హైదరాబాద్: దేశవ్యాప్తంగా కార్యాలయ ఉద్యోగుల నియామకాలు (వైట్ కాలర్) మే నెలలో 2,849గా ఉన్నాయి. 2023 ఏప్రిల్ నెల నియామకాలతో పోల్చి చూసినప్పుడు 5 శాతం పెరగ్గా, 2022 మే నెలలో నియామకాలు 2,863తో పోల్చినప్పుడు ఎలాంటి వృద్ధి లేకుండా ఫ్లాట్‌గా నియామకాలు ఉన్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, వివిధ రంగాల్లో నియామకాల ధోరణలు భిన్నంగా ఉన్నట్టు పేర్కొంది.
ఆయిల్ అండ్ గ్యాస్‌తోపాటు, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఫార్మా రంగాలు ఈ ఏడాది మే నెలలో నియామకాల్లో వృద్ధిని ముందుండి నడిపించాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో నియామకాలు ఏకంగా 31 శాతం పెరిగాయి. అదే ఐటీ రంగంలో నియామకాలు 2022 మే నెలతో పోల్చినప్పుడు 23 శాతం తక్కువగా నమోదయ్యాయి. దేశ ఇంధన భద్రతకు ప్రాధాన్యం పెరగడం, రిఫైనరీల విస్తరతో ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో అధిక నియామకాలు ఏర్పడినట్టు తెలుస్తోంది. అంతకుముందు నెలల్లో ఈ రంగంలో నియామకాల్లో వృద్ధి 10–20 శాతం మించకపోవడం గమనార్హం.
► రియల్ ఎస్టేట్‌లో 22 శాతం, బ్యాంకింగ్‌లో 14 శాతం అధికంగా నియామకాలు నమోదయ్యాయి. రియల్టీలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్, సివిల్ ఇంజనీర్, సైట్ సూపర్ వైజర్ ఉద్యోగాలకు.. బ్యాంకింగ్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్, క్రెడిట్ అనలిస్ట్‌లకు డిమాండ్ నెలకొంది.
► ప్రొడక్షన్ ఇంజనీర్లు, ప్రాసెస్ ఇంజనీర్లు, క్వాలిటీ ఆడిటర్లకు డిమాండ్ ఏర్పడింది.
► హైదరాబాద్, చెన్నై, పుణె నగరాల్లో మధ్య స్థాయి, సీనియర్ ఉద్యోగాల్లో నియామకాలు ఎక్కువగా నమోదయ్యాయి.
► నియామకాలకు నాన్ మెట్రోలు కొత్త కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. అహ్మదాబాద్‌లో 26 శాతం, వదోదరలో 22 శాతం, జైపూర్‌లో 17 శాతం చొప్పున అధిక నియామకాలు (క్రితం ఏడాది మే నెలతో పోల్చినప్పుడు) జరిగాయి. ఇక్కడ బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాలు వృద్ధికి మద్దతుగా నిలిచాయి.
► పెద్ద మెట్రోల్లో నియామకాల పరంగా ఫ్లాట్ లేదా క్షీణత నమోదైంది. పెద్ద మెట్రోల్లో ముంబై, ఢిల్లీలో మాత్రం 5 శాతం వృద్ధి కనిపించింది. రియల్ ఎస్టేట్, టెలికం, హెల్త్‌కేర్, ఆటోమొబైల్ ఇక్కడ వృద్దికి దోహదపడ్డాయి.
► సీనియర్లకు అధిక డిమాండ్ నెలకొంది. 13–16 ఏళ్లు, అంతకుమించి సర్వీసు ఉన్న వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇచ్చాయి.
► ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో సీనియర్లకు నియామకాల పరంగా ప్రాధాన్యం నెలకొంది. ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్ ఫ్రెషర్లకు అవకాశాలు ఇచ్చాయి. మరీ ముఖ్యంగా ఫ్రెషర్లకు నియామకాల్లో 7 శాతం క్షీణత నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment