special website
-
ఇందిరమ్మ ఇళ్ల ఫిర్యాదుల కోసం వెబ్సైట్
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, సేవలను మరింత పారదర్శకంగా అందించడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. ఫిర్యాదుల కోసం ఇంది రమ్మ ఇళ్ల గ్రీవెన్స్ మాడ్యూల్‌ను తెచ్చినట్లు రెవె న్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గురువారం సచివాల యంలోని తన కార్యాలయంలో ఈ గ్రీవెన్స్ మాడ్యూల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే indirammaindlu.telangana.gov.in కు ఫిర్యాదు చేయవచ్చని, ఆ ఫిర్యాదులపై ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకుని, వివరాలను ఫిర్యాదు దారు మొబైల్‌కు మెసేజ్ రూపంలో పంపిస్తామని తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన ఈనెల 8వ తేదీనాటికి 32 జిల్లాలలో 95% పూర్తికాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 88% పూర్తయిందన్నారు. త్వరలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఇళ్ల నిర్మాణం కార్యాచరణపై దృష్టి సారిస్తా మన్నారు. మొదటి విడతలో నివాస స్థలం ఉన్నవారికి, రెండో దశలో ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లను మంజూరు చేస్తామన్నారు, మొదటి విడతలో వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, అత్యంత ప్రాధా న్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. -
విద్యా సంస్థల పర్యవేక్షణకు వెబ్సైట్
సాక్షి, అమరావతి: విద్యా సంస్థల పర్యవేక్షణ కోసం ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటైంది. దీనిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. విద్యా రంగంపై మేధోమథన సదస్సు అనంతరం ఈ వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్కరించారు. తమ విద్యా సంస్థల్లోని వసతులు, పాటిస్తున్న ప్రమాణాలపై ఆయా స్కూళ్లు, కాలేజీలు స్వయంగా ఆ వెబ్సైట్లో వివరాలు అప్లోడ్ చేస్తాయని, ఆ డొమెయిన్ అందరికీ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. వెబ్సైట్లో పేర్కొన్న వసతులు, ప్రమాణాలు నిజంగా క్షేత్రస్థాయిలో లేకపోతే ఎవరైనా స్పందించి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ వెబ్సైట్ అందరికీ అందుబాటులో ఉంటుందని సీఎం చెప్పారు. వెబ్సైట్ ఐడీ : www. apsermc. ap. gov. in. కార్పొరేట్ సంస్కృతికి చెక్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. విద్యా రంగంలో కార్పొరేట్ సంస్కృతికి చెక్ పెడుతున్నామని.. అందుకోసం రెండు కమిషన్లు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. వీటి బాధ్యతలను ఇద్దరు హైకోర్టు జడ్జీలు జస్టిస్ ఆర్.కాంతారావు, జస్టిస్ ఈశ్వరయ్యకు అప్పగించామన్నారు. ఒకరు పాఠశాల విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌కు, మరొకరు ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌కు బాధ్యత వహిస్తారని చెప్పారు. ఇప్పటికే ఆ కమిషన్లు పనులు మొదలు పెట్టాయన్నారు. జస్టిస్ ఆర్. కాంతారావు కమిషన్ గత ఫిబ్రవరిలో 172 స్కూళ్లు తనిఖీ చేసి 62 స్కూళ్లకు నోటీసులు జారీచేయగా, జస్టిస్ ఈశ్వరయ్య కమిషన్ 130 కాలేజీలు తనిఖీచేసి 40 కాలేజీలపై చర్య తీసుకున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, విద్యా శాఖకు చెందిన అధికారులతో పాటు, నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అసత్య ప్రచారానికి చెక్‌పెట్టేలా..
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో తప్పుడు వార్తలు, అసత్య సమాచారంతో జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకునేందు కు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి సంబంధించి ఇప్పటికే పలు చట్టాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనాకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక ధ్రువీ కరణ తర్వాత మాత్రమే ప్రజలకు చేరవేయాలని అన్ని రకాల మీడియాను ఇదివరకే ఆదేశించింది. తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వాస్తవ సమాచారాన్ని ప్రజలకు తెలియ చెప్పేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను డిజైన్ చేసినట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న కథనాలను ఈ వెబ్సైట్లో పెట్టడంతో పాటు అందులోని వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. factcheck. telangana. gov.in వెబ్సైట్లో వాస్తవాలు ధ్రువీకరించుకోవాలని కోరారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా తిరుగుతున్న కొన్ని వీడియోలు, సమాచారంపై గురువారం బులెటిన్ విడుదల చేసింది. ►కొందరు ముస్లిం యువకులు స్పూన్లు, ప్లేట్లు నాకుతున్నట్లుగా ఉన్న ప్రచారంలో ఉన్న వీడియోలు 2018కి సంబంధించినవి. ఆహారం వృథా చేయకుండా బోహ్రా ముస్లిం తెగలో ఇది ఒక ఆచారం. ►కరోనాపై సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పంపేవారు శిక్షార్హులు అంటూ కేంద్ర హోం శాఖ పేరిట ప్రచారంలో ఉన్న లేఖ జారీ చేయడం అవాస్తవం. ►ఇటలీలో రోడ్ల మీద డబ్బును పడేస్తున్నారని ప్రచారంలో ఉన్న ఫోటోలు అవాస్తవం. వెనిజులాలో ద్రవ్యోల్బణం పెరిగి కరెన్సీ విలువ పడిపోవడంతో అలా చేశారు. ►లాక్‌డౌన్‌ను మే 4వ తేదీ వరకు ప్రధాని మోడీ పొడిగించినట్లు స్క్రీన్‌షాట్‌ను ఫొటో షాప్‌లో చేశారు. ప్రధాని ఇలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. ► కొంతమంది ముస్లిం యువకులు బృం దంగా ఏర్పడి తుమ్ముతున్నట్లుగా ప్రచారం లో ఉన్న వీడియోకు నిజాముద్దీన్ దర్గాకు ఎలాంటి సంబంధం లేదు. సూఫీ ఆచారం ప్రకారం ఇలా ఊగిపోవడాన్ని జిక్ర్ అంటారు. పాకిస్తాన్లో జనవరిలోనే ఈ వీడియో ప్రచారంలోకి వచ్చింది. -
కోరుకున్న గుడిలో.. నచ్చిన పూజ
సాక్షి, అమరావతి: ఆస్ట్రేలియాలో ఉంటున్న వెంకటేశ్వరరావుకు సింహాచలం లక్ష్మీ నర్సింహస్వామిపై ఎంతో గురి.. గతంలో విశాఖపట్నంలో ఉన్నప్పుడు ప్రతి ఏటా పుట్టినరోజున కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్లి పూజ చేయించేవాడు. అలా చేయకపోతే.. ఆ ఏడాది పనులు సజావుగా సాగవని అతని నమ్మకం. ఇప్పుడు విదేశాల్లో ఉంటున్నందున పుట్టినరోజ నాడు ప్రతి ఏటా సింహాచలం వచ్చి పూజ చేయించడం సాధ్యం కాని పని. ఇలాంటి వారి కోసం రాష్ట్ర దేవదాయ శాఖ ఎన్నారై సేవలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఎన్నారైలే కాదు.. దేశంలో ఎక్కడున్నా సరే.. మీపుట్టిన రోజు నాడో, ఇతర ప్రత్యేక సందర్భాల్లోనే తమ ఇష్టదైవం ఆలయంలో పూజ, ఇతర సేవలు చేయించుకునే అవకాశాన్ని దేవదాయ శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. భక్తుడు దేశ, విదేశాల్లో ఎక్కడ ఉన్నా.. వారి పేరిట కోరుకున్న తేదీన ఎంచుకున్న పూజను ఆలయ పూజారి జరిపిస్తారు. ఇందుకోసం అన్ని దేవాలయాల సేవల్ని ఒకచోట అందుబాటులోకి తెస్తూ.. ప్రత్యేక వెబ్సైట్ రూపకల్పనకు ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ ప్రక్రియలో గుళ్లలోని వివిధ పూజల టికెట్ ధరకు అదనంగా కొంత మొత్తాన్ని సర్వీసు చార్జ్ రూపంలో వసూలు చేస్తారు. పూజ అనంతరం భక్తుడికి ప్రసాదం వంటివి పంపేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు. -
ఉద్యోగ సమాచారం ఇక మీ చేతుల్లో..
తొర్రూరు రూరల్(పాలకుర్తి) వరంగల్ : ఉద్యోగ సమాచారం తెలుసుకునేందుకు నిరుద్యోగ యువత ఇక ఇబ్బందులు పడనక్కర్లేదు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల సమాచారం తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేలాది మంది విద్యార్థులు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం వివిధ కంపెనీలను ఆశ్రయించడం.. తీరా అక్కడికి వెళ్లాక ఖాళీలు లేవని చెప్పడం పరిపాటిగా మారుతోంది. నిరుద్యోగులకు సమాచారం కత్తి మీద సాములా మారింది. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘నేషనల్ కెరీర్ సర్వీస్’( ఎన్సీఎస్) వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. దీని ద్వారానే భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావిస్తోంది. ఇప్పటికే వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది. ఎంప్లాయిమెంట్ కార్యాలయాలు కూడా దీనిపై అవగాహన కల్పిస్తున్నాయి. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాల్లో ఎన్‌సీఎస్‌లో నమోదు చేసుకున్న వారి మొబైల్‌కు మెసేజ్‌ల ద్వారా ఉద్యోగ సమాచారం అందుతుంది. నమోదు ఇలా.. ఇంటర్నెట్లో www.ncs.gov.in' వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత ‘న్యూ యూజర్’లో ‘సైన్ అప్’ క్లిక్ చేస్తే వివరాలు అడుగుతుంది. అవసరమైన వివరాలు ఎంటర్ చేసిన తర్వాత అకౌంట్ రిజిస్టర్ అవుతుంది పై వివరాల నమోదు తర్వాత అభ్యర్థి ఏయే ఉద్యోగాలకు అర్హులో పేర్కొనాలి. విద్యార్హతలను స్పష్టంగా నమోదు చేయాలి. తర్వాత కాలమ్‌లో సెక్యూరిటీ కోడ్స్ ఉంటాయి. వీటిని నమోదు చేసి ‘సబ్మిట్’ పై క్లిక్ చేయగానే ఎన్సీఎస్ పోర్టల్‌లో యూజర్ ఐడీ వస్తుంది. వెంటనే అభ్యర్థి మొబైల్‌కు ఆరు అంకెల వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే 19 అంకెలతో కూడిన ఎన్సీఎస్ యూఐడీ నెంబర్ క్రియేట్ అవుతుంది. 24 గంటల అనంతరం అభ్యర్థి పేరుపై ఖాతా యాక్టివేట్ అవుతుంది. ఈ వెబ్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకున్న వారికి వ్యక్తిగత ఈ మెయిల్ మాదిరిగానే యూజర్ ఐడీని కేటాయిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ రంగాల్లో నిర్వహించే ఉద్యోగ మేళాలు ఈ వివరాలన్ని నిర్వాహకులకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. వారు నేరుగా ఉద్యోగాల భర్తీ వివరాలను మొబైల్‌కి పంపుతారు. ముఖ్యంగా ఉపాధి కల్పన కార్యాలయాల ద్వారా జరిగే ఎంపికల్లో ఎన్‌సీఎస్‌లో నమోదైన అభ్యర్థులకు ప్రత్యేక ప్రాధాన్యముంటుంది. మరిన్ని వివరాలకు... వెబ్సైట్లో కనిపించే ‘యూజర్ మాన్యువల్’ను డౌన్లోడ్ చేసుకుని నిరుద్యోగులు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. టోల్‌ఫ్రీ నెంబర్ 1800 425 1514కు ప్రతి మంగళవారం నుంచి ఆదివారం వరకు ఉద యం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఫోన్ చేసి సమాచారం తెలుసుకునే వీలుంది. ప్రత్యేక ఫీచర్లు..యూఐడీ పొందిన అభ్యర్థులు వెబ్సైట్లోకి లాగిన్ కాగానే ‘జాబ్ ఫెయిర్ టై ఈవెంట్స్’ క్లిక్ చేస్తే సెర్చ్ మోడ్ వస్తుంది. దేశం, ఏ రాష్ట్రంలో ఉద్యోగం కోరుకుంటున్నారో ఆప్షన్‌ను క్లిక్ చేస్తే అక్కడి జాబ్ మేళా వివరాలు, ప్రైవేటు, కార్పొరేట్ రంగాల్లో నమోదు చేసుకున్న కంపెనీల వివరాలు, వాటిలో ఖాళీల వివరాలు కనిపిస్తాయి. వెబ్సైట్ ముఖ చిత్రంలో కనిపించే ‘ ఆన్ గోయింగ్ ఈవెంట్స్’ ‘జాబ్ ఫెయిర్ ఆప్షన్’ను ఎంపిక చేస్తే ప్రస్తుత జిల్లా, రాష్ట్రం, దేశంలో ఎక్కడ ఉద్యోగావకాశాలు ఉన్నాయో తెలుస్తుంది. -
ఆన్లైన్లో అత్యాచార నిందితుల జాబితా!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక దాడుల వంటి నేరాలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో.. వాటి కట్టడి దిశగా కేంద్ర హోం శాఖ చర్యలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఏడేళ్ల క్రితం 24,206 మంది లైంగిక వేధింపులకు పాల్పడితే.. 2017లో 96,036 మంది లైంగిక వేధింపులకు పాల్పడినట్టు రికార్డులు చెబుతున్నాయి. దీంతో ఈ తరహా నేరాలకు పాల్పడినవారి ఫొటోలు, వివరాలు, నమోదైన కేసులు, పడిన శిక్షలు తదితర వివరాలన్నింటినీ ఓ ప్రత్యేక వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ‘నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్సువల్ అఫెండర్స్’పేరిట డేటాబేస్‌ను ఏర్పాటు చేసి.. దర్యాప్తు సంస్థలకు, ప్రజలకు అందుబాటులో ఉంచనుంది. తద్వారా లైంగిక నేరాలకు పాల్పడినవారిని సులువుగా గుర్తించడం, తగిన జాగ్రత్తలు చేపట్టడం వంటి చర్యల ద్వారా ఆయా నేరాలను నియంత్రించే అవకాశముందని భావిస్తోంది. దేశవ్యాప్త వివరాలు ఒకే వెబ్సైట్లో.. దేశవ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడినవారి వివరాలను ఒకేచోట పొందుపరచనున్నారు. అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడినవారి ఫొటోలతో సహా పూర్తి వివరాలు, వారిపై ఉన్న కేసులు, పడిన శిక్షలు తదితర వివరాలన్నింటినీ నమోదు చేసి... దర్యాప్తు సంస్థలకు, ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. మారు మూల ప్రాంతాల్లో ఉన్న పోలీస్స్టేషన్ల నుంచి దేశవ్యాప్తంగా నేరస్తుల డేటా రూపొందించే సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టు వరకు అన్ని స్థాయిల్లో ఉపయోగించుకునేలా ఈ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో సీఐడీ పరిధిలో పనిచేసే స్టేట్‌క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, జిల్లాల్లో పనిచేసే డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అధికారులు నోడల్ అధికారులుగా పనిచేస్తారు. జీవితాంతం జాబితాలో.. ♦ తొలిసారి లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుల వివరాలను 15 ఏళ్ల పాటు ఈ వెబ్సైట్లో నిక్షిప్తం చేస్తారు. అదే విధంగా ఐపీసీ సెక్షన్లు 376, 354 (ఏ, బీ, సీ, డీ), 377 పరిధిలోని నేరాలకు పాల్పడినవారి వివరాలను కూడా 15 ఏళ్లపాటు నిక్షిప్తం చేస్తారు. పదే పదే లైంగిక వేధింపులు, అత్యాచార నేరాలకు పాల్పడినవారి వివరాలను 25 ఏళ్లపాటు డేటాబేస్‌లో ఉంచుతారు. ♦ ఇక ఐపీసీ సెక్షన్లు 376 (1), (3,4,5,6) పరిధిలోని నేరాలు, ట్రాఫికింగ్ నేరాలు, 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు బాలికలపై వేధింపుల (పోస్కో యాక్ట్ పరిధిలోని నేరాలు)కు పాల్పడేవారి డేటాను 25 ఏళ్ల పాటు వెబ్సైట్లో ఉంచుతారు. ఒకవేళ వీరు తిరిగి నేరాలకు పాల్పడితే వారి జీవితాంతం వివరాలు డేటాబేస్‌లో ఉండిపోతాయి. ♦ తరచూ నేరాలు చేసేవారు (హ్యాబిచువల్ అఫెండర్స్), కిరాతకమైన అత్యాచారాలు, గ్యాంగ్రేపులు, కస్టోడియల్ రేపులు, రేప్ అండ్ మర్డర్ కేసులు నమోదైన వారి వివరాలను వారి జీవితాంతం వెబ్సైట్లో ఉంచుతారు. కేసు కొట్టివేస్తే.. తొలగింపు లైంగిక వేధింపులు, అత్యాచార కేసులను కోర్టులు కొట్టివేస్తే.. ఆయా కేసుల్లోని వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తారు. కోర్టు నుంచి వచ్చిన తుది ఉత్తర్వులకు లోబడి నోడల్ అధికారులు ఈ వివరాలను తొలగిస్తారు. అయితే పదేపదే నేరాలకు పాల్పడేవారి విషయంలో మాత్రం పేర్లను జాబితా నుంచి తొలగించరు. నిఘాతో నియంత్రణ... మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడినవారి వివరాలు అన్ని పోలీస్ స్టేషన్లకు అందుబాటులో ఉండటం వల్ల.. వారిపై నిఘా పెట్టడం, మళ్లీ నేరాలు చేయకుండా నియంత్రించడం సులువు అవుతుందని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. అంతేగాకుండా ఈ నేరస్తుల జాబితాను అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు కూడా అందుబాటులో ఉంచాలని యోచిస్తోంది. ఇక నిందితులపై అత్యాచారాల, వేధింపుల షీట్స్ తెరవాలని కూడా నిర్ణయించింది. అనుమానితుల ఫొటోలను స్కాన్ చేసి.. జాబితాలో ఉంటే గుర్తించేలా ‘ఫేస్ రికగ్నిషన్’సాంకేతికతను కూడా వెబ్సైట్లో పొందుపర్చనున్నారు. నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌కు కూడా ఈ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేసి.. నిందితుల వేలిముద్రలనూ నిక్షిప్తం చేయనున్నారు. దీనివల్ల జాబితాలో ఉన్నవారు దేశంలో ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ నేరాలకు పాల్పడినా వెంటనే గుర్తించేందుకు అవకాశం లభించనుంది. అయితే ఈ జాబితాలో నేరం రుజువై శిక్షపడిన వారి వివరాలు మాత్రమే సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. దర్యాప్తు విభాగాలకు మాత్రం వారిపై ఎఫ్ఐఆర్ అయినప్పటి నుంచి ప్రతి వివరాలూ అందుబాటులో ఉంటాయి. -
పుష్కరాలకు ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభం
భక్తులకు ఉపయోగపడేలా రూపకల్పన సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన వెబ్‌సైట్‌ను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం సచివాలయంలోని తన చాంబర్లో ఆవిష్కరించారు. అనంతరం దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్‌లతో కలసి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పుష్కర స్నానాలకు వచ్చే భక్తులందరికీ ఉపయోగపడేలా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు తెలిపారు. pushkaralu.telangana.gov.in వెబ్సైట్ ద్వారా పుష్కరఘాట్లు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలతోపాటు బస్సులు, రైళ్ల వివరాలను తెలుసుకోవచ్చన్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా పోలీసులు రూపొందించిన మొబైల్ యాప్‌లను ఈ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ఎక్కువ రద్దీ ఉన్న ఘాట్ల వివరాలను ఎప్పటికప్పుడు ‘ఫ్లాష్‌న్యూస్’ ద్వారా అప్డేట్ చేయడంతోపాటు ప్రత్యామ్నాయ ఘాట్ల వివరాలను తెలియజేస్తామని వివరించారు. రోజువారీగా వచ్చే భక్తుల సంఖ్య, ఇతర వివరాలను ఈ సైట్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయనున్నట్లు చెప్పారు. -
రిలయన్స్ ‘లైఫ్’ మొబైల్స్ ప్రత్యేక వెబ్సైట్..
