న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 2016, మార్చి 1 నాటికి దాదాపు 4.12 లక్షల ఖాళీలు ఉన్నట్లు కేంద్రం బుధవారం లోక్‌సభకు తెలిపింది. ‘కేంద్ర సిబ్బందికి చెల్లిస్తున్న జీతభత్యాల వార్షిక నివేదిక’ ప్రకారం 2016 మార్చి నాటికి మొత్తం 36.33 లక్షల ఉద్యోగాలకు గానూ 4.12 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయి’ అని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా తెలియజేశారు.
కేంద్ర సర్వీసుల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. రైల్వేల్లో భర్తీకి చర్యలు: రైల్వేశాఖ భద్రతా విభాగంలో 2017, ఏప్రిల్ నాటికి 1.28 లక్షల ఖాళీలున్నట్లు కేంద్రం లోక్‌సభకు తెలిపింది. ఈ ఖాళీల్ని వేగంగా భర్తీచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వేశాఖ సహాయ మంత్రి రాజెన్ గోహైన్ వెల్లడించారు. గత ఐదేళ్లలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు అసిస్టెంట్ లోకో పైలెట్‌గా 50,463 మందిని విధుల్లోకి తీసుకున్నాయన్నారు.
► దేశవ్యాప్తంగా డాక్టర్ల సంఖ్యను పెంచడంలో భాగంగా 2017లో అద నంగా 5,800కుపైగా పీజీ వైద్య విద్య సీట్లను కేటాయించినట్లు కేంద్రం తెలిపింది. గత మూడేళ్లలో 479 వైద్య కళాశాలలకు అదనంగా 13,004 ఎంబీబీఎస్ సీట్లను కేటాయించినట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ రాజ్యసభకు రాతపూర్వకంగా తెలిపారు.
► దేశవ్యాప్తంగా 2017, డిసెంబర్ 10 నాటికి నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందిన 1040 మందిపై కేసు నమోదు చేసినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభకు రాతపూర్వకంగా తెలిపారు. 2010–16 కాలంలో నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి సీబీఐ 16 కేసుల్ని నమోదుచేసిందన్నారు.
కేంద్ర విభాగాల్లో 4.12 లక్షల ఖాళీలు
Published Thu, Dec 21 2017 2:04 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment