
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ అవుట్ పేషెంట్ విభాగంలో సోమవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. విద్యుత్ బోర్డులోని ఎంసీసీబీ స్విచ్ బోర్డు కాలిపోయింది. వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గుల కారణంగా స్విచ్ బోర్డు కాలిపోయినట్లు ఆస్పత్రి ఎలక్ట్రికల్ సిబ్బంది తెలిపారు. ఉదయం 11 గంటలకు విద్యుత్ సమస్య ఏర్పడి సాయంత్రం వరకు ఓపీలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదు.
దీంతో ఓపీలో వైద్య సేవలకు కొంతమేర అంతరాయం ఏర్పడింది. ఫార్మాసిస్టులు సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ సాయంతో మందుల సరఫరా చేయగా.. కొంత మంది జూనియర్ వైద్యులు రోగులను సెల్‌ఫోన్ వెలుతురులోనే పరీక్షించి చికిత్సలు అందించారు. బ్లడ్ టెస్ట్, ఇతర వైద్య పరీక్షలకు రోగులు ఇబ్బందిపడ్డారు. సుమారు రూ. 26 వేల ఖరీదు చేసే స్విచ్‌బోర్డును కొనుగోలు చేసి సాయంత్రానికల్లా విద్యుత్‌ను పునరుద్ధరించినట్టు సివిల్ సర్జన్ ఆర్‌ఎంవో డాక్టర్ బత్తుల వెంకటసతీష్‌కుమార్ చెప్పారు.