గోదావరి పుష్కరాలు జూలై 14న ప్రారంభమవుతున్న నేపథ్యంలో- ఇది 11 పుష్కరాల క్రితం నాటి ప్రస్తావన. 1884 తారణనామ సంవత్సరంలో గోదావరి పుష్కర సంరంభం ప్రారంభమైంది. అప్పటికి గయోపాఖ్యాన కర్త, కవి చిలకమర్తి లక్ష్మీనరసింహంకు 17 ఏళ్లు. ఆనాటి ముచ్చట్లను, అప్పటి పుష్కర ఏర్పాట్లను తన ‘స్వీయచరిత్ర’లో ఇలా రాసుకున్నారు: ‘1884 తారణ సంవత్సరం గోదావరి పుష్కర యాత్రికులు ఉత్కళ దేశము నుండి, నిజాము రాష్ట్రం నుంచి తక్కిన ఆంధ్ర మండలం నుంచి వచ్చారు’.
అనంతరం 1896లో ఆయన 29వ ఏట వచ్చిన దుర్ముఖి నామ సంవత్సరంలో జరిగిన గోదావరి పుష్కరాలను గురించి కూడా తన ఆత్మకథలో ప్రస్తావిస్తూ, ‘యాత్రికులకు దొరతనము వారు కోటిలింగాల వద్ద తాటియాకుల పందెళ్లు, పాకలు వేయించి వసతులు ఏర్పరిచిరి. ధర్మవరం సంస్థానం ప్రొప్రయిటరు కంచుమర్తి రామచంద్రరావు జమిందారులు యాత్రికుల సౌకర్యం నిమిత్తం నూతి నీళ్లు, కుళాయిగొట్టం ద్వారా తెప్పించునేర్పాటు చేసిరి. పుష్కర నగరంలో మంచి మంచి బాటలు వేయించుటలో వీరు దొరతనము వారికి మిక్కిలి తోడ్పడిరి. ఆ పుష్కరములో వీరు మిక్కిలి శ్రమపడిరనడంలో అతిశయోక్తి లేదు. ఇంతియే కాదు. జనోపయోగకరమైన ప్రతి కార్యక్రమమునందు శ్రీరామచంద్రరావుగారు మేనుదాచుకొనక బహుశ్రమపడి పని చేసి రాజమహేంద్రవరమునకు మంచి యశస్సు సంపాదించెడివారు’. ‘ఎలిపిన్‌స్టన్ సబ్‌కలెక్టర్ మానవ సేవాపరాయణులు. గోదావరిరేవులో జనం పడిపోకుండా, కర్రదూలములు పాతించారు. విషూచి1 జాడ్యము వస్తే స్వయంగా పాయకానా దొడ్లను పరిశీలించి, శుభ్రం చేయించి మందులు సకాలంలో అందించారు’ అని రాశారు.
- మధునామూర్తి
ఫోన్: 9505504998
అల..నాటి పుష్కరాలు
Published Sun, Jul 12 2015 4:22 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM
Advertisement
Advertisement