recruitement
-
సర్కారు ఓకే : మరి 26 ఏళ్లుగా నిలిచిపోయిన భర్తీల మాటేంటి?
దాదర్: ప్రమాణస్వీకారం తంతు పూర్తికావడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ శిందే, అజీత్ పవార్, మంత్రాలయలోని తమ తమ క్యాబిన్లలో ఆసీనులయ్యేందుకు సిద్ధమైతున్నారు. ఇందుకోసం మంత్రాలయ సామాన్య పరిపాలన విభాగం ఆయా శాఖల మంత్రుల క్యాబిన్లను సిద్ధంగా ఉంచింది. అయితే ముఖ్యమంత్రి, ఉప ముఖ్య మంత్రులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాల్సిన అంటెండర్లు, బంట్రోతుల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం సామాన్య పరిపాలన విభాగంలో కేవలం 30 మంది పర్మినెంట్ అటెండర్లు ఉన్నారు. కొరతను దృష్టిలో ఉంచుకుని మూడు, నాలుగో శ్రేణి ఉద్యోగులను భర్తీ కోసం తరుచూ ప్రతిపాదనలు అందుతున్నప్పటికీ సామాన్య పరిపాలన విభాగం ఈ అంశంపై నిర్లక్ష్యం వహిస్తోంది. 1998కి ముందు 120 మంది... ఈ నెల 15వ తేదీలోపు మంత్రివర్గ విస్తరణ చేప ట్టే అవకాశాలున్నాయి. ఆ తరువాత నాగ్‌పూర్ లో 16వ తేదీ నుంచి 21వ తేదీ మధ్య ప్రత్యేక శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలు పూర్తికాగానే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులుసహా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులందరూ మంత్రాలయలో విధులకు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అటెండర్లు, బంట్రోతుల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. 1998 ముందు సామాన్య పరిపాలన విభాగంలో 120 మంది అటెండర్లు, బంట్రోతులు, సిపాయిలు ఉండేవారు. ఎవరైనా పదవీ విమరణ చేస్తే వారి స్థానంలో ఇతరులను నియమించడం, పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ ప్రక్రియ పూర్తిచేసేవారు. కాని 1998 తరువాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, పదోన్నతులు నిలిపివేయడం, అప్పటి నుంచి ఇప్పటి దాకా అనేక మంది పదవీ విరమణ చేయడం, సిపాయి పోస్టులను రద్దు చేయడంతో ప్రస్తుతం పర్మినెంట్, కాంట్రాక్టు అంతాకలిపి 40 మంది అటెండర్లు మాత్రమే ఉన్నారు. వీరిని సామాన్య పరిపాలన విభాగం వివిధ శాఖలకు కేటాయించింది. ఇప్పుడైనా ఆమోదం లభించేనా? ముఖ్యంగా సామాన్య పరిపాలన విభాగం ఈ పోస్టులను భర్తీ చేస్తుంది. కా ముఖ్యమంత్రికి ఇద్దరు సూపర్వైజర్లు, ఒక బంట్రోతు, ఉప ముఖ్యమంత్రులకు ఒక సూపర్వైజర్, ఒక బంట్రోతు చొప్పున, క్యాబినెట్‌లోని మంత్రులందరికి ఒక బంట్రోతు, ఒక అటెండర్ చొప్పున సామాన్య పరిపాలన విభాగం కేటాయిస్తుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఉభయ సభల్లో అధికార పార్టీకి 8 మంది, ప్రతిపక్ష పార్టీకి 8 మంది ఇలా 16 మంది అటెండర్లను సామాన్య పరిపాలన విభాగం సమకూర్చి ఇస్తుంది. కానీ గత 26 ఏళ్లుగా భర్తీ ప్రక్రియ చేపట్టకపోవడం, పదోన్నతులు నిలిపివేయడంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కొనసాగిన మహాయుతి కూటమి ప్రభుత్వంలో ఆరేడుగురు మంత్రులు అటెండర్లు, బంట్రోతులు లేకుండానే విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన మహాయుతి ప్రభుత్వం ఇప్పుడైనా భర్తీ ప్రక్రియకు ఆమోదం తెలుపుతుందని మంత్రాలయ సిబ్బంది భావిస్తున్నారు. -
ఐటీ కంపెనీలు క్యాంపస్‌లకు వచ్చేస్తున్నాయ్..
చాలాకాలం తర్వాత ఐటీ కంపెనీలు క్యాంపస్‌లకు వచ్చేస్తున్నాయి. దాదాపు ఏడాది సుదీర్ఘ విరామం అనంతరం కంపెనీలు రిక్రూట్మెంట్ డ్రైవ్‌ల కోసం కాలేజీ క్యాంపస్‌లకు వస్తున్నాయి. ఇది ఐటీ పరిశ్రమలో పునరుజ్జీవనాన్ని సూచిస్తోంది. వ్యాపారాలు రికవరీ సంకేతాలను చూపడం, ప్రత్యేక సాంకేతిక ప్రతిభకు డిమాండ్ పెరగడంతో క్యాంపస్ నియామకాలపై కంపెనీలు దృష్టి పెట్టాయి.అయితే గతంలో మాదరి ఎంట్రీ-లెవల్ ఇంజనీర్లను పెద్దమొత్తంలో నియమించుకోవడం కాకుండా క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో నైపుణ్యం కలిగినవారి కోసం ఐటీ కంపెనీలు వెతుకుతున్నాయి. వీరికి వేతనాలు కూడా సాధారణంగా ఎంట్రీ-లెవల్ ఉద్యోగులకు ఇచ్చేదాని కంటే ఎక్కువగా ఆఫర్ చేస్తున్నాయి.క్యాంపస్‌ల బాటలో కంపెనీలుఇన్ఫోసిస్, టీసీఎస్, ఐబీఎం, ఎల్‌టీఐమైండ్‌ట్రీ వంటి ప్రధాన ఐటీ సంస్థలు ప్రారంభ దశ నియామకాల కోసం ఇప్పటికే కాలేజీ క్యాంపస్‌లను సందర్శించాయి. వీటిలో టీసీఎస్ 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. అలాగే ఇన్ఫోసిస్ కూడా క్యాంపస్, ఆఫ్-క్యాంపస్ డ్రైవ్‌ల ద్వారా 15,000 నుండి 20,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాది విరామం తర్వాత విప్రో కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో 10,000 నుండి 12,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రణాళికలతో తిరిగి క్యాంపస్‌ల బాట పట్టనుంది.ఇదీ చదవండి: ఉద్యోగులకు విప్రో కొత్త కండీషన్!మరింత కఠినంగా ఎంపికక్యాంపస్ ప్లేస్మెంట్ ప్రక్రియ ఇప్పుడు మరింత కఠినంగా మారింది. అధిక కట్-ఆఫ్ స్కోర్లు, ప్రత్యేక నైపుణ్యాలు, సర్టిఫికేషన్లకు ప్రాధాన్యం పెరిగింది. అభ్యర్థులను అంచనా వేయడానికి సాంప్రదాయ కోడింగ్ పరీక్షలే కాకుండా వారి నైపుణ్యాలు, నేపథ్యంపై సంపూర్ణ అవగాహన పొందడానికి సోషల్ మీడియా ప్రొఫైల్స్, సంబంధిత సర్టిఫికేషన్లను పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో హై-డిమాండ్ నైపుణ్యాలపై కంపెనీలు దృష్టి కేంద్రీకరించడం వల్ల క్లౌడ్, డేటా, ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న టక్నాలజీలలో ప్రత్యేక పరిజ్ఞానం ఉన్నవారికే ఉద్యోగ అవకాశాలు దక్కే పరిస్థితి ఏర్పడింది. -
ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో 1,000 మంది నియామకం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ సేవల సంస్థ ప్లూరల్ టెక్నాలజీ వచ్చే మూడేళ్లలో 1,000 మంది టెక్నాలజీ కన్సల్టెంట్లను నియమించుకోనుంది. వీరిలో 500 మంది జపనీస్ భాషలో శిక్షణ పొందినవారై ఉండనున్నారని సంస్థ సీఈవో సునీల్ సవరం తెలిపారు. (విద్యార్థులకు ప్రత్యేక ఆఫర్! గతి స్టూడెంట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసెస్) ఇటీవలే సాంకేతిక సహకారాల కోసం జపాన్‌కు చెందిన ఓపెన్ సెసేమ్ టెక్నాలజీతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన పేర్కొన్నారు. 2025 నాటికల్లా ఇరు సంస్థల ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సర్వీసులు తదితర వ్యాపారాల ఆదాయం 100 మిలియన్ డాలర్లకు చేరగలదని అంచనా వేస్తున్నట్లు ఆయన వివరించారు. (Jio offer: జియో అన్లిమిటెడ్ డేటా ఆఫర్.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్!) -
హైదరాబాద్ లో TSQS హైరింగ్ స్టార్ట్
హైదరాబాద్: తమ టాలెంట్ స్ట్రాటజీలో భాగంగా మరియు యుఎస్‌లో వృద్ధి చెందుతున్న వ్యాపారానికి మద్దతు అందిస్తూ , డల్లాస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న సాఫ్ట్వేర్ టెస్టింగ్ సేవల సంస్థ TSQS ఇంక్, తమ హైదరాబాద్ ఆఫ్‌షోర్ కేంద్రంలో 15 మంది ఫ్రెష్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను ఉద్యోగాలలో నియమించుకున్నట్లు వెల్లడించింది. ఔత్సాహిక టెకీలతో కూడిన బృందం ప్రారంభించిన ఈ సంస్థకు అపూర్వమైన ఐటీ అనుభవం ఉంది. పలు ఇంప్లిమెంటేషన్స్పై, విభిన్నమైన డొమైన్స్‌లో పనిచేస్తోన్న టీఎస్‌క్యుఎస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో క్వాలిటీ ఇంజినీరింగ్ ప్రాముఖ్యతను గుర్తించింది. సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్స్‌ను సైతం గుర్తించింది. ఇవి క్లయింట్స్ అత్యుత్తమ నాణ్యతతో కూడిన ఉత్పత్తులను అతి తక్కువ ధరలకు అందించేందుకు సహాయపడతాయి అని TSQS ఇంక్ వైస్ ప్రెసిడెంట్ (క్వాలిటీ ఇంజినీరింగ్) శ్రీధర్ బొజ్జా అన్నారు. ‘‘టీఎస్‌క్యుఎస్ ఇంక్ పలువురు యువ ఇంజినీర్లను గుర్తించడంతో పాటుగా వారికి అవసరమైన టూల్స్‌పై శిక్షణ అందించి, యుఎస్‌లోని ప్రాజెక్టులలో నియమించింది. ఇప్పటికే చక్కటి ఫలితాలనూ పొందుతుంది. ప్రస్తుత ద్రవ్యోల్భణం, క్లయింట్స్ బడ్జెట్‌ను పరిగణలోకి తీసుకుని, భారతదేశంలో కూడా అదే తరహా టాలెంట్ వ్యూహం ప్రతిబింబించనున్నాము’’ అని శ్రీధర్ అన్నారు. సాఫ్ట్వేర్ టెస్టింగ్ బృందాలను నాణ్యమైన ఇంజినీరింగ్ బృందాలుగా మార్చడం ద్వారా సాఫ్ట్వేర్ డెలివరీ లైఫ్ సైకిల్ వ్యాప్తంగా తమ నైపుణ్యం మరియు సమస్యా పూరణ అనుభవాన్ని పొందుపరచాలనే లక్ష్యంతో , తగ్గించబడిన సమయం, వ్యయాల వద్ద టెస్టింగ్‌ల నకలు తొలగించడం, ఆటోమేషన్ వృద్ధి చేయడం, పునర్వినియోగం చేసేందుకు సంస్థ యొక్క సామర్థ్యం పెంచుకోవాలని టీఎస్‌క్యుఎస్ ఇంక్ లక్ష్యంగా పెట్టుకుంది. ‘‘ప్రస్తుత తమ ప్రాజెక్టులతో పాటుగా రాబోతున్న వాటిని పరిగణలోకి తీసుకుంటే మాకు నాణ్యతకు భరోసా అందించే ఇంజినీర్ల అవసరం భారీగా ఉంది. క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో పాల్గొనడంతో పాటుగా పక్క రాష్ట్రాల్లో కూడా మా ఆఫ్‌షోర్ కార్యకలాపాలను విస్తరించాలనుకుంటున్నాము. 2023లో 100కు పైగాఆఫ్షోర్ రిసోర్శెస్కు విస్తరించాలన్నది మా ఆలోచన. అలాగే 2024 క్యాలెండర్ సంవత్సరాంతానికి ఈ సంఖ్యను 250కు వృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అని శ్రీధర్ అన్నారు మార్కెట్ శోధన మరియు కన్సల్టింగ్ సంస్ధ గ్లోబల్ మార్కెట్ ఇన్సైట్స్ (జీఎంఐ) ఉటంకించిన శ్రీధర్ మాట్లాడుతూ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ మార్కెట్ ప్రస్తుతం 40 బిలియన్ డాలర్ల మార్కెట్ గా ఉంది. ఇది 2030 నాటికి 70 బిలియన్ డాలర్లు చేరుకోవచ్చని అంచనా. ఇది సీఏజీఆర్ 6%తో వృద్ధి చెందుతుంది. మరీ ముఖ్యంగా ఆటోమేటింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రక్రియ కోసం డిమాండ్ పెరుగుతుండటం, నాణ్యత హామీ కోసం చురుగ్గా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం దోహదపడుతున్నాయన్నారు. చదవండి: చాట్‌జీపీటీకి అంత క్రేజ్ ఇందుకే..! -
మాజీ ఎగ్జిక్యూటివ్ ఫిర్యాదు: కోర్టులో ఇన్ఫోసిస్‌కు షాక్
సాక్షి, ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు భారీ షాక్ తగిలింది.ఇన్ఫోసిస్ మాజీ సీనియర్ ఉద్యోగి, జిల్ ప్రీజీన్ ఆరోపణలను కొట్టి వేయాలని ఇన్ఫోసిస్ దాఖలు చేసిన పిటిషన్‌ను అమెరికా కోర్టు తాజాగా తిరస్కరించింది. అమెరికా నియామకాల్లో వయస్సు, లింగ, జాతి వివక్ష చూపారని ఆమె ఇన్ఫోసిస్‌పై దావా వేశారు. (Hong Kong టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన టికెట్లు ఫ్రీ) కంపెనీలోని సీనియర్ సిబ్బంది వయస్సు, లింగం, జాతి ఆధారంగా నియామకాల్లో వివక్షతో, పక్షపాతంగా వ్యహరించారంటూ గత ఏడాది అమెరికా కోర్టులో జిల్ ప్రీజీన్ ఫిర్యాదు చేశారు. ఈ పద్ధతి జాతి వివక్ష, చట్టవిరుద్ధమని వాదించినందుకు ఒత్తిడికి, వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఇన్ఫోసిస్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కన్సల్టింగ్ హెడ్ మార్క్ లివింగ్స్టన్, అప్పటి ప్రీజీన్ పార్టనర్స్ డాన్ ఆల్బ్రైట్, జెర్రీ కర్ట్జ్లపై కేసు నమోదైంది. అయితే దీనిపై ఇన్ఫోసిస్ స్పందనను కోర్టు తాజాగా తోసిపుచ్చింది. ప్రీజీన్ చేసిన క్లెయిమ్‌లను విచారణకు స్వీకరిస్తూ, న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్‌లోని యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి ఇన్ఫీ వాదనను తిరస్కరించారు. అంతేకాదు ఈ ఆరోపణలపై వచ్చే 21 రోజుల్లోగా తమ స్పందనను తెలియ జేయాలని కూడా ఆదేశించింది. దీనిపై ఇన్ఫోసిస్ ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా ఇన్ఫీలో టాలెంట్ అక్విజిషన్ వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్‌లను రిక్రూటింగ్ నిపుణురాలు జిల్ ప్రీజీన్ ఈ కేసు వేశారు. భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులు, ఇంట్లో పిల్లలున్న మహిళలతోపాటు 50 ఏళ్లు పైబడిన అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆంక్షలు విధించారని జిల్ ఆరోపించారు. నియామకాల్లో వివక్ష చూపేలా తనపై ఒత్తడి చేశారని ఆమె ఆరోపించారు. వీటిని వ్యతిరేకించినందుకు తనను ఉద్యోగం నుంచి తొలగించి ప్రతీకారం తీర్చు కున్నారనేది జిల్ ఆరోపణ. ఇది న్యూయార్క్ నగర మానవ హక్కుల చట్టాల ఉల్లంఘన అంటూ జిల్ ప్రిజీన్ సెప్టెంబర్ 2021లో తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నైట్స్ ఖండన మరోవైపు ఆధునిక యుగంలో జాతి, లింగం, వయసు ఆధారిత వివక్ష ఇది తీరని విషాదమంటూ నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (నైట్స్)ఇన్ఫోసిస్ తీరును తప్పుబట్టింది. పని చేయాలనే కోరిక జీవితాన్ని విలువైనదిగా మారుస్తుందని అలాంటి ప్రయత్నాలను అడ్డు కోవడం నేరమని వ్యాఖ్యానించింది. #Discrimination due to age is one of the great tragedies of modern life. The desire to work and be useful is what makes life worth living, and to be told your efforts are not needed because you are the wrong age is a crime.#ITEmployees #StrongerTogether #JusticeforEmployees pic.twitter.com/X7dDBTOQ5R — Nascent Information Technology Employees Senate (@NITESenate) October 8, 2022 -
హీటెక్కిన ఎస్ఐ కొలువుల స్కాం.. సీఐడీ అదుపులో హోంమంత్రి పీఎస్
బనశంకరి(బెంగళూరు): సంచలనాత్మక ఎస్ఐ ఉద్యోగాల కుంభకోణం మరింత వేడెక్కింది. మొన్న అదనపు డీజీపీ అమృత్‌పాల్ అరెస్టు కాగా, ఇప్పుడు ఏకంగా హోంమంత్రి పీఎస్ సీఐడీకి చిక్కాడు. ఈ స్కాంకు సంబంధించి హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర వ్యక్తిగత కార్యదర్శి గణపతి భట్‌ను మంగళవారం సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితులతో అతడు కుమ్మక్కయ్యాడని ఆరోపణలు ఉండగా, సీఐడీ రంగంలోకి దిగింది. ఆరోపణలకు పలు సాక్ష్యాధారాలు లభించడంతో గణపతిభట్ను నిర్బంధంలోకి తీసుకున్నారు. దీంతో హోంమంత్రి అరగ జ్ఞానేంద్రకు, బొమ్మై సర్కారుకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఉత్తర కన్నడ జిల్లా శిరసి ప్రాంతానికి చెందిన గణపతిభట్ ఆర్ఎస్ఎస్లో గుర్తింపు పొందాడు. చదవండి: పబ్లిక్ పార్క్ బయట బోర్డుతో ఖంగుతిన్న ప్రజలు.. డౌటనుమానాలతో నవ్వులు -
ఎట్టి పరిస్థితుల్లోను అగ్నిపథ్ ను ఆపేది లేదు
-
ఉక్రెయిన్ యుద్ధం: ప్రైవేట్ సైనికులు కావలెను.. భారీగా జీతం, బోనస్ ప్రత్యేకం