ఎంట్రీ లెవెల్లో రెండు మోడళ్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ రిలయన్స్ జియో వ్యూహాత్మకంగా వేగం పెంచుతోంది. 2016 ద్వితీయార్థంలో 4జీ సేవలను ఆవిష్కరించనున్న ఈ సంస్థ మొబైళ్ల కోసం మైలైఫ్.కామ్ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించింది. ఎర్త్, వాటర్, విండ్, ఫ్లేమ్ శ్రేణి మోడళ్లను ఈ వెబ్సైట్లో ప్రదర్శిస్తోంది. వెబ్సైట్ ద్వారా ఫోన్‌ను కొనుక్కునే అవకాశం ప్రస్తుతానికి లేదు. ఆసక్తిగల కస్టమర్ల వివరాలను మాత్రమే వెబ్సైట్ ద్వారా సేకరిస్తున్నారు. లైఫ్ మొబైళ్లు లభించే సమీపంలో ఉన్న స్టోర్లను ఈ పోర్టల్ ద్వారా కస్టమర్లు తెలుసుకోవచ్చు. రిలయన్స్ డిజిటల్, లాట్, బిగ్ సి, సంగీత మొబైల్స్, డిజిటల్ ఎక్స్‌ప్రెస్, ఈజోన్, యూనివర్సెల్, స్పైస్ తదితర స్టోర్లలో లైఫ్ ఫోన్లను కంపెనీ విక్రయిస్తోంది. కస్టమర్ కేర్ ప్రతినిధితో మాట్లాడేందుకు వీలుగా టోల్ ఫ్రీ నంబరు అందుబాటులో ఉంది. ఎంట్రీ లెవెల్లోకి ఎంట్రీ.. రిలయన్స్ రిటైల్ తాజాగా లైఫ్ విండ్-6, లైఫ్ ఫ్లేమ్-1 పేర్లతో ఎంట్రీ లెవెల్ 4జీ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టింది. అసలైన్ 4జీ అనుభూతి కోసం వీటిలో వాయిస్ ఓవర్ ఎల్టీఈ, వాయిస్ ఓవర్ వైఫై ఫీచర్లను జోడించింది. 1.1 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ, రెండు వైపులా 5 ఎంపీ కెమెరా, డ్యూయల్ సిమ్ పొందుపరిచింది. విండ్-6 ధర రూ.7,499. ఫ్లేమ్-1 ధర రూ.6,699. ఇది నాలుగు రంగుల్లో లభిస్తుంది. -
మహిళా సమాఖ్యలకు
కేజీబీవీల పగ్గాలు ప్రతి నెలా రూ.1000 ఇవ్వాలని నిర్ణయం పనితీరు ఆధారంగా సొమ్ము పెంచే అవకాశం పర్యవేక్షణకు ప్రత్యేక వెబ్సైట్ భానుగుడి (కాకినాడ) : ఇప్పటివరకూ అధికారుల పర్యవేక్షణలో ఉన్న కస్తూరిబాగాంధీ బాలికా విద్యాలయాలను (కేజీబీవీ) ఇకనుంచి మహిళా సమాఖ్యలకు అప్పగించనున్నారు. బడి మధ్యలో మానేసిన విద్యార్థినులకు, తల్లితండ్రులు వదిలేసిన వీధి బాలికలవంటివారికి విద్యాసుగంధాన్ని అందించేందుకు కేజీబీవీలను ఏర్పాటు చేశారు. జిల్లాలోని తుని, తొండంగి, కోటనందూరు, శంఖవరం, గంగవరం, వై.రామవరం, రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు, కోటనందూరు, వీఆర్ పురం, ఎటపాక మండల కేంద్రాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. వీటిల్లో 2,282 మంది విద్యార్థినులు 6 నుంచి పదో తరగతి వరకూ చదువుతున్నారు. ఈ విద్యాలయాల నిర్వహణకు ప్రభుత్వం ఏటా రూ.6 కోట్లు వెచ్చిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో ఉండడంతో ఈ విద్యాలయాలను పర్యవేక్షించడం అధికారులకు కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వీటి పర్యవేక్షణ బాధ్యతను మహిళా సమాఖ్యలకు అప్పగించాలని కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మహిళా సమాఖ్యల సభ్యులకు అధికారులతో శిక్షణ ఇస్తున్నారు. మండలాల వారీగా అవగాహన కార్యక్రమాలు, ప్రతి రోజూ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.కేజీబీవీల నిర్వహణకు హేస్ట్ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ఎస్‌ఎఎంఎస్ వెబ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ప్రతి కేజీబీవీలోనూ ఉదయం 8.30 గంటలకే విద్యార్థినుల హాజరు ఈ వెబ్సైట్లో నమోదు కావాలి. విద్యార్థులు, ఉద్యోగుల హాజరంతా ఈ వెబ్సైట్ ద్వారా జిల్లా అధికారులు తెలుసుకోవచ్చు. తద్వారా విద్యార్థినుల హాజరు శాతం పెంచవచ్చని అధికారులు అంటున్నారు.కేజీబీవీల పర్యవేక్షణకు సంబంధించి మహిళా సమాఖ్యకు ప్రతి నెలా రూ.1000 ఇవ్వాలని కలెక్టర్ నిర్ణయించారు. మహిళా సంఘాల పనితీరు ఆధారంగా ఈ సొమ్ము పెంచే అవకాశాలున్నాయి. -
పుష్కరాలపై ప్రత్యేక వెబ్సైట్
హైదరాబాద్: గోదావరి పుష్కరాలపై త్వరలో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. పుష్కరాల సందర్భంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కోసం నిపుణల బృందాల్ని నియమించామన్నారు. శాసనసభలోని తన చాంబర్లో బుధవారం గోదావరి పుష్కరాలపై ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో ఓ బృందం శృంగేరి తదితర ప్రాంతాలకు వెళ్లి అక్కడి పీఠాధిపతులు, మత పెద్దలను ఆహ్వానిస్తుందన్నారు. పుష్కరాలకు హాజరుకావాలంటూ స్వయంగా తానే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితోపాటు రాష్ర్టపతిని ఆహ్వానిస్తానన్నారు. గోదావరి పుష్కరాలను జాతీయ వేడుకల కింద పరిగణించాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్నారు. పుష్కరాల లోగోను వచ్చే నెల పదో తేదీలోగా నిర్ణయిస్తామన్నారు. సమీక్షా సమావేశంలో మంత్రి మాణిక్యాలరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్ కృష్ణారావు, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, కమిషనర్ అనురాధ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అదిత్యనాథ్‌దాసు తదితరులు పాల్గొన్నారు. -
బతుకమ్మ కోసం ప్రత్యేక వెబ్సైట్
హైదరాబాద్: ఇంటర్నెట్ వేదికగా బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా బతుకమ్మ పేరిట సోషల్ మీడియా ద్వారా ప్రచారం మొదలుపెట్టింది. ఫేస్బుక్ లో బతుకమ్మ కోసం ప్రత్యేక పేజీ పెట్టింది. ప్రత్యేక వెబ్సైట్ www.bathukamma.telangana.gov.in తయారుచేయించింది. అక్టోబర్ 2న హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ లో జరిగే బతుకమ్మ వేడుకలను యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.