్రబాబు రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌లతో కలసి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలను పరిశీలించి, క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని, క్షతగాత్రులకు వైద్యం అందిస్తామని ధైర్యం చెప్పారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. రద్దీ నిర్వహణ మరింత క్రమపద్ధతిలో జరిగి ఉండాల్సిందన్నారు. అన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకున్నా.. అనుకున్నదానికంటే ఎక్కువమంది రావడం వల్ల ఊహించని ఈ సంఘటన జరిగిందన్నారు. ట్రాఫిక్, తాగునీటి సమస్యలపై అధికారులతో సమీక్ష జరుపుతామన్నారు. ఇంకా 11 రోజులు ఉన్నందున ఈ దుర్ఘటనకు సంబంధించి బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై అప్పుడే నిర్ణయం తీసుకోలేమన్నారు. పూర్తి విచారణ జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. పుష్కరాలు జరిగినన్ని రోజులూ దాదాపు రాజమండ్రిలోనే ఉంటానన్నారు. కాగా, నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు నేడు ఢిల్లీ వెళ్లాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన పర్యటన రద్దు చేసుకున్నారు. రాజమండ్రి ఘటన నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారవర్గాలు తెలిపాయి.
న్యాయ విచారణకు ఆదేశం
రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం
Published Wed, Jul 15 2015 3:18 AM | Last Updated on Sun, Sep 3 2017 5:29 AM
Advertisement