గోదావరి పుష్కరాలపై త్వరలో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.
హైదరాబాద్: గోదావరి పుష్కరాలపై త్వరలో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. పుష్కరాల సందర్భంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కోసం నిపుణల బృందాల్ని నియమించామన్నారు. శాసనసభలోని తన చాంబర్‌లో బుధవారం గోదావరి పుష్కరాలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో ఓ బృందం శృంగేరి తదితర ప్రాంతాలకు వెళ్లి అక్కడి పీఠాధిపతులు, మత పెద్దలను ఆహ్వానిస్తుందన్నారు.
పుష్కరాలకు హాజరుకావాలంటూ స్వయంగా తానే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితోపాటు రాష్ర్టపతిని ఆహ్వానిస్తానన్నారు. గోదావరి పుష్కరాలను జాతీయ వేడుకల కింద పరిగణించాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్నారు. పుష్కరాల లోగోను వచ్చే నెల పదో తేదీలోగా నిర్ణయిస్తామన్నారు. సమీక్షా సమావేశంలో మంత్రి మాణిక్యాలరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్ కృష్ణారావు, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, కమిషనర్ అనురాధ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అదిత్యనాథ్‌దాసు తదితరులు పాల్గొన్నారు.