Naukri Job Speak Index
-
ఐటీ ఉద్యోగ నియామకాల పరిస్థితి ఇదీ..
ముంబై: వైట్ కాలర్ ఉద్యోగుల (నైపుణ్య, నిర్వహణ విధులు) నియామకాలు నవంబర్ నెలలో 2 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, కృత్రిమ మేథ–మెషిన్ లెర్నింగ్ (ఏఐ/ఎంఎల్), ఎఫ్ఎంసీజీ రంగాల్లో నియామకాలు సానుకూలంగా నమోదయ్యాయి. నవంబర్ నెలకు సంబంధించిన గణాంకాలను నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ విడుదల చేసింది.నౌకరీ ప్లాట్‌ఫామ్‌పై వైట్‌కాలర్ ఉద్యోగాలకు సంబంధించి 2,430 నోటిఫికేషన్లు వెలువడ్డాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 2 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో 16 శాతం, ఫార్మా/బయోటెక్ రంగంలో 7 శాతం, ఎఫ్ఎంసీజీ రంగంలో 7 శాతం, రియల్ ఎస్టేట్‌లో 10 శాతం చొప్పున వైట్ కాలర్ నియామకాలు అధికంగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఏఐ/ఎంఎల్ విభాగంలో 30 శాతం, గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్లలో 11 శాతం అధికంగా ఉపాధి కల్పన జరిగినట్టు నౌకరీ నివేదిక తెలిపింది.ఐటీ రంగంలో వైట్ కాలర్ నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చిచూసినప్పుడు ఎలాంటి వృద్ధి లేకుండా ఫ్లాట్‌గా నమోదైంది. పండుగల సీజన్ మద్దతుతో ఇతర రంగాల్లో నియామకాలు మోస్తరుగా ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూస్తే రాజస్థాన్ ముందుంది. జైపూర్ 14 శాతం, ఉదయ్‌పూర్ 24 శాతం, కోటలో 15 శాతం వైట్ కాలర్ నియామకాలు పెరిగాయి. జైపూర్‌లో విదేశీ ఎంఎన్సీ కంపెనీల తరఫున నియామకాలు 20 శాతం పెరిగాయి. భువనేశ్వర్‌లో 21 శాతం వృద్ధి కనిపించింది. -
హైదరాబాద్‌లో నియామకాల జోరు
ముంబై: జూలైలో కార్యాలయ ఉద్యోగుల నియామకాల పరంగా హైదరాబాద్‌లో మంచి వృద్ధి నమోదైంది. ఒకటికి మించిన రంగాల్లో నియామకాలు జూలైలో గణనీయంగా పెరిగినట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా జూలైలో నియామకాలు 12 శాతం పెరిగినట్టు ప్రకటించింది. మొత్తం 2,877 జాబ్ పోస్టింగ్ నోటిఫికేషన్లు (ఉద్యోగులు కావాలంటూ జారీ చేసే ప్రకటనలు) వచ్చినట్టు పేర్కొంది. క్రితం ఏడాది జూలై నెలలో 2,573 జాబ్ పోస్టింగ్‌లతో పోల్చి చూస్తే 12 శాతం పెరిగినట్టు తెలిపింది. జూలై నెలకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నియామకాల ధోరణిని ఈ నివేదిక ప్రతిఫలిస్తుంటుంది. నౌకరీ డాట్ కామ్ పోర్టల్‌పై జాబ్ పోస్టింగ్‌లు, ఉద్యోగ శోధన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందిస్తుంది. ముఖ్యంగా ఫార్మా రంగంలో 26 శాతం మేర నియామకాలు పెరిగాయి. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో 23 శాతం అధికంగా ఉద్యోగాల భర్తీ నెలకొంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చతే జూలైలో ఐటీ నియామకాలు 17 శాతం పుంజుకున్నాయి. ముఖ్యంగా ఏఐ–ఎంఎల్ విభాగంలో 47 శాతం మేర నియామకాలు పెరిగాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అత్యధికంగా 39 శాతం వృద్ధి నమోదైంది. ఆ తర్వాత జామ్‌నగర్‌లో 38 శాతం, బరోడాలో 25 శాతం మేర నియామకాలు పెరిగాయి. హైదరాబాద్‌లో జోరు హైదరాబాద్‌లో హాస్పిటాలిటీ (ఆతిథ్య పరిశ్రమ) రంగంలో నియామకాలు 76 శాతం పెరిగాయి. ఆ తర్వాత బీమా రంగంలో 71 శాతం, బీపీవో రంగంలో 52 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో 44 శాతం చొప్పున జూలైలో నియామకాలు పెరిగినట్టు నౌకరీ నివేదిక తెలిపింది. విజయవాడలో 13 శాతం, విశాఖపట్నంలో 14 శాతం చొప్పున నియామకాల్లో వృద్ధి కనిపించినట్టు పేర్కొంది. ‘‘12 శాతం వృద్ధి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆశాజనకం. ఈ ఆర్థిక సంవత్సరంలో నియామకాల పరంగా సానుకూల వృద్ధి మొదటిసారి నమోదైంది. దేశ కార్యాలయ ఉద్యోగ మార్కెట్లో పురోగమనాన్ని సూచిస్తోంది’’అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ తెలిపారు. -
ఐటీ హబ్‌లు వెలవెల! భారీగా పడిపోయిన నియామకాలు..
ప్రపంచవ్యాప్తంగా జాబ్ మార్కెట్లో ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. నియామకాలు బాగా నెమ్మదించాయి. భారత్‌లో ముఖ్యంగా ఐటీ హబ్‌లు వెలవెలబోతున్నాయి. దేశంలో ఉద్యోగాల క్షీణతకు సంబంధించి తాజాగా ఓ నివేదిక వెల్లడైంది. పుణె, బెంగళూరు, హైదరాబాద్ వంటి భారతీయ ఐటీ హబ్‌లలో గడిచిన అక్టోబర్ నెలలో ఉద్యోగాల క్షీణత కనిపించిందని నివేదిక వెల్లడించింది. మొత్తం మీద అక్టోబర్‌లో ఇతర రంగాల కంటే ఐటీ రంగంలో నియామకాలు అత్యధికంగా పడిపోయాయి. మరోవైపు, చమురు, గ్యాస్, విద్యుత్ రంగాల్లో అత్యధిక వృద్ధి కనిపించింది. ఐటీ నియామకాల్లో 14% క్షీణత నౌకరీ జాబ్‌స్పీక్ నివేదిక ప్రకారం.. గతేడాది అక్టోబర్‌తో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఐటీ రంగం నియామకాల్లో 14 శాతం క్షీణతను చూసింది. నౌకరీ డాట్ కామ్ రెజ్యూమ్ డేటాబేస్‌పై ఈ నెలవారీ నివేదిక విడుదలైంది. ఇతర నగరాల్లో వృద్ధి కోల్‌కతాతో పాటు ఐటీ పరిశ్రమ కేంద్రాలుగా ఉన్న బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై వంటి మెట్రో నగరాల్లో నియామకాల్లో 6 నుంచి 11 శాతం క్షీణత ఉండగా మరోవైపు ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై నగరాల్లో మాత్రం కొత్త జాబ్ ఆఫర్లలో వరుసగా 5, 4 శాతాల చొప్పున వృద్ధి నమోదైనట్లు నివేదిక పేర్కొంది. ఇక చెన్నైలో అత్యధికంగా 11 శాతం, బెంగళూరులో 9 శాతం, హైదరాబాద్‌లో 7 శాతం నియామకాలు పడిపోయాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ అక్టోబర్‌లో పుణె, కోల్‌కతాలో నియామకాలు 6 శాతం తగ్గాయి. చిన్న నగరాల విషయానికి వస్తే.. కొచ్చిలో 18 శాతం, కోయంబత్తూరులో 7 శాతం తగ్గింది. మరోవైపు మెట్రో నగరాలైన ఢిల్లీ 5 శాతం, ముంబై 4 శాతం వృద్ధిని సాధించాయి. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వడోదరలో అత్యధికంగా 37 శాతం వృద్ధి నమోదైంది. ఆ తర్వాత అహ్మదాబాద్‌లో 22 శాతం, జైపూర్‌లో 10 శాతం నియామకాల్లో వృద్ధి నమోదైనట్లు నౌకరీ జాబ్ స్పీక్ రిపోర్ట్ పేర్కొంది. ఈ రంగాల్లో జోష్ ఐటీ రంగంలో నియామకాల్లో క్షీణత ఉన్నప్పటికీ కొన్ని ఇతర రంగాల్లో మాత్రం కొత్త నియామకాల్లో జోష్ కనిపించినట్లు తాజా వివేదిక తెలిపింది. చమురు & గ్యాస్/పవర్ రంగం అత్యధికంగా 24 శాతం వృద్ధిని సాధించింది. ఆ తర్వాత ఫార్మా పరిశోధన, అభివృద్ధి (19 శాతం), బ్యాంకింగ్/ఫైనాన్స్/బ్రోకింగ్ (13 శాతం) ఉన్నాయి. ఇక నియామకాల్లో క్షీణత అత్యధికంగా ఉన్న రంగాలలో ఐటీ తర్వాత విద్య (10 శాతం), టెలికాం (9 శాతం) ఉన్నాయి. భారత్‌లో వైట్ కాలర్ నియామకానికి సంబంధించిన ఇండెక్స్ విలువ ఈ ఏడాది అక్టోబర్‌లో 2484గా ఉంది. ఇది గతేడాది అక్టోబర్‌లో 2455గా నమోదైంది. -
సెప్టెంబర్‌లో కార్యాలయ ఉద్యోగ నియామకాలు తగ్గుదల
ముంబై: ఐటీ, బీపీవో, ఎఫ్ఎంసీజీ తదితర రంగాల్లో ప్రతికూల ధోరణులతో.. కార్యాలయ ఉద్యోగుల (వైట్ కాలర్) నియామకాలు సెప్టెంబర్‌లో 8.6 శాతం తగ్గాయి. ఆగస్ట్ నెలతో పోలిస్తే సెప్టెంబర్‌లో నియామకాలు 6 శాతం పెరిగినట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ సర్వే నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్‌లో మొత్తం 2,835 మంది కోసం నియామక ప్రకటనలు వెలువడ్డాయి. అంతక్రితం నెలలో 3,103 ఉద్యోగాలకు ప్రకటనలు విడుదలైనట్టు ఈ నివేదిక తెలిపింది. ప్రతి నెలా తన పోర్టల్‌పై వెలువడే పోస్టింగ్‌ల ఆధారంగా నౌకరీ డాట్ కామ్ ఈ నివేదికను విడుదల చేస్తుంటుంది. అంతర్జాతీయంగా అనిశి్చత పరిస్థితుల నేపథ్యంలో ఐటీ రంగంలో నియామకాలు గత కొన్ని నెలలుగా తగ్గుతూ వస్తున్న విషయాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. బీపీవో/ఐటీఈఎస్ రంగంలో 25 శాతం, ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో 23 శాతం చొప్పున నియామకాలు క్షీణించాయి. ‘‘ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం కొనసాగుతూనే ఉంది. బ్యాంకింగ్ రంగలో బలమైన వృద్ధి ఉండడం ఆశావహం. మొత్తం మీద సీక్వెన్షియల్‌గా 6 శాతం వృద్ధిని చూడడం అన్నది భారత ఉద్యోగ మార్కెట్ బలంగా ఉందన్న దాన్ని సూచిస్తోంది’’అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ తెలిపారు. ఆతిథ్యరంగం , రవాణా నియామకాల పరంగా మెరుగైన వృద్ధిని చూశాయి. ఈ రంగాలకు సంబంధించి ముంబైలో ఎక్కువ జాబ్ ఆఫర్లు ఉన్నట్టు నౌకరీ తెలిపింది. సెప్టెంబర్ క్వార్టర్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), హెల్త్‌కేర్ రంగాల్లో 7 శాతం నియాకాల వృద్ధి నమోదైంది. బ్రాంచ్ మేనేజర్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ నిపుణులకు డిమాండ్ నెలకొంది. ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో రంగాల్లో 6 శాతం వృద్ధి కనిపించింది. కొత్త ఉద్యోగ నియామకాల్లో మెట్రోలతో పోలిస్తే, ఇతర పట్టణాల్లో వృద్ధి నెలకొంది. -
ఉద్యోగ నియామకాలు డౌన్
ముంబై: కార్యాలయ ఉద్యోగ నియామకాలు ఆగస్ట్ నెలలో క్షీణత చూశాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చనప్పుడు 6 శాతం తక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఐటీ, బీమా, ఆటోమొబైల్, హెల్త్‌కేర్, బీపీవో రంగాల్లో నియామకాల పరంగా అప్రమత్త ధోరణి కనిపించింది. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో 2,566 ఉద్యోగాలకు సంబంధించి పోస్టింగ్‌లు పడ్డాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఇవి 2,828గా ఉన్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. నౌకరీ సంస్థ తన పోర్టల్‌పై జాబ్ పోస్టింగ్‌లు, ఉద్యోగ అన్వేషణల డేటా ఆధారంగా ప్రతి నెలా నివేదిక విడుదల చేస్తుంటుంది. ఇక ఈ ఏడాది జూలై నెలలో పోస్టింగ్‌లు 2,573తో పోలిస్తే కనుక ఆగస్ట్‌లో నియామకాలు 4 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, హాస్పిటాలిటీ, ఫార్మా రంగాల్లో నియామకాల పట్ల ఆశావహ ధోరణి కనిపించింది. ‘‘ఐటీలోనూ సానుకూల సంకేతలు కనిపించాయి. గడిచిన కొన్ని నెలలుగా ఐటీలో నియామకాలు తగ్గగా, సీక్వెన్షియల్‌గా (జూలైతో పోలిస్తే) ఐటీలో నియామకాలు పెరిగాయి. కార్యాలయ ఉద్యోగాల మార్కెట్లో సాధారణ పరిస్థితులు తిరిగి ఏర్పడుతున్నదానికి ఇది ఆరోగ్యకర సంకేతం’’అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ వెల్లడించారు. ఐటీలో 33 శాతం డౌన్ ఐటీ రంగంలో నియామకాలు క్రితం ఏడాది ఆగస్ట్‌తో పోలి్చనప్పుడు, ఈ ఏడాది అదే నెలలో 33 శాతం తక్కువగా నమోదయ్యాయి. బీమా రంగంలో 19 శాతం, ఆటోమొబైల్ రంగంలో 14 శాతం, హెల్త్‌కేర్ రంగంలో 12 శాతం, బీపీవో రంగంలో 10 శాతం చొప్పున నియామకాలు తగ్గాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో నియామకాల పరంగా 17 శాతం వృద్ధి నమోదైంది. అహ్మదాబాద్, ముంబై, చెన్నై, హైదరాబాద్‌లో ఆయిల్ అండ్ గ్యాస్ రంగ నియామకాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. 16 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన నిపుణులకు డిమాండ్ ఎక్కువగా కనిపించింది. ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ)లోనూ నియామకాలు బలంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చనప్పుడు 14 శాతం వృద్ధి కనిపించింది. ఆర్అండ్డీపై దృష్టి పెరగడంతో ఫార్మా రంగంలో 12 శాతం అధికంగా నియామకాలు జరిగాయి. అహ్మదాబాద్, చెన్నైలో ఎక్కువగా ఫార్మా అవకాశాలు లభించాయి. ఏఐ ఉద్యోగాల్లోనూ 8 శాతం వృద్ధి కనిపించింది. మెషిన్ లెరి్నంగ్, ఏఐ సైంటిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్‌ల ఉద్యోగ నియామకాలు కూడా పెరిగాయి. -
దారుణంగా ఐటీ ఉద్యోగాలు.. ప్రముఖ జాబ్ పోర్టల్ రిపోర్ట్!
IT jobs data: దేశంలో ఐటీ రంగంలో ఉద్యోగాల పరిస్థితి దారుణంగా మారింది. నియామకాలు బాగా తగ్గిపోయాయి. దేశంలోని వివిధ రంగాల్లో ఉద్యోగ నియామయాల పరిస్థితిని ప్రముఖ జాబ్ పోర్టల్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఐటీ, ఇన్సూరెన్స్, ఆటో, హెల్త్‌కేర్ బీపీఓ రంగాల్లోని వైట్ కాలర్ నియామకాలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 6 శాతం తగ్గాయి. జాబ్ పోర్టల్ నౌకరీ (Naukri) డేటా ప్రకారం.. 2023 ఆగస్టులో 2,666 జాబ్ పోస్టింగ్‌లు వచ్చాయి. గతేడాది ఆగస్టు నెలలో 2,828 జాబ్ పోస్టింగ్‌లు వచ్చాయి. కాగా నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ (Naukri JobSpeak Index) ప్రకారం ఈ ఏడాది జులైలో 2,573 జాబ్ పోస్టింగ్‌లతో పోలిస్తే ఈ ఆగస్టులో నియామకాలు 4 శాతం పెరిగాయి. భారీగా తగ్గిన కొత్త జాబ్‌లు ఐటీ పరిశ్రమలో కొత్త ఉద్యోగాలు గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 33 శాతం తగ్గాయి. ఐటీతో పాటు, బీమా, ఆటో, హెల్త్‌కేర్,బీపీఓ వంటి రంగాలు కూడా గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే కొత్త ఉద్యోగాల కల్పనలో వరుసగా 19 శాతం, 14 శాతం, 12 శాతం, 10 శాతం క్షీణించినట్లుగా నివేదిక పేర్కొంది. జాబ్ మార్కెట్లో టెక్ రంగం ఇప్పటికీ కష్టపడుతుండగా, నాన్-టెక్ సెక్టార్లో మాత్రం నియామకాలు పెరిగాయి. నివేదిక ప్రకారం ఆయిల్&గ్యాస్, హాస్పిటాలిటీ, ఫార్మా రంగాలలో కొత్త ఉద్యోగాలలో అత్యధిక వృద్ధి కనిపించింది. గత ఏడాది ఆగస్టుతో పోల్చితే ఈ రంగాల్లో రిక్రూట్మెంట్ వరుసగా 17 శాతం, 14 శాతం, 12 శాతం పెరిగింది. -
మే నెలలో నియామకాలు ఓకే
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కార్యాలయ ఉద్యోగుల నియామకాలు (వైట్ కాలర్) మే నెలలో 2,849గా ఉన్నాయి. 2023 ఏప్రిల్ నెల నియామకాలతో పోల్చి చూసినప్పుడు 5 శాతం పెరగ్గా, 2022 మే నెలలో నియామకాలు 2,863తో పోల్చినప్పుడు ఎలాంటి వృద్ధి లేకుండా ఫ్లాట్‌గా నియామకాలు ఉన్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, వివిధ రంగాల్లో నియామకాల ధోరణలు భిన్నంగా ఉన్నట్టు పేర్కొంది. ఆయిల్ అండ్ గ్యాస్‌తోపాటు, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఫార్మా రంగాలు ఈ ఏడాది మే నెలలో నియామకాల్లో వృద్ధిని ముందుండి నడిపించాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో నియామకాలు ఏకంగా 31 శాతం పెరిగాయి. అదే ఐటీ రంగంలో నియామకాలు 2022 మే నెలతో పోల్చినప్పుడు 23 శాతం తక్కువగా నమోదయ్యాయి. దేశ ఇంధన భద్రతకు ప్రాధాన్యం పెరగడం, రిఫైనరీల విస్తరతో ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో అధిక నియామకాలు ఏర్పడినట్టు తెలుస్తోంది. అంతకుముందు నెలల్లో ఈ రంగంలో నియామకాల్లో వృద్ధి 10–20 శాతం మించకపోవడం గమనార్హం. ► రియల్ ఎస్టేట్‌లో 22 శాతం, బ్యాంకింగ్‌లో 14 శాతం అధికంగా నియామకాలు నమోదయ్యాయి. రియల్టీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్, సివిల్ ఇంజనీర్, సైట్ సూపర్ వైజర్ ఉద్యోగాలకు.. బ్యాంకింగ్‌లో రిలేషన్షిప్ మేనేజర్, క్రెడిట్ అనలిస్ట్‌లకు డిమాండ్ నెలకొంది. ► ప్రొడక్షన్ ఇంజనీర్లు, ప్రాసెస్ ఇంజనీర్లు, క్వాలిటీ ఆడిటర్లకు డిమాండ్ ఏర్పడింది. ► హైదరాబాద్, చెన్నై, పుణె నగరాల్లో మధ్య స్థాయి, సీనియర్ ఉద్యోగాల్లో నియామకాలు ఎక్కువగా నమోదయ్యాయి. ► నియామకాలకు నాన్ మెట్రోలు కొత్త కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. అహ్మదాబాద్‌లో 26 శాతం, వదోదరలో 22 శాతం, జైపూర్‌లో 17 శాతం చొప్పున అధిక నియామకాలు (క్రితం ఏడాది మే నెలతో పోల్చినప్పుడు) జరిగాయి. ఇక్కడ బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాలు వృద్ధికి మద్దతుగా నిలిచాయి. ► పెద్ద మెట్రోల్లో నియామకాల పరంగా ఫ్లాట్ లేదా క్షీణత నమోదైంది. పెద్ద మెట్రోల్లో ముంబై, ఢిల్లీలో మాత్రం 5 శాతం వృద్ధి కనిపించింది. రియల్ ఎస్టేట్, టెలికం, హెల్త్‌కేర్, ఆటోమొబైల్ ఇక్కడ వృద్దికి దోహదపడ్డాయి. ► సీనియర్లకు అధిక డిమాండ్ నెలకొంది. 13–16 ఏళ్లు, అంతకుమించి సర్వీసు ఉన్న వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇచ్చాయి. ► ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో సీనియర్లకు నియామకాల పరంగా ప్రాధాన్యం నెలకొంది. ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్ ఫ్రెషర్లకు అవకాశాలు ఇచ్చాయి. మరీ ముఖ్యంగా ఫ్రెషర్లకు నియామకాల్లో 7 శాతం క్షీణత నమోదైంది. -
బెంగళూరుకి ఝలక్ ! నియామకాల్లో హైదరాబాద్ టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా డిసెంబర్ నెల రిటైల్, ఆతిథ్యం, విద్య వంటి ఐటీయేతర రంగాలు నియామక కార్యకలాపాల పునరుద్ధరణ సంకేతాలను చూసింది. నౌకరీ జాబ్ స్పీక్ నివేదిక ప్రకారం.. 2020 డిసెంబర్‌తో పోలిస్తే గత నెలలో నియామకాలు నిలకడగా ఉన్నాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే 2021 చివర్లో అన్ని మెట్రో నగరాల్లో రిక్రూట్మెంట్ పెరిగింది. ఐటీ నియామకాల్లో వృద్ధిని కొనసాగించినప్పటికీ.. ఆతిథ్యం, యాత్రలు, రిటైల్, రియల్టీ రంగాల నుండి పునరాగమనాన్ని చూడటం సంతోషాన్నిస్తోంది. డిసెంబర్ త్రైమాసికంలో యాత్రలు, ఆతిథ్యం 22 శాతం, రిటైల్ 20, విద్యా రంగం 12 శాతం వృద్ధిని కనబరిచాయి. ‘తిరిగి కార్యాలయాల నుంచి పని’ విధానాలను చాలా కంపెనీలు రూపొందించడంతో అత్యధిక నిపుణులు తాము పనిచేసే నగరాలకు చేరుకున్నారు. హైదరాబాద్ 12 శాతం వృద్ధి.. కంపెనీలు డిజిటల్ వైపు మళ్లడం కొనసాగిస్తున్నందున కొన్ని విభాగాలు, రంగాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. 2020 డిసెంబర్‌తో పోలిస్తే గత నెలలో మెట్రో నగరాలవారీగా చూస్తే నియామకాల వృద్దిలో హైదరాబాద్ 12 శాతం వృద్ది సాధించి తొలి స్థానంలో నిలిచింది. బెంగళూరులో రిక్రూట్మెంట్ 11 శాతం, ముంబై 8, పుణే 4, చెన్నై 6 శాతం అధికమైంది. ఢిల్లీ స్థిరంగా, కోల్‌కతా 3 శాతం తిరోగమన వృద్ధి సాధించింది. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అహ్మదాబాద్ 21 శాతం అధికమై తొలి స్థానంలో ఉంది. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ రంగాలు ఈ నగరానికి అండగా నిలిచాయి. యువ నిపుణుల కోసం డిమాండ్ స్థిరంగా ఉంది. ఫ్రెషర్స్, 4–7 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగుల కోసం అవకాశాలు నిలకడగా ఉన్నాయి. 8–12 ఏళ్ల అనుభవం కలిగిన నిపుణులకు డిమాండ్ 4 శాతం, 13–16 ఏళ్ల విభాగంలో 9 శాతం తగ్గింది. చదవండి: టాప్ కంపెనీల్లో ప్లేస్మెంట్ కోసం 2.41 లక్షల మంది పోటీ -
మార్చిలో నియామకాలు పెరిగాయ్
ముంబై: ఈ ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో నియామకాలు స్వల్పంగా పెరిగాయి. నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ ప్రకారం గత నెలలో జాబ్ లిస్టింగ్స్ 3 శాతం అధికమయ్యాయి. వివిధ ఉద్యోగాల కోసం నౌకరీ.కామ్‌లో నమోదయ్యే ప్రకటనల ఆధారంగా ప్రతి నెల కంపెనీ నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ విడుదల చేస్తోంది. దీని ప్రకారం.. ఐటీ, రిటైల్ రంగాల మూలంగా ఈ పెరుగుదల నమోదైంది. ఫిబ్రవరిలో జాబ్ లిస్టింగ్స్ 2,356 అయితే, మార్చిలో ఈ సంఖ్య 2,436 ఉంది. జాబ్ లిస్టింగ్స్ ఐటీ రంగంలో 11 శాతం, రిటైల్‌లో 15 శాతం వృద్ధి చెందాయి. చమురు, సహజ వాయువు రంగంలో 7 శాతం, అకౌంట్స్, ట్యాక్సేషన్, ఫైనాన్స్ 6, టెలికం, ఐఎస్పీ 5, బీపీవో, ఐటీఈఎస్ 1, బీఎఫ్ఎస్ఐలో 1 శాతం పెరిగాయి. జనవరి–మార్చిలో 23 శాతం.. కోవిడ్ సెకండ్ వేవ్‌తో విద్యా రంగంలో 13 శాతం, ఎఫ్ఎంసీజీ 10, హోటల్స్, ఎయిర్‌లైన్స్, ట్రావెల్ రంగాల్లో 8 శాతం నియామకాలు తగ్గాయి. 2020 అక్టోబర్–డిసెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–మార్చిలో రిక్రూట్మెంట్ 23 శాతం పెరిగిందని నౌకరీ.కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ తెలిపారు. వృత్తి నిపుణుల కోసం డిమాండ్ మార్కెటింగ్, ప్రకటనల విభాగంలో 10 శాతం, హెచ్ఆర్, అడ్మినిస్ట్రేషన్ 8, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్ విభాగంలో 6 శాతం పెరిగింది. 4–7, 8–12 సంవత్సరాల అనుభవం ఉన్న నిపుణుల కోసం నియామకాల వృద్ధి 6% నమోదైంది. నాయకత్వ విభాగంలో 16 ఏళ్లకుపైగా అనుభవం ఉన్నవారి కోసం జరిగే నియామకాలు 3 శాతం తగ్గాయి. -