‘‘ఉక్రెయిన్ శిథిలాల్లో, కల్లోలిత ప్రాంతాల్లో చిక్కుకున్న పౌరులను రక్షించేందుకు ప్రైవేట్ సైనికులు కావలెను. రోజుకు వెయ్యి నుంచి రెండు వేల డాలర్ల జీతం. బోనస్ ప్రత్యేకం’’ – సైలెంట్ ప్రొఫెషనల్స్ అనే ప్రైవేట్ సైనిక సంస్థ ప్రకటన ఇది. కొన్నేళ్లుగా ఇలాంటి ప్రకటనలు వెబ్సైట్లలో అనేకం ప్రత్యక్షమవుతున్నాయి. అమెరికా, యూరప్‌కు చెందిన వందలాది మంది మాజీ సైనికులు ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంలో పని చేస్తున్నారు. ఇంకా చాలామంది వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. సంక్షుభిత ఉక్రెయిన్ నుంచి పౌరులను సురక్షిత దేశాలకు తీసుకెళ్లేందుకూ ప్రైవేట్ సైనిక సంస్థలు కాంట్రాక్టులు కుదుర్చుకుంటున్నాయి. కుటుంబాలను, సమూహాలను సురక్షితంగా తరలించేందుకు 30,000 డాలర్లు మొదలుకొని 60,000 డాలర్ల దాకా కాంట్రాక్టు కుదుర్చుకుంటున్నాయి ఈ సంస్థలు. ప్రోత్సహిస్తోంది ప్రభుత్వాలే చాలా దేశాల్లో సైన్యానికి ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ సంస్థలు ఇలా బలగాలను పోషిస్తున్నాయి. పరిశ్రమలు, కార్యాలయాలకు రక్షణ కల్పించే సెక్యూరిటీ సంస్థల్లాగే సైనిక అవసరాలను తీరుస్తున్న ఈ కంపెనీలను ప్రైవేట్ మిలటరీ కంపెనీలు (పీఎంసీ) అంటారు. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా పని చేస్తున్నాయి. ప్రభుత్వాలు, సైన్యం అధికారికంగా చేయలేని పనులను వీటితో చేయించుకుంటారు. వీటి కార్యకలాపాలు వివాదాస్పదమైతే తమకు సంబంధం లేదని ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటాయి. ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తులూ వీటి సేవలను వాడుకుంటున్నారు. వేలు, లక్షల కోట్ల వ్యాపారం చేసే బడా కార్పొరేట్ సంస్థ లు ఆరితేరిన మాజీ సైనికులను నియమించుకుంటున్నాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా పీఎంసీల వ్యాపార విలువ 22,400 కోట్ల డాలర్లని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ న్యూస్ చెబుతోంది. 2030 నాటికి 45,700 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. వాగ్నర్ VS అకాడమీ ఇవి రెండూ ప్రస్తుతం ఉక్రెయిన్‌లో వైరి పక్షాల తరఫున బరిలో దిగాయి. గతంలో సిరియా, లిబియాల్లో రష్యా ప్రయోజనాలు కాపాడేందుకు పనిచేసిన వాగ్నర్ ఇప్పుడు ఉక్రెయిన్ సైనికాధికారులు, నేతలే లక్ష్యంగా 400 మంది కిరాయి సైనికులను దించిందని ది టైమ్స్ పత్రిక వెల్లడించింది. వీరిని గుర్తించి హతమార్చేందుకు ఉక్రెయిన్ కోరిక మేరకు అకాడమీ పని చేస్తోంది. ఇరాక్, అఫ్గానిస్తాన్‌ల్లో అమెరికా ప్రయోజనాల పరిరక్షణకు పని చేసిన అకాడమీ ఉక్రెయిన్‌లో మాజీ సైనికులను రిక్రూట్ చేసుకొని పౌరులకు సైనిక శిక్షణ ఇస్తోంది. సైనిక సామగ్రి బాధ్యతలూ దీనివే. కంపెనీల స్వరూపం ప్రపంచవ్యాప్తంగా, అమెరికా, సంపన్న యూరప్ దేశాల్లో వందలాది పీఎంసీలున్నాయి. అంతర్జాతీయ సూత్రాలకు, ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధమైన పనులూ చేసే ఈ కంపెనీలను పలు దేశాల్లో ప్రభుత్వాలే రంగంలోకి దించి తమ టార్గెట్లు పూర్తి చేసుకుంటుంటాయి. ఈ కంపెనీల్లో ముఖ్యమైనవి.. చదవండి: McDonald's: మూతపడ్డ 2 నెలలకు రీ ఓపెన్. అయితే కొత్త పేరు, లోగో! ► అకాడమీ: బ్లాక్ వాటర్ పేరుతో నడిచిన ఈ సంస్థ చేతులు మారి అకాడమీగా అవతరించింది. అమెరికాలో ని నార్త్ కరోలినా కేంద్రంగా పని చేస్తుంది. 25,000కు పైగా ఉద్యోగులున్నారు. 90% కాంట్రాక్టులు అమెరికా ప్రభుత్వం, నిఘా సంస్థ సీఐఏ నుంచి వస్తాయి. ► వాగ్నర్ గ్రూప్ రష్యా రాజధాని మాస్కో కేంద్రంగా పని చేసే ఈ సంస్థలో 10,000కు పైగా కిరాయి సైనికులున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడైన యవ్జెన్ ప్రిగోజిన్ దీని అధిపతి. ► జీఫోర్ఎస్ ప్రపంచంలో అత్యంత పెద్ద పీఎంసీల్లో ఒకటి. లండన్ కేంద్రంగా పని చేస్తుంది. 5 లక్షలకుపైగా ఉద్యోగులున్నారు. ► యూనివర్సల్ ప్రొటెక్షన్ అమెరికాకు చెందిన కంపెనీ. 2 లక్షల మంది పని చేస్తున్నారు. ► కేబీఆర్ అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన సంస్థ. 40,000 మంది ఉద్యోగులున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బెంగళూరుకి ఝలక్ ! నియామకాల్లో హైదరాబాద్ టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా డిసెంబర్ నెల రిటైల్, ఆతిథ్యం, విద్య వంటి ఐటీయేతర రంగాలు నియామక కార్యకలాపాల పునరుద్ధరణ సంకేతాలను చూసింది. నౌకరీ జాబ్ స్పీక్ నివేదిక ప్రకారం.. 2020 డిసెంబర్‌తో పోలిస్తే గత నెలలో నియామకాలు నిలకడగా ఉన్నాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే 2021 చివర్లో అన్ని మెట్రో నగరాల్లో రిక్రూట్మెంట్ పెరిగింది. ఐటీ నియామకాల్లో వృద్ధిని కొనసాగించినప్పటికీ.. ఆతిథ్యం, యాత్రలు, రిటైల్, రియల్టీ రంగాల నుండి పునరాగమనాన్ని చూడటం సంతోషాన్నిస్తోంది. డిసెంబర్ త్రైమాసికంలో యాత్రలు, ఆతిథ్యం 22 శాతం, రిటైల్ 20, విద్యా రంగం 12 శాతం వృద్ధిని కనబరిచాయి. ‘తిరిగి కార్యాలయాల నుంచి పని’ విధానాలను చాలా కంపెనీలు రూపొందించడంతో అత్యధిక నిపుణులు తాము పనిచేసే నగరాలకు చేరుకున్నారు. హైదరాబాద్ 12 శాతం వృద్ధి.. కంపెనీలు డిజిటల్ వైపు మళ్లడం కొనసాగిస్తున్నందున కొన్ని విభాగాలు, రంగాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. 2020 డిసెంబర్‌తో పోలిస్తే గత నెలలో మెట్రో నగరాలవారీగా చూస్తే నియామకాల వృద్దిలో హైదరాబాద్ 12 శాతం వృద్ది సాధించి తొలి స్థానంలో నిలిచింది. బెంగళూరులో రిక్రూట్మెంట్ 11 శాతం, ముంబై 8, పుణే 4, చెన్నై 6 శాతం అధికమైంది. ఢిల్లీ స్థిరంగా, కోల్‌కతా 3 శాతం తిరోగమన వృద్ధి సాధించింది. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అహ్మదాబాద్ 21 శాతం అధికమై తొలి స్థానంలో ఉంది. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ రంగాలు ఈ నగరానికి అండగా నిలిచాయి. యువ నిపుణుల కోసం డిమాండ్ స్థిరంగా ఉంది. ఫ్రెషర్స్, 4–7 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగుల కోసం అవకాశాలు నిలకడగా ఉన్నాయి. 8–12 ఏళ్ల అనుభవం కలిగిన నిపుణులకు డిమాండ్ 4 శాతం, 13–16 ఏళ్ల విభాగంలో 9 శాతం తగ్గింది. చదవండి: టాప్ కంపెనీల్లో ప్లేస్మెంట్ కోసం 2.41 లక్షల మంది పోటీ -
ఫ్రెషర్స్‌కి గోల్డ్‌మాన్ సాక్స్ గుడ్‌న్యూస్
హైదరాబాద్: గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ గోల్డ్‌మాన్ సాక్స్‌కి సంబంధించి హైదరాబాద్ క్యాంపస్‌కి ప్రాధాన్యత పెరగనుంది. హైదరాబాద్ క్యాంపస్ ద్వారా మరిన్ని సేవలు అందించేందుకు ఆ సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు రాబోయే రెండేళ్లలో ఇక్కడ కొత్త నియమకాలు చేపడతామని ప్రకటించింది. ఫైనాన్షియల్ సెక్టార్లో గోల్డ్‌మాన్ సాక్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంస్థ. 2021 మార్చిన హైదరాబాద్‌లో కార్యాలయం ప్రారంభించింది. ప్రస్తుతం సంస్థలో కేవలం 250 మంది ఉద్యోగులే పని చేస్తున్నారు. రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ కార్యాలయంలో 2,000 మంది ఉద్యోగులను నియమించుకోబోతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి 700ల మంది ఉద్యోగులను నియమిస్తామని, ఇందులో 70 శాతం కొత్త వారికే అవకాశాలు కల్పించబోతున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. 2023 నాటికి హైదరాబాద్ ఆఫీస్‌లో 2500ల మంది ఉద్యోగులు పని చేసే విధంగా తమ కార్యకలాపాలు విస్తరిస్తామని గోల్డ్‌మాన్ సాక్స్ తెలిపింది. రాబోయే రోజుల్లో తాము నిర్వహించే అంతర్జాతీయ స్థాయి కార్యకలాపాలకి హైదరాబరాద్ ఆఫీస్ కీలకంగా మారబోతుందని గోల్డ్‌మాన్ సాక్స్ చైర్మన్ డేవిడ్ ఎం సాల్మోన్ తెలిపారు. -
గుడ్‌న్యూస్ : ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు .. ఎన్నో తెలుసా ?
బెంగళూరు : పట్టభద్రులకు శుభవార్త ! భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలకు ఇన్ఫోసిస్ రెడీ అయ్యింది. కోవిడ్ నుంచి మార్కెట్ క్రమంగా పుంజుకోవడంతో కంపెనీ ఆర్డర్లు పెరిగాయి. దీంతో కొత్తగా వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించేందుకు ఇన్ఫోసిస్ సిద్ధమైంది. ఈ మేరకు ఆ కంపెనీ సీఈవో నందన్ నీలేకని ప్రకటన చేశారు. కోవిడ్ ఎఫెక్ట్ కోవిడ్ ఎఫెక్ట్, ఆటోమేషన్ కారణంగా వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు పోయాయి. ఐటీ రంగం ఒడిదుడుకులకు లోనైంది. అయితే క్రమంగా మార్కెట్ పుంజుకుంటోంది. కోవిడ్ ఆంక్షలు, లాక్డౌన్ , ప్రయాణ నిషేధాలు తదితర కారణాలతో విదేశాల్లో ఉద్యోగాలు పొందడం కష్టంగా మారింది. అయితే ఇన్ఫోసిస్ నుంచి భారీ రిక్రూట్మెంట్ ప్రకటన రావడంతో ఐటీ ప్రొఫెనల్స్‌కి ఊరట లభించింది. ఇన్ఫోసిస్‌తో మొదలు ఇన్ఫోసిస్‌కి ఇటీవల భారీగా ఆర్డర్లు రావడంతో రిక్రూట్మెంట్ మొదలు పెట్టింది. 2022 నాటికి అమెరికా కేంద్రంగా 25,000 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకుంటామని ఇన్ఫోసిస్ 40వ వార్సికోత్సవ సమావేశంలో నందన్ నీలేకని చెప్పారు. అంతేకాదు ఇటీవలే ఇండియాలో దాదాపు 19,230 మందిని సంస్థలోకి తీసుకున్నట్టు ఆయన వివరించారు. ప్రస్తుతం కెనాడాలో ఇన్ఫోసిస్‌కి 4,000 మంది ఉద్యోగులు ఉన్నారని, వచ్చే ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య రెట్టింపు చేస్తామని తెలిపారు. చదవండి : పెట్రోల్, డీజిల్‌కి... ఆ బ్రాండ్ గుడ్‌బై -
హిజ్రాలకు కూడా పోలీసు ఉద్యోగాలలో అవకాశం.. ఎక్కడంటే..
సాక్షి, భువనేశ్వర్(ఒడిశా): హిజ్రాలకు పోలీసు విభాగంలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అభయ్ శనివారం ప్రకటించారు. ఈ మేరకు 477 సబ్–ఇన్స్పెక్టర్, 244 కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయింది. దరఖాస్తు గడువు జూలై 15వ తేదీతో ముగుస్తుంది. సాధారణ అభ్యర్థులతో పాటు హిజ్రాలు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సబ్– ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి విద్యార్హత డిగ్రీ కాగా కానిస్టేబుల్ ఉద్యోగానికి +2 శ్రేణి అర్హతగా పేర్కొన్నారు. చదవండి: వైరల్ వీడియో.. ఆ కుక్క చూపిస్తున్న ప్రేమకు కన్నీళ్లు వస్తున్నాయి -
IT Companies: ఉద్యోగాల జాతర.. 3 లక్షల జాబ్స్
సాక్షి, హైదరాబాద్: ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల జాతర మొదలుకానుంది. క్యాంపస్ రిక్రూట్ మెంట్స్ చేపట్టేందుకు కంపెనీలు సిద్ధమవు తున్నాయి. కరోనా ప్రభావం ఉన్నా కూడా మానవ వనరుల అవసరం ఉన్న నేపథ్యంలో రిక్రూట్ చేసుకు నేందుకు సన్నద్ధం అవుతు న్నాయి. దీంతో ఈసారి ఐటీ రంగంలో అధిక సంఖ్యలో ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి. గతేడాది లాక్‌డౌన్‌లోనూ క్యాంపస్ రిక్రూట్మెంట్ చేపట్టిన కంపెనీలు.. ఈసారి కూడా నియామకాలు చేపట్టనున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఇంటర్న్‌షిప్ కింద విద్యార్థులను తీసుకుంటుండగా, మరికొన్ని కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రారంభిం చాయి. కంపెనీల్లో వర్క్‌ఫ్రం హోం కొనసాగుతున్నందున ప్రాజెక్టులు యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే కంపెనీల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు సిద్ధం కావట్లేదు. ప్రత్యక్ష బోధన ఆగిపోవడం, లాక్డౌన్ వంటి కారణాలతో రిక్రూట్ మెంట్‌కు అవసరమైన నైపుణ్యా లను విద్యార్థులు పెంపొం దించుకోవట్లేదు. దీంతో విద్యార్థులు మంచి అవకాశాలను కోల్పోయే పరిస్థితి ఉంది. గతేడాది ఇదే జరిగిందని ఐటీ నిపు ణులు పేర్కొంటున్నారు. వచ్చే నెలలో (జూన్) క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ను కంపెనీలు వేగవంతం చేయను న్నాయి. ప్రధాన కంపెనీలు దేశంలో1.1 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందు కొస్తున్నట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్ర వంటి కంపెనీలు తమ ప్రాజెక్టుల కోసం 1.1 లక్షల ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఒక మిగతా కంపెనీలు, గతేడాది భర్తీకాని ఉద్యోగాలు కలుపుకొని మొత్తంగా దేశంలో ఈసారి 3 లక్షల వరకు ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. టీసీఎస్‌లోనే 40 వేల ఉద్యోగాలు.. అధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పించేందుకు టీఎస్ఎస్ చర్యలు చేపట్టినట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది టీసీఎస్‌లో 40 వేలు, ఇన్ఫోసిస్ 25 వేల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. డీఎక్స్ టెక్నాలజీ, మైండ్‌ట్రీ వంటి కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే అవకాశముంది. గతేడాది అన్ని కంపెనీలు 2.1 లక్షలు ఉద్యోగాలను కల్పించాలని భావించినా.. సరైన నైపుణ్యాలు కలిగిన 1.2 లక్షల మందినే తీసుకున్నారు. 90 వేల వరకు ఉద్యోగాలు ఖాళీగానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఈసారి ప్రధానమైన 5 కంపెనీలు కాకుండా మిగతా కంపెనీల్లో మరో లక్షకు పైగా, గతేడాది మిగిలిపోయిన ఉద్యోగాలు కలుపుకొని మొత్తం 3 లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో లభించే అవకాశం ఉంది. ఇన్ఫోసిస్‌లో ఇప్పటికే ప్రారంభం ఇన్ఫోసిస్ కంపెనీ తన సర్వీసెస్, ప్రోడక్ట్ డివిజన్లకు నేషనల్ క్వాలిఫైయర్ టెస్టును ఏటా నిర్వహిస్తుంటుంది. అందులో భాగంగా ఇప్పటికే ఇన్ఫీటీక్యూ, హ్యాక్విత్ ఇన్ఫీ అనే డ్రైవ్ నిర్వహించింది. మిగతా కంపెనీలు అదే బాటలో వెళ్లనున్నాయి. గతేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇన్ఫోసిస్ క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం ఇన్ఫీ టీక్యూను సర్వీసెస్ కోసం, హ్యాక్విత్ఇన్ఫీ అనే రెండు ఓపెన్ కాంపిటీషన్స్ డ్రైవ్‌ను నిర్వహించింది. ఇన్ఫీటీక్యూను సర్వీసెస్‌కు, హ్యాక్విత్ ఇన్ఫీలో ప్రోడక్ట్ డివిజన్లకు చేపట్టింది. వాటికి దేశంలో 60 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. నైపుణ్యాలు కలిగిన విద్యార్థుల కొరత కారణంగా 60 శాతం మందినే తీసుకున్నట్లు తెలిసింది. అందులో 3 వేల మంది వరకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. క్యాప్ జెమినీ తమ అనుబంధ కాలేజీల్లో 30 వేల నియామకాలకు జూన్, జూలైలో క్యాంపస్ రిక్రూట్మెంట్ చేపట్టింది. అయితే అందులో 45 శాతం మందే నైపుణ్యాలు కలిగిన వారు నియమితులయ్యారు. టీసీఎస్ గత ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఎన్‌క్యూటీ, డిజిటల్ అనే రెండు ఓపెన్ కాంపిటీషన్ డ్రైవ్‌లను నిర్వహించింది. విప్రో, కాగ్నిజెంట్, ఐబీఎం తదితర కంపెనీలు నియామకాలను చేపట్టాయి. గతేడాది హైదరాబాద్ ఐటీ జోన్ నుంచి (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) కంపెనీల్లో 45 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే 25 వేల మందికి ఉద్యోగాలు లభించాయి. ఉద్యోగాలకు దూరమైన 40 శాతం మంది.. కరోనా సెకండ్ వేవ్ ధాటికి కాలేజీలు మూతపడ్డాయి. ఫ్యాకల్టీ, విద్యార్థులు కరోనా బారిన పడుతుండటం వల్ల ఆన్లైన్ తరగతులు బారిన పడుతుండటం వల్ల ఆన్లైన్ తరగతులు మందకొడిగా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మెజారిటీ విద్యార్థులు చదువులకు దూరమై వేరే వ్యాపకాలతో సమయం వృథా చేసుకుంటున్నారు. గతేడాది కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉండదని అంతా ప్రిపరేషన్‌ను గాలికి వదిలేశారు. కానీ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్కు ముందుకొచ్చాయి. అయితే విద్యార్థులంతా లాక్‌డౌన్‌తో గ్రామాలకు వెళ్లడం, క్యాంపస్ రిక్రూట్మెంట్కు సిద్ధం కాలేకపోయారు. దీంతో కంపెనీలు అవసరమైన వారిలో 60 శాతం మందినే నియమించుకున్నాయి. దీంతో 40 శాతం మంది విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఉద్యోగాలను పొందలేకపోయారు. ఆన్లైన్ ప్రిపరేషన్ విత్ సర్టిఫికేషన్.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈసారి కూడా విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. దీంతో కంపెనీలు కోరుకునే సామర్థ్యాలు కలిగిన విద్యార్థులు లభిస్తారా లేదా అన్న ప్రశ్న కంపెనీల్లో తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ఓ కొత్త ఆలోచనతో ముందుకొచ్చాయి. విద్యార్థుల ప్రిపరేషన్‌కు ప్రస్తు్తత పరిస్థితులు ఆటంకం కాకుండా, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా మారకుండా కంపెనీలే తమ వెబ్సైట్ల ద్వారా ‘ఆన్లైన్ ప్రిపరేషన్ విత్ సర్టిఫికేషన్’ప్రారంభించాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి కంపెనీలు వీటిని అందిస్తున్నాయి. సమయం వృథా చేసుకోవద్దు.. క్యాంపస్ రిక్రూట్మెంట్ల కోసం విద్యార్థులు ప్రిపేర్ కావాల్సిన సమయం వచ్చింది. ఈ సమయాన్ని వృథా చేసుకోవద్దు. ప్రిపరేషన్లో ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. ప్రాంగణ నియామకాలు అకడమిక్ అంశాలకు సంబంధం లేదు. ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి. ఆప్టిట్యూడ్, వెర్బల్, సి, డీఎస్, జావా లేదా పైతాన్ వంటి వాటిపై పట్టు సాధించాలి. ఇంటర్వ్యూ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. కోడింగ్ ప్రాక్టీసు మొదలు పెట్టాలి. అడ్వాన్స్ డీఎస్ ప్రాక్టీస్ చేయాలి. అల్గారిథమ్స్‌పై పట్టు సాధించాలి. ఈజీ నుంచి మొదలుకొని మోడరేట్, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని ప్రాక్టీస్ చేయాలి. కోడింగ్ సామర్థ్యం పెరిగిన తర్వాత హ్యాకర్ ర్యాంక్ వంటి కోడింగ్ ప్లాట్ఫారం, హాకథాన్స్‌లో పాల్గొనాలి. కోడింగ్ చేయగలమనే నమ్మకం వచ్చినప్పుడు ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేయాలి. లింక్డ్ఇన్లో ఆన్లైన్ ఇంటర్న్‌షిప్‌లు చాలా ఉంటాయి. దఇంటర్న్షిప్ చేశారంటే ఉద్యోగానికి సులభంగా ఎంపిక కావొచ్చు. – కాంచనపల్లి వెంకట్, ఫౌండర్ సీఈవో, సన్‌టెక్ కార్ప్ సొల్యుషన్స్ ప్రాంగణ నియామకాల శిక్షణ సంస్థ -
20 వేల పోస్టుల భర్తీకి పోలీసు శాఖ సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: త్వరలో భర్తీ చేయబోయే కొలువుల కోసం పోలీసుశాఖ క్షేత్రస్థాయి ఏర్పాట్లు మొదలుపెట్టింది. శిక్షణ సమయంలో గతేడాది ఉత్పన్నమైన మైదానాల కొరతతో పాటు ఇతర సమస్యలను ఈసారి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) 2018లో 18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 16,925 కానిస్టేబుల్ పోస్టులు, 1,503 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులున్నాయి. ఇందులో 9,213 మంది సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లు, 1,162 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లుకు జనవరి 17 నాటికి శిక్షణ ప్రారంభమైంది. కానీ, దాదాపు 4 వేల మంది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) కానిస్టేబుళ్ల శిక్షణలో తీవ్ర జాప్యం జరిగింది. ఈసారి అలాంటివి లేకుండా రాష్ట్ర పోలీసు శాఖ ముందుగానే పొరుగు రాష్ట్రాలపైన ఏపీ, కర్ణాటకతో సంప్రదింపులు మొదలుపెట్టింది. మన వద్ద పరిస్థితి ఇదీ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో పోలీసు శిక్షణ కోసం ఉన్న వనరులు కేవలం 6 వేల మందికి మాత్రమే సరిపోయేవి. కానీ, 2018 నోటిఫికేషన్ నాటికి వాటి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు. ఏకంగా 12 వేలకుపైగా అభ్యర్థులకు ఒకేసారి శిక్షణ ఇచ్చేలా మౌలిక సదుపాయాలు కల్పించడంలో పోలీసుశాఖ సఫలీకృతమైంది. ఈసారి మైదానాలు, మౌలిక సదుపాయాల విషయంలో రాజీ పడకుండా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కర్ణాటక, ఏపీతో సంప్రదింపులు జరుపుతున్నా.. ఏపీ వైపే మొగ్గుచూపే అవకాశాలున్నాయి. ఈసారి 20 వేల పోస్టుల నేపథ్యంలో ఎలాగైనా ఏపీని ముందే సిద్ధం చేయాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకెళ్తున్నారు. -
గుడ్ న్యూస్.. ఫ్రెషర్స్ కోసం 3.5 లక్షల ఉద్యోగాలు
ముంబై: కరోనా వైరస్, లాక్డౌన్ నేపథ్యంలో ఆగిపోయిన నియామక ప్రక్రియలో కదలిక మొదలైంది. ప్రస్తుతం వివిధ జాబ్ పోర్టల్స్‌లో 3.5 లక్షల ఫ్రెషర్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఫ్రెషర్ జాబ్స్‌లో జూన్ నుంచి వృద్ధి నమోదవుతుందని తెలిపింది. ఈ ధోరణి ఈ ఆర్ధిక సంవత్సరం చివరి వరకు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎడ్టెక్, ఈ–లెరి్నంగ్, హెల్త్‌కేర్, హెచ్ఆర్, ఫిన్‌టెక్ విభాగాల్లో ఎక్కువగా నియామకాలు జరుగుతున్నాయని టీమ్‌లీజ్, ఫ్రెషర్వరల్డ్.కామ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ బిజినెస్ హెడ్ కౌషిక్ బెనర్జీ తెలిపారు. ఐటీఈఎస్, తయారీ రంగం, బీఎఫ్ఎస్ఐ, టెలికం, సెమికండక్టర్ల పరిశ్రమలోనూ వృద్ధి నమోదవుతుందన్నారు. అడ్మిని్రస్టేషన్లో 14 శాతం, సాఫ్ట్‌వేర్‌లో 10 శాతం, కస్టమర్ సరీ్వసింగ్లో 8 శాతం, మార్కెటింగ్‌లో 5 శాతం, సేల్స్‌లో 4 శాతం ఫ్రెషర్స్ జాబ్స్ పెరిగాయని ఇన్‌డీడ్ ఇండియా ఎండీ శశి కుమార్ తెలిపారు. (చదవండి: 14 వేల మందిని నియమించుకుంటాం...) క్యాంపస్ జాబ్స్ వేతనాల్లో 10 శాతం క్షీణత.. లాక్డౌన్ ఎత్తేసిన నాటి నుంచి నియామకాల్లోనూ కదలిక మొదలైంది. మే– సెపె్టంబర్ మధ్య ఆఫర్ లెటర్స్ హోల్డింగ్‌లో ఉన్న 65 శాతం మంది నియామకం పూర్తయింది. వచ్చే ఏడాది జనవరి–మార్చి కాలంలో ప్రీ–కోవిడ్ స్థాయికి నియామకాలు చేరుకుంటాయని సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ డైరెక్టర్ అండ్ సీఈఓ ఆదిత్య మిశ్రా తెలిపారు. ఆఫ్క్యాంపస్ నియామకాలను పరిశీలిస్తే.. గత ఏడాది ఏప్రిల్–సెపె్టంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది 75 శాతం పూర్తయ్యాయన్నారు. అయితే ఈ సంవత్సరం క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉద్యోగుల వేతనాలు 10 శాతం తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. కంపెనీలు ఉద్యోగుల శిక్షణ కోసం సెల్ఫ్ లెరి్నంగ్, వీడియో ఆధారిత శిక్షణ, బోధన వంటి కొత్త పద్ధతులను అవలంబిస్తున్నాయని చెప్పారు. -
గ్రామ సచివాలయంలో 583 లైన్మెన్ల నియామకం
కరెంటు పోయి ఐదారు గంటల పైనే అయ్యింది. సబ్ స్టేషన్‌కు ఫోన్ చేసినా ఎవ్వరూ పలకడం లేదు. ఈ రాత్రికి ఇక చీకట్లో మగ్గిపోవాల్సిందేనా..! గ్రామంలో వీధిలైట్లు వెలగడం లేదు. కరెంటు స్తంభం పడిపోతుందని వారం రోజులుగా చెబుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. లైన్‌మన్‌కు చెబితే మూడు ఊళ్లవతల ఉన్నాం. నాకు మీ ఒక్క ఊరే అనుకుంటున్నారా? పరుగెత్తుకు వచ్చేయడానికి అంటాడు. జిల్లాలో ఏ పల్లె, పట్టణ వాసిని పలకరించినా విద్యుత్ పరంగా ఇటువంటి సమస్యలనే ఏకరువు పెడతారు. గడచిన ఐదేళ్లుగా జిల్లాలో ఇదే పరిస్థితి. ఇకమీదట ఈ పరిస్థితి ఎదురు కాదని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు. ఇటువంటి సమస్యలు పరిష్కారం లభించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటారా! ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టాలెక్కిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమితులు కానున్న ఎనర్జీ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యల పరిష్కారంలో కీలకపాత్ర పోషించనున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి) : పదిహేనేళ్ల కిందట మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉండగా జిల్లాలో 300 మంది లైన్మన్లను నియమించారు. ఆ తరువాత అడపాదడపా తీసుకున్నా జిల్లాలో ఉన్న ఖాళీలకు, భర్తీ చేసిన పోస్టులకు ఎక్కడా పొంతన లేని పరిస్థితి. అప్పటి నుంచీ జిల్లాలో విద్యుత్ సమస్యలకు పరిష్కారం ఒక ప్రహసనంలా సాగుతూ వస్తోంది. మళ్లీ ఇంతకాలానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్త నియామకాలు చేపట్టింది. కొత్తగా ఏర్పాటు కానున్న ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి ఒక లైన్‌మన్‌ను నియమించనుంది. ఇప్పటికే లైన్మన్లున్న వాటిని మినహాయించి, మిగిలిన అన్నిచోట్లా వీరి నియామక ప్రక్రియను అధికార యంత్రాంగం చురుకుగా సాగిస్తోంది. రాజమహేంద్రవరం లాలాచెరువు విద్యుత్ సబ్ స్టేషన్ సమీపాన ఉన్న ఏపీ ఈపీడీసీఎల్ ప్రాంగణంలో లైన్మన్ల నియామనికి అర్హత నిర్ధారణ పరీక్షలు ఇప్పటికే నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి పర్యవేక్షణలో ఏపీఈపీడీసీఎల్ జిల్లా ఎస్ఈ సత్యనారాయణరెడ్డి సుమారు 200 మంది వివిధ కేడర్లకు చెందిన అధికారులు, ఉద్యోగులు, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో తొలి దశను శనివారం పూర్తి చేశారు. సైకిల్ తొక్కడం, స్తంభం ఎక్కడం, దిగడం, మీటర్ రీడింగ్ వంటి వాటిపై పరీక్షలు నిర్వహించారు. ఈ ప్రక్రియనంతటినీ వీడియో తీసి ఏరోజుకారోజు నేరుగా ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా పారదర్శకతకు పెద్ద పీట వేశారని చెప్పవచ్చు. ఏపీఈపీడీసీఎల్ నుంచి వచ్చిన సీజీఎం సింహాద్రి, జీఎంహెచ్ఆర్ కోటేశ్వరరావు ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ పోస్టులకు 1,853 మంది దరఖాస్తు చేసుకోగా 1,405 మంది హాజరై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే జిల్లావ్యాప్తంగా 583 మంది ఎనర్జీ అసిస్టెంట్లు (లైన్మన్లు) గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమితులు కానున్నారు. వీరికి నెలకు రూ.15 వేల జీతం ఇస్తారు. గతానికి భిన్నంగా.. పారదర్శకంగా.. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఏదైనా శాఖలో ఒక పోస్టు కావాలంటే అది కాంట్రాక్ట్ అయినా ఔట్సోర్సింగ్ అయినా సరే లక్షల రూపాయల ముడుపులు కట్టుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు ఉండేవి. ఇటువంటి నియామకాల్లో తెలుగు తమ్ముళ్లు, జన్మభూమి కమిటీల హవానే నడిచింది. నేరుగా బేరాలాడుకుని పోస్టులు అమ్మేసుకున్న ప్రజాప్రతినిధులు ఎంతోమంది ఉన్నారు. చివరకు సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టును కూడా అప్పట్లోæ టీడీపీ ప్రజాప్రతినిధులు ఐదారు లక్షలకు అమ్మేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో చెప్పనవసరం లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన వచ్చాక ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏ నియామకమైనా పూర్తి పారదర్శకంగా జరగాలని, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఎవరైనా సరే.. నియామకాల్లో జోక్యం చేసుకోరాదని సీఎంగా ప్రమాణం స్వీకారం చేసినప్పుడే జగన్ చెప్పారు. ఈ నియామకాల్లో కూడా అదే విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. దీంతో నైపుణ్యం ఉన్న వారికే న్యాయం జరుగుతుందనే నమ్మకం అభ్యర్థులకు, వారి తల్లిదండ్రులకు లభించింది. పైసా లంచం ఇవ్వనవసరం లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే రూ.15 వేల జీతంతో వీరు ఉద్యోగంలో చేరనున్నారు. ఏపీఎస్ఈబీ ఉన్నప్పుడు గ్రామాల్లో వీధిదీపాల నిర్వహణను అదే పర్యవేక్షించేది. బోర్డు విభజన జరిగి విద్యుత్ పంపిణీ సంస్థలు ఏర్పాటయ్యాక గ్రామ పంచాయతీలే వీధిదీపాలను నిర్వహిస్తూ వస్తున్నాయి. కొత్తగా వచ్చే ఎనర్జీ అసిస్టెంట్లు గ్రామాల్లో వీధిదీపాలు సహా విద్యుత్ పరంగా తలెత్తే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగానే వీరు విధులు నిర్వర్తించనున్నా ఏపీఈపీడీసీఎల్ పర్యవేక్షణలోనే ఉంటారు. ఇక నాణ్యమైన విద్యుత్ సేవలు ఈ నియామకాలు జరిగాక జిల్లా అంతటా విద్యుత్ వినియోగదారులకు పూర్తి నాణ్యమైన సేవలు అందుతాయి. ఇంతవరకూ గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఒకేసారి ఇంతమంది ఎనర్జీ అసిస్టెంట్లను తీసుకోవడం బహుశా ఇదే ప్రథమం. ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి పారదర్శకంగా వీడియో కవరేజ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాం. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఉత్సాహంగా ముందుకు వచ్చారు. – చింతా సత్యనారాయణరెడ్డి, సూపరింటెండింగ్ ఇంజినీర్, ఏపీ ఈపీడీసీఎల్, రాజమహేంద్రవరం -
పైరవీలదే పెత్తనం..
సాక్షి, గుంటూరు: అర్హతలతో పనిలేదు పైరవీలు చేస్తే చాలు.. రూ.లక్షలకు లక్షలు ఖర్చుపెడితే పనైపోతుంది. నిబంధనలు అడ్డంకి రావు. పైరవీలు, పైసలు ఉంటే చాలు నిబంధనలను సైతం తుంగలో తొక్కుతారు.. అన్న చందంగా గత ఐదేళ్ల టీడీపీ పాలనలో గుంటూరు జీజీహెచ్‌లో పాలన సాగింది. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సిఫార్సు లేఖ ఇవ్వడంతో అడ్డదారిలో ఓ వ్యక్తికి సార్జెంట్ పోస్టు కట్టబెట్టారు. వివరాల్లోకి వెళితే.. జీజీహెచ్‌లో 200 మంది వరకూ వార్డు బాయ్‌లు, ఎంఎన్‌వోలు, తోటీలు, స్వీపర్లు వంటి నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి విధులు కేటాయించడం, సర్వీస్ రూల్స్, సెలవులు మంజూరు, హాస్పిటల్ సెక్యూరిటీ తదితర వ్యవహారాలపై పర్యవేక్షణకు సార్జెంట్ ఉంటాడు. సార్జెంట్‌గా ఆర్మీలో 17 ఏళ్లకు పైగా పనిచేసి, సుబేదార్, రసీల్దార్ హోదా కలిగిఉన్న వ్యక్తులు అర్హులు. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి అన్ని అర్హతలు కలిగిన వారిని సార్జెంట్ నియామకం చేపట్టాలి. అయితే జీజీహెచ్ అధికారులు గత ప్రభుత్వ హయాంలో సార్జెంట్ పోస్టు భర్తీలో నిబంధనలను తుంగలో తొక్కారు. ఎమ్మెల్యే సిఫార్సుతో.. 2016లో అప్పటి పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఎం.శ్రీహరి అనే ఎక్స్సర్వీస్మెన్ను సార్జెంట్‌గా నియమించమని సిఫార్సు లెటర్ ఇచ్చాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫార్సు లెటర్ ఇవ్వడంతో నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా శ్రీహరిని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతిలో నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ ద్వారా 2017లో సార్జెంట్‌గా నియమించారు. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ద్వారానే సార్జెంట్‌ను రిక్రూట్మెంట్ చేయాలి. అర్హత కలిగిన వ్యక్తులు లేని పక్షంలో నాలుగో తరగతి ఉద్యోగుల్లో సీనియర్ ఉద్యోగిని సార్జెంట్‌గా కొనసాగించవచ్చు. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు పద్ధతిలో సార్జెంట్ నియమించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాంట్రాక్టు ఉద్యోగి తమపై పెత్తనం చెలాయిస్తుండటంపై నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది కొత్తేమీ కాదు.. జీజీహెచ్‌లో అనర్హలకు ఉద్యోగోన్నతులు, ఉద్యోగాలు, ఇతర పదవులు కట్టబెట్టడం ఇది కొత్తేమీ కాదు. లైంగిక వేధింపుల కేసులో ఉన్న ఓ వ్యక్తికి ఉత్తమ ఉద్యోగి అవార్డు ఇచ్చిన ఘన చరిత్ర జీజీహెచ్ది. ఆస్పత్రిలో కింది స్థాయి మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడి, వడ్డీ వ్యాపారం పేరుతో అరాచకాలకు పాల్పడిన అధికారులకు ఉద్యోగోన్నతులు కల్పించిన ఘటన గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకుంది. అరాచకాలు, అక్రమాలకు పాల్పడినా సరే డబ్బులు వెదజల్లి కొందరు ఉద్యోగులు తమపై ఉన్న మరకలను గతంలో చెరిపేసుకున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో సార్జెంట్‌ను నియమించడం కోసం ఓ అధికారి, అడ్మిస్ట్రేషన్ విభాగంలో పని చేస్తున్న క్లర్క్ రూ.లక్షల్లో వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.గుంటూరు జీజీహెచ్ -
కొత్త సార్లొస్తున్నారు..
ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులు రానున్నారు. పెండింగ్‌లో ఉన్న టీఆర్టీ(టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) పోస్టులను భర్తీ చేసేందుకు రెండు రోజుల క్రితం జీఓ రాగా, అనంతరం షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటివరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వలంటీర్లతో నెట్టుకురాగా.. ఆయా పోస్టుల్లో కొత్త టీచర్లు భర్తీ అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో 130 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017లో టీఆర్టీ ప్రకటన చేసింది. 2018 ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించింది. అదే ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి.. విడతలవారీగా సెప్టెంబర్ 2018, ఏప్రిల్ 2019లో జాబితా విడుదల చేసింది. అయితే టీఆర్టీ నియామకాలపై మార్గదర్శకాలు జారీ చేసి.. అభ్యర్థుల ఎంపిక చేపట్టకపోవడంతో దాదాపు 20 నెలలపాటు అభ్యర్థులు నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం నియామక పత్రాలపై జీఓను విడుదల చేయడంతో త్వరలోనే అభ్యర్థులు టీచర్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు.. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి జిల్లాకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా కలెక్టర్ ఆర్వీ.కర్ణన్.. కార్యదర్శిగా డీఈఓ మదన్మోహన్ వ్యవహరించనున్నారు. పలువురు జిల్లాస్థాయి అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. పాఠశాల విద్యాశాఖ టీఆర్టీ జాబితాను ఇప్పటికే జిల్లా కమిటీకి సమర్పించింది. రోస్టర్, మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో జిల్లా కమిటీలు తమ పరిధిలోని సబ్జెక్టులవారీగా ఖాళీలను గుర్తించి.. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. షెడ్యూల్ ఇలా.. టీఆర్టీ నియామకాలకు సంబంధించి షెడ్యూల్ ఇలా ఉంది. ఎంపికైన అభ్యర్థుల లిస్టును కేటగిరీ, మీడియంవారీగా ఈనెల 10న ప్రదర్శించనున్నారు. 11న జిల్లాస్థాయి కమిటీ సమావేశమై ఖాళీల పరిస్థితిని తెలుసుకొని కేటగిరీ, మీడియంలవారీగా ఖాళీలను వెల్లడిస్తారు. 13, 14వ తేదీన అభ్యర్థులకు కేటగిరీ, మీడియంవారీగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పోస్టింగ్ పొందిన కొత్త టీచర్లు ఈనెల 15న పాఠశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. 17న జాయిన్ కానీ, రిపోర్టు చేయని అభ్యర్థుల వివరాలను గుర్తిస్తారు. 19న ఎంపికైన టీచర్లు జాయినింగ్ రిపోర్టును ఎంఈఓలు, హెచ్ఎంలకు అందజేయాలి. వేగవంతం చేస్తున్నాం.. టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పూర్వ ఖమ్మం జిల్లా నుంచి ఖాళీల వివరాలు సేకరిస్తున్నాం. కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ఆదేశాల మేరకు త్వరలోనే నియామకాలు చేపట్టనున్నాం. మొత్తం 130 పోస్టులను భర్తీ చేయనున్నాం. – పి.మదన్మోహన్, జిల్లా విద్యాశాఖాధికారి -
ప్రభుత్వ బ్యాంకుల్లో లక్షకు పైగా ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగవకాశాలు లభించనున్నాయి. అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సహా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి లక్షలాదిమందిని నియమించుకోనున్నాయని తాజా రిపోర్టు ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా వెల్త్ మేనేజ్మెంట్, ఎనలిటిక్స్, స్ట్రాటజీ, డిజిటల్ బ్యాంకింగ్, కస్టమర్స్ సర్వీసెస్ విభాగాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయని సమాచారం. టీమ్ లీజ్ అంచనాల ప్రకారం గత రెండేళ్లో చేపట్టిన నియమాకాల కంటే రెట్టింపు కన్నా ఎక్కువే. గత రెండు సంవత్సరాలలో బ్యాంకులు గుమస్తా, మేనేజ్మెంట్ ట్రైనీలు, ప్రొబేషనరీ ఆఫీసర్ల కేటగిరీలో దాదాపు 95వేల మందిని నియమించుకున్నాయి. మొండి బకాయిలతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇపుడు అభివృద్ధిలో పోటీపడుతున్నాయి. ఆర్థిక సేవల నిర్వహణా తీరును, కల్చర్‌ను మార్చుకుంటున్నాయనీ, డిజిటల్ మార్కెటింగ్, మొండి బకాయిల వసూళ్లపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. అంతేకాదు ప్రైవేటు/ బహుళజాతి బ్యాంకులకు ధీటుగా వీరికి వేతనాలను ఆఫర్ చేయనున్నాయని సిండికేట్ బ్యాంక్ సీఈవో మృత్యుంజయ్ మహాపాత్ర వ్యాఖ్యలను ఉటింకిస్తూ మీడియా రిపోర్టు చేసింది. ఈ నేపథ్యంలో సిండికేట్ బ్యాంకు ఈ ఆర్థిక సంవత్సరంలో 500మందిని నియమించుకోనుంది. -
పోలీసు అవబోయి ఎమ్మెల్యేగా!!
