తొర్రూరు రూరల్(పాలకుర్తి) వరంగల్ : ఉద్యోగ సమాచారం తెలుసుకునేందుకు నిరుద్యోగ యువత ఇక ఇబ్బందులు పడనక్కర్లేదు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల సమాచారం తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేలాది మంది విద్యార్థులు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం వివిధ కంపెనీలను ఆశ్రయించడం.. తీరా అక్కడికి వెళ్లాక ఖాళీలు లేవని చెప్పడం పరిపాటిగా మారుతోంది. నిరుద్యోగులకు సమాచారం కత్తి మీద సాములా మారింది.
దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘నేషనల్ కెరీర్ సర్వీస్’( ఎన్‌సీఎస్) వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. దీని ద్వారానే భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావిస్తోంది. ఇప్పటికే వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. ఎంప్లాయిమెంట్ కార్యాలయాలు కూడా దీనిపై అవగాహన కల్పిస్తున్నాయి. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాల్లో ఎన్‌సీఎస్‌లో నమోదు చేసుకున్న వారి మొబైల్‌కు మెసేజ్‌ల ద్వారా ఉద్యోగ సమాచారం అందుతుంది.
నమోదు ఇలా..
ఇంటర్నెట్‌లో www.ncs.gov.in' వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత ‘న్యూ యూజర్’లో ‘సైన్ అప్’ క్లిక్ చేస్తే వివరాలు అడుగుతుంది. అవసరమైన వివరాలు ఎంటర్ చేసిన తర్వాత అకౌంట్ రిజిస్టర్ అవుతుంది పై వివరాల నమోదు తర్వాత అభ్యర్థి ఏయే ఉద్యోగాలకు అర్హులో పేర్కొనాలి. విద్యార్హతలను స్పష్టంగా నమోదు చేయాలి. తర్వాత కాలమ్‌లో సెక్యూరిటీ కోడ్స్ ఉంటాయి. వీటిని నమోదు చేసి ‘సబ్‌మిట్’ పై క్లిక్ చేయగానే ఎన్‌సీఎస్ పోర్టల్‌లో యూజర్ ఐడీ వస్తుంది. వెంటనే అభ్యర్థి మొబైల్‌కు ఆరు అంకెల వన్ టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేయగానే 19 అంకెలతో కూడిన ఎన్‌సీఎస్ యూఐడీ నెంబర్ క్రియేట్ అవుతుంది. 24 గంటల అనంతరం అభ్యర్థి పేరుపై ఖాతా యాక్టివేట్ అవుతుంది. ఈ వెబ్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకున్న వారికి వ్యక్తిగత ఈ మెయిల్ మాదిరిగానే యూజర్ ఐడీని కేటాయిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ రంగాల్లో నిర్వహించే ఉద్యోగ మేళాలు ఈ వివరాలన్ని నిర్వాహకులకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. వారు నేరుగా ఉద్యోగాల భర్తీ వివరాలను మొబైల్‌కి పంపుతారు. ముఖ్యంగా ఉపాధి కల్పన కార్యాలయాల ద్వారా జరిగే ఎంపికల్లో ఎన్‌సీఎస్‌లో నమోదైన అభ్యర్థులకు ప్రత్యేక ప్రాధాన్యముంటుంది.
మరిన్ని వివరాలకు...
వెబ్‌సైట్‌లో కనిపించే ‘యూజర్ మాన్యువల్’ను డౌన్‌లోడ్ చేసుకుని నిరుద్యోగులు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. టోల్‌ఫ్రీ నెంబర్ 1800 425 1514కు ప్రతి మంగళవారం నుంచి ఆదివారం వరకు ఉద యం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఫోన్ చేసి సమాచారం తెలుసుకునే వీలుంది.
ప్రత్యేక ఫీచర్లు..యూఐడీ పొందిన అభ్యర్థులు వెబ్‌సైట్‌లోకి లాగిన్ కాగానే ‘జాబ్ ఫెయిర్ టై ఈవెంట్స్’ క్లిక్ చేస్తే సెర్చ్ మోడ్ వస్తుంది. దేశం, ఏ రాష్ట్రంలో ఉద్యోగం కోరుకుంటున్నారో ఆప్షన్‌ను క్లిక్ చేస్తే అక్కడి జాబ్ మేళా వివరాలు, ప్రైవేటు, కార్పొరేట్ రంగాల్లో నమోదు చేసుకున్న కంపెనీల వివరాలు, వాటిలో ఖాళీల వివరాలు కనిపిస్తాయి. వెబ్‌సైట్ ముఖ చిత్రంలో కనిపించే ‘ ఆన్ గోయింగ్ ఈవెంట్స్’ ‘జాబ్ ఫెయిర్ ఆప్షన్’ను ఎంపిక చేస్తే ప్రస్తుత జిల్లా, రాష్ట్రం, దేశంలో ఎక్కడ ఉద్యోగావకాశాలు ఉన్నాయో తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment