
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా డిసెంబర్ నెల రిటైల్, ఆతిథ్యం, విద్య వంటి ఐటీయేతర రంగాలు నియామక కార్యకలాపాల పునరుద్ధరణ సంకేతాలను చూసింది. నౌకరీ జాబ్ స్పీక్ నివేదిక ప్రకారం.. 2020 డిసెంబర్‌తో పోలిస్తే గత నెలలో నియామకాలు నిలకడగా ఉన్నాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే 2021 చివర్లో అన్ని మెట్రో నగరాల్లో రిక్రూట్‌మెంట్ పెరిగింది. ఐటీ నియామకాల్లో వృద్ధిని కొనసాగించినప్పటికీ.. ఆతిథ్యం, యాత్రలు, రిటైల్, రియల్టీ రంగాల నుండి పునరాగమనాన్ని చూడటం సంతోషాన్నిస్తోంది. డిసెంబర్ త్రైమాసికంలో యాత్రలు, ఆతిథ్యం 22 శాతం, రిటైల్ 20, విద్యా రంగం 12 శాతం వృద్ధిని కనబరిచాయి. ‘తిరిగి కార్యాలయాల నుంచి పని’ విధానాలను చాలా కంపెనీలు రూపొందించడంతో అత్యధిక నిపుణులు తాము పనిచేసే నగరాలకు చేరుకున్నారు.
హైదరాబాద్ 12 శాతం వృద్ధి..
కంపెనీలు డిజిటల్ వైపు మళ్లడం కొనసాగిస్తున్నందున కొన్ని విభాగాలు, రంగాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. 2020 డిసెంబర్‌తో పోలిస్తే గత నెలలో మెట్రో నగరాలవారీగా చూస్తే నియామకాల వృద్దిలో హైదరాబాద్ 12 శాతం వృద్ది సాధించి తొలి స్థానంలో నిలిచింది. బెంగళూరులో రిక్రూట్‌మెంట్ 11 శాతం, ముంబై 8, పుణే 4, చెన్నై 6 శాతం అధికమైంది. ఢిల్లీ స్థిరంగా, కోల్‌కతా 3 శాతం తిరోగమన వృద్ధి సాధించింది.
అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అహ్మదాబాద్ 21 శాతం అధికమై తొలి స్థానంలో ఉంది. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ రంగాలు ఈ నగరానికి అండగా నిలిచాయి. యువ నిపుణుల కోసం డిమాండ్ స్థిరంగా ఉంది. ఫ్రెషర్స్, 4–7 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగుల కోసం అవకాశాలు నిలకడగా ఉన్నాయి. 8–12 ఏళ్ల అనుభవం కలిగిన నిపుణులకు డిమాండ్ 4 శాతం, 13–16 ఏళ్ల విభాగంలో 9 శాతం తగ్గింది.
చదవండి: టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్ కోసం 2.41 లక్షల మంది పోటీ
Comments
Please login to add a commentAdd a comment