ఐటీ జాబ్స్: టాప్ 2లో మన హైదరాబాద్
ముంబై: డిజిటలైజేషన్, ఆటోమేషన్ కారణంగా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఉద్యోగ నియామకాలు ఊపందుకున్నాయి. జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో రికార్డ్ స్థాయిలో మంచి వృద్ధి నమోదయింది. అన్ని పరిశ్రమల్లో కలిపి జనవరిలో 1,925 జాబ్స్ హైరింగ్స్ జరగగా.. గత నెలలో 2,356 నియామకాలు జరిగాయని నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ సర్వే తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవటం, మార్కెట్ సాధారణ స్థితికి చేరుకోవటంతో కోవిడ్–19 తర్వాత తొలిసారిగా మెజారిటీ పరిశ్రమలలో నియామక కార్యకలాపాలలో సానుకూల థృక్పదాన్ని సాధించాయని నివేదక వెల్లడించింది. నగరాల వారీగా చూస్తే.. దేశంలోని ఆరు మెట్రో నగరాలు, ప్రధాన ద్వితీయ శ్రేణి పట్టణాల్లో జాబ్స్ హైరింగ్‌లో సానుకూల వాతావరణ నెలకొంది. గత నెలలో 31 శాతం నియామక వృద్ధితో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలవగా.. 28 శాతంతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. పుణేలో 24 శాతంగా ఉన్నాయి. వడోదరలో 20 హైరింగ్స్ ధోరణి కనిపించింది. -
జనవరిలో జోరుగా హైరింగ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరిలో హైరింగ్ పెరిగిందని ఆన్లైన్ హైరింగ్ పోర్టల్ నౌకరీడాట్‌కామ్ తెలిపింది. గత మూడు నెలలుగా హైరింగ్ కార్యకలాపాలు పెరుగుతున్నాయని, ఎన్నికల తర్వాత మరింతగా ఊపందుకుంటాయని తెలియజేసింది. మెట్రో నగరాల్లో హైరింగ్ పరిస్థితులు హైదరాబాద్, కోల్‌కతాల్లో గరిష్ట మెరుగుదల ఉందని పేర్కొంది. నౌఖరీ సర్వే ప్రకారం... గతేడాది డిసెంబర్‌తో పోల్చితే ఈ ఏడాది జనవరిలో ఆన్లైన్ హైరింగ్ కార్యకలాపాలను ప్రతిబింబించే నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ 13 శాతం వృద్ధితో 1,466 పాయింట్లకు పెరిగింది. ఇక గత ఏడాది జనవరితో పోల్చితే ఇది 15 శాతం పెరిగింది. ఐటీ, బీపీవో రంగాల్లో అధికంగా ఉద్యోగాలొచ్చాయి. టెలికాం రంగంలో హైరింగ్ చాలా ఎక్కువ తగ్గింది. వాహన రంగంలో స్వల్పంగా తగ్గింది. సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఉద్యోగులకు డిమాండ్ పెరగడం కొనసాగుతోంది. గత మూడు నెలలుగా నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నెలకు సగటున 4% చొప్పున వృద్ధి సాధిస్తోంది. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడం, త్వరలో జరగనున్న ఎన్నికలు తదితర కారణాలతో నియామకాలు పుంజుకుంటాయి. ఎన్నికల అనంతరం పలు కంపెనీలు విస్తరణ కార్యకలాపాలు చేపడతాయి. ఫలితంగా ప్రతిభ గల ఉద్యోగుల కోసం డిమాండ్ పెరుగుతుంది.