సాక్షి, న్యూఢిల్లీ : గత రెండేళ్లలో 2.53 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని 2018-19 వార్షిక బడ్జెట్ వెల్లడించింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలను పరిశీలిస్తే..మార్చి 1, 2018 నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 35.05 లక్షలుగా అంచనా. మార్చి 2016 నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 32.52 లక్షలు కావడం గమనార్హం. దీంతో కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ ఉద్యోగుల సంఖ్య రెండేళ్లలో 2.53 లక్షలు అధికంగా తేలింది. 2016, 2017లో పోలీస్ శాఖలోనే అత్యధిక నియామకాలు జరిగినా వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో కూడా ఉద్యోగుల సంఖ్యలో పెరుగుదల చోటుచేసుకుంది.
వ్యవసాయ, సహకార, కుటుంబ సంక్షేమ శాఖలో మార్చి 1 నాటికి ఉద్యోగుల సంఖ్యను పరిశీలిస్తే 1944 ఉద్యోగాలు అదనంగా జోడించబడతాయని బడ్జెట్ పత్రాలు పేర్కొన్నాయి. 2016లో ఈ విభాగంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3996గా నమోదైంది. అదేవిధంగా 2016, 2018 మధ్య పశుసంవర్థక, డైరీ అండ్ ఫిషరీస్ శాఖలో 1519 ఉద్యోగాలు నూతనంగా అందుబాటులోకి వచ్చినట్టు అంచనా. అణుఇంధన శాఖలోనూ గత రెండేళ్లలో కొత్తగా 6279 ఉగ్యోగాలు అదనంగా సమకూరాయి.
ఇక 2018 నాటికి పౌరవిమానయాన శాఖలో 1197 ఉద్యోగాలు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఇక హోంమంత్రిత్వ శాఖ పరిధిలో గత రెండేళ్లలో అత్యధికంగా పోలీస్ శాఖలో లక్షకు పైగా పోలీసు పోస్టులు భర్తీ అయ్యాయి. మార్చి 1, 2016లో పోలీస్ శాఖలో 10 లక్షల 24వేల 374 మంది ఉద్యోగులుండగా, మార్చి 1, 2018 నాటికి వీరి సంఖ్య 11 లక్షల 25వేల093కు పెరగనుంది. ఇక విదేశీ వ్యవహారాలు, పర్యావరణం, మైనారిటీ వ్యవహారాలు, గనుల మంత్రిత్వ శాఖలోనూ అదనపు పోస్టులు అందుబాటులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment