సాక్షి, గుంటూరు: అర్హతలతో పనిలేదు పైరవీలు చేస్తే చాలు.. రూ.లక్షలకు లక్షలు ఖర్చుపెడితే పనైపోతుంది. నిబంధనలు అడ్డంకి రావు. పైరవీలు, పైసలు ఉంటే చాలు నిబంధనలను సైతం తుంగలో తొక్కుతారు.. అన్న చందంగా గత ఐదేళ్ల టీడీపీ పాలనలో గుంటూరు జీజీహెచ్‌లో పాలన సాగింది. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సిఫార్సు లేఖ ఇవ్వడంతో అడ్డదారిలో ఓ వ్యక్తికి సార్జెంట్
పోస్టు కట్టబెట్టారు. వివరాల్లోకి వెళితే..
జీజీహెచ్‌లో 200 మంది వరకూ వార్డు బాయ్‌లు, ఎంఎన్‌వోలు, తోటీలు, స్వీపర్లు వంటి నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి విధులు కేటాయించడం, సర్వీస్ రూల్స్, సెలవులు మంజూరు, హాస్పిటల్ సెక్యూరిటీ తదితర వ్యవహారాలపై పర్యవేక్షణకు సార్జెంట్ ఉంటాడు. సార్జెంట్‌గా ఆర్మీలో 17 ఏళ్లకు పైగా పనిచేసి, సుబేదార్, రసీల్‌దార్ హోదా కలిగిఉన్న వ్యక్తులు అర్హులు. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి అన్ని అర్హతలు కలిగిన వారిని సార్జెంట్ నియామకం చేపట్టాలి. అయితే జీజీహెచ్ అధికారులు గత ప్రభుత్వ హయాంలో సార్జెంట్ పోస్టు భర్తీలో నిబంధనలను తుంగలో తొక్కారు.
ఎమ్మెల్యే సిఫార్సుతో..
2016లో అప్పటి పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఎం.శ్రీహరి అనే ఎక్స్‌సర్వీస్‌మెన్‌ను సార్జెంట్‌గా నియమించమని సిఫార్సు లెటర్ ఇచ్చాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫార్సు లెటర్ ఇవ్వడంతో నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా శ్రీహరిని కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ ద్వారా 2017లో సార్జెంట్‌గా నియమించారు. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ద్వారానే సార్జెంట్‌ను రిక్రూట్‌మెంట్ చేయాలి. అర్హత కలిగిన వ్యక్తులు లేని పక్షంలో నాలుగో తరగతి ఉద్యోగుల్లో సీనియర్ ఉద్యోగిని సార్జెంట్‌గా కొనసాగించవచ్చు. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు పద్ధతిలో సార్జెంట్ నియమించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాంట్రాక్టు ఉద్యోగి తమపై పెత్తనం చెలాయిస్తుండటంపై నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కొత్తేమీ కాదు..
జీజీహెచ్‌లో అనర్హలకు ఉద్యోగోన్నతులు, ఉద్యోగాలు, ఇతర పదవులు కట్టబెట్టడం ఇది కొత్తేమీ కాదు. లైంగిక వేధింపుల కేసులో ఉన్న ఓ వ్యక్తికి ఉత్తమ ఉద్యోగి అవార్డు ఇచ్చిన ఘన చరిత్ర జీజీహెచ్‌ది. ఆస్పత్రిలో కింది స్థాయి మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడి, వడ్డీ వ్యాపారం పేరుతో అరాచకాలకు పాల్పడిన అధికారులకు ఉద్యోగోన్నతులు కల్పించిన ఘటన గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకుంది. అరాచకాలు, అక్రమాలకు పాల్పడినా సరే డబ్బులు వెదజల్లి కొందరు ఉద్యోగులు తమపై ఉన్న మరకలను గతంలో చెరిపేసుకున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో సార్జెంట్‌ను నియమించడం కోసం ఓ అధికారి, అడ్మిస్ట్రేషన్ విభాగంలో పని చేస్తున్న క్లర్క్ రూ.లక్షల్లో వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.గుంటూరు జీజీహెచ్
Comments
Please login to add a commentAdd a comment