సొంతిల్లు ప్రతి ఒక్కరి జీవిత కల. పైసా పైసా కూడబెట్టి, గృహ రుణంతో సొంతింటి కలను నెరవేర్చుకుంటారు. గృహ కొనుగోలు (Buying House)నిర్ణయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, నిర్లక్ష్యం వహించినా కష్టార్జితమంతా వృథా అవుతుంది. మరీ ముఖ్యంగా తొలిసారి గృహ కొనుగోలుదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రాపర్టీని (Property) కొనుగోలు చేయడం అంటే కేవలం ఆర్థికపరమైన నిర్ణయం మాత్రమే కాదు.. జీవనశైలి ఎంపిక. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే అందబాటు ధరలు, అభివృద్ధి అవకాశాలు, దీర్ఘకాలిక పెట్టుబడికి సరైనది హైదరాబాద్. నగరంలో గృహ కొనుగోలుదారులు ఈ పంచ సూత్రాలు పాటిస్తే సొంతింటిని దక్కించుకోవచ్చు. – సాక్షి, సిటీబ్యూరో
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట ప్రాంతాలు విలాసవంతమైన జీవనం, పెట్టుబడుల వృద్ధిలో అగ్రస్థానంలో ఉన్నాయి. వృద్ధి సమతుల్యత, అందుబాటు ధరల కోసమైతే నార్సింగి, కొల్లూరు, రాజేంద్రనగర్, తెల్లాపూర్ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను ఎంపిక చేసుకోవచ్చు. ఆయా ప్రాంతాలు ఆధునిక మౌలిక సదుపాయాలు, ఐటీ కారిడార్లకు సమీపంలో ఉండటంతో నివాసం
ఉండేందుకు, పెట్టుబడులకు రెండింటికీ అనువైన ప్రాంతాలు.
లగ్జరీ ప్రాపర్టీల కొనుగోలుదారులు ఇంటి ధరను మాత్రమే కాదు రిజిస్ట్రేషన్ ఫీజులు, ప్రీమియం వసతులు, హైఎండ్ ఇంటీరియర్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. విలాసవంతమైన జీవితాన్ని విలువైనదిగా చేసే నిర్వహణ చార్జీలు కూడా ఉంటాయని గమనించాలి.
విలాసవంతమైన ఇల్లు, దాని నిర్మాణ శైలి గురించి తెలుసుకోవాలి. లగ్జరీ ప్రాపర్టీల అనుభూతిని పొందాలంటే డెవలపర్ కీలకపాత్ర పోషిస్తారు. వారి ఉన్నత నైపుణ్యం, సకాలంలో డెలివరీ, వినూత్నమైన డిజైన్లు, ఎలివేషన్లకు ప్రసిద్ధి చెందిన బిల్డర్ ప్రాజెక్ట్‌లను ఎంచుకోవడం ఉత్తమం. నిర్మాణంలో నాణ్యత, ప్రత్యేకతలు అందించే రెరా ఆమోదిత ప్రాజెక్ట్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి.
ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో స్టేషన్లు, రాబోయే మౌలిక సదుపాయాల ప్రాంతాలలో స్థలాలు, గృహాలను కొనుగోలు చేస్తే తక్కువ కాలంలో విలువ రెట్టింపు అవుతుంది. ప్రైవసీ, ప్రశాంతతను కోరుకునే వారికీ ఈ ప్రాంతాలే బెటర్. రవాణా సదుపాయాలు, కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలైతే రాకపోకలు సౌలభ్యంగా ఉంటుంది.
ఎంపిక చేసిన ప్రాపర్టీకి సంబంధించి న్యాయ నిపుణులు, ప్రొఫెషనల్స్ సలహాలు తీసుకోవాలి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ వంటి ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు గురించి ఆరా తీయాలి.
Comments
Please login to add a commentAdd a comment