జైపూర్: రాజ్‌కుమార్ రోట్.. నిన్నటివరకు సాధారణ మధ్యతరగతి యువకుడు. పోలీసు రిక్రూట్మెంట్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగి. మూడు నెలల క్రితం ఎన్నికల్లో పోటీ చేయమని ఓ పార్టీ అడిగితే సరే అన్నారు. అనూహ్య రీతిలో విజయం సాధించారు. పోలీసు కాబోయి ఎమ్మెల్యే అయ్యారు. త్వరలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న రాజ్‌కుమార్.. రాజస్తాన్ అసెంబ్లీలో గిరిజనుల ప్రతినిధిగా అడుగుపెట్టనున్నారు. దుంగార్పూర్లోని ఖూనియా గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. దీంతో ఛోరసీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాల్సిందిగా భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) రాజ్‌కుమార్‌ను కోరింది. సరేనన్నారు. బీజేపీ అభ్యర్థి సుశీల్ కటారాపై 12,934 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. -
కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియను నిలిపేయండి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోలీస్ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని, వెంటనే ఆ ఉత్తర్వులను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. వివిధ విభాగాల్లోని 16,925 పోస్టుల భర్తీకి మే 10న జారీ చేసిన జీవో 49 ప్రకారం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టిన ప్రక్రియను నిలిపివేయాలని మెదక్ జిల్లా పుల్కల్ మండలం లక్ష్మీసాగర్ గ్రామస్తుడు మహేశ్ కోర్టును ఆశ్రయించారు. ‘నియామక ప్రక్రియ షరతులు లోపభూయిష్టంగా ఉన్నాయి. స్పెషల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వు పోలీస్, స్పెషల్ పోలీస్ ఫోర్స్ తదితర విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టుల అభ్యర్థులకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్లకు 3 మార్కుల వెయిటేజీ ఇవ్వడం చట్ట వ్యతిరేకం. ఇది ఏపీ పోలీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌కు విరుద్ధం. అంతేకాకుండా హోంగార్డులకు వయోపరిమితి పెంపు ప్రభావం రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నష్టం చేకూరుస్తుంది. జిల్లాలు, కమ్యూనిటీల వారీగా రోస్టర్ ప్రకటించలేదు. కొన్ని కేటగిరీ అభ్యర్థుల్ని పట్టించుకోలేదు. కాబట్టి నియామక ప్రకటన అమలును నిలిపివేయాలి’ అని వ్యాజ్యంలో పేర్కొన్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్‌ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. -
ఆర్మీలో పోర్టర్ల నియామకాలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత సైన్యంలో పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేలా నూతన విధానానికి రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నెలసరి వేతనంపై పోర్టర్లను భారత సైన్యం నియమించుకునేందుకు ఈ విధానం వెసులుబాటు కల్పిస్తుంది. పోర్టర్లకు నెలకు రూ 18,000 వేతనంతో పాటు వారు పనిచేసే ప్రాంతం, వాతావరణం, ప్రాణాపాయం వంటి అంశాల ప్రాతిపదికన కాంపెన్సేటరీ వేతనం, వైద్య సేవలు వంటి ఇతర సదుపాయాలను కల్పిస్తారు. గతంలో ఆర్మీలో పోర్టర్లను రోజువారీ వేతనం కింద నియమించుకునేవారు. వారికి ఎలాంటి ఇతర సదుపాయాలూ అందుబాటులో ఉండేవి కావు. పోర్టర్లకు సరైన మౌలిక వసతులు కొరవడటంపై సుప్రీం కోర్టును ఆశ్రయించగా, పోర్టర్లకు మెరుగైన విధానాన్ని అందుబాటులోకి తేవాలని గత ఏడాది జనవరి 2న సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. -
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
కరీంనగర్ సిటీ: ఇండియన్ ఆర్మీలో ఉపాధి కోసం మేలో వరంగల్‌లో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో కరీంనగర్ జిల్లా నుంచి ఎక్కువమంది ఎంపికయ్యేందుకు నిరుద్యోగ యువతకు వారధి, ఎన్సీసీ బెటాలియన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించారు. రన్నింగ్ అంబేద్కర్ స్టేడియంలో, క్యూటీ ఎస్సారార్ కళాశాలలో శిక్షణ ఇస్తారని తెలిపారు. ప్రతి కళాశాలలో ర్యాలీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంపికైనవారికి ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. 8వతరగతి నుంచి ఇంటర్, బీఎస్సీ నర్సింగ్, ఎల్ఎల్బీ ఇంజినీరింగ్ విద్యాభ్యాసం చేసినవారు వివిధ విభాగాల్లో ఆర్మీలో చేరొచ్చని అన్నారు. వారధి సొసైటీ సెక్రటరీ ఆంజనేయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెఫ్ట్‌నెంట్ కల్నల్ ఉమాశంకర్ పాల్గొన్నారు. -
293 అంగన్వాడీ పోస్టులు
కొత్తగూడెం (అర్బన్) : జిల్లాలో అంగన్వాడీ పోస్టుల నియామకానికి తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాలో 293 పోస్టులు ఖాళీగా ఉండగా ఈనెల 14న చివరి తేదీ నాటికి 3650 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులలో అంగన్వాడీ టీచర్లు 57, ఆయాలు119, మినీ అంగన్వాడీ టీచర్లు 117 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. వీటికి గానూ జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి మొత్తం 3650 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎవరెవరికి ఎలా... జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల్లో అత్యధికం ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. బూర్గంపాడు–1 ఎస్సీలకు, అశ్వారావుపేట–1 జనరల్, ఇల్లందు–1 జనరల్, పాల్వంచ మినీ అంగన్వాడీ సెంటర్లు –5 పోస్టులలో జయమ్మకాలనీ జనరల్, గొల్లగూడెం ఎస్సీ, జ్యోతినరగ్ జనరల్, వికలాంగుల కాలనీ జనరల్, సోనినగర్ బీసీ–ఏ కు కేటాయించగా, మిగత పోస్టులన్నీ ఎస్టీలకు రిజర్వ్ చేశారు. దరఖాస్తుల్లోనూ ఎక్కువగా ఎస్టీలవే ఉన్నాయని అధికారులు వెల్లడించారు. స్క్రూట్నీ, ఫీల్డ్ వర్క్ అనంతరం ఎంపికలు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టుల ఖాళీల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ 14న ముగిసింది. దరఖాస్తులు, అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 20 వరకు పరిశీలిస్తారు. ఇందుకోసం అభ్యర్థులు ఐసీడీఎస్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. 21వ తేదీ నుంచి ఐసీడీఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుదారులు స్థానికంగా ఉంటున్నారా.. ఇతర ప్రాంతాల వారెవరైనా దరఖాస్తు చేశారా.. అనే సమాచారాలను సేకరిస్తారు. అనంతరం తుది నివేదికను సెలక్షన్ కమిటీ చైర్మన్ అయిన కలెక్టర్‌కు అందజేస్తారు. ఆ తర్వాత అభ్యర్థుల అర్హతల ప్రకారం, లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, సభ్యులుగా ఆర్డీవో, డీఎంఅండ్‌హెచ్‌వో, కన్వీనర్‌గా డీడబ్ల్యూవో, ఐటీడీఏ ఏరియాల్లో ప్రాజెక్టు ఆఫీసర్లు మెంబర్లుగా ఉంటారు. ఎంపికల్లో అభ్యర్థుల మార్కులకు 80 శాతం, వితంతువులకు –5 శాతం, వికలాంగులకు 5 శాతం, అనాథలకు 10 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. దళారులను నమ్మొద్దు జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా, మినీ అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీ విషయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. మార్కుల ఆధారంగా, ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారమే భర్తీ చేస్తాం. ఎవరి మాటలు విని డబ్బు, సమయం వృథా చేసుకోవద్దు. – ఝాన్సీలక్ష్మీబాయి, జిల్లా సంక్షేమశాఖాధికారిణి -
‘మా సంస్థకు సంబంధం లేదు’
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ)లో నియామకాలు జరుపుతున్నట్లు గుర్తు తెలియని వ్యక్తులు సంస్థ పేరుతో బోగస్ నియామక ఉత్తర్వులు జారీ చేసిన విషయం వెలుగులోకి రావడంతో ఆర్టీసీ అధికారులు మేల్కొన్నారు. ఈ నియామక పత్రాలు నిజమైనవి కావు అంటూ గురువారం ఏపీఎస్ ఆర్టీసీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ. వెంకటేశ్వర రావు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యవహారంతో ఆర్టీసీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సంస్థ నిర్ణీత విధివిధానాలతో నోటిఫికేషన్ రూపంలో దినపత్రికలలో బహిరంగ ప్రకటన జారీ చేసి నియామక ప్రక్రియ నిర్వహిస్తుందని చెప్పారు. ప్రభుత్వ అనుమతి పొందిన తర్వాతే నియామకాలు జరుగుతాయని, సంస్థ జరిపే నియామకాలలో ఎలాంటి గోప్యత ఉండదన్నారు. నిరుద్యోగులు ఈ విషయాన్ని గమనించి మోసగాళ్ల వలలో పడవద్దని చెప్పారు. ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించే వ్యక్తులు లేదా సంస్థలు, నియామక పత్రాలు జారీ చేస్తున్నవారు తారసపడినా లేదా వారి వివరాలు తెలిసినా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.