![More Housing demand in Hyderabad Bengaluru Mumbai report](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/real.jpg.webp?itok=WFzebEi4)
దేశీయ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిలో హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాలు కీలకంగా మారాయి. ఈ ఏడాది గృహ విక్రయాలు ఈ మూడు నగరాల్లోనే అధిక స్థాయిలో జరిగాయి. తక్కువ వడ్డీ రేట్లు, స్థిరమైన ప్రాపర్టీ ధరలే ఇందుకు కారణమని హౌసింగ్. కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్‌లైన్ సెర్చ్ (ఐఆర్‌ఐఎస్) అంచనా వేసింది. రియల్టీ స్టేక్ హోల్డర్లు, ప్రభుత్వం, బ్యాంక్‌లు, ప్రాపర్టీ ఇన్వెస్టర్లు అందరూ టర్న్ ఎరౌంట్ మార్కెట్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపింది. అది గతేడాది సానుకూల దృక్పథంతో మొదలైందని తెలిపింది. గతేడాది వృద్ధే ఈ ఏడాది కూడా కొనసాగుతోంది. – సాక్షి, సిటీబ్యూరో
ప్రధాన నగరంలో ఇరుకు ఇళ్ల మధ్య ఉండటం బదులు శివారు ప్రాంతాలు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే ఫ్లాట్లు, విల్లాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ద్వితీయ శ్రేణి పట్టణాలలోని ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది. గతంలో సూరత్, జైపూర్, పాట్నా, మోహాలీ, లక్నో, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాలు ఆన్‌లైన్‌లో ప్రాపర్టీల సెర్చ్‌లో గణనీయమైన వృద్ధి నమోదు చేశాయని తెలిపింది. ఆయా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గృహ కొనుగోళ్లకు ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొంది. నోయిడాలోని నోయిడా ఎక్స్‌టెన్షన్, ముంబైలోని మీరా రోడ్ ఈస్ట్, అంధేరి వెస్ట్, బోరివలీ వెస్ట్, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతాలు ఈ ఏడాది దేశీయ నివాస సముదాయ మార్కెట్‌ను లీడ్ చేస్తాయని తెలిపింది.
మారిన అభిరుచులు..
ఆన్‌లైన్‌లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకట్నిర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. ప్రస్తుతం గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయని హౌసింగ్.కామ్ కన్జ్యూమర్ సెంటిమెంట్ ఔట్‌లుక్ తెలిపింది. 3 బీహెచ్‌కే, ఆపై పడక గదుల గృహాల్లో 2023తో పోలిస్తే 2024లో 15 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించిందని తెలిపింది.
అద్దెలకు గిరాకీ..
ప్రాజెక్ట్‌ల ఆలస్యం, దివాళా డెవలపర్లు వంటి ప్రతికూల వాతావరణంలోనూ నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్‌సీఆర్)లో ప్రాపర్టీ కోసం సెర్చ్ గణనీయంగా పెరిగింది. నోయిడా ఎక్స్‌టెన్షన్ ప్రాంతం ఆన్‌లైన్ ప్రాపర్టీ సెర్చింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఈ రీజియన్‌లో పలు మౌలిక సదుపాయల ప్రాజెక్ట్‌లను ప్రకటించడం, ధరలు అందుబాటులో ఉండటం వంటివి ఈ రీజియన్‌లో ప్రాపర్టీల వృద్ధికి కారణమని తెలిపింది. ఐటీ, ఫార్మా కంపెనీలు ఉద్యోగ నియామకాలను పెంచడంతో ముంబై, బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లలో అద్దెలకు గిరాకీ పెరిగిందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment